డిపాజిట్ చేస్తే.. రుణం కింద రికవరీ
లింగంపేట: పెద్ద నోట్ల రద్దు ప్రకటన అనంతరం ప్రజలు తమ వద్దనున్న పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు వెళ్తే.. ఇదే అదనుగా బ్యాంకర్లు రుణాలను రికవరీ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఖాతాదారులు తమ వద్దనున్న పాతనోట్లను బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు. డిపాజిట్ చేస్తున్న వారిలో చాలా మంది రైతులున్నారు. బ్యాంకు పరిధిలో సుమారు 2 వేల మంది రైతులకు పంట రుణాలు మాఫీ కాలేదు. వారి జాబితాను అధికారులు ప్రభుత్వానికి పంపారు.
ఈ క్రమంలో రైతులు డిపాజిట్ చేసిన సొమ్ములోంచి.. వారికి సంబంధించిన పంట రుణాన్ని బ్యాంకు అధికారులు మినహారుుంచుకుంటున్నారు. లింగంపేటకు చెందిన ఆవుల ప్రమీల, నాగేందర్ ఈనెల 13న రూ. 40 వేలు డిపాజిట్ చేశాడు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఈనెల 18న రూ. 35 వేలను పంట రుణం కింద రికవరీ చేసుకున్నారని నాగేందర్ తెలిపాడు. ఇలా ఒక్కొక్కరి ఖాతానుంచి రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు పంట రుణం కింద పట్టుకుంటున్నారని రైతులు తెలిపారు. రబీ పెట్టుబడులకు ఇప్పటికే తిప్పలు పడుతున్నామని, పంట రుణాల రికవరీని నిలిపివేయాలని కోరుతున్నారు.