కరోనా కష్టాలు మామ.. సినిమా చూపలేము మామా! | Corona second wave effect on Tollywood | Sakshi
Sakshi News home page

కరోనా కష్టాలు మామ.. సినిమా చూపలేము మామా!

Published Wed, Apr 21 2021 2:50 AM | Last Updated on Wed, Apr 21 2021 5:02 AM

Corona second wave effect on Tollywood - Sakshi

అనుకున్నంతా అయింది. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ ప్రభావం... ఇప్పుడు వరుసగా ఒక్కో రంగం మీద పడుతోంది.  ఈ కరోనా కష్టకాలంలో... కాస్తంతయినా వినోదం పంచడానికి సిద్ధమైన సినిమా థియేటర్లు మూసివేత బాట పట్టాయి. మహారాష్ట్ర, ఢిల్లీల్లో హాళ్ళు, షూటింగులు ఆగిపోయాయి. దక్షిణాది సినీసీమలోనూ హాళ్ళు స్వచ్ఛందంగా మూతబడుతున్నాయి.  నైట్‌ కర్ఫ్యూ, 50 శాతం సీటింగ్‌ కెపాసిటీ లాంటి వాటితో  తెలుగు నేలపై రెండు రాష్ట్రాల్లోనూ సినీ వినోదానికి గడ్డుకాలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ తమ థియేటర్లలో ప్రదర్శనల్ని ఆపేసింది. తెలంగాణలో హాళ్ళను స్వచ్ఛందంగా మూసేయాలని ఓనర్లు నిర్ణయించారు.

దేశమంతటా సినీరంగానికి ఇవి గడ్డు రోజులు. తెలుగే కాదు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ కొత్త రిలీజులకు నిర్మాతలు భయపడుతున్నారు. కలెక్షన్ల కన్నా కరెంట్, శానిటైజేషన్‌ ఖర్చే ఎక్కువవుతోంది. కరోనా ఇలాగే కొనసాగితే, పెద్ద సినిమాలు కనీసం 3 –4 నెలలు వాయిదా పడే ప్రమాదం ఉంది. వెంకటేశ్‌ ‘దృశ్యం–2’ సహా పలు భాషాచిత్రాలు ఓటీటీ వైపు వెళుతున్నాయి.
– కాట్రగడ్డ ప్రసాద్, సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు  

సినిమా ప్రదర్శనలకు కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బ పడింది. రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న సీటింగ్‌ కెపాసిటీ, కర్ఫ్యూలాంటి చర్యలు సహజంగానే థియేటర్లలో సినిమా ప్రదర్శనలకూ వర్తిస్తున్నాయి. దాంతో, ఇప్పుడు వెండితెరపై వినోదం దేశమంతటితో పాటు తెలుగునాట కూడా తగ్గిపోనుంది. మంగళవారం నుంచి తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో, మునుపటిలా రోజుకు నాలుగు షోలూ ప్రదర్శించే వీలు లేకుండా పోయింది. దాంతో, ఈవారం రావాల్సిన ‘ఇష్క్‌’, ‘తెలంగాణ దేవుడు’ సహా ఆరేడు సినిమాల రిలీజులు వాయిదా పడ్డాయి. హాలులో ఉన్న సినిమాలకేమో ప్రేక్షకులు లేరు. దాంతో, తెలంగాణ థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా హాళ్ళు మూసేయాలని నిర్ణయించుకున్నారు.  

ఊపిరి పీల్చుకొనే లోగానే...
కొత్త సినిమాలతో కళకళలాడుతూ నిండా నాలుగు నెలలైనా గడవక ముందే దురదృష్టవశాత్తూ సినిమా హాళ్ళకు క్రమంగా తాళాలు పడుతున్నాయి. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా హాళ్ళను ఆదుకొనేందుకు ఇటీవల పలు రాయితీలు ఇచ్చింది. గత ఏడాది హాళ్ళు మూతబడ్డ కరోనా కాలంలోని మూడు నెలలకు విద్యుత్‌ ఛార్జీలు రద్దు చేసింది. మల్టీప్లెక్సులతో సహా థియేటర్లకు మరో ఆరు నెలల పాటు విద్యుత్‌ ఛార్జీలను వాయిదా వేసింది. సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి కట్టాల్సిన వడ్డీలో 5 నుంచి 10 లక్షల దాకా వడ్డీ ఉపసంహరణ ఇస్తున్నట్టు ఏ.పి. సర్కారు ఉదారంగా ఉత్తర్వులిచ్చింది. ఇంకా కొన్ని సమస్యలున్నా, ఈ రాయితీలతో ఎగ్జిబిషన్‌ సెక్టార్‌ కొంత ఊపిరి పీల్చుకుంది. ఇంతలోనే ఉరుము మీద పిడుగులా కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చి పడింది. 

ఆంధ్రప్రదేశ్‌లో సీటు విడిచి సీటు!
పెద్ద సినిమాలు పోస్ట్‌పోన్‌ బాట పట్టాయి. జనం హాళ్ళకు వచ్చే పరిస్థితులు కనబడడం లేదు. సూపర్‌ హిట్‌ అని చెప్పుకుంటున్న సినిమాలకు సైతం వారం తిరిగే సరికల్లా ప్రేక్షకుల కోసం ఎదురుచూడాల్సిన దుఃస్థితి దాపురించింది. ఇదే అదనుగా ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, తెనాలి, మంగళగిరి, కాకినాడ, విజయవాడ లాంటి పలు ప్రాంతాల్లో ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ తమ చేతిలో ఉన్న థియేటర్లను ఇప్పటికే మూసివేసింది. కాగా, థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీగా ఉంచాలని  సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం సీటింగ్‌ కెపాసిటీకే అనుమతి ఉన్నట్టు లెక్క. 

తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూ ఎఫెక్ట్‌!
ఇది ఇలా ఉండగా, సోమవారమే తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జన సంచారంపైన, సినిమా హాళ్ళు, బార్లు, పబ్‌లపైన నియంత్రణ ఏదని ప్రశ్నించింది. దాంతో, తక్షణమే రాత్రి కర్ఫ్యూ పెడుతున్నట్టు తెలంగాణ సర్కారు మంగళవారం మధ్యాహ్నానికల్లా ప్రకటన చేసేసింది. ప్రస్తుతానికి ఈ నెలాఖరు దాకా ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. తెలంగాణలోని సినిమా హాళ్ళలో ప్రస్తుతానికి ఫుల్‌ కెపాసిటీ అనుమతి ఉన్నా, రాత్రి 8 గంటల కల్లా సినిమా హాళ్ళు మూసేయాలనడం ఇబ్బంది అయింది. 

ఆడియన్స్ను ఆకర్షించే పెద్ద సినిమాలేవీ రిలీజయ్యే పరిస్థితులు లేకపోవడంతో, థియేటర్లను మూసివేయాలని తాజాగా తెలంగాణ సినిమా థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కూడా నిర్ణయించింది. మంగళవారం జరిగిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల జూమ్‌ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. దీంతో, బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు, స్థానిక మల్టీప్లెక్సులు మూతపడనున్నాయి. జాతీయ స్థాయి బ్రాండ్లయిన పి.వి.ఆర్, ఐనాక్స్‌ల నిర్ణయం ఏమిటన్నది వేచి చూడాలి. 

రెండు వారాలుగా థియేటర్ల కలెక్షన్స్‌ బాగా తగ్గాయి. చిన్నచితకా సినిమాలను చూసే నాథుడే లేడు. ప్రముఖ తెలంగాణ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌ దిల్‌ రాజు నిర్మించిన పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’ ఒక్కటే ఇప్పుడు థియేటర్లలో ఉన్న పెద్ద సినిమా. దాంతో, ఆ సినిమా నడుస్తున్న థియేటర్లను మాత్రం మూయకుండా నడుపుతామని తెలంగాణ ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.

అటు బాలీవుడ్‌లో... ఇటు కోలీవుడ్‌లో....
నిజానికి, కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశమంతటా ఇప్పటికే సినిమా పరిశ్రమ ఇరుకున పడింది. ఉత్తరాదిన మహారాష్ట్ర, ఢిల్లీలాంటి చోట్ల లాక్‌డౌన్‌తో ఇప్పటికే షూటింగులు, సినిమా ప్రదర్శనలు బంద్‌ అయిపోయాయి. అలా అక్కడి హిందీ, మరాఠీ సినీ – టీవీ పరిశ్రమ దాదాపు స్తంభించిపోయింది. మంగళవారం రాత్రి సమయానికి మహారాష్ట్రలో పూర్తి లాక్‌ డౌన్‌ విధిస్తారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్‌ కొన్నాళ్ళు పూర్తిగా బంద్‌ అయ్యేలా ఉంది. ఇక, దక్షిణాదిన తమిళనాట కూడా ఏప్రిల్‌ 20వ తేదీ మంగళవారం నుంచి నెలాఖరు దాకా రాత్రి కర్ఫ్యూ పెట్టారు. అలాగే, ప్రతి ఆదివారం పూర్తి లాక్‌ డౌన్‌ ఉంటుందని కూడా తమిళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. 50 శాతం సీటింగ్‌ కెపాసిటీ, నైట్‌ కర్ఫ్యూ, ఆదివారం లాక్‌ డౌన్‌లతో తమిళ సినిమాల ప్రదర్శన ఇక్కట్లలో పడింది. ఏప్రిల్‌ 9న సగం సీటింగ్‌ కెపాసిటీలోనే రిలీజైన ధనుష్‌ ‘కర్ణన్‌’ మినహా అక్కడ కూడా ఇప్పటికిప్పుడు పెద్ద రిలీజులేమీ లేవు. దాంతో, కాస్తంత అటూ ఇటూగా తమిళనాడులోనూ సినిమా హాళ్ళు కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బతో కొన్నాళ్ళు మూతపడతాయని కోడంబాక్కమ్‌ వర్గాల కథనం.

తెలంగాణలో వసూళ్ళు 70 శాతం పడిపోయాయి. పెద్ద హీరో సినిమాకు సైతం టాక్‌కు తగ్గ కలెక్షన్లు ఉండడం లేదు. పెద్ద సినిమాలతో పాటు, రేపు 23న రావాల్సిన సినిమాలూ వాయిదా పడ్డాయి. రిలీజులూ లేక, జనమూ రాక నష్టాలతో హాళ్ళు ఎలా నడుపుతాం? కొత్త రిలీజులతో నిర్మా తలు సిద్ధమంటే హాళ్ళు వెంటనే తెరుస్తాం.
– ఎం. విజయేందర్‌ రెడ్డి, తెలంగాణ థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి

యాభైమందితోనే షూటింగ్‌!
కరోనా విజృంభిస్తున్న తరుణంలో తెలుగు ఫిలిమ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ‘‘కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. అత్యవసరం అనుకుంటే 50 మంది యూనిట్‌తోనే షూటింగ్స్‌ చేసుకోవాలి’’ అని ఆ సంస్థలు పేర్కొన్నాయి.

వాయిదా పడ్డాయి!
తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోహీరోయిన్లుగా యస్‌.యస్‌.రాజు దర్శకత్వంలో రూపొందిన ‘ఇష్క్‌’ చిత్రం ఈనెల 23న రిలీజ్‌ కావాల్సి ఉండగా వాయిదా వేశారు. ‘‘ఏపీలో 50శాతానికి  థియేటర్ల సామర్థ్యాన్ని తగ్గించడం, తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ విధించడం జరిగింది. ఇలాంటి టైమ్‌లో సినిమా రిలీజ్‌ చేయడం కరెక్ట్‌ కాదని వాయిదా వేస్తున్నాం’’ అన్నారు చిత్రనిర్మాతలు. 

హీరో శ్రీకాంత్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘తెలంగాణ దేవుడు’ చిత్రం కూడా ఈ నెల 23న విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు ఇదీ వాయిదా పడింది. మాక్స్‌ల్యాబ్‌ సిఈఓ మొహమ్మద్‌ ఇంతెహాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ – ‘‘పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, ప్రజల శ్రేయస్సును కోరుతూ మా సినిమా విడుదల వాయిదా వేశాం’’ అన్నారు. 

