అవకతవకలు
► ఇన్‌పుట్ సబ్సిడీ పేర్ల నమోదులో ఇష్టారాజ్యం
► అర్హులైన రైతులకు రాకపోవడంపై ఆందోళన
► జిల్లాలో పలుచోట్ల వెలుగు చూస్తున్న వైనం
రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు అందిస్తున్న ఇన్‌పుట్ సబ్సిడీలో అవకతవకల వ్యవహారం రైతులను భగ్గుమనేలా చేస్తోంది.సరిగ్గా ఏడాది కిందట సంబంధిత అధికారులు పంపిన నివేదికల ఆధారంగా ప్రస్తుతం ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో పరిహారం మంజూరైంది. అయితే కొన్ని మండలాల్లో అప్పట్లో పంట సాగు చేయని రైతులకు.. అనుకూలురైన వారికి, అధికారుల బంధువులు,ఇతర అనర్హులకు అందజేశారన్న ఆరోపణలు రచ్చకెక్కేలా చేస్తున్నాయి.
సాక్షి, కడప : ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్‌పుట్ సబ్సిడీకి సంబంధించిన బాండ్ల పంపిణీ వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. అందుకు కారణం పలుచోట్ల ఇన్‌పుట్ సబ్సిడీకి సంబంధించి కొంతమంది పంట సాగు చేయని రైతులకు పరిహారం అందడంతోపాటు అర్హులైన వారికి రాకపోవడం అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. తొండూరుతోపాటు వేముల, రాయచోటి నియోజకవర్గంలోని పలు చోట్ల రైతులు భగ్గుమంటున్నారు. ఎందుకు ఇలా జరిగిందన్న దానిపై సమాధానం చెప్పేందుకు అధికారులు కూడా ముందుకు రావడంలేదు. అంతా ఏడాది కిందట జరిగిపోయిందని.. ఇప్పుడు అరిచినా ఎవరూ ఏమి చేయలేరని అధికారులు పేర్కొంటున్నారు. 2016లో వేరుశనగ, పత్తితోపాటు మరికొన్ని పంటలు వేసి కరువు ప్రభావంతో పంటలు ఎండిపోయాయి. తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొని అన్నదాత అల్లాడిపోయారు.
అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా పంట నష్టం జాబితాను రూపొందించేలా ఆదేశాలు ఇచ్చింది. అప్ప ట్లో మండల వ్యవసాయ శాఖ అధికారులు, వీఆర్‌ఓ, మరో సంబంధిత అధికారి కలిసి నివేదికలు రూపొందించారు. గ్రామసభలు పెట్టి పంట సాగు చేసిన రైతులను గుర్తిం చాల్సి ఉంది. అయితే కొంతమంది అధికా రులు గ్రామసభలు నిర్వహించకుండా తమకు తెలిసిన పంథాలో వెళ్లగా.. మరికొందరు రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అనుకూలురైన వారి పేర్లను జాబితాలో చేర్చిన ట్లు తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరుకు సంబంధించిన అధికారులు అప్పట్లో పులివెందులలోని ఓ లాడ్జిలో కూర్చొని రైతుల జాబితాను తయారు చేస్తున్న వ్యవహారం పత్రికల దృష్టికి వచ్చి రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక తొండూరు మండలంలోనే కాకుండా పలుచోట్ల రైతులు అధికారులను నిలదీస్తున్నారు.
సాగు తక్కువ ఉన్న వారికి ఎక్కువ మొత్తాలు..
జిల్లాలో చాలా మండలాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ బాండ్ల పంపిణీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. కొంతమంది రైతులు ఎక్కువ పంట సాగు చేస్తే తక్కువ మొత్తంలో మం జూరు కావడం..అధికంగా పంట సాగు చేస్తే తక్కువ మొత్తంలో ఇన్‌పుట్ సబ్సిడీ రావడంతో అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నా రు. జిల్లా వ్యాప్తంగా సుమారు 63వేలమం ది రైతులకు గాను రూ.70కోట్లకుపైగా ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరైంది. బాండ్ల పంపిణీ అధికారులకు ఇబ్బందిగా మారింది.
జేడీ ఠాగూర్ నాయక్ ఏమంటున్నారంటే.. :
జిల్లాలో ఇన్‌పుట్ సబ్సిడీ వ్యవహారంలో అవకతవకలకు సంబంధించి వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఠాగూర్ నాయక్‌ను సాక్షి ప్రతినిధి ప్రశ్నించగా ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. ఏడాది కిందట వ్యవసాయ శాఖ అధికారితోపాటు మరో రెండు శాఖల అధికారులు ప్రత్యేకంగా ఎక్కడికక్కడ మండలాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులను ఎంపిక చేశారని తెలిపారు. కొంతమంది పరిహారం రాని రైతులే ఈ విధంగా ఆందోళన చేస్తున్నారని.. అప్పట్లో నియమ నిబంధనల మేరకే పంట సాగు చేసిన వారి పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు. ఏడాది క్రితం అయిపోయిన దానికి ఇప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు.