బడుగు రైతుపై మరో పిడుగు
- నిర్బంధ రుణ వసూళ్లకు డీసీసీబీ బరితెగింపు
- బకాయిదారులకు నోటీసులు
- ఆస్తులు జప్తు చేసి,వేలం వేస్తామంటూ హెచ్చరికలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నవ తెలంగాణలో పాత జమానా మొదలైంది. పటేల్, పట్వారీల నాటి పరిస్థితి మళ్లీ వచ్చింది. తలుపులు, కంచం, మంచం గుంజుకుపోయిన పాడురోజులు మళ్లీ రానేవచ్చాయి. అప్పులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేసి వేలం వేస్తామని హెచ్చరిస్తూ అన్నదాతలకు నోటీసులు జారీ చేసిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) అన్నంత పని చేయబోతోంది. ఈ నెల 20న మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో ఐదుగురు రైతులకు చెందిన భూములను జప్తు చేసి వేలం వేయడానికి సిద్ధమైంది. కాలం లేదు.. కనికరించండని కాళ్లు పట్టుకున్నా బ్యాంకోళ్లకు మనసు రాలేదు. జిల్లాలో రెండు వేలమంది రైతులను గుర్తించి ఈ ఏడాది కనీసం 800 మంది నుంచి బకాయిలు వసూలు చేయడమో..! లేదా భూములు వేలం వేయడమో చేయాలని డీసీసీబీ నిర్ణయించినట్టు సమాచారం. త్వరలోనే ఇదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రమంతటికి విస్తరించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం.
రైతులు బిక్కుబిక్కు
జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు 24 శాఖలు ఉన్నాయి. వీటి నుంచి సగటున ఏడాదికి రూ.250 కోట్లకుపైగా పంట రుణాలు ఇస్తున్నారు. గడిచిన మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 60 వేల మంది రైతులు సుమారు రూ.450 కోట్ల పంట రుణ సహాయం పొందారు. డీసీసీబీ నివేదికల ప్రకారం రెండువేల మంది రైతులు దీర్ఘకాలంగా బకాయిలు పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ నోటీసులు జారీ చేశారు. బ్యాంకు అధికారులు ఎప్పుడొచ్చి ఇళ్ల మీద పడుతారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
20న రంగంపేటలో వేలానికి సిద్ధం..
కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి గతంలో రుణాలు తీసుకొని బకాయిలు పడిన ఐదుగురు రైతుల భూములను జప్తు చేసుకొని ఈనెల 20న వేలం వేయడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు సమీప గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఆసక్తి కలవారు వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన పురం అంజిరెడ్డి తన ట్రాక్టర్ ట్రాలీని అమ్ముకుని సహకార సంఘం అప్పు చెల్లించాడు. కానీ, సంఘపోళ్లు అప్పులు కట్టమని బెదిరిస్తున్నారు. లేకపోతే ఇంటి దర్వాజలు పీకేస్తామని హెచ్చరించి కాయితం ఇచ్చారని ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన పాపోల్ల కొమురయ్య ఆవేదన వ్యక్తం చేశారు.