రుణమాఫీ రూ.లక్ష | Telangana government orders to issue of one lakh Waiver loans to farmers | Sakshi
Sakshi News home page

రుణమాఫీ రూ.లక్ష

Published Thu, Aug 14 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM

Telangana government orders to issue of one lakh Waiver loans to farmers

* మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
* వడ్డీతో కలిపి రూ. లక్షలోపు రుణాలకు వర్తింపు
* కొత్త రుణాలివ్వండి.. బ్యాంకర్లకు ఆదేశం

 
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాల మాఫీ కి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. 2014 మార్చి 31వ తేదీ నాటికి రైతులు తీసుకున్న రుణాల అసలు, వడ్డీ కలిపి కుటుంబానికి లక్ష రూపాయలలోపు ఉన్న పంట రుణాలకు మాత్రమే ఈ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది. పంట దిగుబడిని తాకట్టు పెట్టి ముందస్తుగా తీసుకున్న రుణాలు, ఒప్పంద రుణాలు, క్లోజ్‌డ్ క్రాప్‌లోన్లకు ఈ రుణమాఫీ వర్తించదని పేర్కొంది. రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని, వారికి వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి వ్యవ సాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
 
 ఇవీ మార్గదర్శకాలు...
 * గ్రామాల వారీగా బ్యాంకు రుణాలు, రైతుల వివరాల జాబితా రూపొందిం చాలి. 2014 మార్చి 31 నాటికి ఉన్న మొత్తం బకాయిలు ఎంతో లెక్కించాలి.
* పంట, బంగారం రుణాలు ఎంత అనేది నమూనా పత్రంలో పేర్కొనాలి. గరిష్టంగా లక్ష రూపాయల దాకా రుణం ఉన్న రైతుల జాబితాను బ్యాంకు మేనేజర్ రూపొందించాలి.
* ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల నుంచి పంట, బంగారం తాకట్టు రుణాలు తీసుకున్నవారిని తొలగించడానికి వీలుగా... కుటుంబానికి లక్ష రూపాయల గరిష్ట రుణం ఉన్నవారి జాబితాను మండల స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పెట్టి అర్హుల జాబితాను రూపొందించాలి.
* ఆ జాబితా ఆధారంగా తహసీల్దార్లు పట్టాదారు పాసు పుస్తకాలను పరిశీలించి.. బోగస్‌లను గుర్తించాలి. రుణం తీసుకున్న రైతులకు భూమి ఉందా? లేదా ? అనేది పరిశీలించి.. తప్పుడు క్లెయిములు ఉంటే తొలగించాలి.
* ఒక కుటుంబం ఎన్ని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుందనే విషయాన్ని జేఎల్‌ఎంబీసీ గుర్తించాలి. ఈ జేఎల్‌ఎంబీసీ సమావేశాలను డిప్యూటీ కలెక్టర్  స్థాయి అధికారులు పర్యవేక్షించాలి. వీటిని జిల్లా సహకార సంస్థ ఆడిటర్లు తనిఖీ చేయాలి.
* ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణా లు తీసుకున్న వారి రుణ మొత్తం లక్ష రూపాయల లోపు ఉంటే వారి పేరు తొలగించవద్దు. లక్ష కంటే ఎక్కువ దాటిన పక్షంలో ఏదో ఒక బ్యాంకు రుణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
* గ్రామాల వారీగా రుణ మాఫీ లబ్ధిదారు ల పేర్లను ప్రచురించాలి. ఆ జాబితాపై సామాజిక తనిఖీ నిర్వహించాలి. సామాజిక తనిఖీ సభ్యుల్లో ఎంపీడీవో, తహసీల్దార్, బ్యాంకు బ్రాంచి మేనేజర్, ఏఆర్ (ఎస్‌డీఎల్‌సీవో) సభ్యులుగా ఉంటారు. ఈ తనిఖీలో వచ్చిన అభ్యంతరాల అనంతరం అర్హుల జాబితాను రూపొందించాలి.
* రుణమాఫీ అర్హుల జాబితా, మాఫీ అయ్యే రుణ మొత్తం ఎంతనేది జాబితాగా రూపొందించి బ్యాంకు నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. ఆ జాబితాను జిల్లా కలెక్టరుకు, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజరుకు పంపించాలి. ఈ జాబితాల ఆధారంగా జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించాలి. బ్యాంకుల వారీగా రుణమాఫీ, రైతుల వివరాలను నమోదు చేసి ఎస్‌ఎల్‌బీసీకి పంపించాలి.
* జిల్లాల నుంచి వచ్చిన అర్హుల జాబితా, రుణమాఫీ మొత్తాన్ని లెక్కించి ఆ మేరకు ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ పొందే విధంగా నివేదికను సమర్పించాలి. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రుణమాఫీ మొత్తాన్ని బ్యాంకులకు సర్దుబాటు చేస్తుంది. ప్రభుత్వం చెల్లించిన డబ్బును రైతుల ఖాతాలకు జమచేసినట్లు బ్యాంకులు సర్టిఫై చేయాలి.
* రైతుల ఖాతాల్లో నిధులను సర్దుబాటు చేసే ముందు రైతుల నుంచి హామీ పత్రం తీసుకోవాలి.మోసంతో రుణమాఫీ పొందలేదని, మోసం చేసినట్లు తేలితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని రైతుల నుంచి హామీపత్రం తీసుకోవాలి.
* మండల స్థాయి బ్యాంకర్ల కమిటీలు నెల రోజుల్లోగా సమావేశమై బ్యాంకుల వారీగా, గ్రామాల వారీగా రైతుల జాబి తాను, రుణాల మొత్తాన్ని తేల్చాలి.  అనంతరం ఆడిటర్లు బ్యాంకర్లు ఇచ్చిన దాన్ని ఆడిట్ చేసి చీఫ్ ఆడిటర్‌కు సమర్పించాలి.
* రుణమాఫీ పొందే రైతుల జాబితా కరక్టేనన్న బాధ్యతను బ్యాంకులు స్వీకరించాలి.
* ఈ రుణమాఫీ ఫిర్యాదులకు సంబంధించి వచ్చే ప్రతీ దరఖాస్తును నెల రోజుల్లోగా పరిష్కరించేందుకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పర్యవేక్షక, ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చే యాలి.
* రుణమాఫీకి ఎవరు అర్హులన్న మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసినందున ఆ రుణ భారం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి తక్షణమే బ్యాంకర్లు కొత్త పంట రుణాలు రైతులకు ఇవ్వాలి. రైతులు ఎప్పుడు రుణాలు రెన్యువల్ చేసుకున్నా... దానితో సంబంధం లేకుండా 2014 మార్చి 31 నాటికి ఉన్న రూ. లక్ష లోపు రుణాలను బ్యాంకులకు రీయింబర్స్ చేయనున్నట్లు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు.
* బ్యాంకులు సమర్పించే నివేదికలకు సంబంధించి ఆరు ఫార్మాట్లను రూపొందించారు. ఎ) పంట రుణాల వివరాలు బి) బంగారం తాకట్టు రుణాల వివరాలు సి) పంట, బంగారం తాకట్టు రుణాలు డి) ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణాలున్న రైతుల జాబితా ఇ) తుది నివేదిక ఎఫ్) రుణమాఫీ చేసినట్లుగా రైతులకు బ్యాంకులు ఇచ్చే సర్టిఫికెట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement