సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ, రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శనివారం తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు సమాయత్త మయ్యాయి. ఆయా పార్టీల నేతలు జిల్లాల్లో ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు రాజధానితో పాటు జిల్లా కేంద్రాల్లో బస్సులు యథావిధిగా నడపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ఆదేశించింది. బస్సులు నడిపేందుకు వీలుగా అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి డీజీపీ అనురాగ్‌శర్మను ఆదేశించారు.
దుకాణాలు మూసేయొద్దని, తాము భద్రత కల్పిస్తామంటూ పోలీసులు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వ్యాపారులకు భరోసా ఇచ్చారు. కాగా, శనివారం నాటి బంద్‌ను విజయవంతం చేయాలంటూ హైదరాబాద్‌లో శుక్రవారం కాంగ్రెస్, సీపీఐ నేతలు బైక్ ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి నాంపల్లి వరకు ర్యాలీ నిర్వహించేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి నాగేందర్‌తోపాటు మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి తదితరులను అరెస్టు చేసి అనంతరం వదిలిపెట్టారు. సీపీఐ ఆధ్వర్యంలో ఛత్రినాక నుంచి బషీర్‌బాగ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరంలో ఆటో సంఘాలు కూడా బంద్‌కు మద్దతు పలికాయి. ఎంఎంటీఎస్ రైళ్లు యథావిధిగా తిరుగుతాయని, అవరమైతే రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు.
టీడీఎఫ్ సిద్ధం..
రైతు సమస్యల పరిష్కారంతోపాటు వరంగల్ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్న డిమాండ్‌తో బంద్‌లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీడీఎఫ్) భాగస్వామ్యపక్షాలు సిద్ధమయ్యాయి. పది వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జూబ్లీ, ఇమ్లీబన్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద నేతలు నిరసన తెలపనున్నారు. సీపీఐ నేత కె.నారాయణ, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఇమ్లీబన్ బస్‌స్టేషన్ వద్ద, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత అజీజ్‌పాషా, న్యూడెమోక్రసీ, రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నేతలు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తారు. మరోవైపు బంద్‌కు భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రం (యూసీసీఆర్‌ఐ-ఎంఎల్) మద్దతు ప్రకటించింది.
నేడు రాష్ట్ర బంద్
Published Sat, Oct 10 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM
Advertisement
Advertisement