నేటి నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ పత్రాల పంపిణీ
Published Wed, Jun 21 2017 8:55 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– ప్రభుత్వ ప్రచారానికి వ్యవసాయశాఖ
కర్నూలు(అగ్రికల్చర్): 2016 కరువుకు సంబంధించి జిల్లాలోని 26 మండలాలకు రూ.325 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీఓ జారీ చేసింది. ఇందుకు సంబంధించి రైతులకు ఈ నెల 22 నుంచి 28 వరకు 26 కరువు మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ సభలు నిర్వహించి 3,10,766 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేస్తూ బుధవారం ప్రొసీడింగ్స్ వచ్చాయని, జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకొని సబ్ డివిజన్ ఏడీఏలకు విడుదల చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అంటే రైతులకు పత్రాలు పంపిణీ చేసినా పరిహారం బ్యాంకు ఖాతాలకు జమ కావడానికి రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు పత్రాల పేరుతో ప్రభుత్వం ప్రచారం కోసం వ్యవసాయ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఏఏ రైతుకు ఎంత ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చింది అనే వివరాలు పత్రాల్లో లేవు. వ్యవసాయాధికారులే అక్కడికక్కడ రాసి రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది.
Advertisement