‘తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ పేరుతో విజయేందర్ రెడ్డి అధ్యక్షతన ఇప్పటికే ఓ సంఘం సినీ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు తెలంగాణలో మరో చాంబర్ అవతరించింది. దీని పేరు - ‘తెలంగాణ మూవీ చాంబర్ ఆఫ్ కామర్స్’. తెలంగాణ సినిమాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త సంస్థను ఏర్పాటు చేసినట్లు ప్రధాన కార్యదర్శి సానా యాదిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి ‘దిల్’ రాజు అధ్యక్షునిగా, విజయేందర్ రెడ్డి ఉపాధ్యక్షునిగా, జాయింట్ సెక్రటరీగా సంగ కుమారస్వామి, కోశాధికారిగా బాల గోవిందరాజులు వ్యవహరిస్తారనీ, అల్లాణి శ్రీధర్, సంగిశెట్టి దశరథ, సత్యనారాయణ గౌడ్‌లు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా, గౌరవ సలహాదారుగా బి. నరసింగరావు వ్యవహరిస్తారనీ తెలిపారు.
ఇప్పటికే ‘తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ ఉండగా, మరో సంఘాన్ని ఆరంభించడానికి కారణం ఏంటి? ‘‘ఇప్పటికే ఉన్న సంఘంలో పంపిణీదారులు, థియేటర్ అధినేతలు ఎక్కువ శాతం మంది ఉన్నారు. అందుకే, నిర్మాతల కోసం ఈ తాజా సంఘాన్ని ఆరంభించాం. అయితే నిర్మాతలకు మాత్రమే పరిమితం కాదల్చుకోలేదు. దర్శకులు, పంపిణీదారులు, థియేటర్ అధినేతలను కూడా చేర్చుకుంటాం’’ అని ప్రధాన కార్యదర్శి సానా యాదిరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. చిన్న నిర్మాతల సమస్యలకు పరిష్కారం కోరుతూ, తెలంగాణ కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం సహకారం కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నామన్నారు.
తెలంగాణలో మరో చాంబర్
Published Tue, Mar 17 2015 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM
Advertisement
Advertisement