పెంచుకో.. పంచుకో!  | State government has increased the Polavaram Estimated cost | Sakshi
Sakshi News home page

పెంచుకో.. పంచుకో! 

Published Fri, Jun 15 2018 3:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:24 PM

State government has increased the Polavaram Estimated cost - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రుల చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టుకు ‘చంద్ర’ గ్రహణం పట్టింది. ప్రాజెక్టును పూర్తిచేసి 2018 ఖరీఫ్‌ నాటికి ఆయకట్టుకు నీళ్లందించడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం.. అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.58,319.06 కోట్లకు పెంచేయడంలో మాత్రం గొప్ప ప్రగతి సాధించినట్లు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు పేర్కొంటున్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రమే ఈ జాతీయ ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంది. కానీ, ప్రభుత్వ ముఖ్యనేత ప్రాజెక్టు బాధ్యతను భుజానకెత్తుకున్న ముఖ్యనేత నిర్మాణ పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి.. కమీషన్లు వసూలు చేసుకుంటున్నారు. హెడ్‌ వర్క్స్‌ నుంచి కుడి.. ఎడమ కాలువ పనుల వరకూ ఇదే కథ. ఈ కారణంగా పోలవరం జలాశయం పనులకు సంబంధించిన డిజైన్లు ఇప్పటివరకూ ఓ కొలిక్కి రాలేదు. ప్రస్తుత ఖరీఫ్‌కు కాదు కదా 2019 ఖరీఫ్‌ నాటికి కూడా గ్రావిటీపై ఆయకట్టుకు నీళ్లందించే స్థాయిలో ప్రాజెక్టు పనులు సాగడంలేదని వాటిని పర్యవేక్షిస్తున్న అధికారులే అంగీకరిస్తున్నారు.

నాడు వద్దన్నదే నేడు ముద్దా!?
పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ పనులను రూ.4,054 కోట్లకు 2013లో ట్రాన్స్‌ట్రాయ్‌ దక్కించుకుంది. సాగునీటి ప్రాజెక్టుల పనులలో అనుభవంలేని ఈ సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రాద్ధాంతం చేశారు. ఎన్నికలకు ముందు రాయపాటి ‘సైకిల్‌’ ఎక్కగానే చంద్రబాబు మాట మార్చారు. పోలవరం జలాశయం పనులు చేసే సత్తా ట్రాన్స్‌ట్రాయ్‌కి లేదని పీపీఏ.. నిపుణులు తేల్చిచెప్పినా స్పందించలేదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి సెప్టెంబరు 7, 2016న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. ఆ తర్వాత 24 గంటల్లోనే హెడ్‌ వర్క్స్‌ అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్లకు పెంచేసి.. ట్రాన్స్‌ట్రాయ్‌ను అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించేస్తూ, కమీషన్లు వసూలు చేసుకునే పనిలో పడ్డారు.

ఇటీవల స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌లో రూ.2,165.54 కోట్ల విలువైన పనులను నవయుగకు అప్పగించారు. తాజాగా ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్, కాఫర్‌ డ్యామ్‌ పనులను మరో సంస్థకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించాలని నిర్ణయించారు. దాంతో.. హెడ్‌ వర్క్స్‌లో పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించినట్లయింది. ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌కి ఈపీసీ (ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో పనులను ప్రభుత్వం అప్పగించింది. ఆ కాంట్రాక్టు ఒప్పం దం రద్దు చేయకుండానే ఈపీసీ పద్ధతిని పక్కన పెట్టేసి, లంప్సమ్‌–ఓపెన్‌ పద్ధతిలో పనులను నామి నేషన్‌ విధానంలో సబ్‌ కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం గమనార్హం. దీనివల్ల పనుల పరిమాణం పెరిగితే కాంట్రాక్టర్‌కు అదనంగా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. కాఫర్‌ డ్యామ్‌కు ఒకసారి, కాం క్రీట్‌ పనులకు మరో సారి, గేట్లు తయారైనప్పుడు ఇంకోసారి..ఇలా పలుమార్లు శంకుస్థాపనలు చేసిన సీఎం చంద్రబాబు తాజాగా డయాఫ్రాం వాల్‌ను జాతికి అంకితం చేయడం ద్వారా ‘పోలవరం’ నాటకాన్ని రక్తికట్టించారు.

వైఎస్‌ మరణం..పోలవరానికి శాపం 
ఈ ప్రాజెక్టును నిజం చేసేందుకు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో పోలవరం పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులు సాధించి.. రూ.10,151.40 కోట్ల అంచనా వ్యయంతో శరవేగంగా పనులు చేపట్టారు. హెడ్‌ వర్క్స్‌.. కుడి, ఎడమ కాలువ పనులకు రూ.5,135.87 కోట్లను ఖర్చుచేశారు. కుడి కాలువ పనులు లైనింగ్‌తో సహా దాదాపుగా అప్పట్లోనే పూర్తయ్యాయి. ఎడమ కాలువ పనులూ 145 కి.మీల మేర పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగునీరు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల స్థిరీకరణతోపాటూ 540 గ్రామాల ప్రజలకు తాగునీరు.. విశాఖపట్నానికి తాగు, పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీటిని అందించవచ్చు. గోదావరి డెల్టాలో మూడు పంటలకు నీటిని అందించవచ్చు. కానీ, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం ఈ ప్రాజెక్టుకు శాపంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. వంద శాతం ఖర్చును తామే భరించి పూర్తిచేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేసేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ను ఏర్పాటుచేసింది. కానీ.. చంద్రబాబు సర్కార్‌ పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా, ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం నుంచి తీసుకుంది. 

పోలవరం ‘జాతీయ’ స్థాయి స్కాం
పోలవరం హెడ్‌ వర్క్స్‌లో పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి ముఖ్యనేత, మరో కీలక మంత్రి భారీఎత్తున కమీషన్లు వసూలు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలవరం కుడి కాలువ పనులు 2009 నాటికే దాదాపు పూర్తయ్యాయి. మిగిలిపోయిన పనుల్లో ఆరో ప్యాకేజీలో ఆర్‌ఎస్వీ సంస్థకు,  ఏడో  ప్యాకేజీలో బీఎస్పీసీఎల్‌కు, పట్టిసీమ ఎత్తిపోతల నీటిని 2015లో కృష్ణా డెల్టాకు తరలించేందుకు తాత్కాలిక ఏర్పాట్ల పనుల రూపంలో మొత్తం రూ.523 కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై కట్టబెట్టారు. పోలవరం ఎడమ కాలువను 181.50 కి.మీల మేర తవ్వే పనులను రూ.1,954.74 కోట్ల వ్యయంతో 2005లో ప్రభుత్వం చేపట్టింది. వీటిని ఎనిమిది ప్యాకేజీల కింద విభజించి అప్పట్లో కాంట్రాక్టర్లకు అప్పగించారు.   దాదాపు   65 శాతం   పూర్తయిన  ఈ పనుల అంచనా వ్యయాన్ని గతేడాది డిసెంబరు 6, 2016న రూ.3645.15 కోట్లకు పెంచేస్తూ సర్కార్‌ ఉత్తర్వులు జారీచేసింది. ఆ వెంటనే ఐదో ప్యాకేజీలో పనులు చేయడంలేదనే సాకు చూపి పాత కాంట్రాక్టర్‌పై 60సీ నిబంధన కింద వేటువేసి.. రూ.142.88 కోట్ల విలువైన పనులను ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు, ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌కు అప్పగించారు. సవరించిన అంచనా వ్యయం మేరకు ఈ పనుల విలువ రూ.350 కోట్లకు పైగా ఉంటుంది.

ఇప్పుడు అదే తరహాలో ఒకటి, మూడు, నాలుగు, ఎనిమిదో ప్యాకేజీల్లో పనులు చేయడంలేదనే సాకు   చూపి పాత కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటువేశారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఏలేరు ఆయకట్టుకు నీళ్లందించాలన్న ఉద్దేశంతో పోలవరం ఎడమ కాలువను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని గతేడాది సర్కార్‌ నిర్ణయించింది. దాన్నే సాకుగా చూపి ఒకటో ప్యాకేజీలో మిగిలిన రూ.92.14 కోట్లు, మూడో ప్యాకేజీలో మిగిలిన రూ.53.263 కోట్లు, నాలుగో ప్యాకేజీలో మిగిలిన రూ.102.85 కోట్లు, ఎనిమిదో ప్యాకేజీలో మిగిలిన రూ.80.74 కోట్లు వెరసి రూ.328.993 కోట్ల విలువైన పనులను నామినేషన్‌ పద్ధతిలో అప్పగించేందుకు జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ అంగీకరించకపోవడబంతో సీఎం చంద్రబాబు నోటి మాటపై ఆ పనులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టేశారు. సవరించిన అంచనాల మేరకు ఈ పనుల విలువ రూ.1,045 కోట్లు కావడం గమనార్హం. ఈ వ్యవహారంలో ముఖ్యనేతకు భారీఎత్తున ముడుపులు ముట్టినట్లు అధికార వర్గాలే వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో గిరిజనులు, నిర్వాసితుల పొట్టకొట్టి టీడీపీ నేతలు, అధికారులే వేలాది కోట్ల పరిహారాన్ని మింగేస్తున్నారు. ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన గిరిజనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనుల్లోనూ చేతివాటం ప్రదర్శించి.. పరిహారం మింగేయడంపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది.

అంచనా వ్యయం పెంచడంలోనే ప్రగతి
ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టు పనులు 53.90 శాతం మాత్రమే పూర్తయ్యాయి. జలాశయం పనులు 37.68 శాతం, కుడి కాలువ పనులు పూర్తిగానూ, ఎడమ కాలువ పనులు 210.927 కి.మీ.కి గానూ 164.74 కి.మీల మేర పూర్తయ్యాయి. ప్రాజెక్టు పనులకు ఇప్పటిదాకా రూ.13,466.42 కోట్లు ఖర్చు చేయగా.. ఈ నాలుగేళ్లలో రూ.8,330.55 కోట్లు ఖర్చుచేశారు. ఇందులో కేంద్రం రూ.5,342.26 కోట్ల రీయింబర్స్‌ చేసింది. జలాశయం పనుల్లో ప్రధాన డ్యామ్‌ అయిన ఈసీఆర్‌ఎఫ్‌ పునాది పనులు నేటికీ పూర్తికాకపోవడాన్ని బట్టి చూస్తే.. ప్రాజెక్టు పనులు ఎప్పటికి పూర్తవుతాయో ఊహించుకోవచ్చు. 2018 ఖరీఫ్‌ పంటలకు గ్రావిటీపై ఆయకట్టుకు నీళ్లందించడంలో విఫలమైన చంద్రబాబు.. అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.58,319.06 కోట్లకు పెంచడంలో మాత్రం సఫలమయ్యారు. కాగా, హెడ్‌ వర్క్స్‌ (జలాశయం)కు సంబంధించిన 45 డిజైన్‌లలో ఇప్పటికీ 31 డిజైన్‌లకు అతీగతీ లేదంటే.. ఈ ప్రభుత్వానికి ప్రాజెక్టును పూర్తిచేయడంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నది స్పష్టమవుతోందని రిటైర్డు ఈఎన్‌సీ ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.

‘‘పోలవరం ప్రాజెక్టును 2018 ఖరీఫ్‌ నాటికి పూర్తిచేస్తాం. ఆయకట్టుకు గ్రావిటీపై నీటిని అందిస్తాం’’. .. జూన్‌ 8, 2014న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో చంద్రబాబు చెప్పిన మాట. 
సీన్‌ కట్‌చేస్తే.. 2018 వచ్చేసింది.. ఖరీఫ్‌ పంట కాలం ప్రారంభమైంది. కానీ, చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పోలవరం ఇంకా పూర్తికాలేదు. గ్రావిటీపై ఆయకట్టుకు నీళ్లందించే పరిస్థితి అంతకన్నా లేదు. ఇంకా పునాదుల దశలోనే ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement