
డీకే శివకుమార్
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను సెప్టెంబర్ 13 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం రాత్రి అరెస్టు చేసిన శివకుమార్‌ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరిన నేపథ్యంలో ప్రత్యేక జడ్జి ఈ ఉత్తర్వులిచ్చారు. బుధవారం రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలో పరీక్షల అనంతరం శివకుమార్‌ను ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు.
శివకుమార్ తరఫున వాదిస్తున్న న్యాయవాదులు అభిషేక్‌మను సింఘ్వీ, దయన్ కృష్ణన్ వాదనలు వినిపిస్తూ శివకుమార్ అరెస్టు అన్యాయం అనీ, అతను పరారవుతాడన్న ఈడీ అనుమానాలు నిరాధారమని వాదించారు. శివకుమార్‌ను ఈడీ అరెస్టు చేసినందుకు నిరసనగా బుధవారం కర్ణాటక, ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను ఢిల్లీలోని యువజన కాంగ్రెస్ కార్యాలయం బయట దహనం చేశారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ నిరసనలు నిర్వహించింది. ఐదారు బస్సులపై రాళ్ల దాడి జరిగిందని, కనకపుర, బెంగళూరులో బస్సులను తగలబెట్టడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు.
Comments
Please login to add a commentAdd a comment