37.. 58.. 42 ! | Drought areas On the Crow calculations | Sakshi
Sakshi News home page

37.. 58.. 42 !

Published Fri, Dec 19 2014 3:18 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Drought areas On  the Crow calculations

కరువు ప్రాంతాలపై కాకి లెక్కలు
అధికారుల ఇష్టారాజ్యం
జిల్లాలో 42 కరువు మండలాలు
సీఎం చెప్పిందొకటి...చేసింది మరొకటి
వర్షపాతం తక్కువ ఉన్నా ప్రకటించని వైనం
ఇప్పటికీ అందని గత ఏడాది కరువుసాయం

సాక్షి, చిత్తూరు: జిల్లాలో కరువు మండలాల ఎంపికలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తొలుత 37, తరువాత ఇంకో 21 మండ లాల్లో కరువు ఉన్నట్లు ప్రతిపాదించారు. మొత్తం 66 మండలాలకుగాను 58 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదించారు. తరువాత ఏ లెక్కనో తెలియదు కానీ... కాదు నలభై రెండింటినే కరువుగా మండలాలుగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదించారు. జిల్లా మొత్తం కరువు తాండవిస్తున్నా, ప్రజాప్రతినిధులు నెత్తీనోరు బాదుకున్నా... 42 మండలాల్లో మాత్రమే కరువు అంటూ ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. జిల్లా మొత్తాన్ని కరువు కింద ప్రకటిస్తానని చెప్పిన చంద్రబాబు మాటలు నీటిమూటలయ్యాయి.
 
ఖరీఫ్‌లో వర్షాభావం నేపథ్యంలో కరువుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. సాధారణ వర్షపాతం కంటే 60 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, 37 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని అధికారులు సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి నివేదించారు. అక్టోబర్ మొదటి వారంలో మరో 21 మండలాల్లోనూ అదే పరిస్థితి ఉందంటూ మరో నివేదిక పంపారు. మొత్తంగా 58 మండలాలను కరువు కింద ప్రకటించాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఆ తరువాత ఏంజరిగిందో ఏమో నవంబర్ 5న 42 మండలాలను మాత్రమే కరువు కింద ప్రకటించాలని అధికారులు మరో నివేదిక ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలో నైరుతి రుతుపవనాలు అనుకూలించకపోవడంతో ఖరీఫ్‌లో వర్షాలు సక్రమంగా కురవలేదు.

జిల్లావ్యాప్తంగా 1,22,162 హెక్టార్లలోని రైతులు సాగు చేసిన వేరుశెనగ పంట దెబ్బతింది. దిగుబడి సైతం గణనీయంగా తగ్గింది. లక్ష పైచిలుకు టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, 10వేల మించి దిగుబడి రాలేదు. దాదాపు రూ.400 కోట్లు వెచ్చించి సాగు చేసిన పంట దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేరుశెనగ రైతులను ఆదుకుంటామని, జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటిస్తామని నవంబర్ నెలలో జరిగిన పర్యటనలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కి 42 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు. చిత్తూరు డివిజన్‌లో 20 మండలాలకు గాను 10 మండలాలను, తిరుపతి డివిజన్ పరిధిలో 15 మండలాలకు గాను 5 మండలాలు, మదనపల్లె డివిజన్‌లో 30 మండలాలకు గాను 27 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు.
 
నిబంధనలకు పాతర
కరువు మండలాలను వర్షపాతం, డ్రైసెల్స్, ఏరియా కవరేజి, పంటల దిగుబడి తదితర వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రధానంగా సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైన మండలాలను కరువు కింద ప్రభుత్వం ఎంపిక చేయాల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇష్టానుసారంగా, మండలాల కుదింపే ధ్యేయంగా ఎంపిక జరిగినట్లు స్పష్టమవుతోంది.  ఎక్కువ వర్షపాతం నమోదైన మండలాలను కరువు కింద ఎంపిక చేసిన అధికారులు, తక్కువ వర్షపాతం నమోదైన మండలాలను ఎంపిక చేయకపోవడం విశేషం.

ఉదాహరణకు సాధారణ వర్షపాతం కంటే 23.4 శాతం తక్కువగా పడిన రామసముద్రం, 40.1 శాతం తక్కువ నమోదైన చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, 38 శాతం తక్కువగా నమోదైన ఐరాల, 31.1 శాతం తక్కువ వర్షపాతం నమోదైన కలికిరి మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక 53.9 శాతం తక్కువ వర్షపాతం నమోదైన కార్వేటినగరం, 59.1 శాతం తక్కువ నమోదైన పుత్తూరు, 50 శాతం తక్కువ నమోదైన నిండ్ర, 60 శాతం తక్కువ నమోదైన పాకాల మండలాలను మాత్రం ప్రభుత్వం కరువు కింద ఎంపిక చేయకపోవడం విశేషం. ఈ లెక్కన కరువు మండలాల ఎంపిక తప్పులతడకగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
 
ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే....
కరువు మండలాలకింద ఎంపికైతే రైతులకు సాగు చేసిన పంటలకు సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీ, పశుగ్రాసం సరఫరా, ఉపాధి పనులు కల్పించాలి. తాగునీటి సమస్యతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలి. అన్ని మండలాలను కరువుకింద ప్రకటిస్తే రాయితీలు భరించడం కష్టమవుతుందని, ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకే వీటిని కుదించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
కరువు సాయం అందేనా....?
జిల్లాలో గత ఖరీఫ్‌లో 1,22,162 హెక్టార్లలో సాగు చేసిన  వేరుశెనగతో పాటు మిగిలిన పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.122.16కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. దీంతో పాటు పశుగ్రాసం, ఉపాధిపనులు కల్పించాల్సి ఉంది. అయితే గత ఏడాది కరువు సాయాన్ని సైతం ఇంతవరకు అందించలేదు.
 
గతేడాది ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వని ప్రభుత్వం
గతేడాది జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం 33 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది.లక్షా ఒక్క వేయి హెక్టార్లలో వేరుశెనగపంట దెబ్బతింది. హెక్టార్‌కు 10 వేల చొప్పున   ఇన్‌పుట్ సబ్సిడీ కింద 110 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల సమయంలో రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ఇంతవరకూ పైసా ఇవ్వలేదు.  కరువు మండలాల ఎంపికలో సొంతజిల్లాపై ముఖ్యమంత్రి సవతి ప్రేమ చూపించడంపై జిల్లా ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement