అన్నదాత అప్పుల సాగు | Telangana Farmers in debt | Sakshi
Sakshi News home page

అన్నదాత అప్పుల సాగు

Published Tue, May 9 2017 2:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

అన్నదాత అప్పుల సాగు - Sakshi

అన్నదాత అప్పుల సాగు

రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు 90%
బోర్లు, బావుల కోసం అప్పుల పాలవుతున్నవారు 70%
కౌలుదారుల చేతుల్లో ఉన్న భూమి 65.5%
గ్రామాల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న కుటుంబాలు 50.6%
తెలంగాణ సామాజికాభివృద్ధి నివేదికలో వెల్లడి


ఎస్సీ, ఎస్టీలకు పంట రుణాలు అంతంతే
గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి వైద్యం ఖర్చు రూ. 21,683
జాతీయ సగటు కన్నా 30 శాతం ఎక్కువ


సాక్షి, హైదరాబాద్‌
వ్యవసాయ అవసరాల కోసం తవ్వే బావులు, బోర్లతో తెలంగాణలో దాదాపు 70 శాతం మంది రైతులు అప్పుల పాలయ్యారు. అదే ప్రధాన కారణంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు అప్పుల్లోనే ఉన్నారు. బ్యాంకులు ఎస్సీ, ఎస్టీ రైతులకు పంపిణీ చేస్తున్న పంట రుణాలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. రాష్ట్రంలో సాగవుతున్న మొత్తం విస్తీర్ణంలో 65.5 శాతం భూమి కౌలు రైతుల చేతుల్లోనే ఉంది. వారంతా సన్న, చిన్నకారు రైతులే! వ్యవసాయ సంక్షోభంతో రైతులు అత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో.. సాగు యోగ్యత, కౌలు సంబంధిత అంశాలపై అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదిక–2017 స్పష్టంచేసింది.

రాష్ట్రంలోని రైతుల్లోనూ వివిధ వర్గాల వారీగా సాగునీటి వసతి లభ్యతను ఈ నివేదికలో ప్రస్తావించింది. ఎస్సీలకు చెందిన 25.4 శాతం భూములకు, ఎస్టీలకు చెందిన 29.9 శాతం, ఇతర వర్గాలకు 36.9 శాతం భూములకు సాగునీటి వసతి ఉంది. కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవెలప్‌మెంట్‌ మండలి (సీఎస్‌డీ) డెరైక్టర్‌ కల్పనా కన్నబీరన్‌ సారథ్యంలో పద్మినీ స్వామినాథన్, జయరంజన్‌లు రూపొందించిన ఈ నివేదికను ఈ నెల 12న విడుదల చేయనున్నారు. జాతీయ నమూనా సర్వేతోపాటు 2011 జనాభా లెక్కలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. ప్రధానంగా భూమి, వ్యవసాయం, రుణాల పంపిణీ, అప్పులు, విద్య, ఉపాధి, వైద్యం, గృహ నిర్మాణం, తాగునీటి వసతి, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి తమ అధ్యయనంలో తేలిన అంశాలను ఇందులో పొందుపరిచారు. సామాజిక సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించేందుకు తయారు చేసిన ఈ నివేదిక పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు..
► గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కుటుంబ అవసరాలకు తీసుకునే అప్పులకు ఎక్కువ మంది ప్రైవేటు, వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడుతున్నారు. దాదాపు 50.6 శాతం కుటుంబాలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వాణిజ్య బ్యాంకులు 16 శాతం, సహకార బ్యాంకులు 9.3 శాతం రుణాలు అందిస్తున్నాయి.

► గ్రామీణ ప్రాంతాల్లో సగటున ఒక్కో కుటుంబం వైద్యానికి ఏడాదికి రూ.21,683 చొప్పున ఖర్చు చేస్తోంది. జాతీయ స్థాయి సగటుతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం ఎక్కువ.

► రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేవు. గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించటంతో నిరుపేదలు సైతం వైద్యానికి భారీగా ఖర్చు పెట్టక తప్పటం లేదు.

► వైద్యానికి జాతీయ సగటు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబం సగటున రూ.16,596 ఖర్చు చేస్తుంటే.. రాష్ట్రంలో అంతకు మించి ఖర్చవుతోంది.

► రాష్ట్రంలో 18 శాతం కుటుంబాలు ఇప్పటికీ తాగునీటికి మినరల్‌ వాటర్‌ క్యాన్‌లపైనే ఆధారపడుతున్నాయి.

► రాష్ట్రంలో 36.7 శాతం ఇళ్లల్లో ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో సగానికిపైగా ఇళ్లలో మరుగుదొడ్లు లేవు.

► పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి తగ్గుతోంది. పల్లెల్లో వితంతువుల సంఖ్య పెరుగుతోంది.

► విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి.

► బాల్య వివాహాలు దేశవ్యాప్తంగా 3.7 శాతం ఉండగా తెలంగాణలో 2.6 శాతం నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా బాల్య వివాహాలు నమోదయ్యాయి.

► 60 ఏళ్ల పైబడిన వారిలో 87 శాతం మంది పురుషులు వివాహితులు కాగా.. వితంతువులైన మహిళలు 57 శాతం. పురుషుల్లో జీవిత భాగస్వామి లేనివారు 11 శాతం ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement