బెంగళూరు: కర్ణాటకలో ఈసారి ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని జోస్యం చెప్పారు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి మెజార్టీకి మించే సీట్లు వస్తాయని, ఎన్ని స్థానాలు కైవసం చేసుకునేది కచ్చితంగా లెక్కగట్టి చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు. మెజార్టికీ 113 సీట్లు అవసరం. అయితే కాంగ్రెస్‌కు ఈసారి 141 కంటే ఎక్కువ సీట్లే వస్తాయని, అంతకు ఒక్క సీటు కూడా తక్కువ రాదని డీకే బల్లగుద్ది చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో చావో రేవో తెల్చుకుంటారా? అని అడగ్గా.. కచ్చితంగా గెలిచితీరుతామన్నారు. ఓడిపోయే అవకాశమే లేదని తేల్చిచెప్పారు.
అలాగే కర్ణాటకలో హంగ్ వస్తుందా? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. అసలు ఆ పరిస్థితే రాదన్నారు. కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని పేర్కొన్నారు. జేడీఎస్‌తో జట్టు కట్టాల్సిన అవసరం కూడా తమకు ఉండదని వ్యాఖ్యానించారు. ఏ పార్టీతోనూ కలిసేదిలేదంటూ స్పష్టమైన సంకేతాలిచ్చారు.
కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు ఇప్పటివరకు 166 మంది అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. పార్టీలో అందరూ సమష్టిగా నిర్ణయం తీసుకునే వీరి ఎంపిక జరిగిందని డీకే తెలిపారు. తనకు, సీనియర్ నేత సిద్ధరామయ్య మధ్య పార్టీలో వర్గపోరు లేదని చెప్పారు.
అలాగే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా మిమ్మల్ని భావించవచ్చా? అని ప్రశ్న అడగ్గా.. సీఎం ఎవరనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని డీకే అన్నారు. ఒకవేళ అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు కదా అని పేర్కొన్నారు. సీఎం కావాలని ప్రతి నాయకుడికి ఉంటుందని తన మనసులో మాట బయటపెట్టారు. కర్ణాటకకు ఒకే విడతలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటిస్తారు. ఇటీవల నిర్వహించి సీఓటర్ సర్వేలో కూడా ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందని తేలింది. అయితే సీట్లు 123 వరకు రావచ్చని ఆ సర్వే పేర్కొంది.
చదవండి: నాది కాంగ్రెస్ రక్తం.. కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment