Vijender Reddy
-
కరోనా కష్టాలు మామ.. సినిమా చూపలేము మామా!
అనుకున్నంతా అయింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ప్రభావం... ఇప్పుడు వరుసగా ఒక్కో రంగం మీద పడుతోంది. ఈ కరోనా కష్టకాలంలో... కాస్తంతయినా వినోదం పంచడానికి సిద్ధమైన సినిమా థియేటర్లు మూసివేత బాట పట్టాయి. మహారాష్ట్ర, ఢిల్లీల్లో హాళ్ళు, షూటింగులు ఆగిపోయాయి. దక్షిణాది సినీసీమలోనూ హాళ్ళు స్వచ్ఛందంగా మూతబడుతున్నాయి. నైట్ కర్ఫ్యూ, 50 శాతం సీటింగ్ కెపాసిటీ లాంటి వాటితో తెలుగు నేలపై రెండు రాష్ట్రాల్లోనూ సినీ వినోదానికి గడ్డుకాలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తమ థియేటర్లలో ప్రదర్శనల్ని ఆపేసింది. తెలంగాణలో హాళ్ళను స్వచ్ఛందంగా మూసేయాలని ఓనర్లు నిర్ణయించారు. దేశమంతటా సినీరంగానికి ఇవి గడ్డు రోజులు. తెలుగే కాదు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ కొత్త రిలీజులకు నిర్మాతలు భయపడుతున్నారు. కలెక్షన్ల కన్నా కరెంట్, శానిటైజేషన్ ఖర్చే ఎక్కువవుతోంది. కరోనా ఇలాగే కొనసాగితే, పెద్ద సినిమాలు కనీసం 3 –4 నెలలు వాయిదా పడే ప్రమాదం ఉంది. వెంకటేశ్ ‘దృశ్యం–2’ సహా పలు భాషాచిత్రాలు ఓటీటీ వైపు వెళుతున్నాయి. – కాట్రగడ్డ ప్రసాద్, సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు సినిమా ప్రదర్శనలకు కరోనా సెకండ్ వేవ్ దెబ్బ పడింది. రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న సీటింగ్ కెపాసిటీ, కర్ఫ్యూలాంటి చర్యలు సహజంగానే థియేటర్లలో సినిమా ప్రదర్శనలకూ వర్తిస్తున్నాయి. దాంతో, ఇప్పుడు వెండితెరపై వినోదం దేశమంతటితో పాటు తెలుగునాట కూడా తగ్గిపోనుంది. మంగళవారం నుంచి తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో, మునుపటిలా రోజుకు నాలుగు షోలూ ప్రదర్శించే వీలు లేకుండా పోయింది. దాంతో, ఈవారం రావాల్సిన ‘ఇష్క్’, ‘తెలంగాణ దేవుడు’ సహా ఆరేడు సినిమాల రిలీజులు వాయిదా పడ్డాయి. హాలులో ఉన్న సినిమాలకేమో ప్రేక్షకులు లేరు. దాంతో, తెలంగాణ థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా హాళ్ళు మూసేయాలని నిర్ణయించుకున్నారు. ఊపిరి పీల్చుకొనే లోగానే... కొత్త సినిమాలతో కళకళలాడుతూ నిండా నాలుగు నెలలైనా గడవక ముందే దురదృష్టవశాత్తూ సినిమా హాళ్ళకు క్రమంగా తాళాలు పడుతున్నాయి. నిజానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా హాళ్ళను ఆదుకొనేందుకు ఇటీవల పలు రాయితీలు ఇచ్చింది. గత ఏడాది హాళ్ళు మూతబడ్డ కరోనా కాలంలోని మూడు నెలలకు విద్యుత్ ఛార్జీలు రద్దు చేసింది. మల్టీప్లెక్సులతో సహా థియేటర్లకు మరో ఆరు నెలల పాటు విద్యుత్ ఛార్జీలను వాయిదా వేసింది. సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి కట్టాల్సిన వడ్డీలో 5 నుంచి 10 లక్షల దాకా వడ్డీ ఉపసంహరణ ఇస్తున్నట్టు ఏ.పి. సర్కారు ఉదారంగా ఉత్తర్వులిచ్చింది. ఇంకా కొన్ని సమస్యలున్నా, ఈ రాయితీలతో ఎగ్జిబిషన్ సెక్టార్ కొంత ఊపిరి పీల్చుకుంది. ఇంతలోనే ఉరుము మీద పిడుగులా కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది. ఆంధ్రప్రదేశ్‌లో సీటు విడిచి సీటు! పెద్ద సినిమాలు పోస్ట్‌పోన్ బాట పట్టాయి. జనం హాళ్ళకు వచ్చే పరిస్థితులు కనబడడం లేదు. సూపర్ హిట్ అని చెప్పుకుంటున్న సినిమాలకు సైతం వారం తిరిగే సరికల్లా ప్రేక్షకుల కోసం ఎదురుచూడాల్సిన దుఃస్థితి దాపురించింది. ఇదే అదనుగా ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, తెనాలి, మంగళగిరి, కాకినాడ, విజయవాడ లాంటి పలు ప్రాంతాల్లో ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తమ చేతిలో ఉన్న థియేటర్లను ఇప్పటికే మూసివేసింది. కాగా, థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీగా ఉంచాలని సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం సీటింగ్ కెపాసిటీకే అనుమతి ఉన్నట్టు లెక్క. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్! ఇది ఇలా ఉండగా, సోమవారమే తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జన సంచారంపైన, సినిమా హాళ్ళు, బార్లు, పబ్లపైన నియంత్రణ ఏదని ప్రశ్నించింది. దాంతో, తక్షణమే రాత్రి కర్ఫ్యూ పెడుతున్నట్టు తెలంగాణ సర్కారు మంగళవారం మధ్యాహ్నానికల్లా ప్రకటన చేసేసింది. ప్రస్తుతానికి ఈ నెలాఖరు దాకా ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. తెలంగాణలోని సినిమా హాళ్ళలో ప్రస్తుతానికి ఫుల్ కెపాసిటీ అనుమతి ఉన్నా, రాత్రి 8 గంటల కల్లా సినిమా హాళ్ళు మూసేయాలనడం ఇబ్బంది అయింది. ఆడియన్స్‌ను ఆకర్షించే పెద్ద సినిమాలేవీ రిలీజయ్యే పరిస్థితులు లేకపోవడంతో, థియేటర్లను మూసివేయాలని తాజాగా తెలంగాణ సినిమా థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ కూడా నిర్ణయించింది. మంగళవారం జరిగిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల జూమ్ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. దీంతో, బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు, స్థానిక మల్టీప్లెక్సులు మూతపడనున్నాయి. జాతీయ స్థాయి బ్రాండ్లయిన పి.వి.ఆర్, ఐనాక్స్‌ల నిర్ణయం ఏమిటన్నది వేచి చూడాలి. రెండు వారాలుగా థియేటర్ల కలెక్షన్స్ బాగా తగ్గాయి. చిన్నచితకా సినిమాలను చూసే నాథుడే లేడు. ప్రముఖ తెలంగాణ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ దిల్ రాజు నిర్మించిన పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ ఒక్కటే ఇప్పుడు థియేటర్లలో ఉన్న పెద్ద సినిమా. దాంతో, ఆ సినిమా నడుస్తున్న థియేటర్లను మాత్రం మూయకుండా నడుపుతామని తెలంగాణ ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. అటు బాలీవుడ్లో... ఇటు కోలీవుడ్‌లో.... నిజానికి, కరోనా సెకండ్ వేవ్‌తో దేశమంతటా ఇప్పటికే సినిమా పరిశ్రమ ఇరుకున పడింది. ఉత్తరాదిన మహారాష్ట్ర, ఢిల్లీలాంటి చోట్ల లాక్‌డౌన్‌తో ఇప్పటికే షూటింగులు, సినిమా ప్రదర్శనలు బంద్ అయిపోయాయి. అలా అక్కడి హిందీ, మరాఠీ సినీ – టీవీ పరిశ్రమ దాదాపు స్తంభించిపోయింది. మంగళవారం రాత్రి సమయానికి మహారాష్ట్రలో పూర్తి లాక్ డౌన్ విధిస్తారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ కొన్నాళ్ళు పూర్తిగా బంద్ అయ్యేలా ఉంది. ఇక, దక్షిణాదిన తమిళనాట కూడా ఏప్రిల్ 20వ తేదీ మంగళవారం నుంచి నెలాఖరు దాకా రాత్రి కర్ఫ్యూ పెట్టారు. అలాగే, ప్రతి ఆదివారం పూర్తి లాక్ డౌన్ ఉంటుందని కూడా తమిళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీ, నైట్ కర్ఫ్యూ, ఆదివారం లాక్ డౌన్లతో తమిళ సినిమాల ప్రదర్శన ఇక్కట్లలో పడింది. ఏప్రిల్ 9న సగం సీటింగ్ కెపాసిటీలోనే రిలీజైన ధనుష్ ‘కర్ణన్’ మినహా అక్కడ కూడా ఇప్పటికిప్పుడు పెద్ద రిలీజులేమీ లేవు. దాంతో, కాస్తంత అటూ ఇటూగా తమిళనాడులోనూ సినిమా హాళ్ళు కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో కొన్నాళ్ళు మూతపడతాయని కోడంబాక్కమ్ వర్గాల కథనం. తెలంగాణలో వసూళ్ళు 70 శాతం పడిపోయాయి. పెద్ద హీరో సినిమాకు సైతం టాక్‌కు తగ్గ కలెక్షన్లు ఉండడం లేదు. పెద్ద సినిమాలతో పాటు, రేపు 23న రావాల్సిన సినిమాలూ వాయిదా పడ్డాయి. రిలీజులూ లేక, జనమూ రాక నష్టాలతో హాళ్ళు ఎలా నడుపుతాం? కొత్త రిలీజులతో నిర్మా తలు సిద్ధమంటే హాళ్ళు వెంటనే తెరుస్తాం. – ఎం. విజయేందర్ రెడ్డి, తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి యాభైమందితోనే షూటింగ్! కరోనా విజృంభిస్తున్న తరుణంలో తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ‘‘కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. అత్యవసరం అనుకుంటే 50 మంది యూనిట్‌తోనే షూటింగ్స్ చేసుకోవాలి’’ అని ఆ సంస్థలు పేర్కొన్నాయి. వాయిదా పడ్డాయి! తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా యస్.యస్.రాజు దర్శకత్వంలో రూపొందిన ‘ఇష్క్’ చిత్రం ఈనెల 23న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా వేశారు. ‘‘ఏపీలో 50శాతానికి థియేటర్ల సామర్థ్యాన్ని తగ్గించడం, తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ విధించడం జరిగింది. ఇలాంటి టైమ్‌లో సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని వాయిదా వేస్తున్నాం’’ అన్నారు చిత్రనిర్మాతలు. హీరో శ్రీకాంత్ లీడ్ రోల్లో నటించిన ‘తెలంగాణ దేవుడు’ చిత్రం కూడా ఈ నెల 23న విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు ఇదీ వాయిదా పడింది. మాక్స్‌ల్యాబ్ సిఈఓ మొహమ్మద్ ఇంతెహాజ్ అహ్మద్ మాట్లాడుతూ – ‘‘పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, ప్రజల శ్రేయస్సును కోరుతూ మా సినిమా విడుదల వాయిదా వేశాం’’ అన్నారు. కేరళలోనూ స్వచ్ఛందంగా క్లోజ్! దేశంలో కరోనా కేసులు అత్యధికంగా వస్తున్న రాష్ట్రాల్లో ఒకటైన కేరళలోనూ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. రాత్రి వేళ సినిమా ప్రదర్శనల్ని రద్దు చేస్తూ, రోజుకు 3 ఆటలనే అనుమతిస్తూ, గత వారం కేరళ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. తాజాగా అక్కడ కూడా ఏప్రిల్ 20 నుంచి రాత్రివేళ కర్ఫ్యూ పెడుతున్నట్టు ప్రకటించింది. మధ్యాహ్నం 12కు తెరిచి సాయంత్రం 7.30 గంటలకు హాళ్లు మూసెయ్యాలంటే, రోజుకు రెండు షోలే వేయగలరు. ‘ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ’ సభ్యులందరూ మంగళవారం నాడు ఆన్లైన్లో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు నడపాలా, లేదా అనేది ఆయా థియేటర్ల ఓనర్లు ఎవరికి వారు స్వచ్ఛందంగా నిర్ణయించుకోవచ్చని తీర్మానించారు. కలెక్షన్లు బాగా తగ్గడంతో ఇప్పుడు కేరళలోనూ సినిమా థియేటర్లు నూటికి 80 స్వచ్ఛందంగా మూతబడుతున్నాయి. మే నెలలో రావాల్సిన తాజా జాతీయ ఉత్తమ చిత్రం మోహన్ లాల్ ‘మరక్కర్’, మహేశ్ నారాయణన్ రూపొందించిన ‘మాలిక్’ లాంటి పెద్ద సినిమాలు వాయిదా పడనున్నాయి. కర్ణాటకలోనూ... ఈ 23 నుంచి? కరోనా హాట్‌స్పాట్ కర్ణాటకలోనూ ఇప్పటికే సినిమా హాళ్ళు కష్టాల్లో ఉన్నాయి. ఏప్రిల్ 7 నుంచి అక్కడ హాళ్ళు 50 శాతం సీటింగ్ కెపాసిటీతోనే ముక్కుతూ మూలుగుతున్నాయి. ఏప్రిల్ మొదట్లోనే ఆ రూల్ పెట్టారు. కానీ, పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘యువరత్న’ రిలీజైన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వారం రోజులు ఆ రూల్‌కు మినహాయింపు ఇచ్చింది. ఆ వెంటనే యువరత్న సైతం ఓటీటీ బాట పట్టేసింది. ఆ తరువాత వచ్చిన ‘కృష్ణా టాకీస్’ సైతం థియేటర్ల నుంచి తప్పుకుంది. దాంతో, కొత్త సినిమా రిలీజులేమీ లేక, జనమూ థియేటర్లకు రాక మైసూరులో హాలు ఓనర్లు తాము స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా థియేటర్లు సైతం ఏప్రిల్ 23 నుంచి మూతబడనున్నాయి. ‘‘పెద్ద సినిమాలేమీ ఈ 50 శాతం కెపాసిటీలో రిలీజు కావాలనుకోవడం లేదు. అలాంటప్పుడు ప్రాక్టికల్‌గా ఇంతకుమించి ఏం చేయగలం’’ అని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఏదిఏమైనా ఫిల్మ్ ఎగ్జిబిషన్ సెక్టార్ మరోసారి బాగా దెబ్బతినబోతోంది. చైనాలో 60 వేలు, అమెరికాలో 42 వేల స్క్రీన్లుంటే, ఏటా దాదాపు 1300 నుంచి 1500 సినిమాలు నిర్మించే మన దగ్గర దాదాపు 8 వేల స్క్రీన్లే మిగిలాయి. జనాభా పరంగా ప్రపంచంలో రెండో స్థానంలో మన దేశంలో ప్రతి పది లక్షల మందికి తొమ్మిది స్క్రీన్లే ఉన్నాయి. ఇక ఆంధ్రా, తెలంగాణ కలిపితే 1600 చిల్లర స్క్రీన్లే ఉన్నాయి. వీటన్నిటికీ ఇది గడ్డుకాలమే. సంక్రాంతి నుంచి మూడు నెలల పాటు కళకళ లాడి, ‘సినిమా చూపిస్త మామా’ అంటూ ఉత్సాహపడిన థియేటర్లు, ఇప్పుడు ‘సినిమా చూపించలేము మామా’ అనడం సగటు సినీ్రపియులకు విషాదమే! – రెంటాల జయదేవ -
రోడ్డు ప్రయాణంలో భద్రత పాటించండి
డీసీపీ విజేందర్‌రెడ్డి జ్యోతినగర్ : రోడ్డు ప్రయాణంలో వాహనదారులు భద్రతా నియమాలను పాటించాలని పెద్దపల్లి జోన్ డీసీపీ విజేందర్‌రెడ్డి అన్నారు. ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్ రాజీవ్ రహదారిపై స్టాపర్స్ బోర్డుల ఏర్పాటును బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరంమాట్లాడుతూ అతివేగంగా ప్రయాణించి ప్రమాదాలకు కారకులు కావద్దని సూచించారు. మనం చేసే ప్రమాదం ఇతరుల జీవితాలను చీకటిమయం చేయడం సరికాదన్నారు. వాహనాలు రానప్పుడు రోడ్డు దాటని సూచించారు. స్టాపర్స్ బోర్డుల ఏర్పాటుకు సహకరించిన వారికి జ్ఞాపికలను అందజేశారు. మేడిపల్లి సెంటర్, ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్, లేబర్ గేట్ వద్ద 12 స్టాఫర్స్‌ను ఏర్పాటు చేసిన రామగుండం సీఐ వాసుదేవరావును, ఎస్సై చంద్రకుమార్‌ను అభినందించారు. కార్యక్రమంలో విశ్వభారతి హైస్కూల్ కరస్పాండెంట్ బందారపు యాదగిరిగౌడ్, ఎస్ఎస్ గార్డెన్స్ యజమాని శరత్‌రావు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలంగాణలో మరో చాంబర్
‘తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ పేరుతో విజయేందర్ రెడ్డి అధ్యక్షతన ఇప్పటికే ఓ సంఘం సినీ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు తెలంగాణలో మరో చాంబర్ అవతరించింది. దీని పేరు - ‘తెలంగాణ మూవీ చాంబర్ ఆఫ్ కామర్స్’. తెలంగాణ సినిమాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త సంస్థను ఏర్పాటు చేసినట్లు ప్రధాన కార్యదర్శి సానా యాదిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి ‘దిల్’ రాజు అధ్యక్షునిగా, విజయేందర్ రెడ్డి ఉపాధ్యక్షునిగా, జాయింట్ సెక్రటరీగా సంగ కుమారస్వామి, కోశాధికారిగా బాల గోవిందరాజులు వ్యవహరిస్తారనీ, అల్లాణి శ్రీధర్, సంగిశెట్టి దశరథ, సత్యనారాయణ గౌడ్లు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా, గౌరవ సలహాదారుగా బి. నరసింగరావు వ్యవహరిస్తారనీ తెలిపారు. ఇప్పటికే ‘తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ ఉండగా, మరో సంఘాన్ని ఆరంభించడానికి కారణం ఏంటి? ‘‘ఇప్పటికే ఉన్న సంఘంలో పంపిణీదారులు, థియేటర్ అధినేతలు ఎక్కువ శాతం మంది ఉన్నారు. అందుకే, నిర్మాతల కోసం ఈ తాజా సంఘాన్ని ఆరంభించాం. అయితే నిర్మాతలకు మాత్రమే పరిమితం కాదల్చుకోలేదు. దర్శకులు, పంపిణీదారులు, థియేటర్ అధినేతలను కూడా చేర్చుకుంటాం’’ అని ప్రధాన కార్యదర్శి సానా యాదిరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. చిన్న నిర్మాతల సమస్యలకు పరిష్కారం కోరుతూ, తెలంగాణ కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం సహకారం కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నామన్నారు. -
రసవత్తరం.. సహకార రాజకీయం
సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లా కాంగ్రెస్‌లో హల్చల్ మొదలైంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ ఎన్నిక ఆ పార్టీలో లుకలుకలకు దారితీసింది. డీసీసీబీ చైర్మన్ పదవికి ఈ నెల 8వ తేదీన (బుధవారం) ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ సంస్థాగత రాజకీయ ఒప్పందాల నేపథ్యంలో చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి తన పదవికి గత నెల 15వ తేదీన రాజీనామా చేశారు. ఫలితంగా చైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉన్నందున ఎన్నిక ఏకగ్రీవం కావాల్సి ఉంది. కానీ అంత సానుకూలమైన పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. కాంగ్రెస్ చేతిలో ఉన్న 19 మంది డెరెక్టర్లంతా ఏకతాటిపై నిలబడతారా లేదా అన్న సంశయం నెలకొంది. మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల మధ్య ఎన్నికల ముందు ఓ ఒప్పందంకుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా చైర్మన్ విజ యేందర్‌రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. జానారెడ్డి అనుచరుడైన విజయేందర్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనుచరుడైన వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావులు చెరి రెండున్నరేళ్లు ఛైర్మన్ పదవిలో కొనసాగేలా ఒప్పం దం కుదుర్చుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో జనవరిలో చైర్మన్ విజయేం దర్‌రెడ్డి సెలవుపై వెల్లడంతో ఆరునెలల పాటు వైస్ చైర్మన్ పాండురంగారావు ఇన్చార్జ్ చైర్మన్‌గా పదవిలో కొనసాగారు. తిరిగి జూన్ చివరిలో విజయేందర్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి విజ యేందర్‌రెడ్డిని పదవి నుంచి తప్పించడానికి కాంగ్రెస్ పార్టీకే చెందిన డెరైక్టర్లు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వచ్చారు. ఆరునెలలు సెలవుపై వెళ్లడంతోపాటు మూడు సమావేశాలకు హాజరుకానందున ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఏకంగా రాష్ట్ర సహకార రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే విజయేందర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఏకతాటిపై..అనుమానమే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోవడంతో ఇద్దరు మాజీ మంత్రుల మాటలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ డెరైక్టర్లంతా ఏకతాటిపై ఉంటారా అనేది అనుమానామే అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో మొత్తం 21మంది డెరైక్టర్లలో 20 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. టీడీపీకి చెందిన ఏర్పుల సుదర్శన్‌ను మినహాయిస్తే అంతా కాంగ్రెస్‌కు చెందిన వారే. ఇటీవల ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన చాపల లింగయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ డెరైక్టర్ల సంఖ్య 19కి పడిపోయింది. 8వ తేదీన జరగనున్న ఛైర్మన్ ఎన్నికలో టీసీఎల్పీ నేత జానారెడ్డి వర్గీయులు పాండురంగారావుకు అనుకూలంగా ఓటు వేస్తారా అన్నది కూడా అనుమానమేని ప్రచారం జరుగుతోంది. పోటీ తప్పదా..? చైర్మన్ ఎన్నికలో వైస్ ైఛైర్మన్ పాండురాంగారావు గట్టిపోటీ తప్పదు. ఇప్పటికే పాండురంగారావుకు వ్యతిరేకంగా ఉన్న డెరైక్టర్లంతా ఏకమై రహస్య ప్రాంతంలో క్యాంపు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితులలో పాండురంగారావుకు చైర్మన్ పదవిని దక్కనివ్వవద్దని కాంగ్రెస్ పార్టీకే చెందిన కొందరు డెరైక్టర్లు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయి క్యాంపులు నిర్వహిస్తూ డెరైక్టర్లను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. ఇదీ .. షెడ్యూలు ఎన్నికకు సంబంధించి గత నెల 29న రాష్ట్ర రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటీవ్ సొసైటీస్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న, జిల్లా సహకార ఆడిట్ అధికారి లక్ష్మినారాయణ ‘సాక్షి’కి తెలిపారు. నామినేషన్ స్వీకరణ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు. నామినేషన్ల పరిశీలన 11.30 నుంచి 12 గంటల వరకు, నామినేషన్ల ఉపసంహరణ 12 గంటల నుంచి 2 గంటల వరకు. అభ్యర్థుల తుది జాబితాను 2.30 గంటలకు ప్రకటిస్తారు. ఓటింగ్ 3గంటల నుంచి 5 గంటల వరకు. ఓట్ల లెక్కింపు సాయంత్రం 5.30గంటలకు నిర్వహించి అనంతరం విజేతను ప్రకటిస్తారు. -
యడవెల్లి సీటుకు ఎసరు!
బ్యాంకు (డీసీసీబీ) రాజకీయం కొత్త మలుపు తిరుగుతోంది. ఆరునెలల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన చైర్మన్ విజయేందర్‌రెడ్డి తిరిగి విధుల్లో చేరారు. ప్రజాప్రతినిధికి సెలవేంటి..? వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే అనర్హత వేటు పడాల్సిందే కదా..? సహకార చట్టం చెబుతోంది ఇదే కదా? అంటూ కొందరు సభ్యులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. దీనికోసం హైదరాబాద్‌లో క్యాంప్ నడిపారు..! సాక్షిప్రతినిధి, నల్లగొండ :ఏ ముహూర్తాన డీసీసీబీకి పాలకవర్గం ఎన్నికయ్యిందో ఏమో కానీ, అన్నీ అవాంతరాలే. జిల్లా సహకార రంగం తలదించుకునేలా దేవరకొండ బ్యాంకు అవినీతి బాగోతం బయటపడింది. ఆ వ్యవహారాన్ని చక్కదిద్దకముందే, కాంగ్రెస్ పార్టీలో ప్రాంతాల వారీ, నాయకుల ఆధిపత్య రాజకీయం చైర్మన్‌ను పక్కన పెట్టి దొడ్డిదోవన వైస్‌చైర్మన్‌కు బాధ్యతలు అప్పజెప్పేలా చేసింది. ఇక, మారిన రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో తలకిందులైన కాంగ్రెస్ భవిష్యత్ వల్ల... ఇక వెళ్లిపోతారు అనుకున్న విజయేందర్‌రెడ్డి తిరిగి తన సీటులో తానే కూర్చుంటానంటూ బాధ్యతలు స్వీకరించారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలోనే మరో తాజా ఉదంతం వెలుగులోకి వచ్చింది. సహకార చట్టంలోని నిబంధనల మేరకు వరుసగా మూడు బోర్డు సమావేశాలకు గైర్హాజరైన సభ్యుడు ఎవరైనా అనర్హుడు అవుతాడు. విజయేందర్‌రెడ్డి సెలవుపై వెళ్లిన ఆరు నెలల కాలంలో ఇన్చార్జ్ చైర్మన్ అధ్యక్షతన ఏకంగా నాలుగు బోర్డు సమావేశాలు జరిగాయి. సహజం గానే విజయేందర్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఇప్పుడు ఈ అంశాన్ని అవకాశంగా మలుచుకునే పనిలో కొందరు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డెరైక్టర్లు ఏకతాటిపైకి వస్తున్నారు. ‘వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుంది. అది సభ్యుడైనా, చైర్మన్ అయినా ఎవరైనా కావొచ్చు. సహకార చట్టం అదే చెబుతోంది..’ అని జిల్లా సహకార శాఖకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. దీం తో కొందరు డెరైక్టర్లు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో క్యాంప్ వేశారు. రాష్ట్రస్థాయి సహకారశాఖ అధికారులనూ సంప్రదించి వివరాలు సేకరించారు. ఇప్పుడు వారంతా ఓ పిటిషన్ తయా రు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసే పనిలో ఉన్నారు. అసలేం జరిగింది..? సహకార చట్టాన్ని అపహాస్యం చేస్తూ..తమ వారికి దొడ్డిదోవన పదవులు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ సీనియర్లు చేసిన నిర్ణయంతో అయిష్టంగానే డీసీసీబీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి ఆరునెలల పాటు పక్కకు తప్పుకున్నారు. (దీర్ఘకాలిక సెలవు అని చెబుతున్నా... అసలు సెలవు పెట్టే అవకాశం లేదంటున్నారు.) సహకార ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందం మేరకు విజయేందర్‌రెడ్డిపై ఒత్తిడి పెట్టి పక్కకు తప్పుకునేలా చేసి, కోదాడ నియోజకవర్గానికి చెందిన వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు ఇన్చార్జ్ పదవిని కట్టబెట్టారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు జిల్లా కాంగ్రెస్‌లో ఎన్నికల ముందు జరిగిన ఒప్పందాల గురించి అప్పటి మంత్రుల హోదాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి సవివరంగా లేఖ రాశారు. గత ఏడాది సెప్టెంబరు 30వ తేదీతో ఉన్న ఈ లేఖలో ఇద్దరూ సంతకాలు చేశారు. ముందు చేసుకున్న ఒప్పందంలో భాగంగా, ఆయా కులాల సమీకరణాల నేపథ్యంలో ఈ మార్పు చేయనున్నామని అందులో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. అధికార పీఠాన్నీ కోల్పోయింది. ఇక, పదవీత్యాగం చేసిన విజయేందర్‌రెడ్డికి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టు వచ్చే అవకాశమే లేదు. దీంతో ఆయన తిరిగి గత నెల 26వ తేదీన చైర్మన్‌గా విధులు చేపట్టారు. అన్ని పదవులూ వారికేనా..? జిల్లాలో ముఖ్యమైన పదవులన్నీ ఒకే ప్రాంతానికి, లేదంటే ఒకరిద్దరు నేతల అనుచరులకేనా అన్న చర్చ జిల్లా కాంగ్రెస్‌లో మొదలైంది. ఈలోగా సహకార రం గం, చట్టంపై అవగాహన ఉన్న వారు కొందరు దీని గురించి, నిబంధనల గురించి చెప్పడంతో రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాకుంటే కచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. దీర్ఘకాలిక సెల వు అంటే, వాస్తవానికి చట్టంలో అలాంటి ప్రొవిజన్ లేదు. కానీ, డీసీసీబీ బైలాలో ఏమీ రాసుకున్నారో కూడా చూడాల్సి ఉంటుంది. సెలవు పెట్టినట్లు చెబుతున్న కాలంలో మిగతా ఏ యాక్టివిటీలోనూ ఉండడానికి వీల్లేదు. అలా కాని పక్షంలో డీసీసీబీని చీట్ చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ముందు బైలాలో ఏమీ రాసుకున్నారో తెలుసుకోవాలి..’ అని రాష్ట్ర సహకార శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి డీసీసీబీ పీఠం నుంచి విజయేందర్‌రెడ్డిని తప్పించేందుకు మరో ప్రయత్నం జరుగుతోంది. -
అమ్మ మాట..
సేతినిండా పని కల్పించాలె నా ఒక్కగానొక్క కొడుకు అజయ్ డిగ్రీ సదువుకుంట, తెలంగాణ కోసం పెట్టే మీటిం గులకు పోయేటోడు. తెలంగాణ అస్తలేదని బాధపడేటోడు. తెలంగాణ రాదని అందరూ చెప్పుకుంటుంటే ఏడ్చేటోడు. తెలంగాణ అస్తే ఉద్యోగమస్తది అనేటోడు. 2010 మే నెల 25న ఇంట్లోనే ఉరేసుకుని చచ్చిపోయిండు. ఇప్పడు తెలంగాణ అచ్చింది నా కొడుకు ఎలాగూ లేడు. కాబట్టి కనీసం సదువుకున్నోళ్లకు అయినా ఉపాధి అవకాశం సూపెట్టాలె. సొంతంగ రాష్ట్రం అచ్చెదాక ఎట్ల కొట్లాడిర్రో, అట్లే ప్రతి ఊరు బాగయ్యేదాక అందరు పాటుపడాలె. తెలంగాణ కోసం చనిపోయిన పిల్లల కుటుంబాలకు ఇంటి కో ఉద్యోగం ఇయ్వాలె. స్వాతంత్య్ర సమరయోధులకు వచ్చే సదుపాయాలు కల్పించాలె. సేతి నిండ పని దొరుకుతనే కడుపు నిండ తిండి దొరుకుతది. ఉపాధి అవకాశాలు పెరుగుతనే అందరు పనిల పడతరు. సేకరణ : విజయేందర్‌రెడ్డి, చొప్పదండి -
విశ్లేషణాత్మక అధ్యయనమే విజయ మంత్రం
ఎన్. విజయేందర్ రెడ్డి జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇతర సెంట్రల్ సర్వీసుల (గ్రూప్ ఏ, గ్రూప్ బీ) కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్- 2014 నోటిఫికేషన్ మే 17న వెలువడనుంది. సివిల్స్ మహాయజ్ఞంలో తొలి అంకమైన ప్రిలిమ్స్ ఆగస్టు 24న జరగనుంది. ఈ తరుణంలో ప్రిలిమ్స్‌లోని పేపర్-1 (జనరల్ స్టడీస్) పరీక్ష విధానం, ప్రశ్నల తీరు తదితరాలపై ఫోకస్.. దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి వాటికి నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రిలిమ్స్ (ఆబ్జెక్టివ్ విధానం), మెయిన్స్ (రాత పరీక్ష), పర్సనాలిటీ టెస్ట్ (మౌఖిక పరీక్ష) దశలుంటాయి. ప్రిలిమ్స్‌లోని పేపర్ 1 (జనరల్ స్టడీస్)లో వంద ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున మొత్తం 200 మార్కులకు ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. 2011 నుంచి జనరల్ స్టడీస్ ప్రశ్నల సరళిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అంతకుముందు ఈ పేపర్లో ఫ్యాక్ట్స్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వచ్చేవి. 2010 పేపర్లో వచ్చిన కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం.. Which of the following is/are treated as artificial currency? a) ADR b) GDR c) SDR d) Both ADR and SDR Ans: c n In India, the interest rate on savings accounts in all the nationalised commercial banks is fixed by? a) Union Ministry of Finance b) Union Finance Commission c) Indian Banks Association d) None of the above 2011 నుంచి జనరల్ స్టడీస్ పేపర్లో స్టేట్మెంట్స్, మ్యాచింగ్, ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు ఉండే జవాబులు, అసెర్షన్-రీజన్ ప్రశ్నల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రశ్నల సరళి ప్రామాణికంగా, క్లిష్టంగా ఉంటోంది. 2013లో వచ్చిన కొన్ని ప్రశ్నలను చూద్దాం.. 1. Which of the following bodies does not/do not find mention in the constitution? 1. National Development Council 2. Planning Commission 3. Zonal Councils n Select the correct answer using the codes given below.. a) 1 and 2 only b) 2 only c) 1 and 3 only d) 1, 2 and 3 Ans: d n Which one of the following pairs is correctly matched? Graphical Feature Region a) Abyssinian Plateau Arabia b) Atlas Mountains North Western Africa c) Guiana Highlands South Western Africa d) Okavango Basin Patagonia Ans: b n Who among the following constitute the National Development Council? 1. The Prime Minister 2. The Chairman, Finance Commission 3. Ministers of Union Cabinet 4. Chief Ministers of the States a. 1, 2 and 3 only b. 1, 3 and 4 only c. 2 and 4 only d. 1, 2, 3 and 4 Ans: b విశ్లేషణాత్మక దృక్పథం అవసరం:వర్తమాన అంశాల నుంచి డెరైక్ట్ ప్రశ్నలు రావడం లేదు. జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, పర్యావరణం తదితర అంశాలను వర్తమాన అంశాలతో జోడించి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ కోణంలో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఉదాహరణకు భారత్ తాజాగా స్వతంత్ర నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సాధన కోసం పీఎస్ఎల్వీ-సీ24 ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ పరిణామానికి సంబంధించి ప్రత్యక్షంగా ప్రశ్నలు రాకున్నా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ఉపయోగా లపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అందువల్ల ఒక సమకాలీన పరిణామంతో సంబంధమున్న అన్ని అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. దినపత్రికల సహకారంతో: వర్తమాన వ్యవహారాలపై పట్టు సాధించేందుకు ఇంగ్లిష్ దినపత్రికలు చదువుతూ ముఖ్యాంశాలను రాసుకోవాలి. 2013, ఆగస్టు నుంచి చోటుచేసుకున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను చదవాలి. అంటే పరీక్షకు ఏడాది ముందు నాటి నుంచి వర్తమాన అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ దినపత్రికలను చదవడం వల్ల పేపర్-2లోని వొకాబులరీ, రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగాలకు కూడా ఉపయోగపడుతుంది. ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. దీనికోసం ఎన్సీఈఆర్టీ ఆరు నుంచి 12వ తరగతి వరకు పుస్తకాలను చదవాలి.ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ సిలబస్‌లోని చాలా అంశాలు, మెయిన్స్ రాత పరీక్షలోనూ ఉన్నాయి కాబట్టి రెండు పరీక్షలనూ దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ సాగించాలి. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను డిస్క్రిప్టివ్ కోణంలో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల సబ్జెక్టులోని అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. ఒక అంశం నుంచి ప్రశ్న ఎలా వచ్చినా, సమాధానం గుర్తించే సామర్థ్యం సొంతమవుతుంది. పర్యావరణం కీలకం: పర్యావరణం నుంచి రెండు కోణాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అవి.. కాన్సెప్చువల్, ఫ్యాక్ట్ ఓరియెంటెడ్. కాన్సెప్చువల్ దృక్పథంలో ఏదైనా నిర్దిష్ట సమస్యకు సంబంధించి అన్ని కోణాలను స్పృశించేలా ప్రశ్నలు అడుగుతుండగా.. ఫ్యాక్ట్ ఓరియెంటెడ్ దృక్పథంలో పర్యావరణ అంశాలకు సంబంధించి ఇటీవల సదస్సులు, సమావేశాలు, నియామకాలు వంటి ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ‘పర్యావరణ కాలుష్యం’ చర్చనీయాంశమైన నేపథ్యంలో దీనిపై మరింత దృష్టి సారించాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలు: రాజకీయ అంశాల్లో దేశంలో ప్రధానంగా చోటు చేసుకున్న రాజకీయ సంఘటనలను పరిశీలించాలి. రాజ్యాంగ సవరణలు, ప్రభుత్వ కొత్త పథకాలు, కమిటీలు, కమిషన్లు, కొత్త పార్టీల ఏర్పాటు, ఎన్నికల్లో వాటి విజయాలు, సాధించిన స్థానాలు వంటి వాటిని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. అంతర్జాతీయ సదస్సులు, ఒప్పందాలు, వివిధ దేశాల్లోని సంక్షోభ పరిస్థితులు వంటి వాటి గురించి చదవాలి. ఆర్థిక అంశాలు: ప్రిలిమ్స్ పేపర్-1 గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ఎకానమీ సంబంధిత అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. సాధారణంగా అభ్యర్థులు ‘ఎకానమీ పరిధిలోనివి’ అని భావించే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటికి సంబంధించిన నేప థ్యం.. అంటే.. సదరు పథకంపై ప్రభుత్వ విధానాలు, ఆ విధాన రూపకల్పనకు కారణాలు, లక్షిత వర్గాలు, ఆ పథకాల ప్రస్తుత అమలు తీరు, విజయాలు, వైఫల్యాలు తదితర అన్ని కోణాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. మొత్తం ప్రశ్నల్లో ఎక్కువగా ఇలాంటి ప్రశ్నలే ఉంటున్నాయి. పాలిటీలో కూడా పలు కోణాల్లో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కోర్ పాలిటీకి ప్రాధాన్య తగ్గి కాంటెంపరరీ అంశాల అనుసంధానంతో అడిగే ప్రశ్నలు పెరుగుతున్నాయి. కాబట్టి తాజా రాజ్యాంగ సవరణలు, కారణాలు, వాటి వల్ల ఆశించే ఫలితాలు, పర్యవసానాలపై పట్టు సాధించి అడుగులు వేయాలి. శాస్త్ర, సాంకేతిక అంశాలు: ఇందులో అంతరిక్షం, రక్షణ, పర్యావరణం, ఆరోగ్యం, ఇంధనం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలకు సంబంధించి చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు గుర్తుంచుకోవాలి. అంతరిక్ష రంగానికి సంబంధించి ఉపగ్రహాలు, వాహక నౌకల ప్రయోగాలు, రక్షణ రంగంలో పరీక్షించిన క్షిపణులు, వాటి పరిధి తదితర అంశాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సూపర్ కంప్యూటర్లు, ఇతర సరికొత్త ఆవిష్కరణలు ఉంటాయి. పర్యావరణానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, వివిధ తుపాన్లకు పెట్టిన పేర్లు, భూకంపాల సమాచారం గుర్తుండాలి. ఇంధనం కూడా మరో ప్రధానమైన అంశం. ఇందులో సంప్రదాయేతర, పునర్వినియోగ ఇంధనాలు, సోలార్ మిషన్ వంటివాటి సమాచారం అవసరం ఉంటుంది. 2013 ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ అంశం పశ్నల సంఖ్య భారత దేశ చరిత్ర, స్వాతంత్రోద్యమం 16 జాగ్రఫీ 20 పాలిటీ 17 ఎకానమీ 18 ఎకాలజీ 7 జనరల్ సైన్స్ 22 రిఫరెన్స్: ఎన్సీఈఆర్టీ పుస్తకాలు (హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్). ఇండియా ఇయర్ బుక్, ఎకనమిక్ సర్వే, బడ్జెట్. యోజన, కురుక్షేత్ర మేగజీన్లు. హిస్టరీ: ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్- బిపిన్‌చంద్ర; మాడర్న్ ఇండియా- బిపిన్‌చంద్ర; హిస్టరీ ఆఫ్ మెడీవల్ ఇండియా- సతీశ్ చంద్ర. జాగ్రఫీ: ఆక్స్ఫర్డ్ అట్లాస్; సర్టిఫికెట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ- గో చెంగ్ లియోంగ్. ఎకానమీ: ఇండియన్ ఎకానమీ- దత్తా అండ్ సుందరమ్; ఇండియన్ ఎకానమీ- మిశ్రా అండ్ పూరి. సైన్స్- సైన్స్ రిపోర్టర్. పాలిటీ- యాన్ ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా- డి.డి.బసు. అవర్ కాన్స్టిట్యూషన్- సుభాష్ కశ్యప్; అవర్ పార్లమెంట్- సుభాష్ కశ్యప్. ముఖ్యమైన తేదీలు: నోటిఫికేషన్ తేదీ: మే 17, 2014. దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 16, 2014. ప్రిలిమ్స్ తేదీ: ఆగస్టు 24, 2014. సివిల్స్ మెయిన్స్: డిసెంబర్ 14, 2014 నుంచి