178 మందికి నోటీసులు జారీ చేసిన విజయవాడ నగరపాలక సంస్థ.. వివిధ జిల్లాల్లోనూ ఇదే తీరు
వేధింపుల్లో భాగమేనంటున్న సచివాలయ కార్యదర్శులు
ఈ నెలలో 21,472 పింఛన్లు తగ్గింపు
6 నెలల్లో తగ్గిన పింఛన్ లబ్దిదారుల సంఖ్య 1,57,162
కొత్త పింఛన్ల మంజూరు పూర్తిగా బంద్
అమరావతి/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్):ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభించారనే కారణంతో విజయవాడ నగరంలోని 178 వార్డు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నగరపాలక సంస్థ అధికారులు మూడు మునిసిపల్ సర్కిళ్ల పరిధిలోని వార్డు సచివాలయ కార్యదర్శులకు వీటిని జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, పింఛన్ల పంపిణీ ఆలస్యం కావడానికి గల కారణాలను లిఖిత పూర్వకంగా తెలపాలని నోటీసులలో పేర్కొన్నారు.
డిసెంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని ఒక రోజు ముందే ప్రారంభించారు. విజయవాడలో 294 సచివాలయాల పరిధిలో 67,376 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ప్రతినెలా 1వ తేదీనే వార్డు సచివాలయ కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, వీఆర్వోలు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వారి ద్వారా పెన్షన్లు పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది.
ప్రతినెలా పెన్షన్ పంపిణీ చేసే బాధ్యతను ఏఎన్‌ఎం, వీఆర్వో, గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు అప్పగించింది. సచివాలయ ఉద్యోగులు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్‌ను ఒక రోజు ముందు అంటే.. నవంబర్ 30వ తేదీనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి వీఎంసీ అధికారులు నవంబర్ 29న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 30వ తేదీ ఉదయం 5.30 గంటలకు పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు.
వివిధ కారణాలలో కొందరు ఉదయం 7 గంటల తర్వాత పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. గంటన్నర ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ మధ్యాహ్నానికే పంపిణీ 95 శాతానికి పైగా పూర్తి చేశారు. విజయవాడ నగర పరిధిలో 67,376 మంది పెన్షనర్లు ఉండగా.. 64,099 మందికి అంటే 95.14 శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేశారు. అయినప్పటికీ పెన్షన్ పంపిణీ ఆలస్యంగా ప్రారంభించారని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ నగరపాలక సంస్థ అధికారులు 178 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
వీరిలో సగానికిపైగా నూరు శాతం పంపిణీని పూర్తి చేశారు. ఆస్పత్రులకు వెళ్లి పెన్షన్ అందజేసిన వారికి సైతం నోటీసులు జారీ అయ్యాయి. ఓ వైపు పెన్షన్ల పంపిణీ జరుగుతుండగానే.. సాయంత్రం 6గంటలకల్లా వీఎంసీ కార్యాలయానికి వచ్చి లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు.
పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
వలంటీర్లు లేకుండానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పుకునేందుకు ఆపసోపాలు పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. ఎడాపెడా షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ వేధిస్తోంది. అన్నమయ్య జిల్లా అప్పకొండయ్యగారి పల్లెలో ఓ సచివాలయ ఉద్యోగి ఉదయం 7.40 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించి.. గ్రామంలో లేని ఇద్దరు వ్యక్తులకు మినహా అందరికీ ఉదయం 10 గంటలకల్లా పంపిణీ పూర్తి చేశారు. అయినా ఆ ఉద్యోగికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా 12 సచివాలయాల పరిధిలో 87.25 శాతం నుంచి 93.89 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తయ్యింది. కానీ.. 94 శాతం పంపిణీ ఎందుకు పూర్తి చేయలేదంటూ ఆ సచివాలయాల సిబ్బంది మొత్తానికి ఎంపీడీవో షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో 11 మంది సిబ్బంది పింఛన్ల పంపిణీని ఆలస్యంగా ప్రారంభించారంటూ మున్సిపల్ కమిషనర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. బాపట్ల జిల్లా అనంతవరంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు సచివాలయ ఉద్యోగి సాంబానాయక్ తన స్వగ్రామం నుంచి తెల్లవారుజామున 5 గంటలకే బయలుదేరి వస్తుండగా మార్గంమధ్యలో ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనకు సైతం షోకాజ్ నోటీసు జారీ అయింది.
నోటీసులు ఉద్దేశపూర్వకమే
వీఎంసీ అధికారుల తీరుపై వార్డు సచివాలయ కార్యదర్శులు మండిపడుతున్నారు. కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఉద్దేశపూర్వకంగానే కొందరు అధికారులు తమతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికే పనిభారంతో ఇబ్బందులు పడుతున్న తమపూ అధికారులు ఇటువంటి వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లబ్ధిదారులు మూడు నెలలలోపు ఎప్పుడైనా పెన్షన్లు తీసుకోవచ్చని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు ఇబ్బందులకు గురిచేయడాన్ని గ్రామ/వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ఖండిస్తున్నారు.
మళ్లీ తగ్గిన పింఛన్లు
రాష్ట్రంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య నెలనెలా తగ్గిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలల్లోనే ఏకంగా 1,57,162 మందికి పింఛన్ ఆగిపోయింది. కూటమి అధికారంలోకి రాకముందు ఈ ఏడాది మే నెలలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగ్గా.. తాజాగా శనివారం 63,92,702 మందికి మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల డబ్బులు విడుదల చేసింది.
ఈ నెలలోనే రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 21,472 మేర తగ్గిపోయింది. అంతకు ముందు నెలలో 24,710 మంది, దానికి ముందు నెలలో 22,601 మంది.. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి లబ్ధిదారుల సంఖ్య పడిపోతూ వస్తోంది.
కొత్తగా ఒక్కరికైనా పింఛన్ ఇవ్వలేదు
కొత్తగా పింఛన్ల కోసం అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా కూటమి ప్రభుత్వం ఆన్‌లైన్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. వైఎస్ జగన్ పాలనలో అర్హులు పింఛన్ కోసం ఏడాదిలో ఏ రోజైనా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. కానీ.. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ సేవలను నిలిపివేశారు. గత ఐదేళ్లలో పింఛన్ల పంపిణీకి సంబంధించి అమలు చేసిన విధానాల ప్రకారం ఈ ఏడాది జూలైలో అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలి.
చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇప్పటివరకు కొత్త పింఛన్ల మంజూరుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది జనవరిలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఆ తర్వాతి నుంచి.. ఎన్నికల కోడ్ ముందు వరకు దాదాపు 2 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. చంద్రబాబు ప్రభుత్వం వాటిని కూడా పట్టించుకోలేదు.
గత ఐదేళ్లలో ఆర్భాటం లేకుండా ఠంచన్‌గా ప్రతి నెలా 1వ తేదీనే వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయగా.. ఇప్పుడు సీఎం మొదలు టీడీపీ నేతలంతా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫొటోలకు ఫోజులిస్తూ దండిగా ప్రచారం చేసుకుంటున్నారు.
సచివాలయ ఉద్యోగుల హాజరులో కీలక మార్పు
» వచ్చిన సమయం, వెళ్లే సమయం నమోదు చేస్తేనే పనిదినంగా గుర్తింపు
» లేకపోతే ఆ రోజుకు సెలవుగానే పరిగణన
» స్పష్టంచేసిన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ
» నేటి నుంచి కచ్చితంగా అమలు చేస్తామని వెల్లడి
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల హాజరుకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉద్యోగులు సచివాలయంలో విధులకు వచ్చినప్పుడు గానీ, సాయంత్రం వెళ్లే సమయంలో గానీ మొబైల్ యాప్‌లో హాజరు నమోదు చేసుకునేవారు. ఒకసారి హాజరు నమోదైతే ఉద్యోగి ఆ రోజు విధులకు వచ్చినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించేవారు.
ఇక నుంచి అటెండెన్స్ మొబైల్ యాప్‌లో సచివాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయం రెండూ నమోదు చేయాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఒకసారి మాత్రమే హాజరు నమోదైతే ఆ రోజు ఉద్యోగి సెలవుగా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు ఎస్‌ఎంఎస్ రూపంలో సమాచారం తెలియజేశారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తామని ఉద్యోగులకు పంపిన ఎస్‌ఎంఎస్‌లలో స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment