వచ్చే సార్వత్రిక ఎన్నికలను రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎదుర్కొనే విషయమై కాంగ్రెస్ తర్జన భర్జన పడుతున్నప్పటికీ, కర్ణాటక కాంగ్రెస్ మాత్రం ఆయన పట్ల అచంచల విశ్వాసాన్ని కనబరుస్తోంది.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వచ్చే సార్వత్రిక ఎన్నికలను రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎదుర్కొనే విషయమై కాంగ్రెస్ తర్జన భర్జన పడుతున్నప్పటికీ, కర్ణాటక కాంగ్రెస్ మాత్రం ఆయన పట్ల అచంచల విశ్వాసాన్ని కనబరుస్తోంది. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ప్రకటించాలని కూడా అధిష్టానంపై ఒత్తిడి తెస్తోంది. రాహుల్ పలు రాష్ట్రాల్లో పార్టీ ప్రచార బాధ్యతలను చేపట్టినప్పటికీ, కర్ణాటకలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది.
దీనికి రాహుల్ కన్నా యడ్యూరప్పే ప్రధాన కారణమని విశ్లేషిస్తున్న వారూ లేకపోలేదు. ఆ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఈ విశ్లేషణ తప్పు కాదని కూడా తేలుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్‌కు అవకాశాలున్నాయనే అంచనాతో ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే రాహుల్ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానికులు, వలసవాదులు... అని పార్టీ నిట్ట నిలువునా చీలిన దశలో కూడా అందరినీ ఏక తాటిపైకి తీసుకు రావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు.
ఎగువ సభ ఎన్నికల సందర్భంగా తన వారికి సీట్లు ఇవ్వనందుకు అలకబూనిన ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అనునయించగలిగారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర ఎన్నికలకు ముందు తాను కూడా సీఎం రేసులో ఉన్నానని పరోక్షంగా ప్రచారం చేసుకున్నప్పటికీ, వారిద్దరి మధ్య స్పర్థలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బొటాబొటి మెజారిటీ వచ్చినప్పటికీ, సీఎల్‌పీ నాయకుడుగా సిద్ధరామయ్య ఎన్నికయ్యేలా ఆదేశాలు జారీ చేశారు.
మరో వైపు ఎన్నికల్లో ఓడిపోయిన పరమేశ్వరను కేపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూనే పార్టీలో ఆయన ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని సంకేతాలిచ్చారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం. కృష్ణను ఎన్నికలకు ముందు, తర్వాత అడపా దడపా సంప్రదిస్తూ, పార్టీ వ్యూహకర్తల్లో ఆయనా ఒకరనే భావన కల్పించారు. వెరసి అందరికీ దగ్గరయ్యారు. కనుక సహజంగానే అందరూ ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
రాహుల్ ప్రకటనపై కృష్ణ హర్షం
దేశ ప్రధాని కాగల అన్ని అర్హతలున్న రాహుల్ గాంధీ, పార్టీ అప్పగించే ఏ బాధ్యతనైనా చేపడతానని ప్రకటించడం పట్ల కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం. కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదురు కాబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో కూడా పార్టీ బాధ్యతలను చేపట్టడానికి ఆయన ముందుకు రావడంతో దేశంలోని వేల మంది కాంగ్రెస్ అభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోందని ఓ ప్రకటనలో తెలిపారు.
పార్టీ పట్ల ఉన్న చిత్తశుద్ధి, నిబద్ధతలు ఆయన నాయకత్వ లక్షణాలకు సాక్షులుగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనుభవంతో మాత్రమే పాఠాలు నేర్చుకోవడం సాధ్యమవుతుందని, రాహుల్ ఇంకా చాలా సమయం ఉందని ఆయన తెలిపారు.