లక్ష్యం రూ. 9,707 కోట్లు.. ఇచ్చింది 300 కోట్లే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కరువు కబళించింది. పంటలు పండక అప్పుల భారం ఎక్కువై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వర్షాలు లేక, బోర్లు, బావుల్లో నీరు అడుగంటి రబీలో పంటలు వేసే పరిస్థితి కనిపించడంలేదు. ఆరుతడి వైపు వెళ్లాలని సర్కారు చెబుతోన్నా అందుకు తగ్గా ఏర్పాట్లు లేవు. రైతులను ఆర్థికంగా ఆదుకోవాల్సిన ఈ తరుణంలో వారికి బ్యాంకు రుణాలు ఇప్పించడంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. 2015-16 రబీ పంట రుణ లక్ష్యం రూ. 9,707 కోట్లు కాగా... ఇప్పటివరకు బ్యాంకులు కేవలం రూ. 300 కోట్లు మాత్రమే ఇవ్వడం అత్యంత దారుణ పరిస్థితికి నిదర్శనం.
ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ. 18,032 కోట్లు కాగా... రూ. 14 వేల కోట్ల మేరకు మాత్రమే ఇచ్చారని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి వివరించారు. రబీలో పంటల సాగు కేవలం 26 శాతానికే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా రబీలో సాధారణంగా 31.32 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా... 8.22 లక్షల ఎకరాల్లో (26%) మాత్రమే జరిగింది. అందులో ఆహారధాన్యాల సాగు 25.20 లక్షల ఎకరాలకు గాను... కేవలం 4.97 లక్షల ఎకరాల్లోనే చేపట్టారు.
కీలకమైన వరి నాట్లు కేవలం ఒకే ఒక్క శాతంలోనే పడ్డాయి. పప్పుధాన్యాల సాగు మాత్రమే సాధారణ సాగులో 86 శాతం విస్తీర్ణంలో సాగైంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లడానికి... అందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో సాగు విస్తీర్ణం కూడా పడిపోయిందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.
పూర్తి రుణమాఫీ ప్రకటించకపోవడం వల్లే
తెలంగాణ ప్రభుత్వం రూ. లక్షలోపు పంట రుణాలకు రుణమాఫీ ప్రకటించింది. ఆ ప్రకారం రూ. 17 వేల కోట్లు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు గాను 35.82 లక్షల మంది రైతుల ఖాతాలను గుర్తించింది. తొలి విడతగా గత ఏడాది రూ. 4,230 కోట్లు రుణ మాఫీ ప్రకటించింది. ఆ మొత్తం జిల్లాల్లోని బ్యాంకులకు అందజేసింది. ఆ సొమ్ములో రూ. 4,086 కోట్లు ఇప్పటివరకు రైతుల ఖాతాలో మాఫీ అయినట్లుగా బ్యాంకులు జమచేశాయి.
ఆ తర్వాత రెండో విడత మాఫీని రెండు విడతలుగా మరో రూ. 4,086 కోట్లు విడుదల చేసింది. విడతల వారీగా సొమ్ము విడుదల చేస్తుండటంతో బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వడానికి కొర్రీలు పెడుతున్నాయి. కొందరు రైతుల నుంచి మిగిలిన సొమ్మును వసూలు చేస్తూనే ఉన్నాయి. దీనిపై దుమారం రేగినా ప్రభుత్వం స్పందించడంలేదు. మరో రెండు విడతల రుణమాఫీ సొమ్మును ఏకమొత్తంగా ఒకేసారి విడుదల చేయడంపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు అసెంబ్లీలో చెప్పినా అది ఆచరణలోకి రాలేదు.
ప్రభుత్వం నుంచి మిగిలిన సగం రుణమాఫీ విడుదల కానందున రుణాలు ఇవ్వబోమని బ్యాంకులు రైతులకు తెగేసి చెబుతున్నాయి. దీంతో బ్యాంకు అధికారులను వేడుకుంటున్నా వారు కనికరించడంలేదు. మరికొన్ని బ్యాంకులైతే రూ. లక్ష లోపు రుణాలకు కూడా వడ్డీ వసూలు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎంత చెప్పినా వినడంలేదు. వాస్తవంగా బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చి ఆదుకోకపోవడం వల్లే రైతులు ప్రైవేటు రుణాల వైపు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవే అన్నదాతను ఆత్మహత్యల వైపు పురిగొల్పుతున్నాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.