కౌలుకోనివ్వరా? | bank Discrimination Farmers loans | Sakshi
Sakshi News home page

కౌలుకోనివ్వరా?

Published Wed, Mar 16 2016 11:49 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

bank Discrimination Farmers loans

ఏటా రైతుల గుర్తింపులో వివక్ష!
 రైతుల సంఖ్య పెరుగుతున్నా రుణాలివ్వని బ్యాంకర్లు
 24 నుంచి మళ్లీ ప్రహసనం  
 
 భూమిమీద పడినప్పటినుంచి మట్టి వాసనే పీలుస్తూ, మట్టి తల్లి ఒడిలోనే సేదదీరుతూ..వ్యవసాయం తప్ప మరో వ్యవహారం తెలియని కౌలు రైతులు..అటు వ్యవసాయం చేయలేక..ఇటు కూలి పనులకు పోలేక సతమతమవుతున్నారు. యజమాని దగ్గర భూమిని కౌలుకు తీసుకుని ఆరుగాలం స్వేదం చిందించి సాగుచేశాక పంట కలిసివచ్చినా..రాకపోయినా యజమానికి శిస్తు చెల్లించాల్సిందే. సాగు సమయంలో పెట్టుబడి కోసం రుణాలిచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకర్లు మొండిచేయి చూపుతున్నారు.  
 
 విజయనగరం కంటోన్మెంట్: కౌలు రైతులను చైతన్య పరిచి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్దామనే ధ్యాస ప్రభుత్వానికి లేకపోవడం విచారకరం. 2011లో కౌలు రైతు చట్టం వచ్చినప్పుడు జిల్లాలో 24 వేల మందిని గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లాలో వ్యవసాయ భూములు సాగు చేసేవారి సంఖ్య తగ్గిపోవడంతో పాటు భూములను కౌలుకు ఇచ్చేసే పద్ధతి ఎక్కువైంది. ఈ దశలో కౌలు రైతుల చట్టాన్ననుసరించి మరింత మంది కౌలు రైతులను గుర్తించి వారికి బ్యాంకర్లు రుణా లు ఇచ్చేలా సమావేశాలు నిర్వహించి   చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ యంత్రాంగం పట్టిం చుకోవడం లేదు. జిల్లాలో సుమారు లక్షమంది కౌలు రైతులుంటారని సంబంధిత సంఘాలు చెబుతున్నాయి. అయినా  ఎప్పుడూ 9వేల  నుంచి 24 వేల మంది మాత్రమే ఉంటారని యంత్రాంగం లెక్కలు చెబుతోంది.
 
 తహశీల్దార్ల వైఫల్యం : గ్రామాల్లో ఉన్న కౌలు రైతులను  గుర్తించేందుకు వీఆర్వోల ద్వారా గుర్తింపు శిబిరాలను నిర్వహించి గుర్తింపు కార్డులు ఇచ్చే విధంగా తహశీల్దార్లు చర్యలు తీసుకోవాల్సి ఉండగా అలా జరగడం లేదు.  ప్రతి మండలం నుంచి కౌలు రైతులకు బ్యాంకర్లు రుణాలివ్వాలని ఆయా మండలాల్లో ఉన్న కౌలు రైతుల సంఖ్య ఇది అని చెప్పాల్సిన తహశీల్దార్లు టార్గెట్ల ప్రకారం ఏదో అంకె చెప్పేసి ఊరుకోవడంతో  అసలైన కౌలు రైతుల సంఖ్య జిల్లాలో ఏటా తేలడం లేదు.
 
 గుర్తింపునకు రెండు స్టేజ్‌లు : జిల్లాలో 2016-17 సంవత్సరానికి సంబంధించి కౌలు రైతుల గుర్తింపును రెండు స్టేజ్‌లలో నిర్వహించనున్నారు. కౌలు రైతులకు ఏఏ ప్రయోజనాలున్నాయి. రుణాలు పొందడమెలా? కౌలు రైతుల చట్టాల సంగతేంటన్న విషయాలపై ఈనెల 10 నుంచి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.  మార్చి 24నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం గ్రామసభలు నిర్వహించనున్నారు.  ఆ అవగాహన సదస్సుల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం గ్రామాల్లోని కౌలు రైతులను గుర్తించి వారికి రుణార్హత కార్డులిస్తారు.    గుర్తింపు కార్డులందించిన వారికి రుణాలివ్వాలని బ్యాంకర్లతో కలెక్టర్  సమావేశం నిర్వహించి ఆదేశాలిస్తారు. వారికి లక్ష్యాలను విధిస్తారు. కానీ ఈ లక్ష్యాలను చేరుకోవడంలో బ్యాంకర్లు చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు.
 
 ఈ ఏడాది రుణాలు అంతేనా? : జిల్లాలో ఈ ఏడాది 24,807 మంది కౌలు రైతులను గుర్తించేందుకు అధికారులు లక్ష్యం విధించారు. వీరికి గుర్తింపు కార్డులు ఇచ్చి రుణార్హత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే  గతేడాది కూడా 24వేల మంది రైతులనే గుర్తిస్తామని లక్ష్యం విధించుకున్న యంత్రాంగం 15,827 మంది కౌలు రైతులను గుర్తించి   రుణార్హత కార్డులిచ్చారు. వారికి  సుమారు రూ.5 కోట్ల పైచిలుకు రుణాలివ్వాల్సి ఉండగా కేవలం రూ.65 లక్షలతోనే బ్యాంకర్లు సరిపెట్టారు. 15,827 మందిలోనూ కేవలం 329 మందికే కౌలు రుణాలిచ్చిన బ్యాంకర్లు మిగిలిన 15,498 మందిని రుణాల కోసం కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదు. ఈ ఏడాది కూడా అ లానే రుణాలిస్తారా అని కౌలు రైతులు ప్రశ్నిస్తున్నారు.
 
 హెచ్‌డీటీలదే బాధ్యత! : జిల్లాలో కౌలు రైతుల గుర్తింపు మొత్తం హెచ్‌డీటీలదే. వారు గ్రామాల్లో సభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తించి నివేదికను పంపించాలి. అప్పుడు వారికి గుర్తింపు కార్డులు ఇస్తాం. అనంతరం కలెక్టర్ నిర్ణయం ప్రకారం బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి వారికి రుణాలు అందేలా చర్యలు తీసుకుంటాం. మండలాల్లో హెచ్‌డీటీలు చిత్తశుద్ధితో వ్యవహరించి కౌలు రైతులను పారదర్శకంగా గుర్తించాలి.                              

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement