
న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. ఈ వ్యవహారంపై మంగళవారం సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు..రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై పూర్తి నిర్ణయాధికారం స్పీకర్‌దేనని స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పును ప్రశంసిస్తూ.. ఆపరేషన్ లోటస్ విఫలమైందని, సత్యమేవ జయతే అంటూ పేర్కొంది.
రాజీనామాలపై స్పీకర్‌ని నిర్ణీత సమయంలోపు నిర్ణయం తీసుకోమని తాము బలవంతం చేయలేమని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం వ్యవహరించే స్వేచ్ఛ స్పీకర్‌కి ఉందని పేర్కొంది. జూలై 18న కర్ణాటక అసెంబ్లీలో జరిగే బలపరీక్షకు హాజరుకావాలని కాంగ్రెస్, జేడీ(ఎస్) జారీ చేసిన విప్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాల్లో పాల్గొనడానికి బలవంతం చేయలేమంటూ వ్యాఖ్యానించింది.