karnataka congress
-
కాంగ్రెస్ టికెట్ కావాలా? దరఖాస్తు ఫీ రూ.2 లక్షలే.. వారికి 50% డిస్కౌంట్!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుంచే అందుకు సన్నద్ధమవుతోంది కర్ణాటక కాంగ్రెస్. ఎన్నికల పట్ల అభ్యర్థులు సీరియస్‌గా ఉండేందుకోసమంటూ దరఖాస్తు ప్రక్రియను బుధవారం ప్రకటించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కావాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్. ఈ ప్రక్రియ 10 రోజుల పాటు సాగనుందన్నారు. ‘కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయాలనుకుంటున్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. దరఖాస్తు విండో నవంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు తెరిచి ఉంటుంది. మా ఆఫీసులో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు రూ.5,000. జనరల్ కేటగిరీ దరఖాస్తుదారులు రూ.2 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు 50శాతం డిస్కౌంట్‌తో రూ.1 లక్ష కట్టాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో నేను సైతం ఉంటాను. నేను పోటీ చేయాలనుకుంటే, తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందే.’అని తెలిపారు కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్. ఈ ఫండ్స్‌ను పార్టీ నూతన భవనం నిర్మాణం సహా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగిస్తామని తెలిపారు. మరోవైపు.. ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఈసారి దరఖాస్తులను ముందస్తుగానే ఆహ్వానిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల పట్ల అశ్రద్ధగా ఉన్నవారిని ఫిల్టర్ చేసేందుకే ఫీజును పెంచినట్లు చెప్పాయి. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వం, కాంగ్రెస్ భావజాలాన్ని నమ్మే వారు ఎవరైనా పార్టీలో చేరొచ్చని తెలిపారు డీకే శివకుమార్. ఆన్లైన్ సభ్యత్వ నమోదు కొనసాగుతోందని చెప్పారు. అలాగే.. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర నేత మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన క్రమంలో ఆయనకు నవంబర్ 6న సర్వోదయ సమవేశం ద్వారా ఘన స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేస్తోంది. ఇదీ చదవండి: ‘ఈ విచారణలేందుకు.. వీలైతే నేరుగా అరెస్ట్ చేయండి’.. జార్ఖండ్ సీఎం సవాల్ -
Karnataka: పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు
సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ నివాసం, ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. రామనగర జిల్లాలోని ఆయన స్వగ్రామంతోపాటు కనకపుర, దొడ్డనహళ్లి, సంతే కొడిహళ్లిలో ఈ సోదాలు జరిగాయి. శివకుమార్‌కు చెందిన ఆస్తులు, భూములు, వాటికి సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించారు. కనకపుర తహసిల్దార్‌ను కలుసుకున్నారు. శివకుమార్ ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. 2017లో శివకుమార్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. అనంతరం ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), తర్వాత సీబీఐ పరిధిలోకి వచ్చింది. శివకుమార్‌పై దర్యాప్తు కొనసాగించేందుకు 2019 సెప్టెంబర్ 25న కర్ణాటక ప్రభుత్వం సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. మానసికంగా వేధిస్తున్నారు సీబీఐ దాడులపై డీకే శివకుమార్ స్పందించారు. దాడుల పేరుతో తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ‘నేను చట్టాన్ని గౌరవిస్తాను. వాళ్లు అడిగిన పత్రాలు ఇప్పటికే ఇచ్చాను. అయినప్పటికీ వారు నా ఆస్తులను తనిఖీ చేశారు. ఎంతోమంది ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ నా కేసులో మాత్రమే సీబీఐకి అనుమతి లభించింది. సీబీఐ నాపై మాత్రమే ఎందుకు దర్యాప్తు చేస్తోంది?’ అని శివకుమార్ ప్రశ్నించారు. చదవండి: అక్టోబర్‌లో అమిత్ షా పర్యటన.. జమ్మూ కశ్మీర్లో జంట పేలుళ్ల కలకలం -
రజనీ కొత్త పార్టీ: ‘ఇప్పుడే ఏమీ చెప్పలేం’
సాక్షి, బెంగళూరు : సూపర్ స్టార్ రజనీకాంత్ తాను అతి త్వరలో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి సరిగ్గా 6 నెలల ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ట్విట్టర్ వేదికగా గత గురువారం ప్రకటించారు. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ పనులు కూడా శరావేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు రజనీ రాజకీయ రంగప్రవేశంపై స్పందించారు. ‘‘ రజనీకాంత్ పార్టీ ఇంకా రిజిస్ట్రర్ కాలేదు. పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలు ఏంటో తెలియదు. అసలు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాడో లేక పొత్తు పెట్టుకుంటాడో స్పష్టత లేదు. అతడు ఏం చేయబోతున్నాడో కూడా తెలియదు. దీనిపై స్పష్టత వస్తేనే రజనీ ప్రభావం తమిళనాడు రాజకీయాలపై ఎంత ఉంటుందో చెప్పగలం. చాలా మంది బీజేపీ నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నారు. రజనీ బీజేపీతో కలుస్తాడో లేదో ఏం చేస్తాడో చూడాలి’’ అని అన్నారు. ( రజనీ పొలిటికల్ ఎంట్రీ: ఆ పార్టీల్లో ప్రకంపనలు ) అన్ని స్థానాల్లో రజనీ పార్టీ పోటీకి సిద్ధం వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో రజనీకాంత్ పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని, 234 సీట్లలో పోటీ చేస్తామని రజనీ సలహాదారు మణియన్ ప్రకటించారు. సరికొత్త రాజకీయాలకు రజనీకాంత్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈనెల 31న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారని తెలిపారు. -
శివకుమార్‌కు 13 వరకు కస్టడీ
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను సెప్టెంబర్ 13 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం రాత్రి అరెస్టు చేసిన శివకుమార్‌ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరిన నేపథ్యంలో ప్రత్యేక జడ్జి ఈ ఉత్తర్వులిచ్చారు. బుధవారం రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలో పరీక్షల అనంతరం శివకుమార్‌ను ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. శివకుమార్ తరఫున వాదిస్తున్న న్యాయవాదులు అభిషేక్‌మను సింఘ్వీ, దయన్ కృష్ణన్ వాదనలు వినిపిస్తూ శివకుమార్ అరెస్టు అన్యాయం అనీ, అతను పరారవుతాడన్న ఈడీ అనుమానాలు నిరాధారమని వాదించారు. శివకుమార్‌ను ఈడీ అరెస్టు చేసినందుకు నిరసనగా బుధవారం కర్ణాటక, ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను ఢిల్లీలోని యువజన కాంగ్రెస్ కార్యాలయం బయట దహనం చేశారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ నిరసనలు నిర్వహించింది. ఐదారు బస్సులపై రాళ్ల దాడి జరిగిందని, కనకపుర, బెంగళూరులో బస్సులను తగలబెట్టడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. -
కర్ణాటక రాజకీయాలపై కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్
న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. ఈ వ్యవహారంపై మంగళవారం సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు..రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై పూర్తి నిర్ణయాధికారం స్పీకర్దేనని స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పును ప్రశంసిస్తూ.. ఆపరేషన్ లోటస్ విఫలమైందని, సత్యమేవ జయతే అంటూ పేర్కొంది. రాజీనామాలపై స్పీకర్‌ని నిర్ణీత సమయంలోపు నిర్ణయం తీసుకోమని తాము బలవంతం చేయలేమని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం వ్యవహరించే స్వేచ్ఛ స్పీకర్‌కి ఉందని పేర్కొంది. జూలై 18న కర్ణాటక అసెంబ్లీలో జరిగే బలపరీక్షకు హాజరుకావాలని కాంగ్రెస్, జేడీ(ఎస్) జారీ చేసిన విప్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాల్లో పాల్గొనడానికి బలవంతం చేయలేమంటూ వ్యాఖ్యానించింది. -
కర్ణాటకలో అసంబద్ధ నాటకం!
పార్టీ అధ్యక్ష స్థానం నుంచి రాహుల్ గాంధీ నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీ తన చరిత్రలో ఎన్నడూ లేనంత దుస్థితిలో కొట్టుమిట్టులాడుతుంటే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అన్ని పరిణామాలకు తాము అతీతంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నారు. డజనుకుపైగా పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి ఫిరాయింపుల జూదంలో మునిగితేలుతుండటంతో సంకీర్ణ ప్రభుత్వ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ దుస్థితి పట్ల బాధలేదు. పశ్చాత్తాపం లేదు. ఇప్పుడేం చేయాలి అనే ఆందోళన లేదు. ఎవరెలా చస్తే మాకేం అన్న చందాన ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. రాహుల్‌కి నమ్మినబంటులా వ్యవహరిస్తూవచ్చిన మాజీ సీఎం సిద్ధరామయ్య అనుయాయులే తిరుగుబాటు ప్రకటించడంతో బీజేపీ తదనంతర వారసుడిగా తాను రంగలోకి రానున్నారా అనే అనుమానాలు ప్రబలమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిని అస్తవ్యస్థత అనే ఒకే ఒక్క పదంతో వర్ణించవచ్చు. గాంధీల కుటుంబానికి చెందిన నాల్గవ తరం అధినేత ఏకంగా పార్టీ అధ్యక్ష పదవికే రాజీనామా సమర్పించి, తాను పార్టీలో ఒంటరినయ్యాను అని చేతులెత్తేశారు. తన రాజీనామా నిర్ణయానికి తిరుగులేదని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవి కంటే రాహుల్ తదుపరి చర్య ఏమిటన్నది ఇంకా స్పష్టం కాలేదు. కాగా ఇటీవలి దశాబ్దాలలో కాంగ్రెస్ పార్టీ అదృష్ట చిహ్నంగా ఉంటూ వచ్చిన మన్మోహన్ సింగ్ తాను మరోసారి రాజ్యసభకు ఎన్నిక అవుతానా అన్నది అర్థం కాని స్థితిలో పడిపోయారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇంతటి దుస్థితిలో కొట్టుమిట్టులాడుతుంటే, కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అన్ని పరిణామాలకు తాము అతీతంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నారు. ఒకవైపు డజనుకుపైగా పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి ఫిరాయింపుల జూదంలో మునిగితేలుతుండటంతో సంకీర్ణ ప్రభుత్వ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు చీమకుట్టినట్లుగా కూడా లేదు. ఒకవైపు ఐఎమ్ఎ కుంభకోణం పేరిట పాంజీ స్కీమ్ వేలాదిమంది పేద, మధ్యతరగతి ముస్లింలు తమ జీవితకాలం దాచుకున్న పొదుపు మొత్తాలను ఎగరేసుకుపోయింది. కానీ సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు ఇటీవల నిర్వహించిన ఒక ఈవెంటులో పై కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు ఆరోపణలకు గురైన పార్టీ సహచరులు హాజరై పండుగ చేసుకుంటున్న వార్తలు పత్రికలకెక్కాయి. పార్టీ అస్తిత్వమే సంక్షోభంలో పడిన ప్రస్తుత సందర్భంలోనూ కొందరు ఎమ్మెల్యేలు తమ రాజకీయ అవకాశవాదాన్నే పరమావధిగా భావించి తమ దారి తాము చూసుకోవడం గమనార్హం. ఇన్ని గందరగోళాల మధ్య, జావకారిపోయిన పార్టీని పునర్మిర్మాణం చేయడం ఎలా అనే మీమాంస ఎవరికీ ఉన్నట్లు లేదు. పార్టీలో సంక్షోభం, ఐఎమ్ఏ స్కామ్ నేపథ్యంలో ప్రజల్లో ఆగ్రహావేశం వంటివేవీ కర్ణాటక కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదు. అప్రతిష్టాత్మకమైన ఈవెం ట్లలో మునిగితేలుతూ ఫోటో పోజులకు దిగుతూ, సెలబ్రిటీలతో ట్వీట్లు పంచుకుంటూ ఆ పార్టీ నేతలు పొద్దుపుచ్చుతున్నారు. పార్టీ దుస్థితి పట్ల బాధలేదు. పశ్చాత్తాపం లేదు. ఇప్పుడేం చేయాలి అనే ఆందోళన లేదు. ఎవరెలా చస్తే మాకేం అన్న చందాన ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. జూలై 3న పార్టీకి రాసిన ఉత్తరంలో బహుశా రాహుల్ గాంధీ కీలక సమయాల్లో ‘తాను ఒంటరినయి’నట్లు చెప్పినదానికి అర్థం ఇదేనేమో? పైగా కాంగ్రెస్ పనితీరు మౌలికంగానే పరివర్తన చెందాల్సిన అవసరముందని, రాహుల్ స్పష్టం చేశారు కూడా. కానీ వాస్తవానికి గడచిన దశాబ్దాలుగా కాంగ్రెస్ ఇలాగే కొనసాగుతోంది. యుద్ధం చేయడాన్ని, సమరంలో గెలుపొందడాన్ని కాంగ్రెస్ సేనలు మర్చిపోయాయి. ఈ దయనీయ నేపథ్యంలోనే కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని మనం పరిశీలించాల్సి ఉంది. డజనుకుపైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడి పార్టీనుంచి నిష్క్రమించనున్నారు. లేక ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుని మంచి స్థితికోసం బేరసారాలకు పాల్పడుతున్నారు. అంతే తప్ప, ఒక సంవత్సర కాలంలోనే సంకీర్ణ ప్రభుత్వం వందోసారి సంక్షోభంలో కూరుకుపోవడం పట్ల వీరెవరికీ ఎలాంటి ఆందోళనా కలగడం లేదు. కానీ కర్ణాటకలో కాని దేశవ్యాప్తంగా కానీ కాంగ్రెస్ పరిస్థితి ఇంతకంటే భిన్నంగా మాత్రం లేదు. ప్రజలు ఇలాంటి వారిని, వీరి సిగ్గుమాలిన రాజకీయాలను చూస్తున్నారు. కానీ ప్రజల మనోభావాలను వీరు మాత్రం అర్థం చేసుకోవడం లేదు. ఇలాంటి కారణాలవల్లే రాష్ట్రంలో పార్టీ అధికారానికి దూరమై జనతాదళ (సెక్యులర్) సంకీర్ణ ప్రభుత్వానికి తావివ్వాల్సి వచ్చిందని, అది కూడా దారుణమైన అస్థిరత్వంతో కొనసాగుతోందని చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి కూడా. రెండు పార్టీలకు మద్దతిస్తున్న ప్రజలు పరస్పరం అతివ్యాప్తమయ్యారు కాబట్టి వీరు కలిసి ఉండలేరనే వాదన కూడా ఉంది. ఇది నిజమే కావచ్చు. కానీ ప్రత్యేకించి పాత మైసూరు, దక్షిణ కర్ణాటక జిల్లాల్లో బలీయంగా ఉన్న భూస్వామ్య రాజకీయాలు, అధికార దాహం, ప్రాదేశిక నియంత్రణ, వ్యక్తిగత దురాశలు ఈ అస్తవ్యస్తతకు కారణమని కూడా కొందరి వాదన. ఒక విషయంలో మనం నిజాయితీగా ఉందాం. సిద్ధరామయ్య వంటి అగ్రనేతలు కాంగ్రెస్ ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే పోరాడుతున్నారని నమ్మవచ్చా? సిద్ధరామయ్య వంటి వ్యక్తులు దేవేగౌడ కుటుంబ నిరంకుశత్వానికి, అవమానాలకు గురై వ్యక్తిగతంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే సిద్ధరామయ్య ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా సిద్ధపడతారు తప్పితే కొద్దిమంది ఎమ్మెల్యేలను మాత్రమే కలిగిన గౌడ కుటుంబ సభ్యుడొకరు తనపై బాస్ లాగా పెత్తనం చలాయించడానికి అసలు ఒప్పుకోరు. అందుకే తాజా సంక్షోభంలో సిద్ధరామయ్య అనుయాయులే తిరుగుబాటు పక్షంలో చేరిపోవడం చూస్తే ఆశ్చర్యమనిపించదు. పైగా తమ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే తప్ప హెచ్ డి కుమారస్వామి కానేకాదని ఈ ఎమ్మెల్యేలు చాలాసార్లు బహిరంగంగానే ప్రకటించడం కూడా ఆశ్చర్యం కలిగించదు. కానీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి అర్థం కానిదల్లా ఏమిటంటే, మెజారిటీ మద్దతును కూడగట్టడంలో తాను విఫలమైనందుకే చివరకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది అన్నదే. అయిదేళ్ల తన పదవీకాలంలోనూ ఇదే ప్రతిబింబించింది. చివరకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 పార్లమెంటు ఎన్నికల్లో తన చేతకానితనమే పార్టీ కొంప ముంచింది. అయితే వ్యూహరచనలో తనదే పైచేయి కాబట్టి ఈ పరాజయ బాధ్యతను ఆయన ఎన్నటికీ గుర్తించరు. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణాన్ని ప్రతిఘటించాలంటే మరింత గౌరవనీయ మార్గాలున్నాయి. కానీ రాష్ట్రంలో పార్టీ విధ్వంసానికి సిద్ధరామయ్యే కారణమని మీడియాలో వార్తలొస్తున్నాయి. దురదృష్టవశాత్తూ వాస్తవం ఎలా ఉన్నప్పటికీ ఆయన వారసత్వం మొత్తంగా ఇలాగే ఉంటోందన్నంత అపకీర్తి మాత్రం మిగిలింది. గడచిన దశాబ్దాలలో ఆయన మృదు స్వభావం, ప్రగతిశీల సంభాషణలు ఒక ముసుగుగా మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి ప్రస్తుత పరిస్థితిలో ఆయన తన పార్టీకి సహాయకారిగా లేరనే అర్థాన్ని కల్పిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాన్ని బలహీనపరిచే మరొక అంశం కూడా ఇక్కడ తోడైంది. 2013లో తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి ఏకైక కారకుడు రాహుల్ గాంధీయే అని సిద్ధరామయ్య ప్రగాఢ నమ్మకం. సోనియాగాంధీ ఏఐసీసీ ప్రెసిడెంటుగా ఉంటుండగా సీఎం కుర్చీకి చాలా పోటీ ఉన్నప్పుడు రాహుల్ తనవైపే మొగ్గు చూపారని ఆయన నమ్మిక. అయితే ఇప్పుడు రాహుల్ ఢిల్లీకి దూరమైపోయారు కాబట్టి సీజనల్ రాజకీయనేత అయిన సిద్ధరామయ్య వెంటనే తన విశ్వాసాన్ని మార్చుకుని తనకు మరింత ప్రాధాన్యత లభించే చోటుకోసం వెతుక్కుంటున్న్టట్లు కనిపిస్తోంది. తాను సేవలిందించే పార్టీపైనే తిరుగుబాటు చేసే సుదీర్ఘ చరిత్ర సిద్ధరామయ్యకు ఉందని చాలామందికి తెలీదు. అయితే కాంగ్రెస్ పతనానికి సిద్ధరామయ్య మాత్రమే కారకులని నిందించలేం. సీనియర్ కాంగ్రెస్ నేతలు చాలామంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల వలే పనిచేస్తూవచ్చారు. గత నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ చరిత్రను పరిశీలిస్తే 1983లో రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి నేటివరకు కాంగ్రెస్ వృద్ధిబాట పట్టలేకపోయింది. దాని సగటు వోటు వాటా 30.49 శాతం వద్దే నిలిచిపోయింది. జనతా పరివార్ కావచ్చు, సంఘ్ పరివార్ కావచ్చు వాటిలో చీలికలు వచ్చి బలహీనపడినప్పుడు మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. 1989లో వీరేంద్రపాటిల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొద్ది కాలం మినహాయిస్తే, ఇతర ఏ కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలు కూడా సానుకూల ఓటుతో వచ్చినవి కాదు. అధికారం నిలుపుకోవడానికి ఒక కొత్త ఆలోచనవైపు కానీ, ఒక కొత్త సామాజిక బృందం వైపు కానీ కాంగ్రెస్ నేతలు ఎన్నడూ నడిచిన పాపాన పోలేదు. ప్రస్తుత నేపథ్యంలో బీజేపీ ఏం చేయాలనుకుంటోందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వారు అధికారంపై మాత్రమే దృష్టి పెట్టడంలేదు. బీఎస్ ఎడ్యూరప్పను మళ్లీ సీఎంగా నిలుపడానికి వారు ఏమాత్రం తొందరపడలేదు. ఆయన తదనంతర వారసుడికోసం తగిన మార్గాలకోసం వారు అన్వేషిస్తున్నారు. సిద్ధరామయ్య వంటివారు తమ పార్టీలోకి రావడం ఖరారైతే నూతన నాయకత్వానికి పట్టం కట్టడం కూడా వారు ఎడ్యూరప్ప ద్వారానే చేస్తారు కూడా. బీజేపీ నిజమైన ఉద్దేశం దక్షిణ కర్ణాటకలో బలంగా పాదుకోవడమే. ఉత్తర కర్ణాటకనుంచి ఒక లింగాయత్‌ను పదే పదే నాయకుడిగా నిలుపడం ద్వారా బీజేపీ అలసిపోయినట్లుంది. ఇప్పుడు వొక్కళిగ కమ్యూనిటీ నుంచి నాయకత్వాన్ని రూపొం దించడం దాని లక్ష్యం. అందుకేవారు కాంగ్రెస్ విస్మృత నేత ఎస్ఎమ్ కృష్ణను వారు తమలో చేర్చుకున్నారు. ఈ ప్రాంతంలో ఆయన అస్తిత్వ రాజకీయాలకు బలమైన చిహ్నంగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ రీజియన్‌లో తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వారికి చాలా ప్రోత్సాహకరంగా మారాయి. మొత్తంమీద చూస్తే రాజకీయంగా కర్ణాటకలో బీజేపీ భవిష్యత్తు మాత్రం నిరాశా నిస్పృహలతో కొనసాగదన్నది వాస్తవం. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, రచయిత సుగత శ్రీనివాసరాజు -
‘కర్ణాటక కాంగ్రెస్’ రద్దు
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, సంకీర్ణ ప్రభుత్వంతో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తుల వల్ల కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ)ని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రద్దు చేసింది. కేవలం అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు తప్ప మిగిలిన వారిని తొలగిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 చోట్ల పోటీ చేస్తే కేవలం ఒక్క సీటును మాత్రమే గెలవడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేపీసీసీ చీఫ్ దినేశ్ గుండూ రావు అన్నారు. పార్టీ చీఫ్‌గా తాను, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈశ్వర్ ఖండ్రే కలసి పార్టీని పునర్వ్యవస్థీకరించి, బలపరచాల్సి ఉందన్నారు. నిజాయితీతో పని చేసేవారికే... పార్టీలో నూతన కార్యవర్గానికి అవకాశం కల్పిస్తామని, నిజాయితీగా పనిచేస్తూ పార్టీకి విధేయులుగా ఉండే వారికే అవకాశం ఇస్తామని దినేశ్ స్పష్టం చేశారు. 280 మందిని తొలగించి అదే స్థాయిలో నాయకులను నియమించే అవకాశం ఉంది. నిజం చెబితే తొలగిస్తారా ? లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయానికి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ దినేశ్ వంటి కొందరు నేతలే కారణమంటూ కాంగ్రెస్ మైనార్టీ నేత రోషన్ బేగ్ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపధ్యంలో ఏఐసీసీ ఆయనను కాంగ్రెస్ నుంచి తొలగించింది. నిజాలు మాట్లాడితే తొలగిస్తారా ? నాపై చర్యలు తీసుకున్నారు సరే.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వాళ్లపై చర్యలు లేవా అంటూ మండిపడ్డారు. -
రిసార్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో మరో సారి రిసార్టు రాజకీయాలకు తెరలేచింది. ‘ఆపరేషన్ కమల’ వార్తల నేపథ్యంలో బీజేపీ ప్రలోభాల నుంచి తప్పించుకునేందుకు శుక్రవారం తమ ఎమ్మెల్యేల్ని బెంగళూరు దగ్గర్లోని ఈగల్టన్ రిసార్టుకు తరలించింది. గత మేలో అసెంబ్లీ ఎన్నికలయ్యాక తమ సభ్యుల్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఇదే రిసార్టులో ఉంచింది. తాజాగా శుక్రవారం బెంగళూరులో సీఎల్పీ భేటీ ముగిసిన వెంటనే విధానసౌధ నుంచి రెండు బస్సుల్లో వారిని మళ్లీ అదే రిసార్టుకు తరలించింది. ఎమ్మెల్యేలు రిసార్టులో ఉన్నంత కాలం రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితి, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తారని కాంగ్రెస్ పక్ష నేత సిద్దరామయ్య తెలిపారు. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం నేడో రేపో కూలిపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు వస్తాయేమోనన్న భయంతోనే మోదీ, అమిత్ షా కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్–జేడీఎస్‌ల ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని పునరుద్ఘాటించారు. తమ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల నుంచి రూ .70 కోట్లు ఇచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కోల్‌కతాలో ప్రధాని మోదీని ప్రశ్నించారు. మరోవైపు, వారం రోజులుగా గురుగ్రామ్‌లోని రిసార్టులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం బెంగళూరు రానున్నారు. సీఎల్పీ భేటీకి నలుగురు డుమ్మా.. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. తమ ఎమ్మెల్యేలు తమ వద్దే ఉన్నారని చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి నలుగురు సభ్యులు రాలేదు. 80 మంది ఎమ్మెల్యేల్లో 76 మంది వచ్చారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు వ్యక్తిగత కారణాల రీత్యా సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు ముందస్తుగానే పార్టీ పెద్దలకు సమాచారమిచ్చారు. అనారోగ్య కారణాలతో గైర్హాజరవుతున్నట్లు చించోలి ఎమ్మెల్యే ఉమేశ్‌జాధవ్..సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్యకు ఫ్యాక్స్ చేశారు. కోర్టు పని వల్ల సీఎల్పీ భేటీకి హాజరు కాలేకపోతున్నట్లు బళ్లారి(గ్రామీణ) ఎమ్మెల్యే నాగేంద్ర.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్‌కు తెలియజేశారు. అయితే గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జారకిహోళి, అథని ఎమ్మెల్యే మహేశ్ కుమటెళ్లి గురించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు. రమేశ్ జారకిహోళి తమ పార్టీకి మద్దతిస్తున్నట్లు బీజేపీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ప్రస్తుతం బీజేపీకి 106 సభ్యుల మద్దతుండగా, ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నాక కాంగ్రెస్–జేడీఎస్ కూటమి సంఖ్యాబలం 116కు తగ్గిపోయింది. -
కర్ణాటక కాంగ్రెస్‌లో కీలక మార్పు
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కర్ణాటక పార్టీని పునర్వ్యవస్థీకరించారు. పార్టీ రాష్ట్రస్థాయి పదవుల్లో పలు మార్పులు చేపట్టారు. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత దినేశ్ గుండురావును కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అశోక్ గెహ్లాట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు కర్ణాటక పీసీసీ చీఫ్‌గా కొనసాగిన జీ పరమేశ్వర కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో పీసీసీ చీఫ్‌గా దినేశ్ గుండురావును రాహుల్ నియమించారు. మాజీ సీఎం ఆర్ గుండురావు తనయుడైన దినేశ్ ఐదుసార్లు బెంగళూరులోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నప్పటికీ.. తమకు మంత్రి పదవులు రాకపోవడంతో పలువురు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు అసమ్మతితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో నేతలను బుజ్జగించే పార్టీలో అంతర్గత విభేదాలను సమసిపోయేలా చేసేందుకు రాహుల్ ఈ నియామకం చేపట్టారు. -
సిద్ధరామయ్యపైనే కర్ణాటక కాంగ్రెస్ భారం
-
త్వరలో మా పార్టీలోకి 20మంది బీజేపీ నేతలు!
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో వరుస వలసలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పార్టీ అగ్రనేత, మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. బీజేపీ గూటిలోకి చేరగా.. మాజీ మంత్రులైన శ్రీనివాస్ ప్రసాద్, కుమార్ బంగారప్ప, కే జయప్రకాశ్ హెగ్డే వంటి నేతలు కూడా హస్తాన్ని వీడి.. కాషాయ కండువాను కప్పుకున్నారు. ఈ వలసల్లో కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర హోంమంత్రి జీ పరమేశ్వర కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. త్వరలోనే దాదాపు 20 మంది బీజేపీ నేతలు, మరికొందరు జేడీఎస్ నేతలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. గతంలోనే ఈ విషయాన్ని చెప్పిన పరమేశ్వర తాజాగా గురువారం తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నేతలు, జేడీఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయాన్ని ప్రజలకు తెలిపేందుకు తాను ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు? వారు ఏ ప్రాంతానికి చెందినవారు? అన్నది త్వరలోనే క్లారిటీ ఇస్తామని ఆయన చెప్పారు. ఇంతకు ఎంతమంది బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరబోతున్నారు? వారు చోటామోటా నేతలా? లేక బడా నేతలా? అంటు కర్ణాటక కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది. -
కర్ణాటక కాంగ్రెస్ లో 'కేబినెట్' చిచ్చు
బెంగళూరు: కర్ణాటకలో మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. 14 మంత్రులపై సీఎం సిద్ధరామయ్య వేటు వేయడంతో హస్తం పార్టీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించి గత రెండు రోజులుగా ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి 14 మందిని మంత్రి మండలి నుంచి తప్పించాలని నిర్ణయించారు. రాజీనామాలు సమర్పించాలని సదరు మంత్రులను కోరినట్టు తెలుస్తోంది. మంత్రి పదవులను కోల్పోనున్న కొంత మంది తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ తనను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఎమ్మెల్యే స్థానానికి సైతం రాజీనామా చేసి వెళ్లిపోతానని హెచ్చరించారు. శ్యామనూరు శివశంకరప్పను బుజ్జగించేందుకు ఆయన కుమారుడు ఎస్.ఎస్.మల్లికార్జున్ (దావణగెరె ఉత్తర)కు కేబినెట్ లో చోటు కల్పించారు. సతీశ్ స్థానంలో రమేశ్ కుమార్ ను తీసుకున్నారు. 14 మంత్రులు ఈ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై పార్టీ ఇమేజ్ పెరుగుతుందని సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర విశ్వాసంతో ఉన్నారు. మరోవైపు తమ నేతకు మంత్రి పదవి ఇవ్వలేదన్న సమాచారంతో ఎమ్మెల్యే ఎం.క్రిష్ణప్ప మద్దతు దారులు బెంగళూరులో ఆందోళనకు దిగారు. -
నేతల ఆశలపై నీళ్లు
మంత్రివర్గ ప్రక్షాళనకు బ్రేక్ రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదు స్పష్టం చేసిన దిగ్విజయ్ సింగ్ బెంగళూరు: మంత్రి పదవుల కోసం తహతహలాడుతున్న నేతల ఆశలపై కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ నీళ్లు చల్లారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేసిన ఆయన..మంత్రి వర్గ ప్రక్షాళనకు బ్రేక్ వేశారు. నగరంలోని కుమారకృపా అతిథి గృహంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండబోదని అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆ పదవి నుండి తప్పించనున్నారన్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సైతం దిగ్విజయ్ సింగ్ బ్రేక్ వేశారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సిందిగా ఎవరిపైనా ఒత్తిళ్లు లేవని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కాగా, కరువు పరిస్థితుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడంపై దిగ్విజయ్ సింగ్ సీఎం సిద్ధరామయ్యపై ఫైర్ అయినట్లు సమాచారం. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు తాండవమాడుతున్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణతో పాటు అంతర్గత కుమ్ములాటలను పక్కకు పెట్టి ప్రజలకు సమాయం అందించే దిశగా ప్రణాళికలు రచించాలని దిగ్విజయ్ సింగ్ సిద్ధరామయ్యకు సూచించారు. ఆ దిశగా ఎమ్మెల్యేలకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. హైకమాండ్‌కు ఫిర్యాదు చేయమనండి..... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ స్థానం నుండి దిగ్విజయ్ సింగ్‌ను తప్పించాలంటూ ఆ పార్టీ సీనియర్ నేత హెచ్.విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలపై దిగ్విజయ్ స్పందించారు. ‘విశ్వనాథ్ పై నాకు గౌరవం ఉంది. నేను అసమర్ధుడిని అని విశ్వనాథ్ భావిస్తే ఈ విషయంపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేయమనండి. విశ్వనాథ్ ఎలాగో సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ఫిర్యాదు చేస్తే హైకమాండ్ నన్ను ఈ బాధ్యతల నుండి తప్పించవచ్చేమో’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. -
సీఎంను తప్పించేందుకు యత్నం !
రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు సిద్ధరామయ్యను తప్పించేందుకు యత్నం నామమాత్రంగా వ్యవహరిస్తున్న అధిష్టానం దళిత వర్గాలను మచ్చిక చేసుకునే పనిలో సీఎం గట్టెక్కించాలంటూ ఎస్ఎం కృష్ణకు బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని ప్రధాన నాయకుల మధ్య విభేదాలు బలపడుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని పలువురు పావులు కదుపుతుండగా... పదవిని నిలబెట్టుకునేందుకు సిద్ధరామయ్య కూడా అదే స్థాయిలో ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ రాజకీయ చదరంగంలో ఏఐసీసీ నామమాత్రంగా వ్యవహరిస్తూ సమస్య పరిష్కరించమంటూ రాష్ట్ర రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరుగడించిన ఎస్.ఎం.కృష్ణకు అప్పగించింది. బెంగళూరు : రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు రుచించడం లేదు. దీనికి తోడు తనతో పాటు జేడీఎస్ నుంచి వలస వచ్చిన వారికి సిద్ధు ప్రాధాన్యమిస్తుండడం వారిని మరింత అసంతృప్తికి గురిచేసింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి బలపడేందుకు తన సర్వశక్తులు ఒడ్డిన కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్‌కు ముఖ్యమంత్రి పదవి అందని ద్రాక్షలా మారింది. ఆఖరుకు ఎలాగైనా ఉప ముఖ్యమంత్రి స్థానంలోనైనా ఉండాలనే ఆకాంక్షకు సిద్ధరామయ్య గండి కొడుతూ వచ్చారు. దీనికి తోడు రాష్ట్ర మంత్రి వర్గంలోని నాలుగు స్థానాలు ముఖ్యమంత్రి వద్ద నిలిచిపోయాయి. వీటిని భర్తీ చేయకుండా సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతికి మరింత ఆజ్యం పోశాయి. ఈ విషయంలో పూర్తిస్థాయిలో జోక్యం చేసుకోకుండా అధిష్టానం నామమాత్రంగా వ్యవహరిస్తుండడం సీనియర్లను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న సీనియర్ల అసంతృప్తి ఇటీవల ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కర్ణాటక పర్యాటనకు వచ్చినప్పుడు ఒక్కసారిగా భగ్గుమంది. యువరాజు ఎదుట ఏకంగా ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై ఫిర్యాదుల తుఫాన్ లేచింది. దీంతో ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఎస్.ఎం.కృష్ణ, జాఫర్ షరీఫ్, బి.కె.హరిప్రసాద్ వంటి సీనియర్లను కలుపుకుని ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీతో రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటకలోని తాజా పరిస్థితిపై సమగ్రంగా చర్చించి ముఖ్యమంత్రి స్థానం నుంచి సిద్ధరామయ్యను తప్పించకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమన్న నిర్ణయానికి వచ్చేశారు. అంతేకాక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా చాటాలంటే సిద్ధరామయ్యను సీఎం పీఠం నుంచి తప్పించాలని తీర్మానించినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం తెలుసుకున్న సిద్ధరామయ్య తన పీఠం కాపాడుకోవడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే తనకు ఇష్టం లేకపోయినా ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని పరమేశ్వర్‌కు అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చర్య దళితులను తనకు దగ్గరగా చేస్తుందని సిద్ధు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి సిద్ధు తీసుకెళ్లారు. పరమేశ్వర్‌కు డిప్యూటీ సీఎం పదవినివ్వడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని తెలియజేశారు. అయితే సిద్ధు ప్రతిపాదనకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంగీకరించడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారే కీలక పదవుల్లో ఉన్నారని అందువల్ల సిద్ధరామయ్యను ఆ స్థానం నుంచి తప్పించాలని పట్టుబడుతున్నారు. సిద్ధరామయ్యను సీఎంను పీఠం నుంచి దించి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గే లేదా పరమేశ్వను కూర్చోబెట్టాలని సదరు నేతలు పట్టుదలతో ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సమస్యను పరిష్కరించే బాధ్యత మాజీ సీఎం, రాష్ట్ర రాజకీయాల్లో చాణుక్యుడిగా పేరుగాంచిన ఎస్.ఎం.కృష్ణకు అధిష్టానం అప్పగించింది. ఆయన దసరా వరకు సమయం కోరినట్లు తెలుస్తోంది. దీంతో దసరా తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
రమ్యా కంట నీరు...
శాండల్‌వుడ్ నటి, మాజీ ఎంపీ రమ్యా ఇటీవల తనపై వస్తున్న విమర్శలను కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణ వద్ద చెప్పుకుని కన్నీరు పెట్టారు. రాహుల్ పర్యటన సందర్భంలో బలవన్మరణానికి పాల్పడ్డ రైతు కుటుంబానికి కేపీసీసీ తరఫున అందజేసిన చెక్కు విషయంలో రమ్యాపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తీవ్రంగా కలత చెందిన ఆమె సోమవారం మధ్యాహ్నం ఎస్.ఎం.కృష్ణ నివాసానికి చేరుకుని రైతు కుటుంబానికి అందజేసిన చెక్కు విషయంలో తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని వివరించినట్లు సమాచారం. అయితే తన రాజకీయ ప్రత్యర్థులు కావాలనే ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారని వాపోయారు. ఈ పరిస్థితులన్నింటిని గమనిస్తుంటే అసలు తనకు రాజకీయాల నుంచే తప్పుకోవాలనే భావన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ మౌనంగా విన్న ఎస్.ఎం.కృష్ణ, రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజమేనని, అన్ని పరిణామాలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. అనంతరం కన్నీటితోనే బయటికి వచ్చిన రమ్యా తనకు ఎమ్మెల్సీ కావాలనో లేదంటే మంత్రి పదవి చేపట్టాలనో ఏమాత్రం లేదని అన్నారు. సాధారణ భేటీలో భాగంగానే ఎస్.ఎం.కృష్ణతో సమావేశమైనట్లు చెప్పుకొచ్చారు. -
రాహుల్ వెంటే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వచ్చే సార్వత్రిక ఎన్నికలను రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎదుర్కొనే విషయమై కాంగ్రెస్ తర్జన భర్జన పడుతున్నప్పటికీ, కర్ణాటక కాంగ్రెస్ మాత్రం ఆయన పట్ల అచంచల విశ్వాసాన్ని కనబరుస్తోంది. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ప్రకటించాలని కూడా అధిష్టానంపై ఒత్తిడి తెస్తోంది. రాహుల్ పలు రాష్ట్రాల్లో పార్టీ ప్రచార బాధ్యతలను చేపట్టినప్పటికీ, కర్ణాటకలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. దీనికి రాహుల్ కన్నా యడ్యూరప్పే ప్రధాన కారణమని విశ్లేషిస్తున్న వారూ లేకపోలేదు. ఆ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఈ విశ్లేషణ తప్పు కాదని కూడా తేలుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్‌కు అవకాశాలున్నాయనే అంచనాతో ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే రాహుల్ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానికులు, వలసవాదులు... అని పార్టీ నిట్ట నిలువునా చీలిన దశలో కూడా అందరినీ ఏక తాటిపైకి తీసుకు రావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఎగువ సభ ఎన్నికల సందర్భంగా తన వారికి సీట్లు ఇవ్వనందుకు అలకబూనిన ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అనునయించగలిగారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర ఎన్నికలకు ముందు తాను కూడా సీఎం రేసులో ఉన్నానని పరోక్షంగా ప్రచారం చేసుకున్నప్పటికీ, వారిద్దరి మధ్య స్పర్థలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బొటాబొటి మెజారిటీ వచ్చినప్పటికీ, సీఎల్పీ నాయకుడుగా సిద్ధరామయ్య ఎన్నికయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు ఎన్నికల్లో ఓడిపోయిన పరమేశ్వరను కేపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూనే పార్టీలో ఆయన ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని సంకేతాలిచ్చారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం. కృష్ణను ఎన్నికలకు ముందు, తర్వాత అడపా దడపా సంప్రదిస్తూ, పార్టీ వ్యూహకర్తల్లో ఆయనా ఒకరనే భావన కల్పించారు. వెరసి అందరికీ దగ్గరయ్యారు. కనుక సహజంగానే అందరూ ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రాహుల్ ప్రకటనపై కృష్ణ హర్షం దేశ ప్రధాని కాగల అన్ని అర్హతలున్న రాహుల్ గాంధీ, పార్టీ అప్పగించే ఏ బాధ్యతనైనా చేపడతానని ప్రకటించడం పట్ల కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం. కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదురు కాబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో కూడా పార్టీ బాధ్యతలను చేపట్టడానికి ఆయన ముందుకు రావడంతో దేశంలోని వేల మంది కాంగ్రెస్ అభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోందని ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ పట్ల ఉన్న చిత్తశుద్ధి, నిబద్ధతలు ఆయన నాయకత్వ లక్షణాలకు సాక్షులుగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనుభవంతో మాత్రమే పాఠాలు నేర్చుకోవడం సాధ్యమవుతుందని, రాహుల్ ఇంకా చాలా సమయం ఉందని ఆయన తెలిపారు.