అప్పు పుట్టని ‘అరక’ | Banks not allowed to give loans for farmers | Sakshi
Sakshi News home page

అప్పు పుట్టని ‘అరక’

Published Mon, Jul 18 2016 1:37 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM

అప్పు పుట్టని ‘అరక’ - Sakshi

అప్పు పుట్టని ‘అరక’

- అన్నదాతలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ససేమిరా
- రుణమాఫీ సొమ్ము రాలేదంటూ కొర్రీలు
- బ్యాంకు రుణాలకు నోచుకోని 30 లక్షల మంది రైతులు
- బ్యాంకు అధికారుల చుట్టూ తిరిగినా రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన
- ఇప్పటివరకు 6.16 లక్షల మందికే అందజేత
- వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు
- రూ. 2, రూ. 3 మిత్తికి అప్పులు చేస్తూ తిప్పలు
- ఖరీఫ్ రుణ లక్ష్యం.. రూ. 17,460 కోట్లు
- ఇప్పటిదాకా ఇచ్చింది  రూ. 3,761 కోట్లే!

 
సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: ‘‘బ్యాంకులకు పోతే లోన్లు ఇయ్యడానికి ఇంకా చానా రోజులైతదని చెబుతుండ్రు. ఎక్కడా అప్పు పుడుతలేదు. సేట్ల దగ్గరికి పోతే కాలమే సక్కగైతలేదు.. అప్పులెలా చెల్లిస్తావని అంటుండ్రు.. ఇగ ఏం విత్తనం ఎయ్యాలే? ఏం జేయాలే..? పూట గడుపుకోవడానికి కూలీకి పోతున్న’’
 - మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌కు చెందిన రైతు పోకల మల్లేశం ఆవేదన ఇది!
 ‘‘బ్యాంకు చుట్టూ రుణం కోసం తిరిగినా ఫలితం లేదు. రెన్యువల్ చేయాలని అడిగినా రుణమాఫీ సొమ్ము రాలేదని వాయిదా వేశారు. చేసేది లేక ప్రైవేటుగా రూ.3 వడ్డీకి లక్ష అప్పు తెచ్చి 14 ఎకరాల్లో మొక్కజొన్న వేశా’’
 మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలకు చెందిన రాంరెడ్డి వ్యథ ఇది!!
 
 ..ఇలా ఒక్కరిద్దరు కాదు.. రాష్ట్రంలో లక్షల మంది రైతులది ఇదే గోస. గత రెండేళ్లతో పోలిస్తే వానలు కాస్తోకూస్తో బాగానే పడుతున్నా చేలలో గింజ వేసేందుకు రైతన్న చేతిలో చిల్లి గవ్వ లేదు. రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు మొహం చాటేస్తున్నాయి. అప్పు కోసం కాళ్లరిగేలా తిరిగినా నానా కొర్రీలు పెడుతూ మొండిచేయి చూపుతున్నాయి. దీంతో గత్యంతరం లేక చాలా మంది రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు బంగారం కుదువపెట్టి బ్యాంకుల్లో, షావుకార్ల వద్ద అప్పు తెచ్చుకుంటున్నారు.
 
 కాస్త పెద్ద రైతులు సొంతంగా పెట్టుబడులు పెడుతున్నా.. చిన్న, సన్నకారు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై నెలన్నర దాటినా పంట రుణాలు అనుకున్న స్థాయిలో ఇవ్వడం లేదు. 2016-17 ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి రూ.29,101 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఖరీఫ్‌కు రూ.17,460 కోట్లు, రబీకి రూ.11,640 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ బ్యాంకర్ల లెక్కల ప్రకారం ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు కేవలం రూ.3,761 కోట్లు ఇచ్చారు. సర్కారు లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 55.53 లక్షల మంది రైతుల్లో.. 36 లక్షల మంది బ్యాంకు రుణాలు తీసుకుంటారు. అయితే ఇప్పటివరకు కేవలం 6.16 లక్షల మంది రైతులకే బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. దాదాపు 30 లక్షల మంది రైతులు రుణాలకు దూరంగా ఉన్నారు.
 
 రుణమాఫీనే బూచీగా చూపుతూ..
 తెలంగాణ ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు రుణమాఫీ ప్రకటించింది. మొత్తం రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించింది. రుణమాఫీకి అర్హులుగా 35.82 లక్షల రైతులను గుర్తించింది. మొదటి విడతగా 2014లో రూ.4,230 కోట్ల మాఫీ ప్రకటించింది. ఆ తర్వాత రెండో విడత రుణమాఫీని గతేడాది రెండు విడతలుగా విడుదల చేసింది. ఇంకా రెండు విడతల సొమ్ము రూ.8 వేల కోట్లకుపైగా విడుదల చేయాల్సి ఉంది. ఈ ఏడాది మూడో విడత సొమ్ముకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. మూడు, నాలుగో విడత సొమ్ము ఒకేసారి చెల్లించాలని ప్రతిపక్షాలు, బ్యాంకులు కోరాయి. కానీ సర్కారు మూడో విడతకే పరిమితమైంది. మూడో విడతలోనూ రూ.2,020 కోట్లే ఇస్తానని చెప్పింది. చివరకు ఆ సొమ్మును కూడా రెండు విడతలుగా విడుదల చేసింది. ఇప్పటికీ రుణమాఫీ సొమ్మును సక్రమంగా చెల్లించకపోవడంతో బ్యాంకులు రైతులకు పూర్తిస్థాయిలో పంట రుణాలు ఇవ్వడంలేదు. రుణమాఫీతో రైతులకు సంబంధం లేదని, అది ప్రభుత్వానికి, బ్యాంకులకు సంబంధించిన వ్యవహారమేనని సర్కారు పదేపదే చెప్పినా బ్యాంకులు మాత్రం రుణమాఫీ వ్యవహారాన్నే ముందుకు తెస్తూ రుణాలివ్వడానికి వెనుకంజ వేస్తున్నాయి.
 
 జిల్లాల్లో ఇదీ పరిస్థితి..
 రైతులకు బ్యాంకు రుణాలు ఏ మేరకు అందుతున్నాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. మచ్చుకు జిల్లాకో గ్రామాన్ని ఎంచుకొని ఆ ఊళ్లో రైతుల పరిస్థితిని తెలుసుకుంది. ఇందు లో చాలా మంది బ్యాంకు రుణాలు అందడం లేదని, ఫలితంగా ప్రైవేటుగా రూ.3 వడ్డీకి అప్పులు చేయా ల్సి వస్తోందని గోడు వెల్లబోసుకున్నారు.
 -    ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలం కత్తరశాలలో సుమారు 110 మంది రైతులు ఉండగా.. వీరిలో ఇప్పటివరకు 25 మందికి మాత్రమే రుణాలు అందాయి. మిగతావారంతా ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.22.50 లక్షల మేర అప్పులు చేశారు.
 -    కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లిలో 1,038 మంది రైతులుంటే.. వారిలో 400 మందికి రుణాలు అందాయి. మరో 252 మంది ప్రైవేటుగా రూ.2 వడ్డీకి అప్పులు తెచ్చుకొని పెట్టుబడులు పెట్టారు. మిగతావారిలో బ్యాంకుల్లో బంగారు ఆభరణాలు కుదవపెట్టి కొందరు, డ్వాక్రా సంఘాల నుంచి కొందరు రుణాలు తీసుకున్నారు.
 -    మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలలో 852 మంది రైతులు ఉండగా.. ఈ ఖరీఫ్‌లో బ్యాంకుల నుంచి 40 మందికి మాత్రమే రూ.25 లక్షల మేర రుణాలందాయి. 350కి పైగా రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు చేశారు. ఒక్కో రైతు రూ.40 వేల నుంచి రూ.2 లక్షల అప్పులు చేశారు.
 -    నల్లగొండ జిల్లా చిలుకూరు మండలంలోని చిలుకూరులో 1,322 రైతులు ఉండగా.. ఈ ఖరీఫ్‌లో కొత్తగా 16 మందికి రూ.9 లక్షల మేర మాత్రమే రుణాలిచ్చారు. ప్రాథమిక సహకార సంఘం నుంచి 1,024 మంది రైతులకు రూ.1.14 కోట్ల రుణాలను రెన్యూవల్ చేసినా కొత్త రుణాలు మాత్రం ఇవ్వలేదు.
 -    వరంగల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకలో 789 మంది రైతులు ఉండగా.. 266 మంది రైతులకు బ్యాంకులు రుణాలిచ్చాయి. మిగిలిన 523 మంది రైతులు ప్రైవేటు, ఫైనాన్స్ కంపెనీల వద్ద అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకున్నారు.
 -    ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గౌరారంలో 356 రైతులు ఉండగా.. ఈ ఖరీఫ్‌లో 12 మందికి పలు బ్యాంకులు రుణాల రెన్యూవల్ జరిగింది. రుణాలందకపోవడంతో దాదాపు 200 మంది ప్రైవేటు అప్పులు చేశారు.
 -    మెదక్ జిల్లా వర్గల్ మండలం తున్కిఖాల్సాలో 1,978 మంది రైతులు ఉండగా.. వారిలో 100 మందికే బ్యాంకు రుణాలందాయి. దాదాపు 1,500 మంది ప్రైవేటు అప్పులు చేశారు. మిగతావారు సొంతంగా పెట్టుబడులు పెట్టారు.
 -    నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఆరెపల్లిలో 365 మంది రైతులు ఉండగా.. వాణిజ్య, సహకార బ్యాంకుల నుంచి 284 మంది రుణాలు తీసుకున్నారు. 40 మంది ప్రైవేటు అప్పులు చేయగా.. బంగారం తాకట్టు పెట్టి 60 మంది రుణాలు పొందారు.
 -    రంగారెడ్డి జిల్లా పరిగి మండ లం మిట్టకోడూరులో 750 మంది రైతులు ఉండగా.. 10 మందికే రుణాలందాయి. 550 మంది ప్రైవేటు అప్పులు చేశారు.
 
 బంగారం కుదువ పెట్టా..
ఆంధ్రాబ్యాంక్‌లో పోయిన ఏడాది రూ.30 వేల రుణం ఇచ్చిండ్రు. ఈ ఏడాది రెండెకరాల్లో మొక్కజొన్న పంట ఏసిన. కాగితాల్లో మార్పులు చేసినమని చెప్పిండ్రు. రుణం మాత్రం ఇంక ఇయ్యలే. బంగారం కుదువ పెట్టి అప్పు తెచ్చుకుని సాగు చేసుకున్న.
     -ఎగుర్ల లచ్చయ్య, గొల్లపల్లి, కరీంనగర్
 
 కొత్త వారికి రుణం ఇవ్వరట!
 ఈయన పేరు సింగతి బాపు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లి. ఈ రైతుకు మూడెకరాల భూమి ఉంది. పంట రుణం కోసం బెల్లంపల్లి కో-ఆపరేటివ్ బ్యాంకుకు వెళ్తే కొత్త వారికి ఇవ్వడం కుదరదని వెనక్కి పంపేశారు. చేసేది లేక సమీపం బంధువు వద్ద రూ.2 వడ్డీ చొప్పున రూ.లక్ష అప్పు తీసుకొని రెండెకరాల్లో పత్తి, ఎకరంలో వరి సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ అప్పుకు ఏడాదికి అసలుతో పాటు వడ్డీ రూ.24 వేలు చెల్లించాలి.
 
 బ్యాంకు చుట్టూ తిరిగి అలసిపోయా..
 నేను రెండేళ్ల క్రితం బ్యాంకులో రూ.35 వేలు రుణం తీసుకున్నా. అది మాఫీ అయ్యిందా? లేదా అన్నది బ్యాంకు వారు చెప్పడం లేదు. కొత్త రుణం ఇవ్వడం లేదు. బ్యాంకు చుట్టూ తిరిగి అలసిపోయాను. పొలాన్ని బీడు పెట్టడం ఇష్టం లేక పంట పండిన తర్వాత ధాన్యం విక్రయిస్తానని చెప్పి అప్పు తెచ్చుకొని పంట వేశా.
 -యాపచెట్టు చిన్న చెంద్రాయడు, గోపాల్‌పేట, మహబూబ్‌నగర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement