![SM Krishna Announces Retirement From Active Politics - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/5/SM-Krishna.jpg.webp?itok=Tzlx8x7Q)
శివాజీనగర: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఎస్‌ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాలకు ‘గుడ్‌బై’ చెప్పారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘రాజకీయాలకు ఇక దూరంగా ఉంటాను. 90 ఏళ్ల వయసులో 50 ఏళ్ల వ్యక్తిలా నటించడం సాధ్యం కాదు. అందుకే ప్రజల్లోకి రావడం కూడా తగ్గించాను’ అని తెలిపారు. బీజేపీలో నిర్లక్ష్యానికి గురయ్యారా? అని మీడియా ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని ఆయన బదులిచ్చారు. వయసు రీత్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కాగా, కర్ణాటకలోని మాండ్య జిల్లా మద్దూరులోని రైతు కుటుంబంలో జన్మించిన ఎస్‌ఎం కృష్ణ.. బెంగళూరు, అమెరికాలోని పలు ప్రముఖ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించారు. న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1962లో మద్దూరు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి.. పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1989 నుంచి 1993 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా, అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఎస్‌ఎం కృష్ణ 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు. యూపీఏ హయాంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆయన 2017లో బీజేపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment