పార్టీ అధ్యక్ష స్థానం నుంచి రాహుల్ గాంధీ నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీ తన చరిత్రలో ఎన్నడూ లేనంత దుస్థితిలో కొట్టుమిట్టులాడుతుంటే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అన్ని పరిణామాలకు తాము అతీతంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నారు. డజనుకుపైగా పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి ఫిరాయింపుల జూదంలో మునిగితేలుతుండటంతో సంకీర్ణ ప్రభుత్వ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ దుస్థితి పట్ల బాధలేదు. పశ్చాత్తాపం లేదు. ఇప్పుడేం చేయాలి అనే ఆందోళన లేదు. ఎవరెలా చస్తే మాకేం అన్న చందాన ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. రాహుల్‌కి నమ్మినబంటులా వ్యవహరిస్తూవచ్చిన మాజీ సీఎం సిద్ధరామయ్య అనుయాయులే తిరుగుబాటు ప్రకటించడంతో బీజేపీ తదనంతర వారసుడిగా తాను రంగలోకి రానున్నారా అనే అనుమానాలు ప్రబలమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిని అస్తవ్యస్థత అనే ఒకే ఒక్క పదంతో వర్ణించవచ్చు. గాంధీల కుటుంబానికి చెందిన నాల్గవ తరం అధినేత ఏకంగా పార్టీ అధ్యక్ష పదవికే రాజీనామా సమర్పించి, తాను పార్టీలో ఒంటరినయ్యాను అని చేతులెత్తేశారు. తన రాజీనామా నిర్ణయానికి తిరుగులేదని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవి కంటే రాహుల్ తదుపరి చర్య ఏమిటన్నది ఇంకా స్పష్టం కాలేదు. కాగా ఇటీవలి దశాబ్దాలలో కాంగ్రెస్ పార్టీ అదృష్ట చిహ్నంగా ఉంటూ వచ్చిన మన్మోహన్ సింగ్ తాను మరోసారి రాజ్యసభకు ఎన్నిక అవుతానా అన్నది అర్థం కాని స్థితిలో పడిపోయారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇంతటి దుస్థితిలో కొట్టుమిట్టులాడుతుంటే, కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అన్ని పరిణామాలకు తాము అతీతంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నారు.
ఒకవైపు డజనుకుపైగా పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి ఫిరాయింపుల జూదంలో మునిగితేలుతుండటంతో సంకీర్ణ ప్రభుత్వ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు చీమకుట్టినట్లుగా కూడా లేదు. ఒకవైపు ఐఎమ్‌ఎ కుంభకోణం పేరిట పాంజీ స్కీమ్ వేలాదిమంది పేద, మధ్యతరగతి ముస్లింలు తమ జీవితకాలం దాచుకున్న పొదుపు మొత్తాలను ఎగరేసుకుపోయింది. కానీ సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు ఇటీవల నిర్వహించిన ఒక ఈవెంటులో పై కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు ఆరోపణలకు గురైన పార్టీ సహచరులు హాజరై పండుగ చేసుకుంటున్న వార్తలు పత్రికలకెక్కాయి. పార్టీ అస్తిత్వమే సంక్షోభంలో పడిన ప్రస్తుత సందర్భంలోనూ కొందరు ఎమ్మెల్యేలు తమ రాజకీయ అవకాశవాదాన్నే పరమావధిగా భావించి తమ దారి తాము చూసుకోవడం గమనార్హం.
ఇన్ని గందరగోళాల మధ్య, జావకారిపోయిన పార్టీని పునర్మిర్మాణం చేయడం ఎలా అనే మీమాంస ఎవరికీ ఉన్నట్లు లేదు. పార్టీలో సంక్షోభం, ఐఎమ్‌ఏ స్కామ్ నేపథ్యంలో ప్రజల్లో ఆగ్రహావేశం వంటివేవీ కర్ణాటక కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదు. అప్రతిష్టాత్మకమైన ఈవెం ట్లలో మునిగితేలుతూ ఫోటో పోజులకు దిగుతూ, సెలబ్రిటీలతో ట్వీట్లు పంచుకుంటూ ఆ పార్టీ నేతలు పొద్దుపుచ్చుతున్నారు. పార్టీ దుస్థితి పట్ల బాధలేదు. పశ్చాత్తాపం లేదు. ఇప్పుడేం చేయాలి అనే ఆందోళన లేదు. ఎవరెలా చస్తే మాకేం అన్న చందాన ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు.
జూలై 3న పార్టీకి రాసిన ఉత్తరంలో బహుశా రాహుల్ గాంధీ కీలక సమయాల్లో ‘తాను ఒంటరినయి’నట్లు చెప్పినదానికి అర్థం ఇదేనేమో? పైగా కాంగ్రెస్ పనితీరు మౌలికంగానే పరివర్తన చెందాల్సిన అవసరముందని, రాహుల్ స్పష్టం చేశారు కూడా. కానీ వాస్తవానికి గడచిన దశాబ్దాలుగా కాంగ్రెస్ ఇలాగే కొనసాగుతోంది. యుద్ధం చేయడాన్ని, సమరంలో గెలుపొందడాన్ని కాంగ్రెస్ సేనలు మర్చిపోయాయి. ఈ దయనీయ నేపథ్యంలోనే కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని మనం పరిశీలించాల్సి ఉంది. డజనుకుపైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడి పార్టీనుంచి నిష్క్రమించనున్నారు. లేక ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుని మంచి స్థితికోసం బేరసారాలకు పాల్పడుతున్నారు. అంతే తప్ప, ఒక సంవత్సర కాలంలోనే సంకీర్ణ ప్రభుత్వం వందోసారి సంక్షోభంలో కూరుకుపోవడం పట్ల వీరెవరికీ ఎలాంటి ఆందోళనా కలగడం లేదు.
కానీ కర్ణాటకలో కాని దేశవ్యాప్తంగా కానీ కాంగ్రెస్ పరిస్థితి ఇంతకంటే భిన్నంగా మాత్రం లేదు. ప్రజలు ఇలాంటి వారిని, వీరి సిగ్గుమాలిన రాజకీయాలను చూస్తున్నారు. కానీ ప్రజల మనోభావాలను వీరు మాత్రం అర్థం చేసుకోవడం లేదు. ఇలాంటి కారణాలవల్లే రాష్ట్రంలో పార్టీ అధికారానికి దూరమై జనతాదళ (సెక్యులర్) సంకీర్ణ ప్రభుత్వానికి తావివ్వాల్సి వచ్చిందని, అది కూడా దారుణమైన అస్థిరత్వంతో కొనసాగుతోందని చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి కూడా. రెండు పార్టీలకు మద్దతిస్తున్న ప్రజలు పరస్పరం అతివ్యాప్తమయ్యారు కాబట్టి వీరు కలిసి ఉండలేరనే వాదన కూడా ఉంది. ఇది నిజమే కావచ్చు. కానీ ప్రత్యేకించి పాత మైసూరు, దక్షిణ కర్ణాటక జిల్లాల్లో బలీయంగా ఉన్న భూస్వామ్య రాజకీయాలు, అధికార దాహం, ప్రాదేశిక నియంత్రణ, వ్యక్తిగత దురాశలు ఈ అస్తవ్యస్తతకు కారణమని కూడా కొందరి వాదన.
ఒక విషయంలో మనం నిజాయితీగా ఉందాం. సిద్ధరామయ్య వంటి అగ్రనేతలు కాంగ్రెస్ ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే పోరాడుతున్నారని నమ్మవచ్చా? సిద్ధరామయ్య వంటి వ్యక్తులు దేవేగౌడ కుటుంబ నిరంకుశత్వానికి, అవమానాలకు గురై వ్యక్తిగతంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే సిద్ధరామయ్య ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా సిద్ధపడతారు తప్పితే కొద్దిమంది ఎమ్మెల్యేలను మాత్రమే కలిగిన గౌడ కుటుంబ సభ్యుడొకరు తనపై బాస్ లాగా పెత్తనం చలాయించడానికి అసలు ఒప్పుకోరు.
అందుకే తాజా సంక్షోభంలో సిద్ధరామయ్య అనుయాయులే తిరుగుబాటు పక్షంలో చేరిపోవడం చూస్తే ఆశ్చర్యమనిపించదు. పైగా తమ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే తప్ప హెచ్ డి కుమారస్వామి కానేకాదని ఈ ఎమ్మెల్యేలు చాలాసార్లు బహిరంగంగానే ప్రకటించడం కూడా ఆశ్చర్యం కలిగించదు. కానీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి అర్థం కానిదల్లా ఏమిటంటే, మెజారిటీ మద్దతును కూడగట్టడంలో తాను విఫలమైనందుకే చివరకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది అన్నదే. అయిదేళ్ల తన పదవీకాలంలోనూ ఇదే ప్రతిబింబించింది. చివరకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 పార్లమెంటు ఎన్నికల్లో తన చేతకానితనమే పార్టీ కొంప ముంచింది. అయితే వ్యూహరచనలో తనదే పైచేయి కాబట్టి ఈ పరాజయ బాధ్యతను ఆయన ఎన్నటికీ గుర్తించరు.
కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణాన్ని ప్రతిఘటించాలంటే మరింత గౌరవనీయ మార్గాలున్నాయి. కానీ రాష్ట్రంలో పార్టీ విధ్వంసానికి సిద్ధరామయ్యే కారణమని మీడియాలో వార్తలొస్తున్నాయి. దురదృష్టవశాత్తూ వాస్తవం ఎలా ఉన్నప్పటికీ ఆయన వారసత్వం మొత్తంగా ఇలాగే ఉంటోందన్నంత అపకీర్తి మాత్రం మిగిలింది. గడచిన దశాబ్దాలలో ఆయన మృదు స్వభావం, ప్రగతిశీల సంభాషణలు ఒక ముసుగుగా మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి ప్రస్తుత పరిస్థితిలో ఆయన తన పార్టీకి సహాయకారిగా లేరనే అర్థాన్ని కల్పిస్తున్నాయి.
సంకీర్ణ ప్రభుత్వాన్ని బలహీనపరిచే మరొక అంశం కూడా ఇక్కడ తోడైంది. 2013లో తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి ఏకైక కారకుడు రాహుల్ గాంధీయే అని సిద్ధరామయ్య ప్రగాఢ నమ్మకం. సోనియాగాంధీ ఏఐసీసీ ప్రెసిడెంటుగా ఉంటుండగా సీఎం కుర్చీకి చాలా పోటీ ఉన్నప్పుడు రాహుల్ తనవైపే మొగ్గు చూపారని ఆయన నమ్మిక. అయితే ఇప్పుడు రాహుల్ ఢిల్లీకి దూరమైపోయారు కాబట్టి సీజనల్ రాజకీయనేత అయిన సిద్ధరామయ్య వెంటనే తన విశ్వాసాన్ని మార్చుకుని తనకు మరింత ప్రాధాన్యత లభించే చోటుకోసం వెతుక్కుంటున్న్టట్లు కనిపిస్తోంది. తాను సేవలిందించే పార్టీపైనే తిరుగుబాటు చేసే సుదీర్ఘ చరిత్ర సిద్ధరామయ్యకు ఉందని చాలామందికి తెలీదు.
అయితే కాంగ్రెస్ పతనానికి సిద్ధరామయ్య మాత్రమే కారకులని నిందించలేం. సీనియర్ కాంగ్రెస్ నేతలు చాలామంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల వలే పనిచేస్తూవచ్చారు. గత నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ చరిత్రను పరిశీలిస్తే 1983లో రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి నేటివరకు కాంగ్రెస్ వృద్ధిబాట పట్టలేకపోయింది. దాని సగటు వోటు వాటా 30.49 శాతం వద్దే నిలిచిపోయింది. జనతా పరివార్ కావచ్చు, సంఘ్ పరివార్ కావచ్చు వాటిలో చీలికలు వచ్చి బలహీనపడినప్పుడు మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. 1989లో వీరేంద్రపాటిల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొద్ది కాలం మినహాయిస్తే, ఇతర ఏ కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలు కూడా సానుకూల ఓటుతో వచ్చినవి కాదు. అధికారం నిలుపుకోవడానికి ఒక కొత్త ఆలోచనవైపు కానీ, ఒక కొత్త సామాజిక బృందం వైపు కానీ కాంగ్రెస్ నేతలు ఎన్నడూ నడిచిన పాపాన పోలేదు.
ప్రస్తుత నేపథ్యంలో బీజేపీ ఏం చేయాలనుకుంటోందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వారు అధికారంపై మాత్రమే దృష్టి పెట్టడంలేదు. బీఎస్ ఎడ్యూరప్పను మళ్లీ సీఎంగా నిలుపడానికి వారు ఏమాత్రం తొందరపడలేదు. ఆయన తదనంతర వారసుడికోసం తగిన మార్గాలకోసం వారు అన్వేషిస్తున్నారు. సిద్ధరామయ్య వంటివారు తమ పార్టీలోకి రావడం ఖరారైతే నూతన నాయకత్వానికి పట్టం కట్టడం కూడా వారు ఎడ్యూరప్ప ద్వారానే చేస్తారు కూడా. బీజేపీ నిజమైన ఉద్దేశం దక్షిణ కర్ణాటకలో బలంగా పాదుకోవడమే. ఉత్తర కర్ణాటకనుంచి ఒక లింగాయత్‌ను పదే పదే నాయకుడిగా నిలుపడం ద్వారా బీజేపీ అలసిపోయినట్లుంది. ఇప్పుడు వొక్కళిగ కమ్యూనిటీ నుంచి నాయకత్వాన్ని రూపొం దించడం దాని లక్ష్యం. అందుకేవారు కాంగ్రెస్ విస్మృత నేత ఎస్‌ఎమ్ కృష్ణను వారు తమలో చేర్చుకున్నారు. ఈ ప్రాంతంలో ఆయన అస్తిత్వ రాజకీయాలకు బలమైన చిహ్నంగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ రీజియన్‌లో తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వారికి చాలా ప్రోత్సాహకరంగా మారాయి. మొత్తంమీద చూస్తే రాజకీయంగా కర్ణాటకలో బీజేపీ భవిష్యత్తు మాత్రం నిరాశా నిస్పృహలతో కొనసాగదన్నది వాస్తవం.
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, రచయిత
సుగత శ్రీనివాసరాజు
Comments
Please login to add a commentAdd a comment