కేరళలోనూ స్వచ్ఛందంగా క్లోజ్‌!
దేశంలో కరోనా కేసులు అత్యధికంగా వస్తున్న రాష్ట్రాల్లో ఒకటైన కేరళలోనూ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. రాత్రి వేళ సినిమా ప్రదర్శనల్ని రద్దు చేస్తూ, రోజుకు 3 ఆటలనే అనుమతిస్తూ, గత వారం కేరళ సర్కార్‌ ఉత్తర్వులిచ్చింది. తాజాగా అక్కడ కూడా ఏప్రిల్‌ 20 నుంచి రాత్రివేళ కర్ఫ్యూ పెడుతున్నట్టు ప్రకటించింది.  మధ్యాహ్నం 12కు తెరిచి సాయంత్రం 7.30 గంటలకు హాళ్లు మూసెయ్యాలంటే, రోజుకు రెండు షోలే వేయగలరు.  ‘ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ యునైటెడ్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కేరళ’ సభ్యులందరూ మంగళవారం నాడు ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు నడపాలా, లేదా అనేది ఆయా థియేటర్ల ఓనర్లు ఎవరికి వారు స్వచ్ఛందంగా నిర్ణయించుకోవచ్చని తీర్మానించారు. కలెక్షన్లు బాగా తగ్గడంతో ఇప్పుడు కేరళలోనూ సినిమా థియేటర్లు నూటికి 80 స్వచ్ఛందంగా మూతబడుతున్నాయి. మే నెలలో రావాల్సిన తాజా జాతీయ ఉత్తమ చిత్రం మోహన్‌ లాల్‌ ‘మరక్కర్‌’, మహేశ్‌ నారాయణన్‌ రూపొందించిన ‘మాలిక్‌’ లాంటి పెద్ద సినిమాలు వాయిదా పడనున్నాయి. 


కర్ణాటకలోనూ... ఈ 23 నుంచి?
కరోనా హాట్‌స్పాట్‌ కర్ణాటకలోనూ ఇప్పటికే సినిమా హాళ్ళు కష్టాల్లో ఉన్నాయి. ఏప్రిల్‌ 7 నుంచి అక్కడ హాళ్ళు 50 శాతం సీటింగ్‌ కెపాసిటీతోనే ముక్కుతూ మూలుగుతున్నాయి. ఏప్రిల్‌ మొదట్లోనే ఆ రూల్‌ పెట్టారు. కానీ, పునీత్‌ రాజ్‌ కుమార్‌ నటించిన ‘యువరత్న’ రిలీజైన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వారం రోజులు ఆ రూల్‌కు మినహాయింపు ఇచ్చింది. ఆ వెంటనే యువరత్న సైతం ఓటీటీ బాట పట్టేసింది. ఆ తరువాత వచ్చిన ‘కృష్ణా టాకీస్‌’ సైతం థియేటర్ల నుంచి తప్పుకుంది. దాంతో, కొత్త సినిమా రిలీజులేమీ లేక, జనమూ థియేటర్లకు రాక మైసూరులో హాలు ఓనర్లు తాము స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా థియేటర్లు సైతం ఏప్రిల్‌ 23 నుంచి మూతబడనున్నాయి. ‘‘పెద్ద సినిమాలేమీ ఈ 50 శాతం కెపాసిటీలో రిలీజు కావాలనుకోవడం లేదు. అలాంటప్పుడు ప్రాక్టికల్‌గా ఇంతకుమించి ఏం చేయగలం’’ అని కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఏదిఏమైనా ఫిల్మ్‌ ఎగ్జిబిషన్‌ సెక్టార్‌ మరోసారి బాగా దెబ్బతినబోతోంది. చైనాలో 60 వేలు, అమెరికాలో 42 వేల స్క్రీన్లుంటే, ఏటా దాదాపు 1300 నుంచి 1500 సినిమాలు నిర్మించే మన దగ్గర దాదాపు 8 వేల స్క్రీన్లే మిగిలాయి. జనాభా పరంగా ప్రపంచంలో రెండో స్థానంలో మన దేశంలో ప్రతి పది లక్షల మందికి తొమ్మిది స్క్రీన్లే ఉన్నాయి. ఇక ఆంధ్రా, తెలంగాణ కలిపితే 1600 చిల్లర స్క్రీన్లే ఉన్నాయి. వీటన్నిటికీ ఇది గడ్డుకాలమే. సంక్రాంతి నుంచి మూడు నెలల పాటు కళకళ లాడి, ‘సినిమా చూపిస్త మామా’ అంటూ ఉత్సాహపడిన థియేటర్లు, ఇప్పుడు ‘సినిమా చూపించలేము మామా’ అనడం సగటు సినీ్రపియులకు విషాదమే!
– రెంటాల జయదేవ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement