యడవెల్లి సీటుకు ఎసరు!
బ్యాంకు (డీసీసీబీ) రాజకీయం కొత్త మలుపు తిరుగుతోంది. ఆరునెలల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన చైర్మన్ విజయేందర్‌రెడ్డి తిరిగి విధుల్లో చేరారు. ప్రజాప్రతినిధికి సెలవేంటి..? వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే అనర్హత వేటు పడాల్సిందే కదా..? సహకార చట్టం చెబుతోంది ఇదే కదా? అంటూ కొందరు సభ్యులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. దీనికోసం హైదరాబాద్‌లో క్యాంప్ నడిపారు..!
సాక్షిప్రతినిధి, నల్లగొండ :ఏ ముహూర్తాన డీసీసీబీకి పాలకవర్గం ఎన్నికయ్యిందో ఏమో కానీ, అన్నీ అవాంతరాలే. జిల్లా సహకార రంగం తలదించుకునేలా దేవరకొండ బ్యాంకు అవినీతి బాగోతం బయటపడింది. ఆ వ్యవహారాన్ని చక్కదిద్దకముందే, కాంగ్రెస్ పార్టీలో ప్రాంతాల వారీ, నాయకుల ఆధిపత్య రాజకీయం చైర్మన్‌ను పక్కన పెట్టి దొడ్డిదోవన వైస్‌చైర్మన్‌కు బాధ్యతలు అప్పజెప్పేలా చేసింది. ఇక, మారిన రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో తలకిందులైన కాంగ్రెస్ భవిష్యత్ వల్ల... ఇక వెళ్లిపోతారు అనుకున్న విజయేందర్‌రెడ్డి తిరిగి తన సీటులో తానే కూర్చుంటానంటూ బాధ్యతలు స్వీకరించారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలోనే మరో తాజా ఉదంతం వెలుగులోకి వచ్చింది. సహకార చట్టంలోని నిబంధనల మేరకు వరుసగా మూడు బోర్డు సమావేశాలకు గైర్హాజరైన సభ్యుడు ఎవరైనా అనర్హుడు అవుతాడు.
విజయేందర్‌రెడ్డి సెలవుపై వెళ్లిన ఆరు నెలల కాలంలో ఇన్‌చార్జ్ చైర్మన్ అధ్యక్షతన ఏకంగా నాలుగు బోర్డు సమావేశాలు జరిగాయి. సహజం గానే విజయేందర్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఇప్పుడు ఈ అంశాన్ని అవకాశంగా మలుచుకునే పనిలో కొందరు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డెరైక్టర్లు ఏకతాటిపైకి వస్తున్నారు. ‘వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుంది. అది సభ్యుడైనా, చైర్మన్ అయినా ఎవరైనా కావొచ్చు. సహకార చట్టం అదే చెబుతోంది..’ అని జిల్లా సహకార శాఖకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. దీం తో కొందరు డెరైక్టర్లు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో క్యాంప్ వేశారు. రాష్ట్రస్థాయి సహకారశాఖ అధికారులనూ సంప్రదించి వివరాలు సేకరించారు. ఇప్పుడు వారంతా ఓ పిటిషన్ తయా రు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసే పనిలో ఉన్నారు.
అసలేం జరిగింది..?
సహకార చట్టాన్ని అపహాస్యం చేస్తూ..తమ వారికి దొడ్డిదోవన పదవులు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ సీనియర్లు చేసిన నిర్ణయంతో అయిష్టంగానే డీసీసీబీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి ఆరునెలల పాటు పక్కకు తప్పుకున్నారు. (దీర్ఘకాలిక సెలవు అని చెబుతున్నా... అసలు సెలవు పెట్టే అవకాశం లేదంటున్నారు.) సహకార ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందం మేరకు విజయేందర్‌రెడ్డిపై ఒత్తిడి పెట్టి పక్కకు తప్పుకునేలా చేసి, కోదాడ నియోజకవర్గానికి చెందిన వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు ఇన్‌చార్జ్ పదవిని కట్టబెట్టారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు జిల్లా కాంగ్రెస్‌లో ఎన్నికల ముందు జరిగిన ఒప్పందాల గురించి అప్పటి మంత్రుల హోదాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి సవివరంగా లేఖ రాశారు. గత ఏడాది సెప్టెంబరు 30వ తేదీతో ఉన్న ఈ లేఖలో ఇద్దరూ సంతకాలు చేశారు. ముందు చేసుకున్న ఒప్పందంలో భాగంగా, ఆయా కులాల సమీకరణాల నేపథ్యంలో ఈ మార్పు చేయనున్నామని అందులో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. అధికార పీఠాన్నీ కోల్పోయింది. ఇక, పదవీత్యాగం చేసిన విజయేందర్‌రెడ్డికి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టు వచ్చే అవకాశమే లేదు. దీంతో ఆయన తిరిగి గత నెల 26వ తేదీన చైర్మన్‌గా విధులు చేపట్టారు.
అన్ని పదవులూ వారికేనా..?
జిల్లాలో ముఖ్యమైన పదవులన్నీ ఒకే ప్రాంతానికి, లేదంటే ఒకరిద్దరు నేతల అనుచరులకేనా అన్న చర్చ జిల్లా కాంగ్రెస్‌లో మొదలైంది. ఈలోగా సహకార రం గం, చట్టంపై అవగాహన ఉన్న వారు కొందరు దీని గురించి, నిబంధనల గురించి చెప్పడంతో రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాకుంటే కచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. దీర్ఘకాలిక సెల వు అంటే, వాస్తవానికి చట్టంలో అలాంటి ప్రొవిజన్ లేదు. కానీ, డీసీసీబీ బైలాలో ఏమీ రాసుకున్నారో కూడా చూడాల్సి ఉంటుంది. సెలవు పెట్టినట్లు చెబుతున్న కాలంలో మిగతా ఏ యాక్టివిటీలోనూ ఉండడానికి వీల్లేదు. అలా కాని పక్షంలో డీసీసీబీని చీట్ చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ముందు బైలాలో ఏమీ రాసుకున్నారో తెలుసుకోవాలి..’ అని రాష్ట్ర సహకార శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి డీసీసీబీ పీఠం నుంచి విజయేందర్‌రెడ్డిని తప్పించేందుకు మరో ప్రయత్నం జరుగుతోంది.