Rentala Jayadev
-
గోల్డెన్ మెమొరీస్-‘రౌడీ అల్లుడు’ @30 ఇయర్స్
ఒకే హీరో... రెండు పాత్రలు... మనిషిని పోలిన మనుషులు ఇద్దరు... ఒకడు సాధుస్వభావి, వేరొకడు తాడోపేడో తేల్చుకొనే ఉడుకు, దుడుకు జీవి. ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్ళడం... సమస్యలను చక్కబెట్టడం... వెండితెరపై ఎవర్గ్రీన్ ఫార్ములా ఇది. సరిగ్గా 140 ఏళ్ళ క్రితం 1881లో వచ్చిన మార్క్‌ట్వైన్ రచన ‘ప్రిన్స్ అండ్ పాపర్’ నాటి నుంచి అరిగిపోని, తరిగిపోని వాణిజ్య సూత్రం. వెండితెరపై ఎప్పుడో ఎన్టీఆర్ ‘రాముడు-భీముడు’ నుంచి ఇవాళ్టి దాకా స్టార్ హీరోలకు సూపర్‌హిట్ కథామంత్రం. హీరో చిరంజీవి కెరీర్లో అలాంటి బంపర్ హిట్ అందించిన ద్విపాత్రాభినయ చిత్రాల్లో ప్రత్యేకమైనది – ‘రౌడీ అల్లుడు’. 1991 అక్టోబర్ 18న విడుదలైన ఈ చిత్రానికి ఇప్పుడు 30 వసంతాలు. కొత్త బ్యానర్... సరికొత్త హీరోయిన్... అది 1991 జూన్ ప్రాంతం. సరిగ్గా అప్పుడే హీరో చిరంజీవికి ‘గ్యాంగ్ లీడర్’ లాంటి కెరీర్ బెస్ట్ బాక్సాఫీస్ హిట్ వచ్చింది. యాక్షన్ నిండిన ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా తరువాత ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచన. ఈసారి పూర్తి ఎంటర్టైనర్ తీస్తే? అదీ – తెరపై ఒకరికి ఇద్దరు చిరంజీవుల్ని చూపిస్తే? అంతకు ముందు ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’తో వసూళ్ళ వర్షం కురిపించిన చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్‌ను రిపీట్ చేస్తే? ఇలాంటి ఆలోచనల ఫలితమే – ‘రౌడీ అల్లుడు’ చిత్రం. ‘గ్యాంగ్ లీడర్’ బంపర్ హిట్ తర్వాత చిరంజీవి తన వాళ్ళ కోసం చేసిన సినిమా ఇది. అల్లు అరవింద్ సమర్పణలో, చిరంజీవి తోడల్లుడు డాక్టర్ కె. వెంకటేశ్వరరావు, బావ గారు పంజా ప్రసాద్ (హీరో సాయిధరమ్ తేజ్ తండ్రి) నిర్మాతలుగా శ్రీసాయిరామ్ ఆర్ట్స్ పతాకంపై ‘రౌడీ అల్లుడు’ రూపొందింది. సినిమా నిర్మాణ వ్యవహారాలన్నీ అల్లు అరవిందే చూసుకున్నారు. ఆ బ్యానర్‌పై వచ్చిన ఏకైక సినిమా ఇది. ఇక, చిరంజీవి, దివ్యభారతి కాంబినేషన్లో వచ్చిన ఏకైక సినిమా కూడా ఇదే. నార్త్ నుంచి వచ్చి తెలుగు సినిమాలు చేస్తున్న హీరోయిన్ దివ్యభారతికి అప్పట్లో మంచి క్రేజుంది. వెంకటేశ్ ‘బొబ్బిలి రాజా’, మోహన్‌బాబు ‘అసెంబ్లీ రౌడీ’ లాంటి హిట్స్‌తో ఆమె జోరు మీదున్నారు. ‘రౌడీ ఇన్స్పెక్టర్’లో హీరోకు గాయం కావడంతో, షూటింగ్ ఆలస్యమై అప్పటికింకా రిలీజు కాని బాలకృష్ణ ‘ధర్మక్షేత్రం’లోనూ ఆమే హీరోయిన్. బాక్సాఫీస్ లెక్కలతో చిరంజీవి సరసన ఆమెను బుక్ చేశారు. రెండో హీరోయిన్గా శోభనను తీసుకున్నారు. ఆ మేనరిజమ్‌తో... బాక్సాఫీస్ బద్దలు కోట్లకు పడగెత్తిన మేనల్లుడు కల్యాణ్ (చిరంజీవి) స్థానంలో అదే పోలికలున్న ఆటో జానీ (రెండో చిరంజీవి)ని పెట్టి, మోసం చేయాలనుకుంటాడో దుష్ట మేనమామ (కోట శ్రీనివాసరావు). మొదట వారి పాచిక పారినా, ఆనక హీరో ‘నీచ్ కమీన్ కుత్తే’ దుష్టత్రయం పనిపట్టడం కామెడీ ఆఫ్ ఎర్రర్స్ నిండిన ఈ చిత్రకథ. కోటీశ్వరుడైన బిజినెస్ మ్యాగ్నెట్ కల్యాణ్‌గా, అమలాపురం నుంచి బొంబాయి వెళ్ళి స్థిరపడ్డ ఆటో జానీగా – రెండు పరస్పర విరుద్ధమైన పాత్రలను హీరో చిరంజీవి సమర్థంగా పోషించారు. ఒకదానికొకటి సంబంధం లేని బాడీ లాంగ్వేజ్‌తో, భాషతో, యాసతో వినోదం పంచారు. ముఖ్యంగా, ఆటో డ్రైవర్ జానీ పాత్రలో ప్రత్యేకంగా కనిపించడం కోసం డైలాగ్ డెలివరీ మొదలు మేనరిజమ్స్ దాకా అన్ని విషయాల్లో వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. ‘గ్యాంగ్ లీడర్’లో ‘రప్ఫాడిస్తా’ అన్న చిరంజీవి, ‘రౌడీ అల్లుడు’లో ‘బాక్స్ బద్దలైపోతుంది’ అనే ఊతపదంతో ఆకట్టుకున్నారు. ఆ వెంటనే ‘ఘరానా మొగుడు’లో ‘ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో’ అంటూ జనం నోట నిలిచిపోయారు. వరుసగా ఈ మూడు మేనరిజమ్లూ జనజీవితంలో భాగమైపోయాయి. మూడు సినిమాలూ సూపర్‌హిట్టే. చిరంజీవి కెరీర్లో ఈ 3 చిత్రాల హ్యాట్రిక్ హిట్ సీజన్ ఓ మరపురాని ఘట్టం. రెండు ఫార్ములాలు... మూడు సినిమాలు... చిరంజీవితో డ్యుయల్ రోల్ కథ చేయాలనే దర్శకుడి ఆలోచనకు రచయిత సత్యానంద్ అల్లిన కథ, చేసిన మాటల మాయాజాలం – ఈ బాక్సాఫీస్ హిట్. ఈ చిత్ర రచనలో సత్యానంద్ అనుభవం, దర్శక – నిర్మాతల అభిరుచి ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఒక విధంగా ఈ చిత్రకథ అంతకు ముందు సంవత్సరాల్లో చిరంజీవికి ఘనవిజయాలు అందించిన అనేక ఫార్ములాల మిక్స ్చర్ పొట్లం. ‘దొంగమొగుడు’ (1987)లోని ద్విపాత్రల ధోరణికి అందమైన కొనసాగింపు. హీరో డ్యుయల్ రోల్ ఫార్ములా, మామను ఆటపట్టించే ‘యముడికి మొగుడు’ (1988), అత్తను టీజ్ చేసే ‘అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు’ (1989) మూడింటి సమ్మేళనం – ఈ ‘రౌడీ అల్లుడు’. డబుల్ రోల్, టీజింగ్ ఫార్ములాలు రెంటినీ కలపడంతో బాక్సాఫీస్ వినోదానికి కొదవ లేకుండా పోయింది. మారిన ఆ టైటిల్స్ కథ! విలన్ పాత్రధారుల్లో ఒకరైన అల్లు రామలింగయ్యకు ‘బొంబాయిలో ఇంతే... బొంబాయిలో ఇంతే’ లాంటి మేనరిజమ్స్ పెట్టడం, ఆటో జానీ పాత్ర డైలాగుల్లో మాస్ వినోదపు మసాలా దట్టించడం సామాన్య జనానికి బాగా పట్టాయి. ఒక దశలో ఈ సినిమాకు ‘ఆటో జానీ’, ‘ఫిఫ్టీ – ఫిఫ్టీ’ అనే రెండు టైటిల్స్ కూడా అనుకున్నారు. కానీ, చివరకు మామను ఆటపట్టించే వినోదాత్మక కథాంశానికి తగ్గట్టుగా ‘రౌడీ అల్లుడు’ టైటిల్ ఖరారు చేశారు. అప్పట్లో చిరంజీవి, నగ్మాల ‘ఘరానా మొగుడు’కు కూడా మొదట అనుకున్న టైటిల్ అది కాదు. ‘లీడర్ రాజు’ అని పెడదామనుకున్నారు. కానీ, చివరకు ‘ఘరానా మొగుడు’కు ఫిక్సయ్యారు. ‘రౌడీ అల్లుడు’ కన్నా ముందు చిరంజీవి రెగ్యులర్ నిర్మాత దేవీవరప్రసాద్ ఆయనతో సినిమాకు వెయిటింగ్లో ఉన్నారు. దాంతో, ‘రౌడీ అల్లుడు’ రిలీజు కన్నా ముందే అప్పటికే నిరీక్షిస్తున్న దేవీవర ప్రసాద్‌తో చిరంజీవి – రాఘవేంద్రరావుల తదుపరి బిగ్ హిట్ ‘ఘరానా మొగుడు’ సెట్ మీదకొచ్చేసింది. రజనీకాంత్ ‘మన్నన్’ తెరకెక్కుతున్నప్పుడే, కాస్తంత ఆలస్యంగానైనా అదే కథతో దానికి సమాంతరంగా ‘ఘరానా మొగుడు’ మొదలైంది. మరోపక్క రాఘవేంద్రరావు ‘అల్లరి మొగుడు’ కూడా సెట్స్‌పై ఉండడం విశేషం. ఏకకాలంలో సెట్స్‌పై ఉన్న ఈ సినిమాలన్నీ అప్పట్లో బాక్సాఫీస్ సంచలనాలు కావడం విచిత్రం. 12 రోజులు... రోజుకు 12 గంటలు... స్విట్జర్లాండ్‌లో షూటింగ్ జరుపుకొన్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. కేవలం పాతిక మంది లోపు యూనిట్‌తో, దాదాపు 12 రోజులు, రోజుకు 12 గంటల చొప్పున షూటింగ్ చేసి, మూడు పాటలు చిత్రీకరించారు. ఎవరి సామాన్లు వారు మోసుకుంటూ, షూటింగ్ సామగ్రి కూడా తలా ఓ చెయ్యి వేసి, ఓ కుటుంబంలా షూటింగ్ చేశారు. ఇక, ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిన సరుకులతో హీరో చిరంజీవి సతీమణి సురేఖ పర్యవేక్షణలో అక్కడ తెలుగు వంటలు వండి, వడ్డించుకోవడం మరో విశేషం. బప్పీలహరి మ్యూజికల్ మేజిక్! 1991 జూన్‌లో మొదలుపెట్టి నాలుగే నాలుగు నెలల్లో సినిమాను పూర్తి చేసి, అక్టోబర్‌కు ఈ చిత్రాన్ని హడావిడిగా రిలీజ్ చేసేయడం విశేషం. సినిమా రిలీజుకు ముందే ‘రౌడీ అల్లుడు’కు బప్పీలహరి బాణీలు జనంలోకి వెళ్ళిపోయాయి. సినిమా రిలీజయ్యాక, చిరంజీవి స్టెప్పులు, మాస్ మెచ్చే చిత్రీకరణలు తోడై, రిపీట్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించాయి. తెలుగులో దర్శకుడు రాఘవేంద్రరావు, బప్పీలహరి తొలి కాంబినేషన్ ఇదే. చిరు – బప్పీలహరి ‘గ్యాంగ్‌లీడర్’ సహా వరుస జనాకర్షక గీతాలతో రచయిత భువనచంద్ర దూసుకుపోతున్న సమయం అది. ‘రౌడీ అల్లుడు’లో డిస్కోశాంతిపై వచ్చే స్పెషల్ సాంగ్ ‘అమలాపురం బుల్లోడా...’, చిరంజీవి – దివ్యభారతిపై వచ్చే ‘ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కనపెట్టు..’, ‘లవ్ మీ మై హీరో..’ పాటలు ఆయన భువన మోహన రచనలే. శోభనపై వచ్చే ‘చిలుకా క్షేమమా...’, దివ్యభారతితో తొలి రేయి పాటగా తీసిన ‘కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో...’ పాటల్ని భావుకతతో పండించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. అలాగే ‘తద్ధినకా తప్పదికా...’ పాటలో అక్షరప్రాసతో అలరించారు. గమ్మత్తేమిటంటే, అటు ఆ మాస్ మసాలా పాటలు, ఇటు ఈ లలిత శృంగార యుగళ గీతాలూ కూడా సమాన స్థాయిలో పాపులరవడం. ఈ 6 పాటలే కాకుండా, చిరు – దివ్యభారతిపై ‘స్లోలీ స్లోలీ...’ అనే భువనచంద్ర రచన కూడా షూట్ చేశారు. సినిమా నిడివి ఎక్కువవుతోందని, చివరకు ఆ పాటను తొలగించారు. అలా ఆ పాట కేవలం ఆడియో క్యాసెట్లకే పరిమితమైపోయింది. తమిళ హీరోకు తెలుగు బాణీ! ఇంటింటా టేప్ రికార్డర్లు పెరిగి, సినీగీతాలు ఊరూవాడా మోగడం ఎక్కువైన కొత్త రోజులవి. అందుకు తగ్గట్టే, ‘రౌడీ అల్లుడు’ పాటల క్యాసెట్లను 6 వేర్వేరు రకాల అందమైన ఇన్లే కవర్లతో, ఒకేసారి అన్నికేంద్రాల్లో కలిపి దాదాపు 2 లక్షలు విడుదల చేశారు. లహరి ఆడియో చేసిన వినూత్న ప్రయోగం వార్తావిశేషమైంది. ‘రౌడీ అల్లుడు’లోని ‘అమలాపురం బుల్లోడా...’ పాట ఎంత పాపులర్ అయిందంటే, ఆ బాణీని తరువాతి రోజుల్లో ఓ తమిళ చిత్రంలో సినిమాలో వాడారు. నేటి అగ్ర తమిళ హీరో విజయ్ వర్ధమాన దశలో ఉండగా ‘రసికన్’ (తెలుగులో ‘యమ లవ్’గా అనువాదమైంది) చిత్రంలో ఆ బాణీ మరోసారి ప్రేక్షకులను పలకరించింది. చిరు వినోదానికి వసూళ్ళ వర్షం ఒక రకంగా దర్శకుడు రాఘవేంద్రరావు కెరీర్లోనూ అదో గోల్డెన్ పీరియడ్. అప్పట్లో ఆయనకు ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’, మోహన్‌బాబు ‘అల్లుడు గారు’, వెంకటేశ్ ‘కూలీ నంబర్1’ తర్వాత వరుసగా నాలుగో హిట్ ‘రౌడీ అల్లుడు’. దసరా పండుగ కానుకగా 1991 అక్టోబర్ 18న ‘రౌడీ అల్లుడు’ రిలీజైంది. ‘గ్యాంగ్ లీడర్’ క్రేజు తర్వాత రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. ‘రౌడీ అల్లుడు’ తొలి మూడు వారాల్లోనే రూ. 1.85 కోట్లకు పైగా, మొత్తం వంద రోజుల్లో రూ. 3.25 కోట్ల పైగా నికర వసూళ్ళు రాబట్టుకోవడం విశేషం. ఆ వివరాలను చిత్ర యూనిట్ స్వయంగా పత్రికాముఖంగా భారీయెత్తున ప్రకటించింది. పాటలు, మాటల వినోదం పంచి, విశేష ప్రేక్షకాదరణతో 51 థియేటర్లలో నేరుగా, మరో 5 థియేటర్లలో నూన్‌షోలతో మొత్తం 56 చోట్ల 50 రోజుల పోస్టర్ వేసుకుంది. ఆ పైన డైరెక్టుగా 21 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. తెలుగునాట ఘన విజయం సాధించిన ‘రౌడీ అల్లుడు’ శతదినోత్సవం 1992 జనవరి 26, ఆదివారం నాడు నెల్లూరులో సినీ, వ్యాపార, రాజకీయవేత్త మాగుంట సుబ్బరామిరెడ్డికి చెందిన అర్చన థియేటర్లో జరిగింది. జంధ్యాల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. బప్పీలహరి, దివ్యభారతి లాంటి యూనిట్ సభ్యులతో పాటు సీనియర్ దర్శకులు కె.విశ్వనాథ్, దాసరి సహా సినీ ప్రముఖులందరూ మద్రాసు నుంచి ప్రత్యేకంగా ఆ ఉత్సవానికి హాజరయ్యారు. హైదరాబాద్ సుదర్శన్ 70 ఎం.ఎం.లో ఈ సినిమా రిలీజు కోసం చిరంజీవిదే ‘గ్యాంగ్ లీడర్’ను 23 వారాలకే తీసేయాల్సి వచ్చింది. అలా ‘రౌడీ అల్లుడు’ వల్ల ‘గ్యాంగ్‌లీడర్’కు ఆ హాలులో 25 వారాల సిల్వర్ జూబ్లీ మిస్సవడం గమనార్హం. వినోదం పంచే ఆటో జానీ లాంటి పాత్రలకు తాను పెట్టింది పేరని ఆ తరువాత వరుసగా అనేక చిత్రాల్లో చిరంజీవి నిరూపించుకోవడం మరో చరిత్ర. – రెంటాల జయదేవ -
Telugu Movie: 50 ఏళ్ల ‘ప్రేమనగర్’
కొన్ని కథలు భాషల హద్దులు చెరిపేసి, వెళ్ళిన ప్రతిచోటా బాక్సాఫీస్ చరిత్ర సృష్టిస్తాయి. అవి ప్రేమకథలైనప్పుడు, సంగీతం, సాహిత్యం, అభినయం, అలుపెరుగని నిర్మాణం లాంటివి తోడైనప్పుడు తరాలు మారినా చిరస్మరణీయం అవుతాయి. అలాంటి ఓ అజరామర ప్రేమకథ – తెలుగు, తమిళ, హిందీ మూడింటిలో హిట్ రూపం – ‘ప్రేమనగర్’. ఒకదశలో ‘ద్రోహి’ (1970) లాంటి ఫ్లాప్ తర్వాత, రూ. 12 లక్షల నష్టంతో, మరొక్క దెబ్బతింటే సినిమాలొదిలి, సేద్యంలోకి వెళ్ళిపోవాలనుకున్న నిర్మాత డి. రామానాయుడునీ, ఆయన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థనూ ఇన్నేళ్ళు సుస్థిరంగా నిలిపిన చిత్రం అది. కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వం, అక్కినేని – వాణిశ్రీ అపూర్వ అభినయం, ఆత్రేయ మాటలు – పాటలు, మహదేవన్ సంగీతం – ఇలా అన్నీ కలసి తెలుగు ‘ప్రేమనగర్’ను తీపిగుర్తుగా మార్చాయి. ప్రణయజీవుల ఊహానివాసం ‘ప్రేమనగర్’ (1971 సెప్టెంబర్ 24) రిలీజై, నేటికి 50 ఏళ్ళు. ఒకరు కొంటే, వేరొకరు తీశారు! ‘ప్రేమనగర్’ నిర్మాణమే ఓ విచిత్రం. అది తీయాలనుకున్నది మొదట రామానాయుడు కాదు. ‘ఆంధ్రప్రభ’ వీక్లీ సీరియల్‌గా హిట్టయిన కౌసల్యాదేవి నవల హక్కులు కొన్నది నిజామాబాద్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి. అక్కినేనితో తీయడానికి పాలగుమ్మి పద్మరాజు, చంగయ్య లాంటి ప్రసిద్ధులు స్క్రిప్ట్ సిద్ధం చేశారు. కె.ఆర్. విజయ హీరోయిన్. సిన్మా తీద్దామనుకున్న సమయంలో అనుకోని దుర్ఘటనలతో శ్రీధర్‌రెడ్డికి సెంటిమెంట్ పట్టుకుంది. ప్రాజెక్ట్ అటకెక్కింది. అప్పుడే అక్కినేని ‘దసరాబుల్లోడు’ రిలీజై, కలెక్షన్ల వర్షంతో హోరెత్తిస్తోంది. ఆయనతో సినిమా తీయాలనుకొన్న రామానాయుడికి ఈ స్క్రిప్టు విషయం తెలిసింది. రూ. 60 వేలకు కొని, హిట్ హీరోయిన్ వాణిశ్రీ జోడీగా ‘ప్రేమనగర్’ ప్రారంభించారు. ఆపైన అనేక నవలా చిత్రాలు తీసిన సురేష్ సంస్థకూ, రామానాయుడుకూ ఇదే తొలి నవలా ప్రయత్నం. దర్శకుడు ప్రకాశరావు, రచయిత ఆత్రేయ కృషితో నవలలో లేని అనేక అంశాలతో సెకండాఫ్ స్క్రిప్ట్ అంతా కొత్తగా తయారైంది. ఆ రోజుల్లోనే కామెడీ ట్రాక్ ప్రత్యేకంగా అప్పలాచార్యతో రాయించారు. అప్పట్లో ‘దసరాబుల్లోడు’ రూ. 14 లక్షల్లో తీస్తే, అంతకన్నా ఎక్కువగా రూ. 15 లక్షల్లో కలర్లో తీయాలని సిద్ధపడ్డారు రామానాయుడు. వాహినీ స్టూడియోలో 1971 జనవరి 22న మొదలైన ‘ప్రేమనగర్’ కోసం కళా దర్శకుడు కృష్ణారావు వేసిన హీరో జమీందార్ ఇల్లు, ప్రేమనగర ఫుల్ఫ్లోర్ సెట్ సంచలనం. అది... ఆ ఇద్దరి అపూర్వ ట్రేడ్‌మార్క్ ఇలాంటి ప్రేమకథలు, విషాదదృశ్యాల అభినయాలు అక్కినేనికి కొట్టినపిండి. ‘దేవదాసు’ నుంచి ‘ప్రేమాభిషేకం’ దాకా తెరపై ఆ ఇమేజ్, ఆ గెటప్ ఆయనకే సొంతం. అయితే, ‘దసరాబుల్లోడు’, ఆ వెంటనే ‘ప్రేమనగర్’తో నటిగా వాణిశ్రీ ఇమేజ్ తారస్థాయికి చేరింది. ఇందులో ఆత్మాభిమానం గల నాయిక లత పాత్రలో ఆమె అభినయం అపూర్వం. కథానాయకుడి మొదలు కథంతా ఆ పాత్ర చుట్టూరానే తిరిగే ఈ చిత్రం ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్. ఆ తరువాత అనేక చిత్రాల్లో ఆత్మాభిమానం గల పాత్రలకు వాణిశ్రీయే ట్రేడ్‌మార్క్. ఇక, తలకొప్పు, మోచేతుల దాకా జాకెట్టు, ఆభరణాలు, అందమైన చీరలతో అప్పట్లో ఆమె ఫ్యాషన్ ఐకాన్ అయిపోయారు. అక్కడ నుంచి తెరపై ఆమె చూపిన విభిన్న రకాల స్టయిల్స్ తెలుగు స్త్రీ సమాజాన్ని ప్రభావితం చేయడం ఓ చరిత్ర. రిపీట్ రన్ల... బాక్సాఫీస్ నగర్! ‘ప్రేమనగర్’ రిలీజైన వెంటనే తొలి రెండు వారాలూ తెలుగునాట భారీ వర్షాలు. రామానాయుడికి కంగారు. ఆ రెండు వారాల అవరోధాలనూ అధిగమించి, సినిమా బాగా పికప్ అయింది. వసూళ్ళ వర్షం కురిపించింది. ‘దసరాబుల్లోడు’, వెంటనే ‘ప్రేమనగర్’ బంపర్ హిట్లతో 1971 అక్కినేనికి లక్కీ ఇయరైంది. అప్పట్లో 34 సెంటర్లలో రిలీజైన ఈ చిత్రం 31 కేంద్రాల్లో 50 రోజులాడింది. 13 కేంద్రాల్లో వంద రోజులు, షిఫ్టులతో హైదరాబాద్‌లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. అర్ధశతదినోత్సవం నాటికి అంతకు ముందు వసూళ్ళ రికారై్డన ‘దసరాబుల్లోడు’ను ‘ప్రేమనగర్’ దాటేసి, రూ. 33 లక్షల గ్రాస్‌తో కొత్త ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. అప్పటి నుంచి ‘ప్రేమనగర్’ ఎప్పుడు రిలీజైనా వసూళ్ళ వానే. అక్కినేని చిత్రాల్లోకెల్లా రిపీట్ రన్ల పరంగా నంబర్ 1 చిత్రమైంది. హార్ట్ ఆపరేషన్ తర్వాత అక్కినేని రెస్ట్ తీసుకున్న 1975లో ‘ప్రేమనగర్’ రిపీట్‌లో 50 రోజులు ఆడడం విశేషం. మూడు భాషలు... ముగ్గురు స్టార్లు... ‘ప్రేమనగర్’ కథను తెలుగు తర్వాత తమిళ, హిందీల్లోనూ దర్శకుడు ప్రకాశరావుతోనే తీశారు. తమిళ ‘వసంత మాళిగై’లో శివాజీగణేశన్ – వాణిశ్రీ జంట. హిందీ ‘ప్రేమ్‌నగర్’లో రాజేశ్‌ఖన్నా– హేమమాలిని జోడీ. మూడూ పెద్ద హిట్. అన్నిటికీ రామానాయుడే నిర్మాత. ‘విజయా’ నాగిరెడ్డి కుటుంబం ఈ 3 చిత్రాల నిర్మాణంలో భాగస్థులు. ఇప్పటికీ ఈ చిత్ర రైట్స్ తాలూకు రాయల్టీ ఆ కుటుంబాలకు అందుతుండడం ఈ సినిమా సత్తా. అన్నిటికీ పబ్లిసిటీ డిజైనర్ ఇటీవల కన్నుమూసిన ప్రసిద్ధ డిజైనర్ ఈశ్వరే. ఈ చిత్రం ఆయన కెరీర్‌ను మరో మెట్టెక్కించింది. అంతకు ముందు ‘రాముడు – భీముడు’, తమిళంలో ‘ఎంగవీట్టు పిళ్ళై’, హిందీలో ‘రామ్ ఔర్ శ్యామ్’గా 3 భాషల్లో హిట్. ఆ తరువాత ‘ప్రేమనగర్’ మూడు భాషల్లో హిట్. అక్కడ ఎన్టీఆర్, ఎమ్జీఆర్, దిలీప్ కుమార్. ఇక్కడ ఏయన్నార్, శివాజీ, రాజేశ్‌ఖన్నా. అదీ లెక్క. శివాజీ చిత్రాల్లో ‘వసంత మాళిగై’ డైరెక్ట్ 40 వారాలాడిన కెరీర్ బెస్ట్ హిట్. ఎనిమిదిన్నరేళ్ళ క్రితం ఆ తమిళ చిత్రాన్ని డిజిటల్‌గా పూర్తిగా పునరుద్ధరించి, స్కోప్‌లో 2013 మార్చి 8న రీరిలీజ్ చేస్తే, అప్పుడూ హిట్టే. మారిన పాటలు! మారని క్లైమాక్స్! ‘ప్రేమనగర్’లో ఆత్రేయ మాటలు, పాటలు జనం నోట నిలిచాయి. ‘కడవెత్తుకొచ్చిందీ..’, ‘నేను పుట్టాను..’ లాంటి మాస్ పాటలు, ‘తేటతేట తెలుగు’, ‘నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం..’ లాంటి క్లాస్ పాటలు ఇవాళ్టికీ మర్చిపోలేం. ‘తేటతేట తెలుగులా..’ పాట తెలుగులోనే ఉంది. తమిళ, హిందీ వెర్షన్లలో అలాంటి పాటే లేకుండా, సీన్‌తో వదిలేశారు. అలాగే, తెలుగులో క్లైమాక్స్‌లో హీరో విషం తాగి, ‘ఎవరి కోసం’ అంటూ పాట పాడడం విమర్శకు తావిచ్చింది. దాంతో తమిళ, హిందీల్లో జాగ్రత్తపడి, పాట పాడాక, విషం తాగేలా మార్చారు. తెలుగులో సుఖాంతం, విషాదాంతం 2 క్లైమాక్సులూ తీశారు. సుఖాంతంగా రిలీజ్ చేశారు. జనానికి నచ్చకపోతే ఉంటుందని ముందుజాగ్రత్తగా రెండో క్లైమాక్స్ రీలూ అందరికీ పంపారు. సుఖాంతానికి జై కొట్టడంతో, రీలు మార్చే పని రాలేదు. లవ్‌స్టోరీలకు ఇది సెంటిమెంట్ డేట్! ‘ప్రేమనగర్’ బాక్సాఫీస్ హిట్‌తో ఆ రిలీజ్ డేట్ సెంటిమెంట్ అయిపోయింది. సరిగ్గా పదేళ్ళకు 1981లో దాసరి దర్శకత్వంలో అక్కినేనితోనే రూపొందిన దేవదాసీ ప్రేమకథ ‘ప్రేమమందిరం’ చిత్రాన్నీ సెప్టెంబర్ 24నే రామానాయుడు రిలీజ్ చేశారు. మరుసటేడు దాసరి సొంతంగా, అక్కినేనితో నిర్మించిన ప్రేమకావ్యం ‘మేఘసందేశం’ రిలీజ్ డేటూ అదే. తాజాగా ఇప్పుడు అక్కినేని మనుమడు నాగచైతన్య లేటెస్ట్ ‘లవ్‌స్టోరీ’ ఇదే డేట్‌కి రిలీజ్ చేయడం విశేషం. – రెంటాల జయదేవ -
Nayanthara: నయనతార 'నిళల్' మూవీ రివ్యూ
చిత్రం: ‘నిళల్’ (మలయాళం) తారాగణం: నయనతార, కుంచాకో బోబన్; సంగీతం: సూరజ్ ఎస్. కురూప్ కెమేరా: దీపక్ డి ఎడిటింగ్: అప్పు ఎన్. భట్టాత్రి, అరుణ్ లాల్ దర్శకత్వం: అప్పు ఎన్. భట్టాత్రి నిడివి: 124 నిమి ఓటీటీ: అమెజాన్ దేశంలోని ఎక్కడెక్కడి వాళ్ళకూ ఇప్పుడు మలయాళం సుపరిచితం. కారణం.... కరోనా దెబ్బతో ఓటీటీలో మలయాళం సినిమాలు పెద్ద హల్చల్. లేటెస్ట్గా అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతున్న మలయాళ చిత్రం – నయనతార ‘నిళల్’ (అంటే ‘నీడ’ అని అర్థం). మిస్టరీ థ్రిల్లర్ కోవకు చెందిన చిత్రమిది. కాకపోతే, ఇప్పటికే మంచి మలయాళ సినిమాలెన్నో చూశాక, ఈ మిస్టరీ వాటితో పోలిస్తే అంతగా ఆనుతుందా? కథేమిటంటే..: ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జాన్ బేబీ (కుంచాకో బోబన్). కారు ప్రమాదంలో గాయపడ్డ అతనికి లేని వర్షం పడుతోందన్న భ్రమ లాంటివి కలుగుతుంటాయి. ఇంతలో, చైల్డ్ సైకాలజిస్ట్ అయిన డాక్టర్ ఫ్రెండ్ షాలిని (దివ్య ప్రభ) ద్వారా ఎనిమిదేళ్ళ చిన్న స్కూలు పిల్లాడు నితిన్ గురించి తెలుస్తుంది. మర్డర్ స్టోరీలు చెప్పే ఆ కుర్రాడి గురించి, అతని తల్లి షర్మిల (నయనతార) గురించి హీరో ఆరా తీస్తాడు. చూడడానికి మామూలుగా ఉండే ఆ కుర్రాడు కథలో చెప్పే ప్రాంతాలకు వెళితే, నిజంగానే అక్కడ అస్తిపంజరం బయటపడుతుంది. పిల్లాడు చెబుతున్న కథలు ఒక్కొక్కటీ వాస్తవ మని తేలడంతో మిస్టరీ పెరుగు తుంది. దాన్నిఛేదించడానికి హీరో, ఆ పిల్లాడి తల్లి ఏం చేశారు? తండ్రి లేని ఆ పిల్లాడిని తల్లి అసలు ఎలా పెంచింది? ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి లాంటివి చివరలో ముడి వీడతాయి. ఎలా చేశారంటే..: సగటు తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ సినిమాలో బాగా తెలిసిన ముఖం నయనతార ఒక్కరే! పిల్లాడి తల్లి పాత్రలో ఆమె చేయడానికి ఈ కథలో పెద్దగా ఏమీ కనపడదు. కథలో తొలిసారి కనిపించే లాంటి కొన్నిచోట్ల మేకప్ కూడా ఎక్కువవడంతో నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక, కథానాయకుడైన మేజిస్ట్రేట్ పాత్రలో కుంచాకో బోబన్ ఫరవాలేదనిపిస్తారు. కేరళలోని తొలి స్టూడియో అయిన ‘ఉదయ’ ఓనర్ల కుటుంబానికి చెందిన అతను ఒకప్పుడు బాల నటుడు. ఇప్పుడు పలు చిత్రాల హీరో, నిర్మాత, వ్యాపారవేత్త. లేటెస్ట్ మలయాళ థ్రిల్లర్ ‘నాయట్టు’ (వేట)లోనూ ఇతనే హీరో. సినిమా చివరలో మలయాళ దర్శక, నటుడు లాల్ కాసేపు కనిపిస్తారు. ఎలా తీశారంటే..: మొదట కాసేపు బాగా నిదానించినా, అరగంట తర్వాత కథలోని మిస్టరీ ఎలిమెంట్ ప్రేక్షకులను కూర్చోబెడుతుంది. కాకపోతే, ఆ ఆసక్తిని కొనసాగించడంలోనే దర్శక, రచయితలు విఫలమయ్యారు. ఎంచుకున్న ఇతివృత్తం బాగున్నా, దాన్ని ఆసక్తిగా చెప్పడంలోనే ఇబ్బంది పడ్డారు దర్శకుడు. ప్రాథమికంగా ఎడిటరైన ఆయనకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. హీరో లవ్ ఫెయిల్యూర్ స్టోరీ, హీరోయిన్ చిన్నప్పటి కష్టాలు, క్లైమాక్స్‌లో వచ్చే అసలు కథ – ఇలా బోలెడు అంశాలున్నాయి కానీ, అన్నిటినీ కలిపి కథగా చెప్పలేకపోయారు. కథారంభంలో వేసుకున్న ముడులు సంతృప్తి కలిగేలా విప్పలేదనిపిస్తుంది. కేరళలోని అందమైన లొకేషన్లతో పాటు కర్ణాటక హొగెనెకల్ జలపాతం దాకా సినిమా తిరుగుతుంది. అయితే సీన్లకు సీన్లు జరుగుతున్నా కథ ముందుకు నడిచేది తక్కువ. పైగా పాత్రలూ ఎక్కువే. కథ కన్నా కెమేరా వర్క్, ఆర్.ఆర్. మీద ఎక్కువ ఆధారపడ్డారా అని అనుమానం కలుగుతుంది. సినిమాలోని రెండు పాటలూ లేకున్నా ఫరవాలేదు. వర్షం పడడం లాంటి అతని భ్రమలకు కారణం ఏమిటన్నది సినిమా చివరి దాకా చూసినా అర్థం కాదు. నయనతార పాత్ర, ఆ పాత్ర ప్రవర్తన కూడా ఓ పట్టాన అంతుచిక్కదు. పిల్లాడి కథకూ, తన కథకూ ఏదో ముడి ఉందని భావించిన హీరో దానికి ముగింపు చెప్పలేదు. అతీంద్రియ శక్తుల కథ అనే ఫీల్ ఇచ్చి, ఆఖరుకు తుస్సుమనిపించారు. వెరసి, మలయాళ సిన్మా కదా అని... నయనతారపై ఆశలు పెట్టుకొని ఈ ‘నిళల్’ చూస్తే, ఆశాభంగం తప్పదు. అటు నయనతార, ఇటు సినిమా – ఎవరూ మెప్పించరు. ఇంగ్లీష్ సబ్ టైటిల్సున్న ఈ సినిమా... లాక్డౌన్ టైమ్‌లో మరీ... ఖాళీగా ఉంటే చూడవచ్చు. లేదంటే, స్కిప్ చేసినా మీరేమీ మిస్ కారు. బలాలు: సస్పెన్స్ కథాంశం, నయనతార స్టార్ వ్యాల్యూ బలహీనతలు: స్లో నేరేషన్, నీరసింపజేసే క్లైమాక్స్, కథను మించి రీరికార్డింగ్ హంగామా, కథన, దర్శకత్వ లోపాలు కొసమెరుపు: స్టార్లు ఉన్నంత మాత్రాన... సినిమాలు బాగుండవు! – రెంటాల జయదేవ -
కరోనా కష్టాలు మామ.. సినిమా చూపలేము మామా!
అనుకున్నంతా అయింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ప్రభావం... ఇప్పుడు వరుసగా ఒక్కో రంగం మీద పడుతోంది. ఈ కరోనా కష్టకాలంలో... కాస్తంతయినా వినోదం పంచడానికి సిద్ధమైన సినిమా థియేటర్లు మూసివేత బాట పట్టాయి. మహారాష్ట్ర, ఢిల్లీల్లో హాళ్ళు, షూటింగులు ఆగిపోయాయి. దక్షిణాది సినీసీమలోనూ హాళ్ళు స్వచ్ఛందంగా మూతబడుతున్నాయి. నైట్ కర్ఫ్యూ, 50 శాతం సీటింగ్ కెపాసిటీ లాంటి వాటితో తెలుగు నేలపై రెండు రాష్ట్రాల్లోనూ సినీ వినోదానికి గడ్డుకాలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తమ థియేటర్లలో ప్రదర్శనల్ని ఆపేసింది. తెలంగాణలో హాళ్ళను స్వచ్ఛందంగా మూసేయాలని ఓనర్లు నిర్ణయించారు. దేశమంతటా సినీరంగానికి ఇవి గడ్డు రోజులు. తెలుగే కాదు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ కొత్త రిలీజులకు నిర్మాతలు భయపడుతున్నారు. కలెక్షన్ల కన్నా కరెంట్, శానిటైజేషన్ ఖర్చే ఎక్కువవుతోంది. కరోనా ఇలాగే కొనసాగితే, పెద్ద సినిమాలు కనీసం 3 –4 నెలలు వాయిదా పడే ప్రమాదం ఉంది. వెంకటేశ్ ‘దృశ్యం–2’ సహా పలు భాషాచిత్రాలు ఓటీటీ వైపు వెళుతున్నాయి. – కాట్రగడ్డ ప్రసాద్, సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు సినిమా ప్రదర్శనలకు కరోనా సెకండ్ వేవ్ దెబ్బ పడింది. రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న సీటింగ్ కెపాసిటీ, కర్ఫ్యూలాంటి చర్యలు సహజంగానే థియేటర్లలో సినిమా ప్రదర్శనలకూ వర్తిస్తున్నాయి. దాంతో, ఇప్పుడు వెండితెరపై వినోదం దేశమంతటితో పాటు తెలుగునాట కూడా తగ్గిపోనుంది. మంగళవారం నుంచి తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో, మునుపటిలా రోజుకు నాలుగు షోలూ ప్రదర్శించే వీలు లేకుండా పోయింది. దాంతో, ఈవారం రావాల్సిన ‘ఇష్క్’, ‘తెలంగాణ దేవుడు’ సహా ఆరేడు సినిమాల రిలీజులు వాయిదా పడ్డాయి. హాలులో ఉన్న సినిమాలకేమో ప్రేక్షకులు లేరు. దాంతో, తెలంగాణ థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా హాళ్ళు మూసేయాలని నిర్ణయించుకున్నారు. ఊపిరి పీల్చుకొనే లోగానే... కొత్త సినిమాలతో కళకళలాడుతూ నిండా నాలుగు నెలలైనా గడవక ముందే దురదృష్టవశాత్తూ సినిమా హాళ్ళకు క్రమంగా తాళాలు పడుతున్నాయి. నిజానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా హాళ్ళను ఆదుకొనేందుకు ఇటీవల పలు రాయితీలు ఇచ్చింది. గత ఏడాది హాళ్ళు మూతబడ్డ కరోనా కాలంలోని మూడు నెలలకు విద్యుత్ ఛార్జీలు రద్దు చేసింది. మల్టీప్లెక్సులతో సహా థియేటర్లకు మరో ఆరు నెలల పాటు విద్యుత్ ఛార్జీలను వాయిదా వేసింది. సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి కట్టాల్సిన వడ్డీలో 5 నుంచి 10 లక్షల దాకా వడ్డీ ఉపసంహరణ ఇస్తున్నట్టు ఏ.పి. సర్కారు ఉదారంగా ఉత్తర్వులిచ్చింది. ఇంకా కొన్ని సమస్యలున్నా, ఈ రాయితీలతో ఎగ్జిబిషన్ సెక్టార్ కొంత ఊపిరి పీల్చుకుంది. ఇంతలోనే ఉరుము మీద పిడుగులా కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడింది. ఆంధ్రప్రదేశ్‌లో సీటు విడిచి సీటు! పెద్ద సినిమాలు పోస్ట్‌పోన్ బాట పట్టాయి. జనం హాళ్ళకు వచ్చే పరిస్థితులు కనబడడం లేదు. సూపర్ హిట్ అని చెప్పుకుంటున్న సినిమాలకు సైతం వారం తిరిగే సరికల్లా ప్రేక్షకుల కోసం ఎదురుచూడాల్సిన దుఃస్థితి దాపురించింది. ఇదే అదనుగా ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, తెనాలి, మంగళగిరి, కాకినాడ, విజయవాడ లాంటి పలు ప్రాంతాల్లో ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తమ చేతిలో ఉన్న థియేటర్లను ఇప్పటికే మూసివేసింది. కాగా, థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీగా ఉంచాలని సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం సీటింగ్ కెపాసిటీకే అనుమతి ఉన్నట్టు లెక్క. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్! ఇది ఇలా ఉండగా, సోమవారమే తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జన సంచారంపైన, సినిమా హాళ్ళు, బార్లు, పబ్లపైన నియంత్రణ ఏదని ప్రశ్నించింది. దాంతో, తక్షణమే రాత్రి కర్ఫ్యూ పెడుతున్నట్టు తెలంగాణ సర్కారు మంగళవారం మధ్యాహ్నానికల్లా ప్రకటన చేసేసింది. ప్రస్తుతానికి ఈ నెలాఖరు దాకా ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. తెలంగాణలోని సినిమా హాళ్ళలో ప్రస్తుతానికి ఫుల్ కెపాసిటీ అనుమతి ఉన్నా, రాత్రి 8 గంటల కల్లా సినిమా హాళ్ళు మూసేయాలనడం ఇబ్బంది అయింది. ఆడియన్స్‌ను ఆకర్షించే పెద్ద సినిమాలేవీ రిలీజయ్యే పరిస్థితులు లేకపోవడంతో, థియేటర్లను మూసివేయాలని తాజాగా తెలంగాణ సినిమా థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ కూడా నిర్ణయించింది. మంగళవారం జరిగిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల జూమ్ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. దీంతో, బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు, స్థానిక మల్టీప్లెక్సులు మూతపడనున్నాయి. జాతీయ స్థాయి బ్రాండ్లయిన పి.వి.ఆర్, ఐనాక్స్‌ల నిర్ణయం ఏమిటన్నది వేచి చూడాలి. రెండు వారాలుగా థియేటర్ల కలెక్షన్స్ బాగా తగ్గాయి. చిన్నచితకా సినిమాలను చూసే నాథుడే లేడు. ప్రముఖ తెలంగాణ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ దిల్ రాజు నిర్మించిన పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ ఒక్కటే ఇప్పుడు థియేటర్లలో ఉన్న పెద్ద సినిమా. దాంతో, ఆ సినిమా నడుస్తున్న థియేటర్లను మాత్రం మూయకుండా నడుపుతామని తెలంగాణ ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. అటు బాలీవుడ్లో... ఇటు కోలీవుడ్‌లో.... నిజానికి, కరోనా సెకండ్ వేవ్‌తో దేశమంతటా ఇప్పటికే సినిమా పరిశ్రమ ఇరుకున పడింది. ఉత్తరాదిన మహారాష్ట్ర, ఢిల్లీలాంటి చోట్ల లాక్‌డౌన్‌తో ఇప్పటికే షూటింగులు, సినిమా ప్రదర్శనలు బంద్ అయిపోయాయి. అలా అక్కడి హిందీ, మరాఠీ సినీ – టీవీ పరిశ్రమ దాదాపు స్తంభించిపోయింది. మంగళవారం రాత్రి సమయానికి మహారాష్ట్రలో పూర్తి లాక్ డౌన్ విధిస్తారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ కొన్నాళ్ళు పూర్తిగా బంద్ అయ్యేలా ఉంది. ఇక, దక్షిణాదిన తమిళనాట కూడా ఏప్రిల్ 20వ తేదీ మంగళవారం నుంచి నెలాఖరు దాకా రాత్రి కర్ఫ్యూ పెట్టారు. అలాగే, ప్రతి ఆదివారం పూర్తి లాక్ డౌన్ ఉంటుందని కూడా తమిళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీ, నైట్ కర్ఫ్యూ, ఆదివారం లాక్ డౌన్లతో తమిళ సినిమాల ప్రదర్శన ఇక్కట్లలో పడింది. ఏప్రిల్ 9న సగం సీటింగ్ కెపాసిటీలోనే రిలీజైన ధనుష్ ‘కర్ణన్’ మినహా అక్కడ కూడా ఇప్పటికిప్పుడు పెద్ద రిలీజులేమీ లేవు. దాంతో, కాస్తంత అటూ ఇటూగా తమిళనాడులోనూ సినిమా హాళ్ళు కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో కొన్నాళ్ళు మూతపడతాయని కోడంబాక్కమ్ వర్గాల కథనం. తెలంగాణలో వసూళ్ళు 70 శాతం పడిపోయాయి. పెద్ద హీరో సినిమాకు సైతం టాక్‌కు తగ్గ కలెక్షన్లు ఉండడం లేదు. పెద్ద సినిమాలతో పాటు, రేపు 23న రావాల్సిన సినిమాలూ వాయిదా పడ్డాయి. రిలీజులూ లేక, జనమూ రాక నష్టాలతో హాళ్ళు ఎలా నడుపుతాం? కొత్త రిలీజులతో నిర్మా తలు సిద్ధమంటే హాళ్ళు వెంటనే తెరుస్తాం. – ఎం. విజయేందర్ రెడ్డి, తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి యాభైమందితోనే షూటింగ్! కరోనా విజృంభిస్తున్న తరుణంలో తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ‘‘కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. అత్యవసరం అనుకుంటే 50 మంది యూనిట్‌తోనే షూటింగ్స్ చేసుకోవాలి’’ అని ఆ సంస్థలు పేర్కొన్నాయి. వాయిదా పడ్డాయి! తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా యస్.యస్.రాజు దర్శకత్వంలో రూపొందిన ‘ఇష్క్’ చిత్రం ఈనెల 23న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా వేశారు. ‘‘ఏపీలో 50శాతానికి థియేటర్ల సామర్థ్యాన్ని తగ్గించడం, తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ విధించడం జరిగింది. ఇలాంటి టైమ్‌లో సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని వాయిదా వేస్తున్నాం’’ అన్నారు చిత్రనిర్మాతలు. హీరో శ్రీకాంత్ లీడ్ రోల్లో నటించిన ‘తెలంగాణ దేవుడు’ చిత్రం కూడా ఈ నెల 23న విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు ఇదీ వాయిదా పడింది. మాక్స్‌ల్యాబ్ సిఈఓ మొహమ్మద్ ఇంతెహాజ్ అహ్మద్ మాట్లాడుతూ – ‘‘పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, ప్రజల శ్రేయస్సును కోరుతూ మా సినిమా విడుదల వాయిదా వేశాం’’ అన్నారు. కేరళలోనూ స్వచ్ఛందంగా క్లోజ్! దేశంలో కరోనా కేసులు అత్యధికంగా వస్తున్న రాష్ట్రాల్లో ఒకటైన కేరళలోనూ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. రాత్రి వేళ సినిమా ప్రదర్శనల్ని రద్దు చేస్తూ, రోజుకు 3 ఆటలనే అనుమతిస్తూ, గత వారం కేరళ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. తాజాగా అక్కడ కూడా ఏప్రిల్ 20 నుంచి రాత్రివేళ కర్ఫ్యూ పెడుతున్నట్టు ప్రకటించింది. మధ్యాహ్నం 12కు తెరిచి సాయంత్రం 7.30 గంటలకు హాళ్లు మూసెయ్యాలంటే, రోజుకు రెండు షోలే వేయగలరు. ‘ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ’ సభ్యులందరూ మంగళవారం నాడు ఆన్లైన్లో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు నడపాలా, లేదా అనేది ఆయా థియేటర్ల ఓనర్లు ఎవరికి వారు స్వచ్ఛందంగా నిర్ణయించుకోవచ్చని తీర్మానించారు. కలెక్షన్లు బాగా తగ్గడంతో ఇప్పుడు కేరళలోనూ సినిమా థియేటర్లు నూటికి 80 స్వచ్ఛందంగా మూతబడుతున్నాయి. మే నెలలో రావాల్సిన తాజా జాతీయ ఉత్తమ చిత్రం మోహన్ లాల్ ‘మరక్కర్’, మహేశ్ నారాయణన్ రూపొందించిన ‘మాలిక్’ లాంటి పెద్ద సినిమాలు వాయిదా పడనున్నాయి. కర్ణాటకలోనూ... ఈ 23 నుంచి? కరోనా హాట్‌స్పాట్ కర్ణాటకలోనూ ఇప్పటికే సినిమా హాళ్ళు కష్టాల్లో ఉన్నాయి. ఏప్రిల్ 7 నుంచి అక్కడ హాళ్ళు 50 శాతం సీటింగ్ కెపాసిటీతోనే ముక్కుతూ మూలుగుతున్నాయి. ఏప్రిల్ మొదట్లోనే ఆ రూల్ పెట్టారు. కానీ, పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘యువరత్న’ రిలీజైన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వారం రోజులు ఆ రూల్‌కు మినహాయింపు ఇచ్చింది. ఆ వెంటనే యువరత్న సైతం ఓటీటీ బాట పట్టేసింది. ఆ తరువాత వచ్చిన ‘కృష్ణా టాకీస్’ సైతం థియేటర్ల నుంచి తప్పుకుంది. దాంతో, కొత్త సినిమా రిలీజులేమీ లేక, జనమూ థియేటర్లకు రాక మైసూరులో హాలు ఓనర్లు తాము స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా థియేటర్లు సైతం ఏప్రిల్ 23 నుంచి మూతబడనున్నాయి. ‘‘పెద్ద సినిమాలేమీ ఈ 50 శాతం కెపాసిటీలో రిలీజు కావాలనుకోవడం లేదు. అలాంటప్పుడు ప్రాక్టికల్‌గా ఇంతకుమించి ఏం చేయగలం’’ అని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఏదిఏమైనా ఫిల్మ్ ఎగ్జిబిషన్ సెక్టార్ మరోసారి బాగా దెబ్బతినబోతోంది. చైనాలో 60 వేలు, అమెరికాలో 42 వేల స్క్రీన్లుంటే, ఏటా దాదాపు 1300 నుంచి 1500 సినిమాలు నిర్మించే మన దగ్గర దాదాపు 8 వేల స్క్రీన్లే మిగిలాయి. జనాభా పరంగా ప్రపంచంలో రెండో స్థానంలో మన దేశంలో ప్రతి పది లక్షల మందికి తొమ్మిది స్క్రీన్లే ఉన్నాయి. ఇక ఆంధ్రా, తెలంగాణ కలిపితే 1600 చిల్లర స్క్రీన్లే ఉన్నాయి. వీటన్నిటికీ ఇది గడ్డుకాలమే. సంక్రాంతి నుంచి మూడు నెలల పాటు కళకళ లాడి, ‘సినిమా చూపిస్త మామా’ అంటూ ఉత్సాహపడిన థియేటర్లు, ఇప్పుడు ‘సినిమా చూపించలేము మామా’ అనడం సగటు సినీ్రపియులకు విషాదమే! – రెంటాల జయదేవ -
ఆయన పాట కమనీయం.. స్వరం రమణీయం
కొన్నేళ్ళుగా తన డ్రీమ్ ప్రాజెకై్టన మ్యూజికల్ ఫిల్మ్ ‘99 సాంగ్స్’తో ఏప్రిల్ 16న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలకరించనున్న ప్రపంచ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ‘సాక్షి’తో ఎక్స్‌క్లూజివ్‌గా, సుదీర్ఘంగా సంభాషించారు. అందులో నుంచి కొన్ని ముఖ్యాంశాలు... ► రచయితగా, నిర్మాతగా కొత్త జర్నీ గురించి... రెహమాన్: దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలోనే గడుపుతున్నా. కొత్తగా ఏదైనా చేయమని నా మైండ్ చెప్పింది. ఆస్కార్ అవార్డు తర్వాత హాలీవుడ్లో 5 ఏళ్ళున్నా. అక్కడి సినిమాలు చేశా. ఆ టైమ్‌లో కొన్ని వర్క్‌షాప్స్ చేశా. మనం ఎందుకు ఓ కథ చెప్పకూడదని అప్పుడనిపించింది. సంగీతం అనేది యూనివర్సల్ సబ్జెక్ట్. ప్రపంచంలో మంచి కథలున్నప్పుడు మనమూ చెప్పవచ్చనుకొని ‘99 సాంగ్స్’ కథ రాశాను. తల్లితో రెహమాన్ ► కొత్త రెహమాన్ పుట్టారననుకోవచ్చా? ఇదో మ్యూజికల్ ఫిల్మ్ లాగా అనిపిస్తోంది. (నవ్వేస్తూ...) అవును నిర్మాతగా కొత్త రెహమాన్నే. ఈ సినిమాలో పాటలు ఎక్కువే. అలాగని సినిమా పూర్తిగా సంగీతం గురించే కాదు. సామాజిక అంశాలూ ఉన్నాయి. ఈ కొత్త ప్రపంచానికీ, పాత ప్రపంచానికీ మధ్య వైరుధ్యాలనూ, డిమాండలోని తేడాలనూ మా కథ చూపిస్తుంది. ► మీ నిజజీవిత ఘట్టాలేమైనా కథలో పెట్టారా? లేదు. ఇది ఫ్రెష్స్టోరీ. వృత్తిలో భాగంగా చాలామందిని కలిశా. ఎన్నో ప్రదేశాలు చూశా. కొత్త క్యారెక్టర్లను చూశా. మనుషుల్ని రకరకాలుగా విడదీస్తున్న వేళ మ్యూజిక్, స్పోర్ట్స్, సినిమా... వీటి గురించి అందరినీ కలుపుతాయి. ముఖ్యంగా సినిమా. మా సినిమా రైట్ టైమ్‌లో వస్తోంది. ► ఈ కథపై దాదాపు ఏడేళ్లు వర్క్ చేశారట? ఒక అమ్మాయికి, ఒక అబ్బాయి వంద పాటలు రాయడమనేది నా బేసిక్ థాట్. కానీ ప్రేక్షకులకు పాటలే సరిపోవు. వాళ్లకు సినిమా చూస్తున్నామనే అనుభూతి కలగాలి. మ్యూజిక్, విజువల్స్ కలిస్తే బాగుంటుంది. ముందు తరాలవారు అలానే చేశారు. కె. విశ్వనాథ్ గారు తీసిన ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’, బాలచందర్‌గారి ‘సింధుభైరవి’, మణిరత్నం ‘నాయగ¯Œ ’ ఇలాంటి సినిమాలు చూసి చాలా నేర్చుకున్నా. దర్శకులు శంకర్, సంజయ్ లీలా భన్సాలీ గ్రాండియర్ విజువల్స్‌తో పాటలను తెరకెక్కిస్తారు. ప్రతి దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్ మైండ్స్ వేర్వేరు. ఈ ‘99 సాంగ్స్’ డైరెక్టర్ విశ్వేశ్ కృష్ణమూర్తి, నేను కలిసి ఉమ్మడి కలగా ఈ సినిమా చేశాం. ► చెన్నై సంగీత ప్రపంచానికి ఇది మీ కానుక...? అనుకోవచ్చు. 1980లలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం... ఇలా సౌత్‌లో ఉన్న సినీ జీనియస్‌లు అందరూ మద్రాసులోనే ఉండేవారు. తర్వాత ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ అయిపోయింది. ఓసారి దిలీప్ కుమార్ గారు మద్రాసులో 6 నెలలున్నారు. ఓ సినిమా చేశారు. అలా చెన్నైలో హిందీ సినిమాల షూటింగ్‌లూ జరిగాయి. అలాంటి మంచి రోజులు రావాలని, మరో స్వర్గం రావాలనీ మా సినిమా ఓ చిన్ని ప్రయత్నం. ► మ్యూజికల్ ఫిల్మ్స్ ఇండియాలో తక్కువ. నిర్మాతగా తొలిసారే ఇలాంటి ఛాలెంజ్...? (నవ్వేస్తూ) రెగ్యులర్‌గా ఉంటే, తీస్తే లైఫ్ బోర్ కొడుతుంది. అందుకే ఈ ఛాలెంజ్. జనం లవ్, యాక్షన్ ఫిల్మ్స్ చూశారు. ఓ మ్యూజికల్ సినిమా చూడబోతున్నామనే ఎగ్జయిట్మెంట్ వారికి ఉంటుంది. థియేటర్స్‌లో పాటలు వస్తున్నప్పుడు కొందరు మొబైల్ బ్రౌజింగ్‌లో ఉంటారు. ఏకకాలంలో ‘మల్టీఫుల్ థింగ్స్’ కోరుకుంటున్నారు. కానీ ఈ సినిమాకు అలా జరగదు. బిగువైన స్క్రీన్‌ప్లేతో ‘99 సాంగ్స్’ ఉంటుంది. ► తమిళం, హిందీ, తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. పాటలకు, గాయకుల విషయంలో జాగ్రత్తలు? ప్రతి పాటకూ 10 –13 రివిజన్స్ జరిగాయి. లిప్‌సింక్, మీనింగ్, పొయిట్రీ చూసుకున్నాం. అనువాదం చేయకుండా స్వేచ్ఛగా ఏ భాషకు ఆ భాషలో పాటలు రాశారు. డబ్బింగ్ సినిమాలా ఉండకూడదనుకున్నా. (నవ్వేస్తూ) అందర్నీ కష్టపెట్టి చాలా రివైజింగ్ వెర్షన్స్ చేశాం. కొన్నిసార్లు సింగర్స్నూ మార్చాం. తెలుగులో సీతారామశాస్త్రి గారు ‘సాయి..’ సాంగ్ బ్యూటిఫుల్‌గా రాశారు. అలాగే వెన్నెలకంటి కుమారుడు రాకేందు మౌళి. ► భారత చరిత్రలో తొలిసారి డాల్బీ ఎట్మాస్ టెక్నాలజీతో రిలీజ్ చేస్తున్న సౌండ్ ట్రాక్ ఆల్బమ్ అట కదా ఇది... అవును. ఆడియో త్వరలోనే రిలీజ్ చేస్తాం. ఫస్ట్ డాల్బీ సౌండ్ ట్రాక్ మా సినిమాతో లాంచ్ అవడం గౌరవంగా ఉంది. ఈ సినిమాను హిందీలోనే విడుదల చేద్దామనుకున్నాం. జియో స్టూడియోస్ మాతో అసోసియేటయ్యాక తెలుగు, తమిళంలోనూ చేయాలనుకున్నాం. ► మొదట మీకు కథ తట్టిందా? లేక సంగీతమా? (నవ్వుతూ) కథే! కథలో నుంచే సంగీతం వచ్చింది. కథ ప్రకారమే పాటలు ఉంటాయి. ► కె.విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’ సినిమాలు నచ్చాయన్నారు. మీరు ఆ టైమ్‌లో ఉంటే, ఆ సినిమాలకు చేసి ఉంటే...? లేదండీ. వాటికి లెజెండ్స్ వర్క్ చేశారు. కేవీ మహాదేవన్ గారిని నా గురువుగా భావిస్తాను. కర్ణాటక సంగీతం నుంచి తీసుకొని ఆయన సినిమాకు చేసిన ట్యూన్స్‌ను మ్యాచ్ చేయలేం. ► విశ్వనాథ్ గారి లాంటి వారితో ఓ మ్యూజిక్ ఫిల్మ్ చేయాలని మీరు ఆశపడుతుంటారా? ‘ఇఫీ’ ఫంక్షన్ లో గోవాలో విశ్వనాథ్‌గారిని కలిశా. గంట మాట్లాడా. ఆయనకి చాలా వినయం. అలాంటి అద్భుత చిత్రాలన్నీ భగవత్ కృప అని వినయంగా చెప్పారు. కమల్‌హాసన్ గారిని కలిసినప్పుడు రెండు గంటలు మాట్లాడుకున్నాం. ‘సాగర సంగమం’ రూపకల్పనలో విశ్వనాథ్‌గారి కృషి, అందరి మేధామథనం సంగతుల్ని నెమరేసుకున్నాం. ► మ్యూజిక్, రచన, నిర్మాణం... ఏది కష్టం? ఏ విషయాన్ని అయినా మూలాల నుంచి తపనతో నేర్చుకోవాలి. మ్యూజిక్‌లో నేను ఫాలో అయిన ఈ విధానాన్నే ప్రొడక్షన్, రైటింగ్లోనూ చేశా. సినిమా నిడివి మూడున్నర గంటలు వచ్చింది. కథాంశం పాడవకుండా ఉండేలా రెండు గంటల్లో సినిమా ఉండేలా కొత్త ఎడిట్ చేశాం. ‘మామ్’ చిత్ర ఎడిటర్ మోనిషా పని చేశారు. ట్రైలర్ కట్ కోసం దర్శకుడు అట్లీని సంప్రదించాం. కమర్షియల్ వేలో కట్ చేశారాయన. తమిళ వెర్షన్ కు దర్శకుడు గౌతమ్ మీనన్ డైలాగ్స్ అందించారు. ఆస్కార్ గెలిచిన ‘లా లా ల్యాండ్’కు చేసిన పియానో ప్లేయర్ మా సినిమాకు పనిచేశారు. చాలామంది అంతర్జాతీయ నిపుణులు, నా స్నేహితులు నన్ను గైడ్ చేశారు. ► నిర్మాతల కష్టాలు అర్థమయ్యాయా? (నవ్వేస్తూ) ప్రొడ్యూసర్ జాబ్ జూదం లాంటిది. నిర్మాతగా ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఫినిష్. చాలామంది నష్టపోయారు. కానీ ధైర్యంగా ముందుకు వెళ్లకపోతే లైఫ్ లేదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘సినిమాలో మంచి పాట ఇది.. వినండి’ అని నేనెప్పుడూ చెప్పను. కానీ నిర్మాత బాధ్యతలు వేరు. కెప్న్ ఆఫ్ ది షిఫ్ మనమే. సినిమాను రిలీజ్ చేయాల్సిన బాధ్యతా నిర్మాతలదే. కానీ ఈ ప్రొడక్ట్ ఒక్క నిర్మాతదే కాదు. డైరెక్టర్స్, ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్... ఇలా చాలామంది కలిస్తేనే ఒక సినిమా. వీటికి తోడు ఏఆర్ రెహమాన్ సినిమా అంటే కొన్ని అంచనాలు ఉంటాయి. వాటినీ అందుకోవాలి. ఇందులో అందరి కృషీ ఉంది. ► నిర్మాతగా, రచయితగా... కొనసాగుతారా? ‘99 సాంగ్స్’ రిలీజ్ కోసం చూస్తున్నా. నేను నిర్మాతగా కొనసాగాలో లేదో జనం నిర్ణయిస్తారు. ► సినిమా రఫ్కట్ మీ అమ్మగారికి చూపించారట అవును. ఆమె తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతారు. ఆ సమయంలో అమ్మ అనారోగ్యంతో మంచం మీదున్నారు. ఆవిడ చూసి ఇంగ్లీష్ సినిమాలా ఉందన్నారు. ఇనిషియల్ కట్, కథలోని సీన్లు ఆమెకి అలా అనిపించాయి. ► దర్శకులు శంకర్ ఇదే మాట అన్నట్లున్నారు? ఆయన ఓ పాట చూశారు. విజువల్స్ అంత గ్రాండ్‌గా అనిపిస్తుండడం హ్యాపీగా ఉంది. హాలీవుడ్ విజువల్స్, భారతీయ ఆత్మ – మా సినిమా. ► మీ చిత్రదర్శకుడు విశ్వేశ్కి మీ సలహాలేమైనా? లేదు. 2016లో ఈ సినిమాను స్టార్ట్ చేశాం. వర్క్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ నాలుగేళ్లు జరిగాయి. ► రాబోయే రోజుల్లో సినీ డైరెక్టర్‌గా కూడా...? లేదు. ‘లే మస్క్’ అనే ఓ చిన్న వర్చ్యువల్ రియాలిటీ ఫిల్మ్ మాత్రం తీశా. దర్శకత్వం అంటే, 2–3 ఏళ్ళు అన్నీ పక్కన పెట్టేయాలి. (నవ్వేస్తూ) నన్ను సంగీతం వదిలేయమంటారా ఏమిటి? ► మీరు వర్క్ చేసిన రాజ్–కోటితో అనుబంధం? కోటి గారిని కలుస్తుంటా. అన్నయ్య లేని నాకు ఆయన అన్నయ్య. రాజ్ గారిని చూసి చాలా కాలమైంది. ఆయనను కలవాలని ఉంది. ► గత ఏడాది మీ అమ్మ గారి లానే, లెజండ్ సింగర్ ఎస్పీ బాలు దూరమయ్యారు... (బాధగా)ఎస్పీబీ గారి లాంటి సింగర్ మరొకరు రారు. 40 వేల పాటలు పాడిన ఆయనను ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. 1982 –83 టైమ్‌లో అనుకుంటా... నా ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఆయన బర్త్ డేకి, మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో జరిగింది. నా మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో ఆయన పాడిన పాటలన్నీ మళ్ళీ వీడియో రికార్డ్ చేయిద్దామని అనుకున్నాను. ఆయన ఎగ్జయిటయ్యారు. కానీ ఇంతలో కరోనా వ్యాప్తి. ప్రాజెక్ట్ ఆగింది. ఆయన వెళ్ళిపోయారు. ► ఆస్కార్ సాధించారు. మన సిన్మాలకి బెస్ట్ ఫారిన్ఫిల్మ్గా ఆస్కారొచ్చే ఛాన్స్? మన ఫిల్మ్‌మేకర్స్ ఏం మిస్సవుతున్నామో గమనించాలి. బావిలో కప్పల్లా ఉండిపోకూడదు. మనం వెళ్ళాలి, పోటీ పడాలి. నేను ‘ఫ్యూచర్ ప్రూఫ్స్’ వర్క్‌షాప్ కూడా చేశా. మార్కెటింగ్‌లో, క్రియేటివ్ సైడ్ కొత్త ఆలోచనలను సమీకరించడానికి ఈ ఛానెల్‌ను స్టార్ట్ చేశా. నేను అనకూడదు కానీ హాలీవుడ్లో భారతీయ సినిమాల పట్ల చిన్న రేసిజమ్ ఉంది. ఏ భాష సినిమా అయినా బాలీవుడ్ అనేస్తారు. నిజానికి, అద్భుతమైన డైరెక్టర్లు, సాంకేతిక నిపుణులు ఉన్నారు మన దగ్గర. మన మధ్య ఉన్న గ్యాప్‌ను కూడా పూడ్చుకోవాలి. ► నార్త్, సౌత్ మధ్య వివక్ష మాటేమిటి? అదో పెద్ద కథ. మరోసారి మాట్లాడతా. కానీ, జనరల్‌గా సౌత్ డైరెక్టర్స్ నార్త్‌లో చేస్తున్నారు. నార్త్ హీరోలు సౌత్‌లో నటిస్తున్నారు. జనం సమైక్యంగానే ఉన్నాం. తెలుగువారు తమిళం, తమిళం వారు తెలుగును ఇష్టపడతారు. హిందీవారు తమిళ పాటలను ఇష్టపడతారు. సో.. వుయార్ యునైటెడ్. వుయార్ హ్యాపీ ఇండియా. ► మీరు మళ్ళీ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేసేదెప్పుడు? ‘ఏ మాయ చేసావే’ స్ట్రైటేగా! మంచి కథ, దర్శకుడు కుదిరితే మళ్లీ చేస్తా. తెలుగంటే ఇష్టం. నా దగ్గరవాళ్ళతో తెలుగులోనే మాట్లాడుతుంటా. ► ఇటీవల ఓ ఫంక్షన్ లో ఈ తరం సంగీత దర్శకులు యువన్ శంకర్, జీవీ ప్రకాశ్, అనిరు«ధ్ మిమ్మల్ని పొగుడుతుంటే ఏమనిపించింది? ఈ తరంలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. వారు ప్రేమను చూపించడాన్ని గౌరవంగా ఫీలవుతున్నా. ఆర్టిస్టులందరూ కలిసి ఉంటే మరిన్ని అద్భుతాలు వస్తాయి. యువ సంగీతజ్ఞుల కోసం మేం ‘మాజా’ అనే యాప్ స్టార్ట్ చేశాం. ఇండిపెండెంట్ మ్యూజిక్‌ను ముందుకు తీసుకెళ్ళి, ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ► మీరు చాలామందికి స్ఫూర్తి. కొత్తతరాన్ని చూసి మీరు ఇన్ స్పైర్ అవుతారనుకోవచ్చా? అవును. ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తున్నా. ఎవరైనా కొత్త మ్యూజిక్‌ను ట్రై చేసినప్పుడు మెచ్చుకుంటే వారిలో మరింత జోష్ వస్తుంది. ► మీరు చాలామందిని ట్రైన్ చేస్తున్నారు కదా? మా కె.ఎం కన్జర్వేటరీ ద్వారా చాలామంది పైకొస్తు్తన్నారు. మేం కొన్ని షోలు చేశాం. కొన్నిసార్లు ఈ పాటను మరోలా పాడదామని అనిపిస్తుంటుంది. ఒకసారి నీతీ మోహన్, జనితాగాంధీ లాంటి యంగ్‌స్టర్స్ ఆడుతూ, పాడే శైలి చూశా. స్టేజ్‌పై ఎలా ఉండాలనే విషయాల్ని నేను వారిని చూసి నేర్చుకున్నా. మనం ఇంకా బాగా పాడాలి, ఏదో రిటైర్డ్ ఆఫీసర్లలా బిగుసుకోని ఉండకూడదని (నవ్వేస్తూ) అనుకున్నా. ఇప్పుడు బన్నీ, సిధ్ శ్రీరామ్ బాగా షైనవుతున్నారు. హ్యాపీగా ఉంది. ► మీ సంగీతానికి వారసులెవరు? మీ ఇంట్లో... నా అకాడెమీలోని స్టూడెంట్స్‌ను సొంత బిడ్డలుగా భావిస్తా. అమీన్, సార్థక్ కల్యాణి, పూర్వీ కౌటిశ్, ఔరంగాబాద్ అంజలీ గైక్వాడ్... ఇలా నా లెగసీని కంటిన్యూ చేయడానికి చాలామంది ఉన్నారు. అందులో నా బిడ్డలూ భాగస్వాములే. ► మీరీ స్థాయికి చేరుకోవడంలో మీ అమ్మగారి పాత్ర? గత ఏడాది మా అమ్మ మాకు దూరమయ్యారు. నేను, నా ఫ్యామిలీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాం. మా అమ్మకి మేం అంతలా అటాచ్ అయ్యాం. నా పిల్లలు, నా సిస్టర్స్ ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తుంటే, నా బాధను దిగమింగుకొని, వాళ్లల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత తీసుకున్నా. మా అమ్మగారు ఈ లోకాన్ని వదిలి మరో మంచి లోకాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని మా ఫ్యామిలీ మెంబర్స్‌కు కన్విన్సింగ్‌గా చెప్పడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఆమె త్యాగం, గైడ్‌లైన్స్, ధైర్యమే మమ్మల్ని ఈ స్థాయిలో నిలిపాయి. మా అమ్మ పేరిట చెన్నైలో ఓ స్మారక చిహ్నం నిర్మిస్తున్నాం. ► ప్రపంచసిన్మాకి, భారతీయ సినిమాకు తేడా? ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి తెలియాలి. మనం బెగ్గర్స్ కాదు. మనకంటూ ఓ స్టేటస్, ఉనికి, ఐకమత్యం ఉన్నాయని ప్రపంచం మొత్తం తెలియాలి. కష్టపడి పనిచేసే తత్వం మన నేలలోనే ఉంది. అంతర్జాతీయ ప్రేక్షకులు మన ప్రతిభను గుర్తించాలి. ఇండియా అనగానే ఏదో పేదరికంలో మగ్గే దేశం అన్నట్లు జాలి చూపిస్తుంటారు వారి సినిమాల్లో. అది కరెక్ట్ కాదు. అందుకే, నాకు ‘బాహుబలి’ నచ్చింది. ‘ఎవెంజర్స్’, ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ లాగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది. మన దగ్గర్నుంచి యంగ్ ఫిల్మ్‌మేకర్స్ మంచి ప్రతిభావంతులు వస్తున్నారు. మన సినిమాలు ప్రపంచస్థాయిని చేరుకోవాలని కోరుకుంటున్నా. – రెంటాల జయదేవ -
ఈ అల్లుడు బెదుర్స్!
చిత్రం: ‘అల్లుడు అదుర్స్’; తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేశ్, ప్రకాశ్ రాజ్, సోనూసూద్, అనూ ఇమ్మాన్యుయేల్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కెమేరా: ఛోటా కె. నాయుడు; ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, స్టన్ శివ; ఎడిటింగ్: తమ్మిరాజు; నిర్మాత: గొర్రెల సుబ్రహ్మణ్యం; దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్; రిలీజ్: జనవరి 14 అల్లుడు పాత్ర తెలుగు సినిమాకు మంచి కమర్షియల్ ఎలిమెంట్. సంక్రాంతికి అత్తారింటికి కొత్త అల్లుళ్ళు వచ్చినట్టే... ఈ సినీ సంక్రాంతికి థియేటర్లకు వచ్చిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. కానీ, అన్నిసార్లూ అల్లుడి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? విలన్ మామ గారిని ఒప్పించి, హీరోయిన్‌తో ప్రేమ పెళ్ళి చేసుకున్న హీరో కథలు కొన్ని వందల సినిమాల్లో చూశాం. మరోసారి ఆ ఫార్ములాను వాడి, తీసిన సినిమా ఇది. కథేమిటంటే..: ఫ్యాక్షనిస్ట్ తరహా లీడర్ – నిజామాబాద్ జైపాల్ రెడ్డి (ప్రకాశ్ రాజ్). అతనికి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి వసుంధర (అనూ ఇమ్మాన్యుయేల్). చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ అయిన ఆ అమ్మాయంటే శీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్)కు ఇష్టం. కానీ, ఆమె రియల్ ఎస్టేట్ గజ (సోనూసూద్)ను ప్రేమిస్తుంది. ఇది ఇలా ఉండగా, తెలియకుండానే వసుంధర చెల్లెలు కౌముది (నభా నటేశ్)తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడతాడు హీరో. ఆ పెళ్ళి వద్దనే ఆడపిల్ల తండ్రిని మన హీరో ఎలా మెప్పించి, ఒప్పించాడన్నది కథ. సోనూసూద్‌కూ, ప్రకాశ్ రాజ్‌కూ మధ్య సినిమా కథలో సంబంధం ఏమిటి? సోనూసూద్ విఫల ప్రేమకథ ఎలా చివరకు సక్సెసైంది అన్నది ఓపిగ్గా చూడాల్సిన మెయిన్ కథలోని కీలక ఉపకథ. ఎలా చేశారంటే..: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎప్పటిలానే డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశారు. హిందీ డబ్బింగ్, శాటిలైట్ మార్కెట్ ఉన్నందు వల్లనో ఏమో – ఒకటి రెండు హిందీ డైలాగులూ చెప్పారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ‘‘శీనుగాడు నా ఫ్రెండు. యాక్షన్ సీన్లలో వీడిది సెపరేట్ ట్రెండు’’ (హీరో గురించి వెన్నెల కిశోర్) లాంటి మాస్ డైలాగులూ పెట్టారు. ఫైట్స్‌తో పాటు కామెడీ పండించేందుకు హీరో తెగ ప్రయత్నించారు. నభా నటేశ్ ఓకే అనిపిస్తారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ది నిడివి పరంగా చిన్న పాత్రే. ప్రకాశ్ రాజ్, సోనూసూద్ తదితరులు – ఈ పాత్రల్లో ప్రత్యేకించి చేయడానికీ, నిరూపించుకోవడానికీ ఇవాళ కొత్తగా ఏమీ లేదు. హీరో తల్లి పాత్రలో ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ, హీరో ఇంట పనిమనిషి రత్తాలుగా హరితేజ లాంటి వాళ్ళూ ఉన్నారు. ఎలా తీశారంటే..: సినిమాటోగ్రఫీ నుంచి దర్శకత్వం వైపు వచ్చిన సంతోష్ శ్రీనివాస్‌కు దర్శకుడిగా ఇది నాలుగో సినిమా. తొలి చిత్రం ‘కందిరీగ’ విజయంతోనే ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఆయన... ఆ సక్సెస్ ఫార్ములాను ఇవాళ్టికీ వదులుకోలేకపోవడం అర్థం చేసుకోదగినదే. అందుకే, ఆ ఫార్ములానే వీలైనంత తిరగేసి, మరగేసి, బోర్లేసి... ‘అల్లుడు అదుర్స్’గా మరోసారి వండి వడ్డించారు. దానికి లారెన్స్ ‘కాంచన’ సినిమాతో పాపులరైన హార్రర్ కామెడీని కలిపారు. కానీ, ఎంత సక్సెస్ఫుల్ సూత్రమైనా, పదే పదే వాడితే చీకాకే. అది ఈ సినిమాకున్న పెద్ద ఇబ్బంది. దానికి తోడు ప్రేమకథను సాఫీగా కాకుండా, పలు పాత్రలు, సంఘటనల మధ్య అటూ ఇటూ తిప్పి, తిప్పి చెప్పే కథనం సహనానికి పరీక్ష పెడుతుంది. సెకండాఫ్‌లో వచ్చే హార్రర్ కామెడీ, ప్రకాశ్ రాజ్ – సత్యల ఊహా ప్రపంచం సీన్లు మాత్రం హాలులో అడపాదడపా బాగానే నవ్వులు పూయిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్న ఈ సినిమాలో ఛోటా కె. నాయుడు కెమెరా వర్క్, దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం ప్రత్యేకించి స్పష్టంగా తెలుస్తాయి. సినిమాకు కొంత బలంగా నిలుస్తాయి. తెర నిండా సుపరిచితులైన నటీనటులు కనిపిస్తారు. వినోదం కోసం సత్య, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, చమ్మక్ చంద్ర – ఇలా చాలామందే వస్తూ పోతూ ఉంటారు. ఇటీవల కరోనా కాలంలో మరణించిన నటులు జయప్రకాశ్ రెడ్డి, కమెడియన్ వేణుగోపాల్ కోసూరి లాంటి వాళ్ళూ తెరపై తమ చివరి సినిమాల్లో ఒకటిగా ఇందులో ఎదురవుతారు. ‘బిగ్ బాస్4’ ఫేమ్ మోనాల్ గజ్జర్ చేసిన ఐటమ్ సాంగ్ ‘రంభ ఊర్వశి మేనక అందరు కలిసి నేనిక...’ లాంటివి మాస్‌ను ఆకర్షిస్తాయి. కాశ్మీర్‌లోని పహల్ గావ్ ప్రాంతాల్లో ఇటీవలే ఈ జనవరి చలిలో తీసిన హీరో, హీరోయిన్ల డ్యుయట్... మంచు కురిసే దృశ్యాలు విజువల్‌గా బాగున్నాయి. ఏ విదేశాల్లోనో తీసిన ఫీలింగ్ కలిగిస్తాయి. అయితే, అన్నీ ఉన్నా... అల్లుడి... అదేదో అన్నట్టు స్క్రిప్టులోని బలహీనతలు ఈ సినిమాకు శాపం. కామెడీ చేస్తున్నాం అనుకొని దర్శక, రచయితలు కథన విధానంలో లేనిపోని కన్ఫ్యూజన్లు పెట్టుకున్నారు. ఎంత సక్సెస్ఫుల్ ఫార్ములా వాడుకున్నా, దాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికి ప్రయత్నించకపోవడంలో పొరపాటు జరిగిందనిపిస్తుంది. ఇది ‘కందిరీగ’కు మరో రీమేక్ అనే కామెంట్‌నూ భరించాల్సి వస్తుంది. వెరసి, రెండున్నర గంటల సాగదీతను భరించాలంటే... జనం బెదుర్స్ అనాలనిపిస్తుంది. కొసమెరుపు: ‘కందిరీగ’ ఫార్ములా + ‘కాంచన’ హార్రర్ కామెడీ = ‘అల్లుడు అదుర్స్’ బలాలు: ∙హీరో చేసిన డ్యాన్సులు, ఫైట్లు ∙తెర నిండా నటీనటులు, నిర్మాణ విలువలు ∙నేపథ్య సంగీతం, కెమెరా వర్కు బలహీనతలు: ∙చాలా ప్రిడిక్టబుల్ ఫార్ములా ∙పాత సినిమాలే చూస్తున్న ఫీలింగిచ్చే స్క్రిప్టు ∙సహనాన్ని పరీక్షించే సా....గ దీత కథనం ∙దర్శకత్వ లోపం ∙కన్ఫ్యూజింగ్... కామెడీ -రివ్యూ: రెంటాల జయదేవ -
అందరికీ ఒక్కడే దేవుడు!
అది 50 ఏళ్ళ క్రితం సంగతి. తెలుగునాట ఓ కాలేజీలో విభిన్న మతాల విద్యార్థుల మధ్య ఘర్షణ రేగింది. సమ్మె జరిగింది. మతవిద్వేషాల మధ్య చివరకు ఆ కాలేజీని కొంతకాలం తాత్కాలికంగా మూసేశారు. మమతలు పెంచవలసిన మతాలు, మనుషులను విడదీస్తున్న సరిగ్గా అదే సమయంలో యాదృచ్ఛికంగా ఓ సినిమా వచ్చింది. సీనియర్ క్యారెక్టర్ నటుడు నాగభూషణం స్వయంగా ఓ కీలకపాత్ర పోషిస్తూ, ఓ సినిమాను సమర్పించారు. అదే పెద్ద ఎన్టీయార్ హీరోగా చేసిన – ‘ఒకే కుటుంబం’. ఈ క్రిస్మస్తో స్వర్ణోత్సవం (రిలీజ్ తేదీ 1970 డిసెంబర్ 25) పూర్తి చేసుకున్న ప్రబోధాత్మక చిత్రం. ఎన్టీఆర్ సినీ కుటుంబం: హిందువైన రాముగా పుట్టి, అనుకోకుండా ఓ ముస్లిమ్ ఇంట రహీముగా పెరిగి, ఓ క్రైస్తవ అమ్మాయి మేరీని ప్రేమించి, పెళ్ళాడిన ఓ యువకుడి (ఎన్టీఆర్) కథ ఇది. ఆ యువకుడి కన్నతండ్రి దుర్మార్గుడైన వజ్రాల వర్తకుడు (నాగభూషణం). కుమారుడని తెలియక, హీరో మీదే యాసిడ్ దాడి చేయిస్తాడు. అలా ముఖం అందవిహీనంగా మారే హీరో పాత్రను ఎన్టీఆర్ పోషించారు. ఆ తరువాత పుట్టుకతో వికారమైన ముఖం ఉన్న హీరో పాత్ర తమిళ, తెలుగు తెరపై అనేకం వచ్చాయి. శివాజీగణేశన్ సూపర్ హిట్ ‘దైవ మగన్’ (తెలుగులో ‘కోటీశ్వరుడు’) లాంటివి అందుకు ఉదాహరణ. (చదవండి: వెండితెర సోగ్గాడు @45 ఇయర్స్) ఆ రోజుల్లో ఎన్టీఆర్‌తో నాగభూషణానికి అనుబంధం ఉండేది. ఎన్టీఆర్ ‘ఉమ్మడి కుటుంబం’, ‘కోడలు దిద్దిన కాపురం’, ‘వరకట్నం’ లాంటి తన సొంత చిత్రాలు చాలావాటిలో పాత్రలను ఎస్వీఆర్ అందుబాటులో లేనప్పుడల్లా, నాగభూషణానికి ఇచ్చేవారని పాత సినీ పరిశీలకుల మాట. అలాగే, ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఎంతో పెద్ద హీరో అయినా... సినీపరిశ్రమలోని తోటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సొంతంగా సినిమాలు తీసుకుంటామంటే, వారికి డేట్లిచ్చి, ప్రోత్సహించేవారు. తోటివారికి అలా చాలా సినిమాలు చేసిన ఏకైక హీరో ఆయనే. ఆ క్రమంలోనే నాగభూషణానికి ఎన్టీఆర్ ఈ ‘ఒకే కుటుంబం’ చేశారు. మంచి సినిమాల మన భీమ్ సింగ్: తమిళంలో అగ్ర దర్శకుడైన ఎ. భీమ్‌సింగ్ ఈ ‘ఒకే కుటుంబం’కి రూపకర్త. ఎన్టీఆర్ హీరోగా భీమ్‌సింగ్ దర్శకత్వంలో తొలి సినిమా ఇదే. తమిళంలో అగ్ర హీరో శివాజీ గణేశన్‌తో అనేక సూపర్ హిట్లు తీసి, హిందీలో కూడా పలు చిత్రాలు దర్శకత్వం వహించిన ఘనత భీమ్సింగ్ది. తమిళనాట ఎంతో పేరున్న భీమ్‌సింగ్ నిజానికి అచ్చంగా మన తెలుగువారే. తిరుపతి దగ్గర రాయలచెరువు ఆయన స్వస్థలం. ఏసుక్రీస్తుపై విజయచందర్ నిర్మించిన ‘కరుణామయుడు’కు కూడా దర్శకుడు భీమ్సింగే. ఆ చిత్రం తీస్తున్నప్పుడే అస్వస్థతకు గురై, భీమ్‌సింగ్ మరణించారు. 1980 – 90లలో తెలుగులో మనకు దాసరి – రాఘవేంద్రరావుల లాగా, వాళ్ళ కన్నా చాలాముందే తమిళ వెండితెరను ఇద్దరు ప్రముఖ దర్శకులు – భీమ్‌సింగ్, శ్రీధర్ ఏలారు. సూపర్ హిట్లిచ్చి, తమిళ సినీచరిత్రలో వారిద్దరూ భాగమయ్యారు. తమిళ సినీరంగం ఇప్పటికీ తలుచుకొనే ఆ ఇద్దరూ తెలుగువాళ్ళే కావడం విశేషం. దాసరి వర్సెస్ నాగభూషణం?: ‘ఒకే కుటుంబం’కి భీమ్‌సింగ్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఈ సినిమాకు ఆయన ఓ పాట కూడా రాశారు. అప్పట్లో తమిళ, హిందీ చిత్రాల బిజీతో ఉన్న భీమ్ సింగ్ కు కుదరనప్పుడు ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను దాసరే డైరెక్ట్ చేయడం విశేషం. ఆ చిత్రీకరణ సమయంలో ఏమైందో, ఏమో కానీ దర్శకుడిగా మారాలన్న ప్రయత్నంలో ఉన్న దాసరికీ, నటుడు – నిర్మాత నాగభూషణానికీ ఎక్కడో తేడా వచ్చింది. సినిమా అయిపోయినా, ఆ తరువాత కూడా వారి మధ్య ఆ పొరపొచ్చాలు సమసిపోయినట్టు లేవు. అందుకేనేమో... ఆ తరువాత దాసరి దర్శకుడై, అనేక చిత్రాలు రూపొందించినా ఆయన సినిమాల్లో నాగభూషణం కనిపించరు. ఎన్టీఆర్ సరసన లక్ష్మి నటించారీ చిత్రంలో. కాంతారావు, రాజశ్రీ మరో జంట. మతసామరస్యానికి ప్రతీకగా..: ఒక మతం ఎక్కువ, మరో మతం తక్కువ కాదంటూ... మతసామరస్యం బోధించే ఈ సినిమా కథకు తగ్గట్టుగా... టైటిల్‌కు పక్కనే గుడి, మసీదు, చర్చి శిలువ – మూడూ ఉండేలా అర్థవంతమైన డిజైన్ చేశారు ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్. ఈ సినిమాకు ప్రభుత్వం వినోదపన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా అప్పట్లో కొందరు సినీ విమర్శకులు అభిప్రాయపడడం విశేషం. మూడు వేర్వేరు మతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ సినిమాలో కనిపిస్తారు. తొలి తరం అగ్ర హీరో నాగయ్య చుట్టుపక్కల అందరికీ మంచి చేసే ముస్లిమ్ పెద్ద ఇస్మాయిల్ పాత్రలో, అలాగే మరో తొలినాళ్ళ హీరో సిహెచ్. నారాయణరావు క్రైస్తవ ఫాదర్ జేమ్స్ పాత్రలో నటించారు. ఆకాశవాణిలో ‘రేడియో బావగారు’గా సుప్రసిద్ధులైన ప్రయాగ నరసింహశాస్త్రి ఈ చిత్రంలో హిందువైన శాస్త్రి పాత్రలో కనిపిస్తారు. ఎస్పీ కోదండపాడి సంగీతంలో దాశరథి రాయగా, ఎన్టీఆర్ పై చిత్రీకరించిన ‘అందరికీ ఒక్కడే దేవుడు’ పాట ప్రబోధాత్మకంగా సాగుతుంది. ఒకప్పుడు తరచూ రేడియోల్లో వినిపించిన ‘మంచిని మరచి వంచన చేసి’ అనే పాట సమాజంలోని పరిస్థితులను స్ఫురింపజేస్తూ, 50 ఏళ్ళ తరువాత ఇవాళ్టికీ సరిగ్గా సరిపోవడం విశేషం. మిస్సయిన సెంచరీ! ‘ఒకే కుటుంబం’కి మాటలు రాసింది ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు. తెలుగుదనం ఉట్టిపడేలా రాసిన ఆయన మాటలు, మరీ ముఖ్యంగా వినోదభరితమైన విలనీ పండిస్తూ నాగభూషణం పోషించిన మార్తాండం పాత్రకు రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నాగభూషణం పక్కన ఉండే అల్లు రామలింగయ్యతో ఈ సినిమాలో ‘శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే’ అనే శ్లోకానికి శివుడు, విష్ణువు అంతా రూపాయిలోనే కనిపిస్తారు అంటూ చేసిన సోషల్ సెటైర్ డైలాగ్ అప్పట్లో అందరికీ తెగ నచ్చింది. అప్పట్లో జనాదరణ పొందిన ఈ చిత్రం నిజానికి శతదినోత్సవం జరుపుకోవాల్సిందే. అయితే, అప్పట్లో సినిమా వందరోజులు ఆడితే థియేటర్లలో వర్కర్లకు బోనస్ ఇచ్చే పద్ధతి ఉండేది. దాంతో, వర్కర్లకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని సరిగ్గా 97 రోజులకు ‘ఒకే కుటుంబం’ చిత్రాన్ని నిర్మాతలు హాలులో నుంచి తీసేయడం విచిత్రం. – రెంటాల జయదేవ -
వెండితెర సోగ్గాడు @45 ఇయర్స్
ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది... కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. జనం మనసు దోచి, బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన సినిమా. కాలం మారినా... మరపురాని సినిమా. ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సష్టించిన హీరో శోభన్ బాబు కెరీర్లో అలాంటి ఓ స్పెషల్ సినిమా ‘సోగ్గాడు’. అది ఎంత స్పెషల్ అంటే, ‘వెండితెర సోగ్గాడు’ అంటే శోభన్ బాబే అనేటంతగా స్పెషల్. సరిగ్గా 45 ఏళ్ళ క్రితం 1975 డిసెంబర్ 19న రిలీజైన ‘సోగ్గాడు’ చిత్రంలోని ఉర్రూతలూపిన పాటలు, బాక్సాఫీస్‌ను ఊపేసిన వసూళ్ళు ఇవాళ్టికీ ఓ చెరిగిపోని చరిత్రే! గ్రామీణ నేపథ్యంలోని ఓ కథ గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని కేంద్రాలలో విజయఢంకా మోగించడం విశేషమే. శోభన్ బాబు హీరోగా, సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు అందించిన అలాంటి బాక్సాఫీస్ విశేషం ‘సోగ్గాడు’. ఊరంతా సోగ్గాడుగా పిలిచే శోభనాద్రి (శోభన్ బాబు), అతని మరదలు (జయసుధ), అనుకోకుండా నగరంలోని హోటల్ రూమ్‌లో అతను పెళ్ళాడిన అమ్మాయి (జయచిత్ర) మధ్య నడిచే కథ ఇది. కృష్ణాజిల్లా కోలవెన్ను, ఈడ్పుగల్లు, అలాగే రామానాయుడు తన స్వగ్రామం కారంచేడులో తొలిసారిగా షూటింగ్ చేసిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషనల్ హిట్. నిజజీవితంలోని తన బాబాయిని అనుకరిస్తూ, కోరమీసం, పంచెకట్టుతో, ఎడ్లబండి నడుపుతూ, ‘తస్సాదియ్యా’ అనే ఊతపదంతో ఆ రోజుల్లో శోభన్ బాబు చేసిన నటన, జయసుధ, జయచిత్రల గ్లామర్ అండగా ఆబాలగోపాలాన్ని అలరించిన సినిమా ఇది. స్టార్ డమ్ తెచ్చిన సూపర్ హిట్: శోభన్ బాబు కబడ్డీ ఆటగాడుగా కనిపించే ఈ చిత్రం అప్పట్లో ఎదురులేని ప్రజాదరణతో అఖండ విజయం సాధించింది. ‘సోగ్గాడు’ రిలీజవడానికి సరిగ్గా వారం ముందు... 1975 డిసెంబర్ 12న ఇదే చిత్ర దర్శకుడు కె. బాపయ్య డైరెక్షన్లోనే పెద్ద ఎన్టీఆర్ నటించిన ‘ఎదురులేని మనిషి’ వచ్చింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వినీదత్‌కు అదే తొలి సినిమా. ఎన్టీఆర్‌ను ఓ కొత్త పంథాలో చూపించిన ఆ సినిమా ఓ పక్కన ఆడుతుండగానే, సీనియర్ టాప్ హీరోతో పోటాపోటీగా శోభన్ బాబును నిలిపింది ‘సోగ్గాడు’. థియేటర్లలో విజయఢంకా మోగించిన ఈ చిత్రం విడుదలైన అనేక కేంద్రాలలో విజయ విహారం చేస్తూ, వసూళ్ళలో నూతన అధ్యాయం çసృష్టించింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పింది. విడుదలైన 31 కేంద్రాలలో 50 రోజుల పండగ జరుపుకొంది. 19 కేంద్రాలలో వందల రోజుల పైగా ఆడింది. శోభన్ బాబు కెరీర్లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రం ఇదే. వెరసి... సరికొత్త స్టార్ హీరోగా శోభన్ బాబు అవతరించడానికి తోడ్పడింది. తమిళ స్టార్ శివాజీగణేశన్ ముఖ్య అతిథిగా చిత్రయూనిట్ అంతా పాల్గొనగా, విజయవాడలో వందరోజుల వేడుక జరుపుకొన్న ఈ చిత్రం బాపయ్యను కూడా దర్శకుడిగా మరో మెట్టు పైన పెట్టింది. దర్శకులు బాపయ్య, కె. రాఘవేంద్రరావు కజిన్స్. గమ్మత్తేమిటంటే, ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమండ్రిలో బాపయ్య మరో యూనిట్‌తో బిజీగా ఉండడంతో, రాఘవేంద్రరావు స్వయంగా హైదరాబాద్‌లో కొన్ని షాట్లు, ఇండోర్ సీన్లు తీసిపెట్టారు. కెరీర్ బెస్ట్ ఇయర్: నిజానికి, శోభన్ బాబు కెరీర్లోనే ఓ మరపురాని సంవత్సరం – 1975. ఆ ఏడాది శోభన్ బాబు సినిమాలు ఏకంగా 8 రిలీజయ్యాయి (‘దేవుడు చేసిన పెళ్ళి, అందరూ మంచివారే, బాబు, జీవనజ్యోతి, బలిపీఠం, జేబుదొంగ, గుణవంతుడు, సోగ్గాడు’). వాటిలో 5 సూపర్ హిట్లు. అలా ఆ ఏడాది శోభన్ బాబుకు బాగా కలిసొచ్చింది. ఆయన స్టార్ అయిపోయారు. ఒకే ఏడాది ‘జీవన జ్యోతి, సోగ్గాడు’– ఈ రెండు సూపర్ హిట్లతో శోభన్‌బాబు ఇమేజ్ తార స్థాయికి చేరింది. ఈ సినిమాతోనే నటి జయచిత్ర తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమయ్యారు. అప్పటికి వర్ధమాన నటి అయిన జయసుధ హీరో మరదలిగా సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. తమిళ రచయిత బాలమురుగన్ అందించిన కథకు మోదుకూరి జాన్సన్ మాటలు, కె.వి. మహదేవన్ సంగీతంలో ఆచార్య ఆత్రేయ పాటలు ఆకట్టుకున్నాయి. గమ్మత్తేమిటంటే, నిజానికి ఈ చిత్రాన్ని నాగిరెడ్డి వారసుల విజయ కంబైన్స్, రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సమర్పించినట్టు సినిమా టైటిల్ కార్డుల్లో ఉన్నా, పోస్టర్లు, పబ్లిసిటీలో మాత్రం విజయా కంబైన్స్ పేరు కనిపించదు. ఈ తెలుగు సూపర్ హిట్‌ను ఆ తరువాత హిందీలో జితేంద్ర, రేఖ జంటగా ‘దిల్ దార్’ పేరిట రీమేక్ చేశారు. అందరూ కోరిన అందాల నటుడు: ఆ రోజుల్లో ఎక్కడ విన్నా... మహదేవన్ బాణీల్లోని ‘సోగ్గాడు’ పాటలే. ‘సోగ్గాడు లేచాడు చూసి చూసి నీ దుమ్ము దులుపుతాడు...’ పాట వస్తూ ఉంటే, మాస్లో ఓ హిస్టీరియా. ఫ్యాన్స్ అయితే, తమ అభిమాన హీరో బాక్సాఫీస్ వద్ద జూలు విదిలించి, రికార్డుల దుమ్ము దులుపుతున్నాడని కేరింతలు కొట్టారు. ఈ సినిమాలోని ‘ఏడుకొండలవాడా వెంకటేశా.. ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా’ అనే పాట రేడియోలో కొన్నేళ్ళు ఓ అభిమాన జనరంజక గీతం. అలాగే, ‘అవ్వా బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయి’ పాట. ‘చలివేస్తోంది... చంపేస్తోంది...’ పాట కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టింది. ‘సోగ్గాడు’తో పతాక స్థాయికి చేరిన ఇమేజ్‌తో... పెళ్ళి కావాల్సిన అమ్మాయిలకు ఇలాంటి అబ్బాయి కావాలనే కోరిక పుట్టింది. కన్నవాళ్ళకు అలాంటి కొడుకు కావాలనే ప్రేమ వచ్చింది. తోడబుట్టినవాడు శోభన్ బాబు లాంటి తమ్ముడైతే బాగుండనే అభిమానం వెల్లువెత్తింది. ఆ తరువాత దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇద్దరు ప్రేయసుల మధ్య నలిగే అందాల నటుడిగా శోభన్ బాబు తెలుగుతెరను ఏలారు. అదీ ‘సోగ్గాడు’గా శోభన్‌బాబు చేసిన మేజిక్. – రెంటాల జయదేవ -
ఇది ఓ సిల్లీ రోబో!
చిత్రం: ‘బొంభాట్’; తారాగణం: సాయిసుశాంత్ రెడ్డి, చాందినీ చౌదరి, ప్రియదర్శి, శిశిర్ శర్మ, తనికెళ్ళ భరణి; సంగీతం: జోష్ బి.; నిర్మాత: విశ్వాస్ హన్నూర్కర్; దర్శకత్వం: రాఘవేంద్ర వర్మ ఇందుకూరి; ఓ.టి.టి: అమెజాన్ ప్రైమ్. సైన్స్ ఫిక్షన్ సినిమా, అందులో మనిషికీ, మర మనిషికీ మధ్య ఓ ప్రేమ. ఈ కాన్సెప్ట్ వింటుంటే, ఎక్కడో విన్నట్టు, చూసినట్టు అనిపిస్తోందా? తాజాగా రిలీజైన కొత్త తెలుగు సినిమా ‘బొంభాట్’ అచ్చం ఇలాంటిదే. కాకపోతే, ఇటు ప్రేమకథకూ, అటు సైన్స్ ఫిక్షన్కూ మధ్య ఇరుక్కుపోయి, కథాకథనం ఎటూ కాకుండా పోవడమే విషాదం. కథేమిటంటే..: లైఫ్‌లో ఎప్పుడూ ఏ మంచీ జరగని కుర్రాడు విక్కీ (సాయిసుశాంత్ రెడ్డి). ఏ కొద్ది మంచి జరిగినా, ఆ వెంటనే చెడు జరిగిపోతుంటుంది. ఇలాంటి అన్‌లక్కీ హీరోకు, చైత్ర (చాందినీ చౌదరి) అనే అమ్మాయితో ప్రేమ. హీరోకి చిన్నప్పటి నుంచి అనుకోకుండా కాలేజీ ప్రొఫెసర్ ఆచార్య (శిశిర్ శర్మ)తో అనుబంధం ఏర్పడుతుంది. పెరిగి పెద్దయిన తరువాత కూడా ఆ ప్రొఫెసర్‌తో హీరో బంధం కొనసాగుతుంటుంది. అనుకోని ఓ ప్రమాదంలో ప్రొఫెసర్ చనిపోతాడు. చనిపోవడానికి రెండు రోజుల ముందు విదేశాల్లోని తన కుమార్తెలానే కనిపించే, ప్రవర్తించే ఓ హ్యూమనాయిడ్ రోబోను ప్రొఫెసర్ తయారుచేస్తాడు. ప్రొఫెసర్ కూతురు మాయ (సిమ్రాన్ చౌదరి) కోసం వెతుకుతూ ఉంటాడు మరో వెర్రి సైంటిస్ట్ సాహెబ్ (మకరంద్ దేశ్‌పాండే). ఇంతకీ, ఈ ఇద్దరు సైంటిస్టుల మధ్య గొడవేంటి, మిగతా కథేమిటన్నది చివరి అరగంటలో చూస్తాం. ఎలా చేశారంటే..: గతంలో ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో కనిపించిన హీరో సాయిసుశాంత్ రెడ్డి, తాజా ‘కలర్ ఫోటో’ ఫేమ్ చాందినీ చౌదరి ఈ స్క్రిప్టులోని పాత్రచిత్రణకు తగ్గట్టు తెరపై కనిపించడానికి బాగానే శ్రమపడ్డారు. సిమ్రాన్ చౌదరి ఓకె. హీరో ఫ్రెండ్‌గా ప్రియదర్శిది కాసేపు కామెడీ రిలీఫ్ వేషం. మన కంటికి కనిపించని అదృష్టంగా హీరో సునీల్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమాలోని ఇద్దరు శాస్త్రవేత్తల పాత్రలకూ సీనియర్ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్ అద్భుతంగా గొంతునివ్వడం విశేషం. ఆ పాత్రలు ఎంతో కొంత బాగున్నాయంటే, ఆ వాచికానికే ఎక్కువ మార్కులు పడతాయి. ఎలా తీశారంటే..: రజనీకాంత్ ‘రోబో’ మొదలు అనేక చిత్రాల నుంచి దర్శక, రచయిత తీసుకున్న అంశాలు ఈ సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇది ప్రేమకథో, సైంటిఫిక్ సినిమానో తెలియనివ్వకుండా మొదటి గంట సేపు సాగదీతతో, కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. సుదీర్ఘమైన సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఓ కీలక మలుపు దగ్గర ఇంటర్వెల్ అయ్యాక, సెకండాఫ్ కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందనుకుంటాం. ఆ పైన కూడా అసలు కథను ఒక పట్టాన ముందుకు సాగనివ్వకుండా పక్కన చెవిటి దాదా (వినీత్ కుమార్) కథ సహా అనేకం పక్కనే నడుస్తుంటాయి. హీరోతో హీరోయిన్ ఎందుకు, ఎలా ప్రేమలో పడిందో అర్థం కాదు. దానికి బలమైన రీజనింగూ కనిపించదు. ప్రొఫెసర్‌తో అంతకాలంగా అనుబంధం ఉన్నా సరే, హీరోకు ఆ ప్రొఫెసర్ అసలు సంగతి ఎందుకు చెప్పడో అర్థం కాదు. సినిమా దాదాపు చివర ముప్పావుగంటకు వచ్చేసినా, వెర్రి సైంటిస్టుకూ, ప్రొఫెసర్‌కూ మధ్య గొడవేమిటో దర్శకుడు చెప్పడు. ప్రియదర్శి లవ్ ట్రాక్ సినిమాకు మరో పానకంలో పుడక. రోబో తాలూకు ప్రేమ, తదితర ఫీలింగ్స్‌కు సరైన ఎస్టాబ్లిష్మెంటూ కనిపించదు. ఈ సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది – బాణీలు, రీరికార్డింగ్ విషయంలో ప్రత్యేకత చూపిన సంగీత దర్శకుడి ప్రతిభ. నాలుగు పాటలనూ నాలుగు విభిన్న పంథాల్లో అందించడం విశేషం. సినిమా మొదట్లో వచ్చే పాట సంగీత దర్శకుడి శాస్త్రీయ సంగీత నైపుణ్యాన్ని తెలియజేస్తూ, వినడానికి బాగుంది. అలాగే హీరోయిన్ జెలసీతో పాడే ‘చుప్పనాతి..’ పాట మరో డిఫరెంట్ కాన్సెప్టుతో, డిఫరెంట్ సౌండ్‌తో వినిపిస్తుంది. నిర్మాణవిలువలు, అక్కడక్కడా డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి. ఇలాంటి కొన్ని పాజిటివ్ పాయింట్లున్నా, అక్కడక్కడే అనేక సీన్లుగా సుదీర్ఘమైన సినిమాగా సా...గుతూ ఉంటే, ప్రేక్షకులు భరించడం కష్టమే. అందులోనూ ప్రేక్షకుడి చేతిలో రిమోట్ చేతిలో ఉండే ఓటీటీ షోలలో మరీ కష్టం. కొసమెరుపు: రెండోసారి రెండు గంటల రోబో వెర్షన్! బలాలు: ► కెమెరా వర్క్, నిర్మాణ విలువలు ► సంగీత దర్శకుడి ప్రతిభ ► శుఖలేఖ సుధాకర్ డబ్బింగ్ బలహీనతలు: ► కలవని ప్రేమ, సైన్స్ ఫిక్షన్ స్టోరీ ► సాగదీత కథనం, పండని ఎమోషన్లు ► అతకని సీన్లు, లాజిక్కు అందని పాత్రచిత్రణ – రెంటాల జయదేవ -
అగ్ర దర్శకుడికి బేతాళప్రశ్న!
చిత్రం: ‘రాంగ్ గోపాల్ వర్మ’; తారాగణం: షకలక శంకర్, ప్రభు, కత్తి మహేశ్; కెమెరా: బాబు; కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు; రిలీజ్: డిసెంబర్ 4; ఓ.టి.టి: శ్రేయాస్. నిజజీవిత వ్యక్తుల జీవితాన్నీ, ప్రవర్తననూ ఆధారంగా చేసుకొని, వారి మీద వ్యంగ్య బాణాలు, విమర్శలు సంధిస్తూ సినిమాలు తీయడం ఓ ప్రత్యేకమైన జానర్. మిగిలిన ప్రాంతీయ భాషా సినీ సీమల్లో కన్నా తెలుగులో ఈ కోవ చిత్రాలు కాస్తంత ఎక్కువే! 1980లలోనే పెద్ద ఎన్టీఆర్ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ‘మండలాధీశుడు’, ‘గండిపేట రహస్యం’ లాంటి వ్యంగ్యాత్మక సినీ ప్రయత్నాలు జరిగాయి. ఈ ఫిక్షనల్ రియాలిటీ చిత్రాలకు పరాకాష్ఠ – ఇటీవల కరోనా కాలంలో హీరో పవన్ కల్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘పవర్ స్టార్’. దానికి పోటీగా వర్మపై షకలక శంకర్ హీరోగా వచ్చిన ‘పరాన్నజీవి’. ఈ పర్సనల్ ట్రోలింగ్ సినిమాల మధ్య రచయిత జొన్నవిత్తుల తీస్తానని ప్రకటించిన ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లే వాడు) చిత్రం ఇంకా తయారీలో ఉంది. ఇంతలో తాజాగా సీనియర్ సినీ జర్నలిస్టు ప్రభు రూపొందించిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. కథేమిటంటే..: పబ్లిసిటీ కోసం, నాలుగు డబ్బుల కోసం రాజ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) అనే ఓ అగ్ర దర్శకుడు విపరీత ధోరణులకు పాల్పడుతుంటారు. ఆ ధోరణిని అతని అసిస్టెంట్లు (కత్తి మహేశ్ వగైరా) ప్రశ్నిస్తారు. దానికి ఆర్జీవీ తనదైన జవాబిస్తారు. కానీ, చివరకు ఆర్జీవీని అంతరాత్మే నిలదీస్తుంది. దానికి ఆయన రియాక్షన్ తెరపై చూడాలి. సినిమా టైటిల్‌ను బట్టి, టైటిల్ రోల్ నటుడి హావభావాలను బట్టి, అంశాలను బట్టి ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి తీసిన ఫిక్షనల్ రియాలిటీయో ఇట్టే అర్థమైపోతుంది. ‘ఎ రైట్ డైరెక్టర్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్’ అంటూ టైటిల్‌కు పెట్టిన ట్యాగ్ లైన్‌తోనే సినిమాలో తాను ఏం చెప్పదలుచుకున్నదీ, ఏం చూపించదలుచుకున్నదీ ఈ చిత్రదర్శకుడు తేల్చేశారు. ఎలా తీశారంటే..: ఆర్జీవీని అనుకరించడంలో దిట్ట అయిన షకలక శంకర్ ఆ హావభావాలనూ, డైలాగ్ డెలివరీనీ యథోచితంగా మెప్పించారు. దర్శకుడు ప్రభు సినిమాలో తన నిజజీవిత జర్నలిస్టు పాత్రలో కనిపిస్తారు. మిగిలిన పాత్రధారులు, పరిమిత సాంకేతిక విభాగాల పనితనం అంతే పరిమితం. దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ప్రభుది. ఆయన తన గురువును ఆదర్శంగా తీసుకొని, ఈ 42 నిమిషాల సినిమాకు తానే కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 32 ఏళ్ళుగా సినీ జర్నలిజమ్‌లో అబ్బిన ప్రశ్నించే లక్షణాన్ని ఈసారి కలంతో కాక కెమేరాతో ఆయన వ్యక్తం చేశారనుకోవాలి. ఆర్జీవీకి వ్యతిరేకంగా ఈ సినిమా తీయడానికి వివిధ మెగా సినీ వర్గాల నుంచి ప్యాకేజీలు అందాయని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నంపై పరిశ్రమలో ఓ చిన్న ఆసక్తి నెలకొంది. ఆ గాలివార్తలను కొట్టిపారేసిన దర్శకుడు సినీ పరిశ్రమలోని అవాంఛనీయ ధోరణిని ప్రశ్నించడమే ఈ సినిమా లక్ష్యమని తేల్చారు. అదే సమయంలో ఎవరినో కించపరచాలనే ఉద్దేశంతో కాక, ఆవేదనతో ఈ ప్రయత్నం చేసినట్టు సినిమా చివర చెప్పుకొచ్చారు. మొత్తం మీద కొత్త తరహా సినిమా టేకింగ్, ఆలోచనలతో ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన ఓ అగ్ర దర్శకుడు ఇప్పుడు బూతు సినిమాలు, ఫిక్షనల్ రియాలిటీ పేరుతో ట్రోలింగ్ సినిమాలు తీసే స్థాయికి దిగజారిపోవడాన్ని ఈ సినిమా చర్చకు పెడుతుంది. ఆత్మవిమర్శతో పంథా మార్చుకుంటే, ఇప్పటికీ ఆస్కార్ అందుకొనే ప్రతిభ ఆ దర్శకుడికి ఉందని అంటుంది. ‘నా జీవితం, నా సినిమా, నా పోర్న్ కాలక్షేపం, నా ఓడ్కా, నా ట్వీట్లు... నా ఇష్టం’ అనే ఆర్జీవీకి ఇలాంటి సద్విమర్శలూ, సలహాలూ కొత్త కావు. కానీ, సెన్సార్ అవసరం లేని ఓటీటీల పుణ్యమా అని ఆర్జీవీతో సహా పలువురు తీస్తున్న కంటెంట్‌ను చూసినప్పుడు చాలామందిలో కలిగిన ఆవేదనకు తెర రూపం – ఈ లేటెస్ట్ సినిమా. అంతమాత్రాన ఈ తాజా సినిమాతో ఆర్జీవీ సహా అసలు ఎవరైనా మారిపోతారనుకోవడమూ అత్యాశే. అయినా సరే, సినీ రంగంలో ఉంటూ కూర్చున్న చెట్టుకే చేటు తెస్తున్నారన్న వాదనతో ప్రభు ఈ చిరుప్రయత్నం చేశారు. దీనిలో సగటు సినిమా లక్షణాలు వెతుక్కోవడం వేస్ట్. పరిమితమైన బడ్జెట్లో, అతి పరిమితమైన వనరులు, సాంకేతిక సౌలభ్యాలతో తీసిన ఈ కొత్త గిల్లుడు సినిమా పే పర్ వ్యూ పద్ధతిలో ఓటీటీ వేదికలో ఎంత మందికి చేరుతుందో చెప్పలేం. ఎంతమందిని ఆకట్టుకుంటుందో కూడా చెప్పలేం. కాకపోతే, గొప్ప సినీ ప్రయత్నం కాకున్నా... ధర్మాగ్రహంతో వేసిన ఓ ఆవేదనాభరిత ప్రశ్నగా ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ మిగిలిపోవచ్చు. కొసమెరుపు: అగ్రదర్శకుడిపై కలం చూపిన కెమేరా ఆగ్రహం. బలాలు: సినీసీమలో అవాంఛనీయ ధోరణిపై ఆగ్రహం వర్మ చుట్టూ ఉన్న వివాదాలు గడచిన ‘గిల్లుడు సినిమా’ల్లోని అంశాల ప్రస్తావన బలహీనతలు: విడిగా కథంటూ ఏమీ లేకపోవడం విమర్శలు, విశ్లేషణలతోనే మొత్తం సినిమా సాగడం పరిమిత బడ్జెట్, పరిమిత టెక్నికల్ సహకారం – రెంటాల జయదేవ -
'అనగనగా ఓ అతిథి' సినిమా రివ్యూ
చిత్రం: ‘అనగనగా ఓ అతిథి’ తారాగణం: పాయల్, చైతన్యకృష్ణ; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దయాళ్ పద్మనాభన్; రిలీజ్: నవంబర్ 20; ఓ.టి.టి: ఆహా. దురాశ దుఃఖానికి హేతువు! ఈ పెద్దబాలశిక్ష సూక్తికి వెండితెర రూపం ‘అనగనగా ఓ అతిథి’. అయితే చిన్న పాయింట్ చుట్టూ కథను అటూ ఇటూ తిప్పి, గంటాముప్పావు చిత్రం తీశారు. కథేమిటంటే..: బీద రైతు కుటుంబం అన్నపూర్ణ, సుబ్బయ్యలది (వీణా సుందర్, ఆనంద్ చక్రపాణి). ఈడొచ్చినా... వయసు, మనసు తొందరపెట్టే కోరికలేవీ తీరక వేగిపోతున్న పెళ్ళీడు కూతురు మల్లిక (పాయల్ రాజ్‌పుత్). జంగమ దేవర భిక్షాటనకు వచ్చి, వాళ్ళింటికి మహాలక్ష్మి వస్తుందని జోస్యం చెబుతాడు. అనుకోకుండా పెట్టె నిండా నగలు, డబ్బుతో ఓ దేశసంచారి శ్రీనివాస్ (చైతన్య కృష్ణ) ఆ ఇంటికి అతిథిగా వస్తాడు. ఆ రాత్రికి అక్కడే ఉంటానంటాడు. మనుషుల్లో ఉండే కామం, దురాశ, కోరిక, పైశాచికత్వం అనుకోకుండా ఆ రాత్రి మేల్కొంటాయి. అప్పుడు జరిగిన రకరకాల సంఘటనలే మిగతా కథ. ఎలా చేశారంటే..: ఈ సినిమాకు ప్రధాన బలం కీలక పాత్రధారిణి పాయల్ రాజ్‌పుత్. ‘ఆర్.ఎక్స్ 100’ లాంటి చిత్రాల్లో బొద్దుగా, పూర్తి గ్లామర్‌గా కనిపించిన పాయల్ ఈసారి నాజూకు దేహంతో, డీ గ్లామరైజ్డ్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో ప్రత్యక్షమయ్యారు. కానీ, తన హావభావాలతో, అభినయించే కళ్ళతో కథలోని తన పాత్ర ప్రవర్తనకు తగ్గట్టు ఎన్నో భావాలు పలికించారు. తల్లి పాత్రలో కన్నడ నటి వీణా సుందర్ జీవించారు (తెలుగుకు తొలి పరిచయం. కన్నడ మాతృకలోనూ ఆమె ఇదే పాత్ర చేశారు). పత్తి ఏకుతున్నప్పుడూ, సారాయి దుకాణంలో షాకింగ్ తెలిసినప్పుడూ తండ్రి పాత్రలో ఆనంద్ చక్రపాణిని మర్చిపోయి, ఆ పాత్రనే చూస్తాం. ఎలా తీశారంటే..: చిన్న బడ్జెట్ చిత్రాలను వరుసగా ఓ.టి.టిలో వదులుతున్న వేదిక ‘ఆహా’. ట్రెండ్ లౌడ్ సంస్థతో కలసి, ఈ ‘అనగనగా ఓ అతిథి’ని నిర్మించింది. కన్నడంలో సక్సెసై, అక్కడి కర్ణాటక సర్కారు నుంచి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి (వీణా సుందర్) అవార్డులు అందుకున్న ‘ఆ కరాళ రాత్రి’ (2018) చిత్రానికి ఇది రీమేక్. ఓ ప్రసిద్ధ పాశ్చాత్య రచన ఆధారంగా వచ్చిన కన్నడ నాటకం ఆ కన్నడ చిత్రానికి ఆధారం. కన్నడంలో డైరెక్ట్ చేసిన తెలుగు – తమిళుడు దయాళ్ పద్మనాభన్ ఇప్పుడీ రీమేక్‌తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. నాలుగే పాత్రల చుట్టూ, ఒకే ఇంట్లో తిరిగేలా ఓ పూర్తి నిడివి సినిమా తీయడం కొంత సాహసమే. కథలో ఊహించని ట్విస్టు పెట్టడమూ బాగుంది. కానీ, కన్నడంలో 18 చిత్రాల అనుభవంతో 17 డేస్‌లోనే, రూ. 2.30 కోట్ల తక్కువ బడ్జెట్లో సినిమా తీసిన దర్శకుడు ఈ కథను నడిపించడంలో ఇబ్బంది పడ్డాడు. సినిమాలోని పాత్రల ప్రవర్తన కొన్నిసార్లు లాజిక్కు అందదు. ముఖ్యంగా, ఓ కీలక నిర్ణయం సమయంలో ప్రధాన పాత్రలు తీసుకొనే నిర్ణయానికి హేతువు కనిపించదు. పోస్టర్లలో ఫోటోలకూ, కథకూ సంబంధం లేకపోవడమూ కన్ఫ్యూజింగ్ పబ్లిసిటీ ట్యాక్టిక్స్. అలాంటి తప్పులనూ, కన్నడ ఛాయలనూ, తగ్గిన వేగాన్నీ పట్టించుకోకపోతే, టికెట్ కొనకుండా ఇంట్లోనే చూస్తున్నాం గనక ఈ మాత్రం చాలు లెమ్మని సరిపెట్టుకుంటాం. కొసమెరుపు: సినిమా చూస్తున్నా... సీరియల్ ఫీలింగ్! బలాలు: ఊహించని ట్విస్టున్న కథ పాత్రధారుల నటన, రీరికార్డింగ్ చివరి ముప్పావుగంట సినిమా బలహీనతలు సీరియల్లా సాగే కథనం ఆర్టిఫిషియల్ డైలాగ్స్ లాజిక్కు అందని పాత్రల ప్రవర్తన – రెంటాల జయదేవ -
ఎంటర్టైనింగ్ రియలిజమ్
చిత్రం: ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’; తారాగణం: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ; నిర్మాత: వి. ఆనందప్రసాద్; ద ర్శకత్వం: వినోద్ అనంతోజు; రిలీజ్: నవంబర్ 20; ఓ.టి.టి: అమెజాన్. కథకైనా, కళకైనా మధ్యతరగతి జీవితం ఎప్పుడూ మంచి ముడిసరుకు. ఆ జీవితాలను వాస్తవికంగా చూపిస్తూనే, వినోదం పంచే నిజా యతీ నిండిన ప్రయత్నం ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. కథేమిటంటే..: ఇది కొన్ని మిడిల్ క్లాస్ కుటుంబాల కథ. గుంటూరుకు కాస్తంత దూరంలో ఉండే కొలకలూరు గ్రామంలో ఓ చిన్న హోటల్ నడుపుతుంటారు కొండలరావు, అతని భార్య (గోపరాజు రమణ, సురభి ప్రభావతి). వాళ్ళ ఒకే ఒక్క కొడుకు రాఘవ (ఆనంద్ దేవరకొండ). తల్లి దగ్గర నేర్చిన బొంబాయి చట్నీ స్పెషల్‌తో పక్కనున్న గుంటూరు పట్నంలో హోటల్ పెట్టి, పైకి రావాలని హీరో తపన. ఇంటర్ చదివే రోజుల్లోనే సంధ్య (వర్ష బొల్లమ్మ)తో ప్రేమ. హీరో గుంటూరు వెళతాడు. తల్లీతండ్రి పొలం అమ్మి ఇచ్చిన సొమ్ముతో హోటల్ పెడతాడు. తరువాత ఏమైంది, ప్రేమ ఎలా గెలిచిందన్నది మిగతా కథ. ఎలా చేశారంటే..: హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, కన్నడిగురాలు వర్ష బొల్లమ్మ ఇద్దరూ పాత్రలే కనిపించేలా చేశారు. ఈ సినిమాకు హీరో కాని హీరో మాత్రం కథానాయకుడి తండ్రి పాత్రధారి గోపరాజు రమణ. రంగస్థల నటుడిగా ప్రసిద్ధుడై, టీవీ సీరియల్స్, కొన్ని సినిమాలతో తెర పరిచితుడైన రమణ ఈ తండ్రి పాత్రధారణతో సినిమాకు ప్రాణం పోశారు. ఈ పాత్ర ఆయన కెరీర్‌కు కచ్చితంగా ఓ మలుపు. సురభి జమునా రాయలు లాంటి రంగస్థల కళా కారులే అత్యధికులు నటించారీ సినిమాలో! అందుకే, హీరో, హీరోయిన్ల మాటెలా ఉన్నా... చుట్టుపక్కల కనిపించే తల్లితండ్రులు, స్నేహితుల మొదలు తాగుబోతు తండ్రితో వేగలేక మొబైల్ ఫోన్ల షాపులో పనిచేసే అమ్మాయి (దివ్య శ్రీపాద), మనవరాలి చదువు కోసం తపిస్తూ పాలు అమ్మే అంజయ్య (కట్టా ఆంటోనీ) దాకా చాలామందితో ఐడెంటిఫై అవుతాం. ప్రతి ఒక్కరితో ప్రేమలో పడతాం. అలాంటి పాత్రల రూపకల్పన దర్శక, రచయితల జీవితానుభవ ప్రతిభ. అతిథి పాత్రలో ‘పెళ్ళిచూపులు’ తరుణ్ భాస్కర్ కనిపిస్తారు. ఎలా తీశారంటే..: మధ్యతరగతి జీవితం, సాహితీ వాసనలతో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి, షార్ట్ ఫిల్మ్‌ల మీదుగా సినిమాల్లోకి వచ్చిన కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు తొలి ప్రయత్నం ఈ చిత్రం. ఈ గుంటూరు కుర్రాడు మొట్టమొదటి గృహప్రవేశం సీన్ నుంచే సినిమాకు ఓ టోన్ సెట్ చేశాడు. జనార్దన్ పసుమర్తి రాసిన కథ, మాటలు చూస్తే అచ్చంగా ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడి సంబోధనలు, సామెతల మొదలు తిట్ల దాకా అన్నీ వినోదం పంచుతాయి. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ స్వీకర్ అగస్తి బాణీల్లో ‘సంధ్యా’, ‘గుంటూరు’ పాటల లాంటివి బాగు న్నాయి. గుంటూరు వాతావరణం, అక్కడి ఫేమస్ ఫుడ్ జాయింట్ల పాట (రచన – కిట్టు విస్సాప్రగడ, గానం – అనురాగ్ కులకర్ణి) కొన్నేళ్ళు ఆ ప్రాంతవాసుల థీమ్ సాంగ్‌గా నిలబడిపోతుంది. ఇక, విక్రమ్ ఇచ్చిన నేపథ్య సంగీతం మరో ఆయువుపట్టు. దేవుణ్ణి నమ్మని హీరో – జాతకాల పిచ్చి ఉన్న అతని స్నేహితుడు, డబ్బున్న పెద్ద సంబంధంతో కూతురి జీవితాన్ని కట్టేయాలనుకొనే ఓ నాన్న – ఆటోవాడికైనా కూతురినిచ్చి పెళ్ళి కానిచ్చేసి తన తాగుడుకు ఢోకా లేకుండా చూసుకోవాలనుకొనే మరో తండ్రి, తండ్రీ కొడుకుల మధ్య సయోధ్యకు ప్రయత్నించే ఓ తల్లి – దురాశతో అయిన సంబంధాన్ని వద్దనుకున్న భర్తకు నచ్చజెప్పే ఓ భార్య... ఇలా చాలా పాత్రలు జీవితంలో నుంచి తెర మీదకు వచ్చాయి. జీవితంలోనూ, మనుషుల్లోనూ సింప్లిసిటీ ఎంత ఆనందాన్నిస్తుందో ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది. అయితే, రెండుంబావు గంటల కథాకథనంలో హీరో– హీరోయిన్ల ఇంటర్ ప్రేమకథ పర్యవసానాలను తెరపై పూర్తిగా చూపించలేదు. చెట్టు మీద నుంచి మామిడికాయ పడే దాకా బొంబాయి చట్నీలో నిపుణుడైన హీరోకు ఆ వంటలో మామిడి వాడాలనేది తెలీదంటే నమ్మలేం. రెసిపీ మార్చాడందామంటే, ఆ స్పష్టతా లేదు. పాలు పోసే అంజయ్య, చిట్ ఫండ్ డబ్బులతో ఊరికి రోడ్డు వేయించి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న అతి మంచితనపు పెదనాన్న పాత్ర లాంటి సెంటిమెంట్, ఎమోషన్లను మరింతగా తెరపై చూపించి ఉంటే, సినిమా వేరే స్థాయికి వెళ్ళేది. అలాగే, సాగదీత తగ్గించి, క్లైమాక్స్ ముందర కథనం పేస్ పెంచి, మరింత పట్టుగా రాసుకోవాల్సింది. హఠాత్తుగా సినిమా అయిపోయిందన్న ఫీలింగ్ రాకుండా చూడాల్సింది. అయితే, సినిమా మొత్తం మీద అందించిన ఫీలింగ్‌తో పోలిస్తే, కొత్త కుర్రాళ్ళ తొలి యత్నంగా అవన్నీ క్షమించేయవచ్చు. వెరసి, ఇదో రియలిస్టిక్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ ఉన్న ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఇరవై ఏళ్ళ క్రితం దర్శకులు నాగేశ్ కుకునూర్ ‘హైదరాబాద్ బ్లూస్’, శేఖర్ కమ్ముల ‘డాలర్ డ్రీమ్స్’ మొదలు ఇటీవలి ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘పలాస’ లాంటి ప్రయత్నాలకు కొనసాగింపు ఇప్పుడీ లేటెస్ట్ ఫిల్మ్ అనుకోవచ్చు. ట్రైలర్లోనే అంతా చెప్పేసి, సినిమాలో సర్ ప్రైజులు లేకుండా చేసిన దర్శక, రచయితల తొలి ప్రయత్నంలో ఎత్తుపల్లాలున్నా... ఈ చిత్రాన్ని ఇంటిల్లపాదీ కలసి ఇంట్లోనే ఓటీటీలో చూడవచ్చు. కొసమెరుపు: చివరలో టేస్టు తగ్గినా... (అభి)రుచికరమైన బొంబాయి చట్నీ! బలాలు: కథలో నేటివిటీ మనల్ని మనకు గుర్తుచేసే పాత్రలు స్టేజ్ ఆర్టిస్టుల సినీ నటన గుంటూరు యాస, పాటలు నేపథ్య సంగీతం. బలహీనతలు: ముగింపు తెలిసే సింపుల్ స్టోరీలైన్ చివరలో సడలిన కథ, కథనం ర్ధంతర ముగింపు వినోదానికి దీటైన సెంటిమెంట్ లేమి – రెంటాల జయదేవ -
హద్దులు చెరిపిన ఆకాశం
చిత్రం: ఆకాశం నీ హద్దురా; తారాగణం: సూర్య, అపర్ణా బాలమురళి, పరేశ్ రావల్, మోహన్ బాబు; మాటలు: రాకేందు మౌళి; సంగీతం: జి.వి. ప్రకాశ్ కుమార్; కెమెరా: నికేత్ బొమ్మిరెడ్డి; నిర్మాత: సూర్య; రచన – దర్శకత్వం: సుధ కొంగర; రిలీజ్ తేదీ: నవంబర్ 12; ఓటీటీ వేదిక: అమెజాన్; ఏ రంగంలో పైకి రావాలన్నా, ఏ కొత్త ఆలోచనైనా జనామోదం పొందాలన్నా ఎన్నో కష్టనష్టాలు తప్పవు. ఆ పురిటినొప్పులు భరిస్తేనే అంతిమ విజయం వరిస్తుంది. పౌర విమానయాన రంగంలో సామాన్య పౌరుడికి కూడా విమానంలో చౌకధరకు చోటివ్వాలని తపించిన ఓ మంచి మనిషి కథ ఇది. ‘ఎయిర్ దక్కన్’ ఫౌండర్ కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా, సినిమాటిక్ కల్పనలు జోడించి మహిళా దర్శకురాలు సుధ కొంగర చేసిన స్ఫూర్తిదాయక ప్రయత్నం – ‘ఆకాశం నీ హద్దురా’. కథేమిటంటే..: చుండూరు అనే చిన్న ఊళ్ళో మాస్టారు రాజారావు కొడుకు చంద్రమహేశ్ (సూర్య). నిమ్న వర్గానికి చెందినవాడైనా ఆ ఊరికి కరెంట్ తెప్పించడంలో, చివరకు రైలు హాల్టు వచ్చేలా కృషి చేయడంలో రాజారావు ఎంతో కృషి చేస్తాడు. అహింస, అర్జీ పద్ధతుల్లో సాగే రాజారావు పోరాటాన్ని తరాల అంతరంతో కొడుకు హర్షించడు. తల్లి పార్వతి (ఊర్వశి) సయోధ్యకు ప్రయత్నించినా, కొడుకు వినడు. నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో చదువుకొని, ఎయిర్ ఫోర్స్ లో చేరతాడు. అంతిమ ఘడియల్లో ఉన్న తండ్రిని చూడడానికి విమానంలో వద్దామన్నా, డబ్బు చాలక టైమ్‌కి రాలేకపోతాడు హీరో. ఆ బాధతో ఎలాగైనా సామాన్యమైన ఊరి జనం మొత్తానికీ చౌకధరకు విమానయానం అందుబాటులోకి తేవాలనుకుంటాడు. ఆ క్రమంలో అతనికి చిన్నస్థాయి నుంచి పైకి ఎదిగిన జాజ్ ఎయిర్ లైన్స్ అధిపతి పరేశ్ గోస్వామి (పరేశ్ రావల్) ప్రేరణ అవుతారు. తీరా అదే పరేశ్ అసూయతో, అహంకారంతో హీరో ప్రయత్నానికి అడుగడుగునా అడ్డుపడతాడు. చివరకు హీరో ఎలా తన కలను నిజం చేసుకున్నాడో మిగతా కథ. ఎలా చేశారంటే..: కుగ్రామంలో పుట్టి, ఎడ్లబండి మీద తిరిగిన కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత అనుభవాల ఆత్మకథ ‘సింప్లీ ఫ్లయ్’ ఈ సినిమాకు ప్రధాన ఆధారం. వరుసగా ఫ్లాపులతో ఉన్న హీరో సూర్య ఆ పాత్రను ఆవాహన చేసుకొని, అభినయించారు. ఆర్థిక స్వావలంబన, అదే సమయంలో భర్తకు అన్నిఅండగా నిలిచే మనస్తత్వం కలిసిన బలమైన హీరోయిన్ పాత్రలో అపర్ణ మనసుకు హత్తుకుంటారు. హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలు, సంభాషణలు చూస్తే, మంచి మణిరత్నం సినిమా చూస్తున్నామనిపిస్తుంది. విలన్‌గా పరేశ్ రావల్ తక్కువ మాటలతో, ఎక్కువ భావాలు పలికిస్తూ బాగున్నారు. వైమానికదళ అధికారి పాత్రలో మోహన్ బాబు బాగున్నారు. కానీ, ఆ పాత్ర రూపకల్పన, కథ చివరకు వచ్చేసరికి దక్కిన ప్రాధాన్యం ఆశించినంత బలంగా లేవు. హీరో తల్లితండ్రుల మొదలు స్నేహితులు, గవర్నమెంట్ ఆఫీసు అధికారుల దాకా చాలా పాత్రలు నిడివితో సంబంధం లేకుండా మనసుపై ముద్ర వేస్తాయి. ఎలా తీశారంటే..: మణిరత్నం వద్ద పనిచేసిన డైరెక్టర్ సుధ కొంగరపై తన గురువు సినిమా టేకింగ్ ప్రభావం బలంగా ఉన్నట్టు తెరపై కనిపిస్తుంది. సినిమా ఫస్ట్ సీన్ నుంచి ప్రేక్షకులు కథలో ఇన్ వాల్వ్ అయిపోతారు. పాత్రలనూ, సన్నివేశాలనూ, బలమైన సంఘటనలనూ కథకు తగ్గట్టు వాడుకున్నారు. లో కాస్ట్ ఎయిర్ లైన్స్ లాంటి టెక్నికల్ అంశాన్ని సైతం అందరికీ అర్థమయ్యేలా, ఎమోషనల్ గా చూపించడం విశేషం. కొన్ని చోట్ల కంటతడి పెట్టకుండా ఉండలేం. అందుకే, భావోద్వేగాలను ఇష్టపడేవారికి కచ్చితంగా నచ్చే సినిమా ఇది. అయితే, అక్కడక్కడా బాగున్న ఎమోషనల్ సీన్లను కూడా పరిమితికి మించి కొనసాగించడంతో మెలోడ్రామా మితిమీరింది. తండ్రి చనిపోయాక ఇంటికొచ్చిన హీరోతో తల్లి వాదన సీన్, పోస్టాఫీస్‌లో ఊరి జనం హీరోతో ఫోన్లో మాట్లాడే సీన్ లాంటివి బాగున్నా, కొద్దిగా కత్తెరకు పదును పెట్టి ఉండాల్సింది. అలాగే, లల్లాయి లాయిరే అంటూ మొదలయ్యే పాట మినహా మిగిలినవేవీ గుర్తుండేలా లేకపోవడం చిన్న లోటే. అయితే, ఇలాంటి లోటుపాట్లన్నీ బిగువైన కథాకథనంలో కొట్టుకుపోతాయి. శాలినీ ఉషాదేవితో కలసి దర్శకురాలు రాసుకున్న స్క్రీన్ ప్లే, సినిమా నిర్మాణ విలువలు, రీరికార్డింగ్, కెమెరా పనితనం ప్రధాన బలాలయ్యాయి.. గోపీనాథ్ జీవితకథతో పాటు చౌకధరలో విమానయానమనే విభాగంలో జరిగిన అనేక నిజజీవిత సంఘటనలను కూడా కలగలిపి, ప్రధాన పాత్రల స్వరూప స్వభావాలను పకడ్బందీగా రాసుకున్నారు సుధ కొంగర. రాసుకోవడంతో స్క్రిప్టు ఆసక్తిగా తయారైంది. ఇప్పటి వరకు స్పోర్ట్స్ డ్రామాలు, సినిమా యాక్టర్లు, పొలిటీషియన్ల బయోపిక్‌లకే పరిమితమైన చోట తెలుగు మహిళ సుధ కొంగర చేసిన ఈ ప్రయత్నం అందుకే ఆనందం అనిపిస్తుంది. హీరోకూ, ప్రత్యర్థికీ మధ్య వ్యాపార పోరాటం సహా, కథలో అడుగడుగునా హీరోకు ఎదురయ్యే సవాళ్ళు ప్రేక్షకుల ఆసక్తిని చివరికంటా నిలుపుతాయి. సినిమా క్లైమాక్స్ లో ఎలాగైనా హీరోనే గెలుస్తాడని తెలిసినా, రెండున్నర గంటలూ ఆపకుండా చూసేలా చేస్తుంది. ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ కంటెంట్ కావడంతో, కరోనా వేళ ఇటీవల రిలీజైన సినిమాల్లో ఇది ఫస్ట్ బిగ్ ఓటీటీ హిట్‌గా నిలిచే సూచనలూ ఉన్నాయి. కొసమెరుపు: ఇటీజ్ నాట్ ఎ ‘భయో’పిక్! బలాలు ► స్ఫూర్తిదాయక కథ ► బిగి సడలని కథనం ► దర్శకత్వ ప్రతిభ ► పాత్రల రూపకల్పన, నటన ► సీన్లలోని ఎమోషన్ బలహీనతలు ► అక్కడక్కడ అతి మెలోడ్రామా ► డబ్బింగ్ సినిమా వాసనలు ► ఆకట్టుకోని పాటలు ► క్లైమాక్స్ లో కాస్తంత తికమక – రెంటాల జయదేవ -
ఆర్. నారాయణమూర్తి సినిమాకు 25 ఏళ్లు
పాతికేళ్ళ తరువాత కూడా ఒక సినిమా గుర్తుందంటే... అందులోని పాత్రలు, పాటలు, అభినయం గుర్తున్నాయంటే.. ఆ సినిమా కచ్చితంగా ప్రత్యేకమే. దాసరి నారాయణరావు నిర్మాతగా, దర్శకుడిగా తన శిష్యుడు ఆర్. నారాయణమూర్తి హీరోగా రూపొందించిన ‘ఒరేయ్ రిక్షా’ ఆ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇవాళ్టికి ఈ సినిమాకు పాతికేళ్ళు. సరిగ్గా పాతికేళ్ళ క్రితం 1995. అగ్ర దర్శకుడు దాసరి నారాయణరావుకు ఎందుకో కాలం కలసిరాలేదు. వరుసగా కొన్ని ఫ్లాపులు. ఆర్థికంగా అనుకోని ఆటుపోట్లు! గతంలో ఆయనతో హిట్లు సాధించిన అగ్ర హీరోలు కూడా ఆ సమయంలో డేట్లు ఖాళీ లేవంటూ బిజీ మంత్రం పఠించసాగారు. సరిగ్గా అప్పుడే ఆయనకు తన శిష్యుడు ఆర్. నారాయణమూర్తి, అతని కోసం గతంలో తాను అనుకున్న ఓ మదర్ సెంటిమెంట్ కథ గుర్తొచ్చాయి. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..: అంతకుముందు కొన్నేళ్ళ క్రితం దాసరి ఓ తల్లి సెంటిమెంట్ కథ అనుకున్నారు. అప్పట్లో సామాజిక విప్లవ కథాంశాలతో ముందుకొస్తున్న టి. కృష్ణ దర్శకుడిగా, ఆర్. నారాయణమూర్తి హీరోగా దాసరి ఆ కథను నిర్మించాలనుకున్నారు. టి. కృష్ణతో మాట్లాడారు కూడా. అంతా ఓకే. కానీ, బిజీగా ఉన్న టి. కృష్ణ క్యాన్సర్ బారిన పడి కన్నుమూశారు. ఇప్పుడు టి. కృష్ణ లేరు. కానీ, ఆర్. నారాయణమూర్తి నమ్మినబంటులా గురువు గారి కోసం సిద్ధంగా ఉన్నారు. నిజానికి, ఈ మధ్య గ్యాప్‌లో నారాయణమూర్తి నిర్మాతగా, దర్శకుడిగా మారి, ‘అర్ధరాత్రి స్వతంత్రం, ఎర్రసైన్యం’ లాంటి వరుస విప్లవ సినిమాలు తీశారు. ఆ భారీ ఘన విజయాలతో ‘పీపుల్స్ స్టార్’ హీరోగా ఎదిగి, బిజీగా ఉన్న నారాయణమూర్తిని గురువు దాసరి పిలిచారు. గురువు గారి కోసం పైసా పారితోషికం లేకుండా, ఏం చేయడానికైనా శిష్యుడు సిద్ధమయ్యారు. మునుపటి తల్లీ కొడుకుల కథలో మరిన్ని అంశాలు జొప్పించి, లీడర్ వర్సెస్ క్యాడర్ అనేది ప్రధానాంశంగా, సినిమా తీద్దామన్నారు దాసరి. అలా దాసరి తన పేరు మీద దాసరి ఫిలిమ్ యూనివర్సిటీ పతాకం స్థాపించి, ఆ బ్యానర్‌పై తొలి సినిమాగా తీసిన చిత్రం ‘ఒరేయ్ రిక్షా’. సమకాలీన సామాజిక ఘటనలతో..: అంతకు ముందు వేషాల కోసం మద్రాసు వచ్చిన ఆర్. నారాయణమూర్తికి చిన్న వేషాలతో సినీజీవితమిచ్చిన దాసరి, కాలం మారి తన శిష్యుడు స్టార్ అయ్యాక, అడిగి హీరోగా పెట్టి మరీ తీసిన ఏకైక సినిమా ఇది. ఒక రాజకీయ నేత చెప్పిన మాటలు నమ్మి, అతని కోసం తన వాళ్ళతో ఓట్లన్నీ వేయించి, క్యాడర్‌గా ఒక రిక్షా కార్మికుడు శ్రమిస్తే, చివరకు ఆ లీడరే ఆ క్యాడర్ అందరినీ మోసం చేస్తే ఏమైందనేది కథాంశం. రాజకీయ నేతలు, పాలనా యంత్రాంగం, పోలీసు వ్యవస్థ గనక ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడకపోతే, యువతరం మరో మార్గం లేక తుపాకీ పట్టుకొని అడవుల్లోకి పోవాల్సి వస్తుందని సినిమాలో చెప్పారు దాసరి. రిక్షా కార్మికుడు సూర్యంగా ఆర్. నారాయణమూర్తి, అతని భార్యగా రవళి, అతని చెల్లెలిగా మధురిమ (నటి ప్రభ మేనకోడలు), తల్లిగా శివపార్వతి, రాజకీయ నేతగా రఘునాథరెడ్డి నటించారు. నారాయణమూర్తి ప్రభృతుల అభినయం, నాటక రచయిత సంజీవి రాసిన పదునైన మాటలు, ముక్కురాజు కొరియోగ్రఫీ – ఇవన్నీ ‘ఒరేయ్ రిక్షా’ను పైయెత్తున నిలిపాయి. నీ పాదం మీద పుట్టుమచ్చనై..: దాసరితో సంగీత దర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్ పనిచేసిన తొలి చిత్రం ఇదే. ఆ తరువాత ఆ కాంబినేషన్లో ‘ఒసేయ్ రాములమ్మా’ సహా పలు చిత్రాలు వచ్చాయి. విప్లవ గాయకుడు గద్దర్ తాను రాసిన ‘రక్తంతో నడుపుతాను రిక్షాను..’ సహా పలు ప్రైవేట్ జనగీతాలను ఈ సినిమాలో వాడుకొనేందుకు అనుమతినిచ్చారు. ఆత్మీయుడు ఆర్. నారాయణమూర్తి కోసం పారితోషికమైనా తీసుకోలేదు. ఈ సినిమాలో ‘రక్తంతో నడుపుతాను.., జాగోరే జాగో జాగో.., జాతరో జాతర..’ – ఇలా అన్ని పాటలూ హిట్. అన్నాచెల్లెళ్ళ అనుబంధమూ కీలకమైన ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా..’ అనే పాట రాసి ఇచ్చారు గద్దర్. ఈ పాట చిరస్థాయిగా నిలిచింది. ఆ పాట రాసిన గద్దర్‌కూ, పాడిన ‘వందేమాతరం’ శ్రీనివాస్‌కూ ఇద్దరికీ ప్రభుత్వం ఆ ఏడాది నంది అవార్డులు ప్రకటించింది. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో గద్దర్ ఆ అవార్డును తిరస్కరించడం వేరే కథ. మరపురాని గురుదక్షిణ: పూర్తిగా తిరుపతి పరిసరాల్లో, కొంత మద్రాసులో చిత్రీకరణ జరుపుకొన్న ‘ఒరేయ్ రిక్షా’ అప్పట్లో పెద్ద సంచలనం. పాతికేళ్ళ క్రితం 1995 నవంబర్ 9న రిలీజైన ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ హిట్‌గా నిలిచింది. పేరుతో పాటు పైసలూ తెచ్చింది. మచ్చుకు చెప్పాలంటే – షూటింగ్ వేళ గురువు గారికి ఇబ్బంది లేకుండా, ఈస్ట్ గోదావరి రైట్స్ కోసమంటూ 20 లక్షలు ముట్టజెప్పారు నారాయణమూర్తి. సినిమా విడుదలయ్యాక ఏకంగా అక్కడ 60 లక్షలు వసూలు చేసింది. మళ్ళీ దాసరికి కొత్త ఊపు తెచ్చింది. సాక్షాత్తూ దాసరి సతీమణి పద్మ సైతం ‘‘మీ గురువు ఋణం తీర్చుకున్నావయ్యా. మళ్ళీ మీ గురువును నిలబెట్టావయ్యా’’ అని తనతో అన్న విషయాన్ని ‘పీపుల్స్ స్టార్’ ఇప్పటికీ చెమర్చిన కళ్ళతో గుర్తు చేసుకుంటారు. తరువాత దాసరి ‘ఒసేయ్ రాములమ్మా’ లాంటి మరో ఆల్ టైమ్ హిట్ తీయడం వెనుక ‘ఒరేయ్ రిక్షా’ ప్రభావం కనిపిస్తుంది. బడుగు, బలహీన వర్గాల ఆత్మాభిమానాన్నీ, ఆత్మగౌరవాన్నీ చాటిచెప్పిన ఈ రెండు చిత్రాలూ దాసరి కెరీర్లో మైలురాళ్ళుగా మిగిలిపోయాయి. సాక్షాత్తూ దాసరి సైతం హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ఆడియో ఫంక్షన్లో హీరో కృష్ణ, నిర్మాత ఎమ్మెస్ రెడ్డి సమక్షంలో ‘‘విప్లవ సినిమాలు తీయడం ఓ ముళ్ళబాట. ఆ ముళ్ళబాటను సరిచేసి, రాస్తాగా మార్చాడు నా బిడ్డ ఆర్. నారాయణమూర్తి. ఆ రాస్తాలో ఇవాళ నేను, అనేకమంది పయనిస్తున్నాం’’ అని సభాముఖంగా మెచ్చుకోవడం గురువు ముఖతః శిష్యుడికి దక్కిన ఓ అపూర్వ గౌరవం. ఓ శిష్యుడు చెల్లించిన గురుదక్షిణగా చరిత్రలో మిగిలిపోయిన చిత్రం – ‘ఒరేయ్ రిక్షా’. – రెంటాల జయదేవ -
చూడాలంటే భయపెట్టే.. చంద్రిక
సినిమా రివ్యూ: చంద్రిక చిత్రం - ‘చంద్రిక’, తారాగణం - జయరామ్ కార్తీక్, శ్రీముఖి, కామ్నా జెత్మలానీ, గిరీష్ కర్నాడ్, ఎల్బీ శ్రీరామ్, ‘సత్యం’ రాజేశ్ మాటలు - నాగేశ్వరరావు పాటలు - వనమాలి సంగీతం - గుణ్వంత్ కెమెరా - కె. రాజేందర్ బాబు ఎడిటింగ్ - వి. సురేష్‌కుమార్ కథ, స్క్రీన్‌ప్లే - సాజిద్ ఖురేషీ నిర్మాత - వి. ఆశ దర్శకత్వం - యోగేశ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు హార్రర్ సినిమాలు చాలా వస్తున్నాయి. అందులో లేటెస్ట్ ఎడిషన్ ఈ ‘చంద్రిక’. వాల్‌పోస్టర్లలో ‘చంద్రముఖి’ తరహాలో డ్యాన్స్ దుస్తుల్లో హీరోయిన్ కనిపించడం, అలాగే కామ్నా జెత్మలానీ లాంటి పేరున్న తార కూడా నటించడం వల్ల ఈ సినిమా పట్ల కొంత ఆసక్తి నెలకొంది. మరి, ఈ శుక్రవారం వచ్చిన ‘చంద్రిక’ ఆ ఆసక్తికి తగ్గట్లే ఉందా? కథేమిటంటే.. అనగనగా ఒక ఊరు. అందులో ఓ పెద్ద బంగళా. ఆ బంగళాను కొనుక్కున్నవాళ్ళకు చిత్రవిచిత్రమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. దాంతో, అందరూ భయపడి పారిపోతుంటారు. ఆ పరిస్థితుల్లో ఆ బంగళాను అర్జున్ (తొలి పరిచయం - జయరామ్ కార్తీక్) అనే చిత్రకారుడు కొనుక్కుంటాడు. అది తన గురువైన చిత్రకారుడు రవివర్మ ఒకప్పుడు ఉన్న బంగళా అనీ, అందుకే దాన్ని కొన్నాననీ తన భార్య శిల్ప (తెలుగు యాంకర్, నటి శ్రీముఖి)కి చెబుతాడు. ఆ హవేలీలో ఆర్ట్ గ్యాలరీ పెడదామని అతను అనుకుంటే, ‘లేదు... అక్కడే ఉందామ’ని భార్య అంటుంది. అలా ఆ దంపతులు ఆ బంగళాకు కాపురం మారుస్తారు. అక్కడ నుంచి శిల్ప ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఆ మార్పులను భర్త మొదట పట్టించుకోడు. భవంతిలో ఆత్మ ఉందనే సంగతి అతనికీ క్రమంగా అర్థమవుతుంది. ఆ బంగళాలోని ఒక పెద్ద చిత్తరువు (ఆ బొమ్మలో కామ్నా జెత్మలానీ)ని చూపించి, చంద్రికను అనడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. సెకండాఫ్‌కు వచ్చేసరికి, ఆ చంద్రిక ఎవరనే ప్రశ్న వస్తుంది. ఆ భూతాన్ని వదిలించడానికి వచ్చిన మంత్రవేత్త సమక్షంలో ఫ్లాష్‌బ్యాక్ ఓపెన్ అవుతుంది. చంద్రిక ఎవరనే విషయం అడిగిన మంత్రవేత్తతో హీరో జరిగిన కథ చెప్పడం మొదలుపెడతాడు. ఆ బంగళా ప్రసిద్ధ చిత్రకారుడు రవివర్మ (గిరీష్ కర్నాడ్)ది అనీ, అతని తమ్ముడి కూతురే చంద్రిక (కామ్నా జెత్మలానీ) అనీ చెబుతాడు. ఏకలవ్య శిష్యుడిగా గురువు గారి వద్ద చిత్రకళ నేర్చుకోవడానికి వచ్చిన తనకూ, చంద్రికకూ మధ్య పెరిగిన ప్రేమ బంధం గురించి చెబుతాడు. తమ ప్రేమ పెళ్ళిదాకా వచ్చినా, పీటల మీద పెళ్ళి ఆగిపోయినట్లు చెబుతాడు. కానీ, దానికి తాను కారణం కాదని చెబుతాడు. మంత్రవేత్త మాటలతో ఆ తరువాత జరిగిన కథ తెలుసుకోవడం కోసం అన్వేషణ మొదలుపెడతాడు. ఇంతకీ అసలేమైంది? చంద్రిక ఎలా చనిపోయింది? లాంటివన్నీ మిగతా కథ. ఎలా చేశారంటే...? ఇది ప్రధానంగా కన్నడ సినిమా. అయితే, కొంతమంది తెలుగు ఆర్టిస్టుల్ని కూడా పెట్టుకొని, రీషూట్స్ చేసి ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో తయారైన సినిమా అనగలిగారు. ఈ చిత్ర కథానాయక పాత్రధారికి తెలుగులో ఇదే తొలిచిత్రం. ఆ పాత్రలో ఆయన చేయగలిగిందీ, చేసిందీ ఏమీ లేదు. టీవీ యాంకర్, ‘జులాయి’ చిత్రంలో అల్లు అర్జున్ చెల్లెలు పాత్రధారిణి అయిన శ్రీముఖి ఈ చిత్రంలో హీరోయిన్. ఆమె కొన్ని చోట్ల చూడడానికి బాగుంది. ముఖ్యంగా, చంద్రిక (కామ్నా జెత్మలానీ) పూనినట్లు అనిపించే సీన్స్‌లో బాగా చేశారు. ఇంటర్వెల్‌కు ముందు తానే చంద్రికను అంటూ వచ్చే ముగ్గులోని ఆత్మ సీన్లో శ్రీముఖి ఆంగికం, ఆహార్యం, క్లిష్టమైన భంగిమల్లో ఆమె చేసిన వర్క్ బాగుంది. చంద్రికగా కామ్నా జెత్మలానీ కనిపించేది కాసేపే అయినా, సినిమాకు అదనపు ఆకర్షణ. ఆమెకూ, హీరోకూ మధ్య పెట్టిన రొమాంటిక్ సాంగ్ ఒక రకంగా చెప్పాలంటే, స్పెషల్ ఐటమ్ సాంగ్. గిరీష్ కర్నాడ్ లాంటి సీనియర్ నటుడున్నా, కథలో ఆయనకున్న పాత్ర కొద్దిగానే. ‘సత్యం’ రాజేశ్, ఎల్బీ శ్రీరామ్, ‘తాగుబోతు’ రమేశ్ లాంటి వారందరూ చేసినవి తెరపై కనిపించడానికే తప్ప కథను నడిపించడానికి ఉపయోగపడిన పాత్రలు కావు. ఎలా ఉందంటే...? దర్శకుడు యోగేశ్‌కు ఇదే తొలి చిత్రం. ఆ అనుభవ రాహిత్యం బయటపడిపోయింది. క్యారెక్టర్ల పరిచయం కాసేపటికే అయిపోతుంది. బంగళాలోని భూతం సంగతి సినిమా మొదలైన కాసేపటికే అర్థమైపోతుంది. ఇక, ఆ తరువాత కథను పట్టాలెక్కించి, వేగంగా నడపాల్సింది. కానీ, అక్కడ అవసరం లేని, ఆసక్తి కలిగించని సీన్లు పెట్టారు. వాటికి తోడు పానకంలో పుడక లాగా పాటలు. సెకండాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్ మొదలుపెట్టినప్పటి నుంచి సినిమా రసకందాయంలో పడాలి. కానీ, అలా జరగలేదు. సరికదా... అనాసక్తిగా తయారైంది. ఫ్లాష్‌బ్యాక్ ఘట్టం కూడా అంతంత మాత్రంగానే ఉంది. హీరో, కామ్నా జెత్మలానీల ప్రేమఘట్టాన్ని అతిగా సాగదీశారు. ఫ్లాష్‌బ్యాక్ తరువాతహీరో కనిపెట్టిన అంశాలు కూడా ఆసక్తిగా లేవు. చివరకు వచ్చేసరికి, రజనీకాంత్ ‘చంద్రముఖి’ తరహా క్లైమాక్స్‌ను అనుకరించారు. కానీ, అదీ అంతంత మాత్రమే. మాటి మాటికీ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే దయ్యం పాట ముక్కలు ముక్కలుగా విన్నప్పుడు బాగుంది. గుణ్వంత్ సంగీతం, సేతు సౌండ్ ఎఫెక్ట్స్ కొంత సినిమాను కాపాడాయి. కెమేరా వర్క్ ఫరవాలేదు. కానీ, కథలో పస లేనప్పుడు, చెప్పిన విధానంలో దమ్ము లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు. విషాదం ఏమిటంటే, ‘చంద్రముఖి’ని చూసి, ఆ ధోరణిలో వెళ్ళాలని వాత పెట్టుకున్న ఈ హార్రర్ జానర్ సినిమాలో క్రైమ్ ఎలిమెంట్ కానీ, భయపెట్టే అంశాలు కానీ, కనీసం కాసేపు నవ్వు తెప్పించే విషయాలు కానీ లేకపోవడం! కన్నడంలో ప్రధానంగా తీసిన సినిమా కావడంతో ఆ తరహా టేకింగ్ తెలిసిపోతుంటుంది. వెరసి, తెలుగులో కన్నా ఒక రోజు ముందే కన్నడంలో విడుదలైన ఈ ద్విభాషా ‘చంద్రిక’ జనం చూడడానికి భయపడే సినిమాయే తప్ప, చూస్తే భయపడే సినిమా కాదు! - రెంటాల జయదేవ. -
అంతర్జాతీయ గేయానువాదకుడు... అక్షరారాధకుడు!
‘ఆకలి మంటచె మలమలమాడే అనాథులందరు లేవండోయ్..!’ ఇవాళ్టికీ ఈ పల్లవి, ఆ వెంట వచ్చే చరణాలు ఎంతోమందికి సుపరిచితం. తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమంలో విస్తృత ప్రాచుర్యం పొంది, లక్షల మంది శ్రమజీవులు, కమ్యూనిస్టులు పాడు కుంటున్న గేయం. ప్రపంచ శ్రామిక గీతం ‘కమ్యూ నిస్ట్ ఇంటర్నేషనల్’కు అచ్చ తెలుగు అనువాదం. అలా తెలుగులోకి దాన్ని తొలిసారి అనువదించిన వ్యక్తి - బాలాంత్రపు నళినీకాంతరావు. కాకినాడలో బి.ఎ. చదువుకుంటున్న రోజుల్లో ఆయన ఈ గేయం రాసిన వైనం ఆశ్చర్యం కలిగి స్తుంది. ‘ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ’ స్థాపన (1936 జనవరి 29) కన్నా దాదాపు ఏడాది ముందే ఈ ‘అంతర్జాతీయ శ్రామిక గేయం’ తెలుగులోకి అనువాదం కావడం ఆసక్తికరం. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య ఆ రోజుల్లో కాకినాడకు తరచూ వస్తూ, విద్యార్థులకు రాజకీయ శిక్షణనిచ్చే వారు. ఆయన 1781లో ఫ్రెంచ్ రచయిత యుజెనీ పాటియార్ రాసిన ‘కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్’ ఇంగ్లిష్ మూలాన్ని నళిని గారి అన్నయ్య బాలాంత్రపు సత్యనారాయణరావుకి ఇచ్చి, నళి నితో తెలుగులోకి అనువాదం చేయించారు. గద్దె లింగయ్య సం పాదకులైన ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ తొలి పత్రిక ‘ప్రభ’ పక్ష పత్రికలో 1935 ఏప్రిల్ 30న ఈ గేయం ప్రచురితమైంది. ఇవాళ్టికీ శ్రామికోద్యమానికి ఊతంగా నిలి చే ఈ పాటను తెలుగులోకి తెచ్చిన నళినీకాంతరావు కు ఇది శత జయంతి వత్సరం. సరిగ్గా నూరేళ్ళ క్రితం 1915 మే 9న తూర్పు గోదావరి జిల్లా బాలాంత్రం దగ్గర కుతుకులూరులో నళిని జన్మించారు. సుప్రసిద్ధ ‘వేంకట పార్వతీశ కవు లు’ ఇద్దరిలో ఒకరైన బాలాంత్రపు వేంకటరావు గారి పెద్ద కుమారుడు ఆయన. లలిత సంగీత వాగ్గేయకా రులు బాలాంత్రపు రజనీకాంత రావుకు స్వయానా అన్నయ్య. కాకినాడ పి.ఆర్. కాలేజ్‌లో బి.ఎ. చేసిన నళిని 1937లో మద్రాసు వెళ్ళి, ఆంగ్ల సాహిత్యంలో మాస్ట ర్స్ డిగ్రీ చదివారు. దుర్గాబాయ్ గారి చెన్నపురి ‘ఆంధ్ర మహిళ’ సంస్థలో 1940 నుంచి ’47 దాకా విద్యా విభాగానికి పర్యవేక్షకుడిగా పని చేశారు. ప్రముఖ జర్నలిస్టు కోటంరాజు రామారావు దగ్గర ‘ఇండియన్ రిప బ్లిక్’లో 1948లో పత్రికారచనలో శిక్షణ పొందిన నళిని ప్రధానంగా జర్నలిస్టుగా జీవించారు. తొలి రోజుల్లో గోరాశాస్త్రి వద్ద ‘తెలుగు స్వతంత్ర’లో, ‘ఆంధ్రప్రభ’లో అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. పదిహేనేళ్ళ వయసులోనే ‘ఆంధ్ర ప్రచా రిణి’ పత్రికకూ, ‘ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల’కు ప్రచురణ కోసం వచ్చే రచనల్ని పరిశీలిస్తూ తండ్రి గారికీ సహ కరించిన నళిని చివరి దాకా సాహిత్య, సంగీతాలను వదులుకోలేదు. గమ్మత్తేమిటంటే ప్రపంచ కార్మికులను చైతన్య పరిచే ‘ఆకలిమంటచే...’ గేయాన్ని అనువదించిన ప్పుడు దాని కింద నళిని తన పేరు రాసుకోలేదు. అందుకే, తెలుగునాట ఈ గేయం బహుళ ప్రచారం పొందినప్పటికీ, రచయిత ఎవరో మొదట్లో తెలియ లేదు. అది నళిని అనువాదమని తరువాత బయట కొచ్చింది. అలాగే, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ సొత్తు అయిన గేయాన్ని రాసి, సంప్రదాయ సాహిత్య ప్రచు రణలకు సంపాదకుడిగా, ఇంగ్లిష్ జర్నలిస్టుగా పని చేసిన నళినీకాంతరావు గురించి తెలియని తరానికి ఆయనను గుర్తు చేయడానికి ఈ శతజయంతి సం దర్భం ఒక చిన్న వేదిక. (మే 9న బాలాంత్రపు నళినీకాంతరావు శత జయంతి) (1915 మే 9 - 2005 ఏప్రిల్ 29) - రెంటాల జయదేవ jayadeva.sakshi@gmail.com -
ఆ అవార్డులన్నీ నేనే వచ్చేలా చేశా... తప్పేముంది?!
అందరినీ బాగా పొగుడుతాను...నన్నెవరు పొగిడినా సంతోషిస్తాను! రోడ్ నంబర్ 1.. బంజారా హిల్స్‌లోని ఆ ఇంట్లో ఉదయాన్నే హడావిడిగా ఉంది. ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నాల మధ్య ప్రయాణాలతో... రోజుకో చోట ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ఆ రోజు హైదరాబాద్‌లో ఉన్నారు. విశాఖపట్నంలో సెప్టెంబర్ 17న జరిగే పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లలో ఆఫీసు సిబ్బంది బిజీగా ఉన్నారు. పూజ ముగించుకొని, ఆధ్యాత్మికవాది నుంచి ఆచరణవాదిగా మారి, ట్రేడ్ మార్క్ కుర్తా, కోటుతో నవ్వుతూ వచ్చారు - సుబ్బరామిరెడ్డి. ఏడు పదుల పైగా జీవితం చూసి, వేల కోట్లు సంపాదించిన ఈ రైతుబిడ్డ చేతిలోని బేసిక్ మోడల్ నల్ల రంగు నోకియా ఫోన్‌ను టేబుల్ మీద పెట్టి, సంభాషణకు ఉపక్రమించారు. సినిమా, వ్యాపారం, రాజకీయం, ఆధ్యాత్మికత, సేవ - ఇలా ఎన్నో కోణాలున్న ఒకే నాణెం టీయస్సార్తో ముఖాముఖి.. ఇంత సంపాదించి, ఈ స్మార్ట్ఫోన్ల యుగంలో ఇంకా బేసిక్ ఫోనా? సుబ్బరామిరెడ్డి: ఫోన్ అనేది మాట్లాడుకోవడానికి, సమాచారం చేరవేయడానికి. దానికి ఇంతకన్నా ఎందుకు? ఐ ఫోన్ ఇంట్లో తెచ్చారు. కానీ, అది వాడను. జీవితమైనా, ఫోనైనా సంక్లిష్టత లేకుంటేనే సుఖం. ఇంత వేదాంతిలా మాట్లాడతారు. మళ్ళీ విందులంటూ భౌతికవాదిలా ఉంటారే! వైరాగ్యమంటే ఒంటికి బూడిద రాసుకొని, జీవితంలో ఏదీ వద్దనుకోవడం కాదు! జీవితంలో ఏదో సాధించాలనే అభిలాష ఉండాలి. అదే సమయంలో ‘సాధించినది, సంపాదించినది ఏదీ నాది కాదు, నా వెంట రాద’నే వైరాగ్యమూ ఉండాలి. అప్పుడు అనుకున్నది కాకపోయినా బాధపడరు. డెబ్భై రెండో ఏటా చేపట్టిన అన్ని రంగాల్లో క్రియాశీలంగా ఉన్నారు. మీ నిత్యనూతనోత్సాహం వెనుక రహస్యం? ఇదంతా ఈశ్వర తపస్సు వల్ల లభించిన ఉత్సాహం. రోజూ గంటన్నర పూజతో మానసిక వ్యాయామం, రెండు గంటల శారీరక వ్యాయామం - పదేళ్ళుగా నా జీవితంలో భాగమైంది. అదే నాలో నిత్యనూతనోత్సాహం నింపుతోంది. మరో కారణం - నా లోని పాజిటివ్ మైండ్. దాంతో శత్రువుల్ని కూడా మిత్రుల్ని చేసుకోవచ్చు. కానీ, మీరు కోరి, ఆశపడ్డ పదవి అంటూ ఇంతవరకూ లేదా? ఉంది. చిన్నప్పటి నుంచి భక్తెక్కువ. టి.టి.డి. బోర్డు చైర్మన్ కావాలనుకున్నా. కోరి మరీ ఆ పదవిని రెండుసార్లు చేపట్టా. మీకు కళలు, సినిమాల పట్ల ఆసక్తి ఎలా మొదలైంది? చిన్నప్పటి నుంచి నాకు ఆ ఆసక్తి ఉండేది. పైగా, అప్పటి మేటి సినీ కమెడియన్ రమణారెడ్డి మా సొంత బాబాయే! సహజంగానే ఆ ప్రభావం నా మీదా ఉంది. నెల్లూరులో హైస్కూల్లో చదివే రోజుల నుంచే ఏకపాత్రాభినయాలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో పాల్గొనేవాణ్ణి. స్కూలు చదువు కాగానే, హైదరాబాద్‌కు వచ్చి నిజామ్ కాలేజ్‌లో డిగ్రీ చదివా. పద్ధెనిమిదేళ్ళ వయసులోనే వ్యాపార రంగంలోకి వచ్చా. కానీ, కళాభిరుచి కారణంగా 1973లో పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ‘కాస్మొపాలిటన్ కల్చరల్ సెంటర్’ నెలకొల్పి, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపా. తరువాత సినీ ఎగ్జిబిటర్నయ్యా, నిర్మాతనయ్యా. సినిమాల డిస్ట్రిబ్యూషన్ కూడా చేశా. వ్యాపారానికీ, కళకూ లంకె కుదరడం కష్టం కదా! కళ అనేది ఒక మహాశక్తి. అది మనిషికి తెలియని ఎనర్జీనిస్తుంది. ముందుకు తీసుకెళుతుంది. కానీ, కోట్లు సంపాదించిన వ్యాపారవేత్తలకూ, బడా రాజకీయ నాయకులకూ ఆ సంగతి తెలియదు. ఎంతసేపటికీ తమ పనుల్లోనే మునిగిపోతుంటారు. ఈ రహస్యం తెలుసు కాబట్టి, కళా రంగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగా. గడచిన 52 ఏళ్ళుగా వ్యాపారంలో విజయాలు సాధిస్తున్నా. ఇటు ‘కళాబంధు’గానూ పేరు తెచ్చుకున్నా. కానీ, వ్యాపార విస్తరణలో భాగంగానే సినీ రంగంలోకొచ్చినట్లున్నారు! సినిమాను వ్యాపారంగా చూస్తే తప్పు. అది పవర్ఫుల్ మాస్ మీడియా. అనేక కళల అద్భుత సమాహారం. మీకో రహస్యం తెలుసా? నా భక్తికి ప్రధాన కారణమూ సినిమానే. ‘భూకైలాస్’లో రావణ బ్రహ్మ పాత్రలో ఎన్టీఆర్ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి పొట్ట చీల్చుకొని, పేగులతో వీణలా వాయిస్తాడు. ఆ పరమభక్తుడి జీవితం చూశాక, నాకెందుకు ప్రత్యక్షం కాడని కఠోర శివపూజ చేయడం మొదలుపెట్టా. ఆ తరువాత నాకు శివలింగ దర్శనం అనేకసార్లు జరిగింది. ఆధ్యాత్మికత పక్కన పెడితే, సినీరంగ తొలినాళ్ళు గుర్తున్నాయా? రిస్కు లేని వ్యవహారం కదా అని సినీ ప్రదర్శన రంగంతో మొదలయ్యా. 1981లో హైదరాబాద్‌లో ‘మహేశ్వరి - పరమేశ్వరి’ సినిమా కాంప్లెక్స్ నిర్మించా. రోమన్, స్పానిష్ ఆర్కిటెక్చర్‌తో అందంగా కట్టించిన హాలులో అప్పట్లోనే ఎస్కలేటర్ పెట్టించా. ఆ హాళ్ళ మీద వచ్చిన డబ్బుతో నిర్మాతగా మారా. హిందీలో మల్టీస్టారర్ ‘విజయ్’ తీశాను. ఆ తరువాత తెలుగులో శోభన్‌బాబు (‘జీవన పోరాటం’), వెంకటేశ్ (‘త్రిమూర్తులు’, ‘సూర్య ఐ.పి.ఎస్’), చిరంజీవి (‘స్టేట్ రౌడీ’), రాజశేఖర్ (‘గ్యాంగ్ మాస్టర్’), బాలకృష్ణ (‘వంశోద్ధారకుడు’) - ఇలా పెద్ద హీరోలతో సినిమాలు చేశా. హిందీలో ‘లమ్హే’, ‘చాందినీ’, డి.రామానాయుడుతో కలసి ‘దిల్వాలా’ చేశా. జి.వి. అయ్యర్ దర్శకత్వంలో ‘భగవద్గీత’ (సంస్కృతం, తెలుగు), ‘స్వామి వివేకానంద’ (హిందీ, ఇంగ్లీషు) లాంటి కళాఖండాలూ నిర్మించా. జి.వి. అయ్యర్‌తో గొప్ప చిత్రాలు తీసే అవకాశమెలా వచ్చింది? అప్పట్లో జాతీయ ఫిల్మ్ అవార్డుల జ్యూరీకి చైర్మన్‌గా పనిచేశా. జ్యూరీలో అయ్యర్ ఓ సభ్యుడు. సంస్కృతంలో ‘ఆది శంకరాచార్య’ తీసి పేరు తెచ్చుకున్న ఆయన మాటల సందర్భంలో ‘భగవద్గీత’ స్క్రిప్టు గురించి చెప్పారు. ఆ గొప్ప సబెక్ట్ను నేనే తెరకెక్కిస్తానన్నా. అలా ‘భగవద్గీత’ చేశాం. ఆ సంస్కృత చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్రంగా ‘స్వర్ణకమలం’ దక్కింది. అంతకు ముందూ, ఆ తరువాతా ఏ తెలుగు సినిమాకూ ఉత్తమ చిత్ర పురస్కారం రాలేదు. ఆ అవార్డందుకున్న ఏకైక తెలుగు నిర్మాతను నేనే! మరి, మన ‘శంకరాభరణం’ మాటేమిటి? అది గొప్ప సినిమా. కానీ, దానికి వచ్చింది - కళాత్మక విలువలతో, అత్యధిక ప్రజాదరణ పొందిన పూర్తి వినోదాత్మక చిత్రం అవార్డు మాత్రమే. ఉత్తమ చిత్రం అవార్డు కాదు. కాకపోతే, ఆ ఏడాదికి ఉత్తమ చిత్రంగా ఎంపికైన హిందీ చిత్రంతో పాటు మన ‘శంకరాభరణం’కీ స్వర్ణకమలమిచ్చారు. మీ జాతీయ అవార్డుల్లో మీ పాత్ర ఏమిటంటారు? ఏమీ లేదు. నేను నిర్మాతను. అంతే! ‘భగవద్గీత’కు అవార్డు వస్తుందని నాకు తెలియదు. ఆ ఆలోచన కూడా నాకు లేదు. గొప్ప చిత్రాన్ని గుర్తించి, ఇచ్చారు. అలాగైతే, అయ్యర్‌తో నేను తీసిన తరువాతి చిత్రం ‘స్వామి వివేకానంద’కు ఇతర అవార్డులు వచ్చాయి కానీ, ఉత్తమ చిత్రం అవార్డు రాలేదు కదా! ఆ రెండు చిత్రాల ద్వారా అప్పట్లోనే రూ. 3 కోట్లు నష్టం వచ్చింది. అయినా, బాధ లేదు. మంచి చిత్రాలు తీశాననే తృప్తి మిగిలింది. అయ్యర్ తీసిన కళాఖండాలైన ‘ఆది శంకరాచార్య’, ‘భగవద్గీత’, ‘స్వామి వివేకానంద’ చిత్రాల డీవీడీలను సిద్ధం చేసి, అందుబాటులోకి తేవాలనుకుంటున్నా. అప్పట్లో ‘స్వామి వివేకానంద’ వివాదాస్పదం అయినట్లుంది! అదేమీ లేదు. నేను ఆ చిత్రానికి నిర్మాతనే తప్ప, కథ వ్యవహారం నాకు తెలియదు. అయ్యర్ తను రాసుకున్న స్క్రిప్టును తాను అనుకున్న పద్ధతిలో తీశారు. అయితే, అందులో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని రామకృష్ణ మఠం వారన్నారు. దాంతో, ఆ సన్నివేశాలు తొలగించాం. అంతే! అప్పట్లో హిందీ ‘రోటీ కపడా ఔర్ మకాన్’లో అమితాబ్ చేసిన అతిథి పాత్రకు తెలుగు ‘జీవన పోరాటం’లో రజనీకాంత్నెలా ఒప్పించారు? అమితాబ్, రజనీకాంత్ నటించిన ‘అంధా కానూన్’ శతదినోత్సవం మా ‘మహేశ్వరి’లో జరిగింది. అప్పుడొచ్చిన రజనీకాంత్ ఆ హాలు, మా ఇల్లు, నాకున్న కళాభిరుచి చూసి, నిజంగా నాకు అభిమాని అయ్యాడు. అందుకే, అడగగానే ‘జీవనపోరాటం’లో అతిథి పాత్రకు ఒప్పుకున్నాడు. ఇలా పరిచయాలున్నా చిత్ర నిర్మాణంలో మమేకం కాలేదేం? ఒక హాబీ కింద సినిమాలు తీశానే తప్ప, అది నా వృత్తి కాదు. కథ, ఆర్టిస్టుల ఎంపిక, పై పై పర్యవేక్షణే తప్ప షూటింగ్‌లకు కూడా తరచూ వెళ్ళేవాణ్ణి కాదు. ప్రతి సినిమాకూ ఒకరిని ఇన్‌ఛార్జ్‌గా పెట్టేవాణ్ణి. వాళ్ళే అంతా చూసేవారు. అలా నాకున్న సరదా తీర్చుకున్నా. మరి, ఎంతో నచ్చి సినిమాల్లోకి వచ్చిన మీరు 2000వ సంవత్సరం తర్వాత సినిమాలు తీయడం లేదేం? సరదా తీరిందనా? రిస్కు పెరిగిందనా? సినిమా అంటే చాలా టైవ్‌ు వెచ్చించాలి. అంత సమయం వెచ్చిస్తూ, సినీ రంగానికే పరిమితం కావడం నాకిష్టం లేదు. అందుకే, సినిమాలు చూడడం, ఆస్వాదించడం, కళాకారులను అభినందించడమే తప్ప, తీయడం మానేశా. పైగా, సినీ రంగాన్ని ఒక్కదాన్నే నమ్ముకొంటే, వేరే రంగాల్లో కాన్సన్ట్రేట్ చెయ్యలేనుగా! సినిమాలు... ఆధ్యాత్మికత..., రాజకీయాలు... వ్యాపారం, ఇవి కాక సభలు, డిన్నర్ పార్టీలు... మీదో విలక్షణ జీవితమేనే?! అవును. నేను ఆల్‌రౌండ్ మ్యాన్‌ను. సినిమా స్టార్లనూ, ప్రముఖులనూ పిలిచి, ఓ స్థాయిలో విందు వినోదాలు ఏర్పాటు చేసి ఆతిథ్యం అందించడం నాకిష్టం. మీ వస్త్రధారణ కూడా విభిన్నంగా ఉంటుందేం? (నవ్వేస్తూ...) నాకంటూ ప్రత్యేక గుర్తింపు కోరుకొనే లక్షణమే డ్రెస్సింగ్లోనూ పాటించా. ఈ స్టైల్ కూడా చాలా ఏళ్ళ క్రితం నేను డిజైన్ చేసుకున్నదే. ఈ చొక్కా మూడేళ్ళ క్రితం కుట్టించుకున్నది, ఈ కోటు అంతకన్నా పాతది. ఇక, కోటు పై జేబులోని ఈ రంగు కర్చీఫ్ అంటారా? అదో ప్రత్యేకత. అన్నట్లు ప్రధాని మోడీదీ, నాదీ పుట్టినరోజు సెప్టెంబర్ 17నే. ఆయన పి.ఎం (ప్రైమ్ మినిస్టర్) అయితే, నేను ఎం.పి (మెంబర్ ఆఫ్ పార్లమెంట్). అంతే తేడా. (నవ్వులు...). రాజకీయాల్లోకి వచ్చాక - ఇన్నేళ్ళలో మీరూ పెరిగారు. మీ వ్యాపారాలూ పెరిగాయి. మరి, ఇక్కడ మీరు సంపాదించింది ఎంత? వ్యాపారవేత్తగా గౌరవ ప్రతిష్ఠలు కొంత వరకే! రాజకీయాల్లో ఉంటే, అధికార హోదా కూడా తోడై, ఒక్క ఫోన్ చేసి, ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రజలకు కావాల్సిన మంచి పనులు చేయించవచ్చు. ఇక్కడ నేను సంపాదించినది - డబ్బుకు అతీతమైన ఈ గౌరవాన్నే! పోనీ, మీరు పోగొట్టుకున్నది ఎంత? పోగొట్టుకున్నది... కంటి నిండా నిద్ర! రోజూ పద్ధెనిమిది గంటల పని వల్ల అయిదారు గంటలు మించి నిద్ర పోలేకపోతున్నా. కానీ, మీరు గోరంత చేసి కొండంత ప్రచారం పొందుతారని మీపై విమర్శ! జీవితంలో ఏమీ సాధించకుండా, ఏమీ చేయకుండానే ప్రచారం చేసుకునేవారు ఒక రకం. చేసినదాని గురించి నలుగురిలో ప్రచారం చేసుకొనేవారు రెండో రకం. నేను రెండో వర్గానికి చెందినవాణ్ణి. అవును, నేను ప్రచారం చేసుకుంటా. చేసిన మంచి పని నలుగురికీ చెబితే తప్పా? ఉదాహరణకు, విశాఖపట్నంలో ప్రసిద్ధ కె.జి. హాస్పిటల్‌కు వచ్చే రోగులు, వారి బంధువులు చెట్ల నీడనే ఇబ్బందులు పడడం చూసి, దాదాపు రూ. 4 కోట్లతో 200 పడకలు ఉండేలా సత్రం కట్టించా. అది జనానికి తెలియాలంటే, వారు ఉపయోగించుకోవాలంటే ప్రచారం చేయాలి కదా! ప్రచారం చేయడం వల్ల నలుగురూ మెచ్చుకోవడంతో మన మనసుకు తృప్తి కలుగుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే కోరిక పుడుతుంది. మనకొస్తున్న మంచి పేరు చూసి, మరికొందరు స్ఫూర్తి పొంది, వాళ్ళూ అలా చేయడానికి ముందుకొస్తారు. ఇవేవీ పట్టించుకోకుండా, కేవలం ప్రచారమంటూ విమర్శించేవాళ్ళు నా దృష్టిలో అసూయాపరులు! రిలేషన్‌షిప్‌లు పెంచుకోవడానికే విందులిస్తుంటారనీ మీపై మరో విమర్శ! మనుషుల మధ్య అనుబంధం లేకపోతే ఎలా? ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి ఎంతో సేవ చేసి, రిటైరయ్యాడనుకోండి. ఆయన సేవకు గుర్తుగా ఒక విందు ఇచ్చి, అందరినీ పిలిచామనుకోండి. అతను ఎంత సంతోషపడతాడు! అందరి మధ్య ఎంత మంచి వాతావరణం వస్తుంది! అక్కడ ఎవరూ మనం పెట్టే భోజనం చేయడానికి రారు. కబుర్లు చెప్పుకొని, ఒక చక్కటి సోషల్ మైండ్ క్రియేట్ చేసుకోవడానికి వస్తారు. దాని వల్ల ఉత్సాహం వస్తుంది. పార్టీ పెద్దల్ని ఇట్టే బుట్టలో వేసుకుంటారని టాక్! (పెద్దగా నవ్వి...) నా దగ్గర బుట్టలేమీ లేవు. (గంభీరంగా) స్వయంకృషితో నేను పెకైదిగా కాబట్టే, ఎవరొచ్చినా నాతో స్నేహంగా ఉంటారు. బర్తడే భారీగా చేయడం, లక్షల ఖర్చు అవసరమా? పుట్టినరోజనేది ఒక పని మీద భగవంతుడు మనల్ని ఈ లోకానికి పంపించిన రోజు. ఆ రోజున దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని, అప్పటి వరకు మనం సాధించినది ఏమిటి, సాధించాల్సినది ఏమిటన్నది సింహావలోకనం చేసుకోవాలి. పైగా, పుట్టినరోజు నాడు నేనేమీ కేక్‌లు కట్ చేయను. అన్ని మతాల ఆధ్యాత్మికవేత్తలనూ పిలిచి, సత్కరించి, ఆశీస్సులు తీసుకుంటా. రెండో రోజున సీనియర్ కళాకారుల కృషికి గుర్తింపుగా, వారిని ఘనంగా సత్కరించి, కళారాధన చేస్తా. గొప్పవాళ్ళను సత్కరించడం వల్ల ప్రజలు సంతోషిస్తారు. వాళ్ళ మంచి మనసు, దీవెనల వల్ల నాకు శక్తి వస్తుంది. మీ విజయం వెనక మీ శ్రీమతి ఇందిర పాత్ర... ఇదంతా నా బాస్ (శ్రీమతి ఇందిర) చలవే! నేను ఏ పని చేసినా ఆమె అడ్డుచెప్పదు. ఇంత ఎందుకు ఖర్చు చేస్తున్నారని కానీ, ఎందుకు, ఏమిటని కానీ అడగదు. ఆమె నాకు దేవుడిచ్చిన వరం. మీ మీద మీ అమ్మ గారి ప్రభావం ఎక్కువని విన్నాం... అవును. నాకు ఇద్దరన్నయ్యలు, ఒక అక్క. మా అన్నయ్య చంద్రశేఖరరెడ్డి దగ్గరే నేను తొలి రోజుల్లో నిర్మాణ కాంట్రాక్టుల్లో ఓనమాలు నేర్చుకున్నా. ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి మా అమ్మ రుక్మిణమ్మ కారణం. ‘జీవితంలో ఏదైనా సాధించాలన్న లక్ష్యం ఉండాలి... నలుగురిలోనూ పేరు నిలిచిపోయేలా కృషి చేయాలి’ అని ఆమె నూరిపోసేది. నా పురోగతికి నా మనసులో ముద్ర వేసిన ఆమె మాటలే కారణం. రాజకీయాల్లో ఇప్పుడు మీకున్న ఆశలు, అంచనాలు... రాజకీయాల్లోకి వచ్చాక ఇప్పటికి 18 ఏళ్ళుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా. ప్రస్తుత రాజ్యసభ సభ్యత్వ కాలం (ఆరేళ్ళు) ముగిసేసరికి 24 ఏళ్ళవుతుంది. ఆ తరువాత కూడా పార్లమెంట్ సభ్యుడినై, పాతికేళ్ళ పైగా ఎం.పి.గా ప్రజలకు సేవ చేశాననే తృప్తి పొందాలని ఉంది. ఇంతకీ, మీకున్న అతి పెద్ద బలం ఏమిటి? నా మనోబలం, ఈశ్వరశక్తి. మరి, బలహీనత మాటేమిటో? (నవ్వుతూ...) అందరినీ బాగా పొగుడుతాను. నన్ను ఎవరు పొగిడినా బాగా సంతోషిస్తాను. భోళా శంకరుడిలా అడిగిన వరాలు ఇచ్చేస్తా. అది నాకున్న పెద్ద బలహీనత. ఇన్నేళ్ళుగా దాని నుంచి బయటపడలేకపోయా (నవ్వులు...). జాతీయ, ఫాల్కే అవార్డుల మొదలు ‘పద్మ’ పురస్కారాల దాకా చాలామందికి అవార్డులు రావడం వెనుక మీ కృషి ఉందని జనశ్రుతి. అవును. అది నిజం. అన్ని రకాల అర్హతలూ ఉన్నప్పటికీ, ప్రతిభావంతులైన మన తెలుగువాళ్ళకు ఇలాంటి అవార్డుల విషయంలో ఢిల్లీలో న్యాయం జరగడం లేదు. అలాంటప్పుడు పలుకుబడిని ఉపయోగించి, ఫలానా తెలుగువాళ్ళు అర్హులని చెప్పాను. తప్పేముంది! అన్ని భాషల్లో సినిమాలు తీసిన గొప్ప నిర్మాత రామానాయుడుకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా చేశా. అట్లానే, స్వయంకృషితో పైకొచ్చిన చిరంజీవికి పద్మభూషణ్ వచ్చేలా చేశా. హీరో కృష్ణ, గాయని పి. సుశీల, నటులు మోహన్‌బాబు, బ్రహ్మానందాలకు పద్మ పురస్కారాలు వచ్చేలా చేశా. అక్కినేనికి పద్మవిభూషణ్ వచ్చేలా చేశా. అర్హతలు లేనివాళ్ళకు మనం అడగం. ఒకవేళ మనం అడిగినా సరే, వాళ్ళూ ఇవ్వరు. అర్హత ఉన్నప్పుడు చెబితే నేరమా? తెలుగువారికి గుర్తింపు విషయంలో ఢిల్లీ వాళ్ళు కళ్ళు మూసుకుంటే, వారిని నిద్ర లేపా! మీకు ‘పద్మ’ రాలేదు. అడగలేదా, ఆశించలేదా? (వెంటనే అందుకుంటూ...) అవి నాకెందుకండీ! సిసలైన కళాకారులకు అవి ఇవ్వాలి. ప్రజల ప్రశంసలే నాకు అవార్డు! ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ -
దర్శకుడిగా నాన్న దగ్గరే ఎక్కువ నేర్చుకున్నా
తెలుగు సినిమాకు 82 ఏళ్ళు.అందులో దాదాపు 75 ఏళ్ళుగా ఈ రంగంతో మమేకమైన కుటుంబం కోవెలమూడి వారిది.నటుడిగా మొదలై, నిర్మాతగా మారి, దర్శకుడిగా, స్టూడియోఅధినేతగా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినీ రంగాల్లో పేరు తెచ్చుకున్న ఘనత - స్వర్గీయ కె.ఎస్. ప్రకాశరావుది.ఆయన కుమారుడు కె. రాఘవేంద్రరావు శతాధిక చిత్ర దర్శకుడై, తెలుగు సినిమా వాణిజ్య విశ్వరూపాన్ని చూపెట్టారు. మరో కుమారుడు కె. కృష్ణమోహనరావు నిర్మాతగా భారీ చిత్రాలు అందించారు.ఇంకో కుమారుడు స్వర్గీయ కె.ఎస్. ప్రకాశ్ కెమేరామన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక, తాత పేరే పెట్టుకున్న మనుమడుసూర్యప్రకాశ్ కోవెలమూడి అచ్చంగా తాత లాగే ఇప్పుడు నటుడు, నిర్మాత, దర్శకుడు.ఇవాళ కె.ఎస్. ప్రకాశరావు శతజయంతి. తండ్రిది నూరేళ్ళు.1964లో సినీ రంగానికి వచ్చిన కుమారుడు రాఘవేంద్రరావు సినీ కెరీర్‌కు సరిగ్గా యాభయ్యేళ్ళు. ఈ శతజయంతి వేళకోవెలమూడి సినీ వారసుల నోట తొలితరం దర్శక, నిర్మాణ దిగ్గజం కె.ఎస్. ప్రకాశరావు జ్ఞాపకాల ‘ట్రిపుల్ ధమాకా’ .... ఇన్నేళ్ళుగా భేటీలకు దూరంగా ఉన్న దర్శకేంద్రుడు తొలిసారిగా పెదవి విప్పి, ఓ పత్రికకు ఇచ్చిన సాధికారిక ఇంటర్వ్యూ... ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం. కె.ఎస్. ప్రకాశరావు గారి పుట్టుపూర్వోత్తరాలు ఇప్పటి తరానికి తెలియవు. ఆయన సినీ రంగంలోకి ఎలా వచ్చారు? కె. కృష్ణమోహనరావు: నూరేళ్ళ క్రితం 1914 ఆగస్టు 27న మా నాన్న గారు జన్మించారు. ఆయన పుట్టింది విజయవాడకు 12 మైళ్ళ దూరంలోని కోలవెన్నులో. ప్రాథమిక చదువు కేసరపల్లిలో. గన్నవరంలో హైస్కూల్‌తో చదువు ఆగింది. కె. రాఘవేంద్రరావు: ఆ రోజుల్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవారుగా! అందుకే, మా నాన్న గారు పై చదువులు చదవలేకపోయారు. మా అమ్మ కోటీశ్వరమ్మకూ, నాన్నకూ ముడిపెట్టేశారు. పెళ్ళయ్యాక, విజయవాడకు మకాం మార్చారు. కృష్ణమోహనరావు: మా అమ్మ వాళ్ళు చెబుతుంటే విన్నదేమిటంటే, మా నాన్న గారు అక్కడ మొదట్లో ఒక చిన్న బంగారు నగల దుకాణంలో పనిచేశారట. అక్కడ కొద్ది నెలలు చేశాక, ఒక బ్రిటీషు ఇన్స్యూరెన్స్ సంస్థలో మేనేజర్ స్థాయిలో వ్యవహరించారు. తరువాతి రోజుల్లో ప్రముఖ సినీ గీత రచయితగా పేరు తెచ్చుకున్న కొసరాజు రాఘవయ్య చౌదరి మా నాన్న గారి దగ్గర బీమా ఏజెంట్‌గా వ్యవహరించారట. గూడవల్లి రామబ్రహ్మంకూ, మీకూ చుట్టరికముందని విన్నా! రాఘవేంద్రరావు: అసలు మా నాన్న గారికి సినిమా రంగం మీద పెద్ద ఆసక్తి లేదు. అయితే, అప్పట్లో దర్శక - నిర్మాత రామబ్రహ్మం గారి ‘మాలపిల్ల’ (1938) సినిమా చూసి, పత్రికలో దాని మీద వ్యాసం రాశారట. అది రాసిందెవరా అని ఆరా తీసి, మా నాన్న గారి స్ఫురద్రూపం, కంఠం లాంటివన్నీ చూసి, రామబ్రహ్మం బలవంతాన ఆయనను సినీ రంగానికి తీసుకువచ్చారట. ‘అపవాదు’ (1941)లో హీరోగా నటింపజేశారు. ఆ వెంటనే, ప్రసిద్ధ తమిళ కావ్యం ‘శిలప్పదికారం’ ఆధారంగా తీసిన ‘పత్ని’ (’42)లో హీరో కోవలన్ పాత్ర చేయించారు. అలా మా నాన్న గారు, ఆయన చాలా సన్నిహితులయ్యారు. ఈ క్రమంలో మాకూ, రామబ్రహ్మం గారికీ చుట్టరికంగా ఉందన్న సంగతి బయటపడింది. ఆ రోజుల్లో ప్రజానాట్యమండలితో నాన్న గారికి సంబంధం ఉండేదట. నటించిన చాలాకాలానికి నాన్న గారు నిర్మాతయ్యారే? కృష్ణమోహనరావు: 1946లో కుటుంబంతో సహా నాన్న గారు మద్రాసుకు మకాం మార్చారు. రామబ్రహ్మం జబ్బునపడడంతో సారథీ వారి ‘పల్నాటి యుద్ధం’ సగంలో ఆగింది. ఇక, తాను కోలుకోవడం కష్టమని గ్రహించి, ‘దర్శకత్వ బాధ్యత చేపట్టి, ఆ సినిమా పూర్తి చేయి’ అని నాన్న గారిని కోరారట. కానీ, ఆయన, ‘ప్రతిభా’ శాస్త్రి, ఇతర మిత్రులు బొంబాయి వెళ్ళి, ఎల్.వి. ప్రసాద్‌ను తీసుకువచ్చి, ‘పల్నాటి యుద్ధం’ (’47) పూర్తి చేయించారు. ‘గృహప్రవేశం’ (’48)కి కూడా ఎల్.వి. ప్రసాదే దర్శకులు. దానికి నాన్న గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అలాగే, ఇన్సూరెన్స్ వ్యవహారాల ద్వారా మా నాన్న గారికీ, చల్లపల్లి రాజా గారికీ బాగా పరిచయం. ఆయన చైర్మన్‌గా, కోవెలమూడి భాస్కరరావు, కంచర్ల నారాయణరావు డెరైక్టర్లుగా ‘స్వతంత్ర ఫిలిమ్స్’ పేరిట లిమిటెడ్ కంపెనీని నాన్న గారు పెట్టారు. తాను, జి. వరలక్ష్మి హీరో హీరోయిన్లుగా, కోన ప్రభాకరరావు విలన్‌గా ‘ద్రోహి’ (’48) తీశారు. అలా నిర్మాణంలోకొచ్చారు. ప్రకాశ్ ప్రొడక్షన్స్ పెట్టడం... దర్శకుడిగా మారడం...? రాఘవేంద్రరావు: ‘స్వతంత్ర’ తరువాత 1949లో సొంతంగా ‘ప్రకాశ్ ప్రొడక్షన్స్’ స్థాపించారు. సముద్రంలో నౌకలకు దారి చూపే లైట్ హౌస్ దానికి లోగోగా పెట్టడంలోనే ఆయన అభ్యుదయ భావన అర్థం చేసుకోవచ్చు. ‘మొదటి రాత్రి’ (’50)తో దర్శకుడిగానూ అవతారమెత్తారు. మద్రాసులో ‘ప్రకాశ్ స్టూడియో’ కట్టి, దర్శక, నిర్మాతగా ఎదిగారు. మీరెంతమంది? నాన్నతో అనుబంధమెలా ఉండేది? కృష్ణమోహనరావు: నేను అందరి కన్నా పెద్ద. 1940లో పుట్టా. నాకూ, రాఘవేంద్రరావుకూ రెండేళ్ళు తేడా. ఆ తరువాత మా చెల్లెళ్ళు స్వతంత్ర, మంజుల. మరో సోదరుడైన కెమేరామన్ స్వర్గీయ కె.ఎస్. ప్రకాశేమో మంజుల తోటివాడు. రాఘవేంద్రరావు: ఆయన ఫ్రీగా, ఓపెన్‌గా ఉండేవారు. కానీ, మేము చనువుగా ఉండలేకపోయేవాళ్ళం. చివరి వరకు ఆయనంటే మాకు భక్తి, గౌరవం, అభిమానం. ఆయన సినీ వారసత్వాన్ని పిల్లలుగా మీరంతా అందిపుచ్చుకున్నారు. మిమ్మల్ని నాన్నగారు ప్రోత్సహించేవారా? కృష్ణమోహనరావు: అందరి కన్నా ముందు మా పెద నాన్న గారబ్బాయి కె. బాపయ్య, తర్వాత తమ్ముడు రాఘవేంద్రరావే సినిమాల్లోకి వచ్చారు. నేనేమో బి.ఎస్సీ చదివా. నాకేమో పై చదువులు చదువుకోవాలనీ, కెమేరామన్ కావాలనీ ఉండేది. నాన్న గారేమో అన్నదమ్ములిద్దరూ సినిమాల్లో ఉండడమెందుకంటూ, నన్ను ఉద్యోగం చేయమన్నారు. రాఘవేంద్రరావు: ఆదుర్తి సుబ్బారావు, వి. మధుసూదనరావు, కె.బి. తిలక్ తదితరులంతా నాన్న గారి శిష్యులే. అప్పుడే నన్ను మొదట ఆదుర్తి దగ్గర పెడదామనుకున్నారు. ముందుగా, ఎడిటర్ సంజీవి దగ్గర చేర్చారు. వెనక్కొచ్చేసి, బి.ఏ. చేశా. 1964లో కమలాకర కామేశ్వరరావు గారి దగ్గర ‘పాండవ వనవాసం’కి సహాయకుడిగా చేరా. అలా సరిగ్గా 50 ఏళ్ళ క్రితం నా సినీయానం మొదలైంది. అప్పటి నుంచి ‘తాసిల్దారు గారి అమ్మాయి’ (’71) దాకా నాన్న గారి దగ్గరే చేశా. నాన్న గారే కథ రాసిన ‘బాబు’ (’75)తో దర్శకుడినయ్యా. కృష్ణమోహన్ గారూ! బయట ఉద్యోగం చేయమన్నాక మరి మీరు నిర్మాత ఎప్పుడు, ఎలా అయ్యారు? కృష్ణమోహనరావు: మా నాన్న గారి మిత్రులైన పారిశ్రామికవేత్త పి. ఓబుల్‌రెడ్డి గారి సంస్థలో పన్నెండేళ్ళు పనిచేశా. అక్కడ పైకొచ్చే అవకాశాలు లేవని గ్రహించి నాన్న గారు చివరకు నన్నూ సినిమాల్లోకి రమ్మన్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత చిత్ర నిర్మాణం ప్రారంభిస్తూ, స్వీయదర్శకత్వంలో ‘సుప్రభాతం’ (’75) తీస్తూ, నన్ను నిర్మాతను చేశారు. కానీ, తీసిన చిత్రాలాడలేదు. దాంతో, నిర్మాణానికి దూరమయ్యారు. దర్శకుడిగా కొనసాగారు. దర్శకుడిగా ఆయన ఆఖరు చిత్రం ఏయన్నార్ నటించిన ‘ముద్దుల మొగుడు’. అన్నదమ్ములిద్దరూ కలిసి నిర్మాతలైందెప్పుడు? కృష్ణమోహనరావు: రాఘవేంద్రరావుకు మొదటి నుంచీ ప్రొడక్షన్ అంటే భయం. కానీ, మా అన్నదమ్ములిద్దరినీ నిర్మాతలుగా కొనసాగమన్నది నాన్నగారే. అప్పుడు దర్శకుడిగా రాఘవేంద్రరావు జోరు మీదున్నాడు. ‘ఎప్పుడూ బయటవాళ్ళకు సినిమాలు తీయడమే కాదు. యేటా మన సొంతానికి ఒక సినిమా అయినా తీసుకోవాల’ని నాన్న గారు చెప్పారు. ఆర్.కె.ఫిల్మ్ అసోసియేట్స్ పెట్టి, ‘భలే కృష్ణుడు’(’80)తో నిర్మాణం చేపట్టాం. నేను ప్రొడక్షన్ చూస్తే, రాఘవేంద్రరావు దర్శకత్వంపై దృష్టి పెట్టేవాడు. అలా ‘పాండురంగడు’ (’08) దాకా చాలా తీశాం. రాఘవేంద్రజీ! నూటికి పైగా చిత్రాలు తీసిన మీరు నాన్న గారి నుంచి నేర్చుకున్న మెలకువలేమిటి? రాఘవేంద్రరావు: దర్శకుడిగా నేను ఎక్కువ నేర్చుకున్నది నాన్న గారి దగ్గర నుంచే. ఆయన మంచి స్క్రీన్‌ప్లే రచయిత. ఒక కథను తెరపై ఎలా చూపాలన్నది ఆయనకు బాగా తెలుసు. ఆయన తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసే సహాయకులకు తగినంత స్వేచ్ఛ ఇచ్చి, వారితో సీన్లు కూడా తీయించేవారు. మేము తీసినవి చూశాక, అందులో తప్పొప్పుల గురించి మాకు చెప్పేవారు. అలాగే, ‘ప్రేక్షకులను ఎక్కువ విసిగించకూడదు. సన్నివేశాల నిడివిని తగ్గించుకోవడానికి మమకారం చంపుకోవాలి’ అని నాకు చెప్పేవారు. మొదట్లో కష్టపడి సీన్ తీసినా, కట్ చేస్తున్నారేమిటి అనేవాణ్ణి. క్రమంగా అర్థం చేసుకున్నా. నిర్మాత లేనిదే దర్శకులం లేమన్న గ్రహింపు ఆయన నుంచే నాకొచ్చింది. నిర్మాతతో ఎలా వ్యవహరించాలన్నదీ ఆయన్నుంచే నేర్చుకున్నా. అసిస్టెంట్‌గా మీ సలహాలు ఆయన తీసుకొనేవారా? రాఘవేంద్రరావు: తప్పకుండా! ‘బందిపోటు దొంగలు’ (’68) సినిమా బ్లాక్ అండ్ వైట్. కాకపోతే, మైసూర్ బృందావన్ గార్డెన్స్‌లో ఏయన్నార్, జమున మీద తీసిన ‘విన్నానులే ప్రియా...’ పాట కలర్లో తీశాం. అప్పుడు పై నుంచి వచ్చే నీళ్ళలో రంగు పౌడర్లు కలిపితే, రంగునీళ్ళతో కలర్లో బాగుంటుందని అనిపించి, ఆ మాటే చెప్పా. ఒప్పుకొన్నారు. ఇక, ‘కోడెనాగు’(’74) లో లక్ష్మి, శోభన్‌బాబు మీద వచ్చే ‘సంగమం అనురాగ సంగమం’ పాట చిత్రీకరణ లోనూ నా మాటకు విలువిచ్చారు. అలాంటి సంగతులు చాలా ఉన్నాయి. మీ చిత్రాలు చూసి, ఆయన మీకిచ్చిన ఉత్తమ ప్రశంస, విమర్శ? (రాఘవేంద్రరావు ఆలోచనలో పడగానే... అందుకుంటూ...) కృష్ణమోహనరావు: మా సినిమాలే కాదు... ఏ సినిమా చూసి వచ్చినా సరే, ఆయన తన డైరీలో ఆ సినిమా గురించి తన అభిప్రాయాలు, కథలోని బలాబలాలు, చేసుకోవాల్సిన మార్పులు చేర్పుల లాంటివన్నీ రివ్యూ రాసుకొనేవారు. ఇక, సంతానం పైకి రావడం పట్ల ఆనందం, సంతోషం ఉన్నా, లోలోపలే ఉంచుకొనేవారు. తమ్ముడు తీసిన సినిమా చూశాక తనకు అనిపించినవి ఏదైనా ఉంటే, చిన్నగా సలహా రూపంలో చెప్పేవారు. వాణిజ్య అంశాల గురించి తనకున్న భిన్నాభిప్రాయం సున్నితంగా వ్యక్తం చేస్తూనే, ‘ఇవాళ మీ సినిమాలకు ఇవే కావాలేమోలే’ అనేవారు. రాఘవేంద్రజీ, రూపకల్పనలో మీ నాన్న గారికీ, మీకూ ఉన్న తేడా? రాఘవేంద్రరావు: అంతా పేపర్ మీద పెట్టడం ఆయనకు అలవాటైతే, నేనేమో దానికి పూర్తి విరుద్ధం. ఒకసారి సీన్ పేపర్ చూసుకొన్నాక, అంతా మైండ్‌లోనే ఉంటుంది. ఫలానా షాట్ ఫలానా లాగా తీయాలని అనుకొని, చేసుకుంటూ పోతుంటా. ఆయనలో విశేషం ఏమిటంటే, ఆర్టిస్టులతో ఆయన బాగా స్నేహంగా ఉండేవారు. ఎంతటి హీరో, హీరోయిన్లతోనైనా చిటికెలో స్నేహం పెంచుకొనేవారు. ఇబ్బంది కలగకుండా, జాగ్రత్తగా చూసుకుంటూనే తనకు కావాల్సిన నటన రాబట్టుకొనేవారు. కృష్ణమోహనరావు: ఆర్టిస్టులను సుకుమారంగా డీల్ చేస్తూ, పని రాబట్టడమనే కళ ఆయన నుంచి మా తమ్ముడికీ అబ్బింది (నవ్వులు...) టాలెంట్ చూసి, తొలి అవకాశాలివ్వడంలోనూ నాన్న గారిది రికార్డే! రాఘవేంద్రరావు: పెండ్యాల గారిని ‘ద్రోహి’తో సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. ఆత్రేయ గారిని ‘దీక్ష’తో పాటల రచయితను చేశారు. ఈ సినిమాతోటే నటులు రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడలూ పరిచయమయ్యారు. ‘కన్నతల్లి’తో పి. సుశీల గారిని నేపథ్యగాయనిగా, రాజసులోచనను నటిగా పరిచయం చేశారు. ఒక దర్శకుడిగా ఆయనలోని గొప్పదనం ఏమిటంటారు? రాఘవేంద్రరావు: నాన్న గారు బాగా క్రియేటివ్. ఎప్పుడూ ఏవో కథలు రాసేవారు. సీన్ పేపర్లో ఎడమపక్కన ఆయనే స్వయంగా రాసుకొనే యాక్షన్ పార్ట్, షాట్ డివిజన్ వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఆ సీన్ పేపర్ చూస్తూ, ఎవరైనా ఇట్టే దర్శకత్వం వహించవచ్చు. దర్శకుడిగా మీ నాన్న గారు చేసిన ప్రయోగాల మాటేమిటి? రాఘవేంద్రరావు: దర్శకుడిగా, నిర్మాతగా మొదటి నుంచి ఆయన చేసినవన్నీ ప్రయోగాలే. హీరోగా నటిస్తున్న రోజుల్లోనే, సిహెచ్. నారాయణరావును హీరోగా పెట్టి, తాను విలన్‌గా నటిస్తూ ‘మొదటి రాత్రి’ (’50) స్వీయదర్శకత్వంలో నిర్మించారు. తమిళ, కన్నడ, హిందీ చిత్రాలూ తీశారు. పిల్లలను పాత్రధారులుగా పెట్టి, ‘కొంటె కృష్ణయ్య’, ‘బూరెల మూకుడు’ అనే సాంఘికాలు, ‘రాజయోగం’ అనే జానపదం కలిపి ‘బాలానందం’గా విడుదల చేశారు. క్లైమాక్స్‌లో పాట ఉండకూడదని ఎవరెంతగా వారించినా, ‘ప్రేమనగర్’లో ‘ఎవరి కోసం...’ పాట పెట్టారు. ఆ ప్రయోగం హిట్టయ్యాక, అనేక చిత్రాల్లో క్లైమాక్స్‌లో పాటలు వచ్చాయి. కథాకథనంలో కె.ఎస్.ది ప్రత్యేక శైలనేవారు. మీ స్వీయ అనుభవం? కృష్ణమోహనరావు: ఏ కథ తీసుకున్నా మనసుకు హత్తుకొనేలా, సాఫీగా తెరపై చెప్పేవారు. కథాకథనంలో ఫ్లాష్‌బ్యాక్‌లు బాగా వాడేవారు. ఒక దశలో ఆయనను ‘ఫ్లాష్‌బ్యాక్‌ల దర్శకుడు’ అని ఛలోక్తిగా పిలిచినవారూ ఉన్నారు. కానీ, ఎన్ని ఫ్లాష్బ్యాక్లున్నా సినిమాలో ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఉదాహరణకు, ‘తాసీల్దార్ గారి అమ్మాయి’ తీసుకుంటే, అందులో ఏకంగా 8 ఫ్లాష్బ్యాక్లున్నాయి. అయినా సరే, ఆ కథ తెరపై ఎంత బాగా చెప్పారన్నది ఇవాళ్టికీ ఒక మంచి స్క్రీన్‌ప్లే పాఠం. ఆయన సినిమాగా తీయాలనుకొని, తీయని కథల మాటేమిటి? రాఘవేంద్రరావు: రాయడం ఆయన హాబీ. ఉదయం లేస్తే చాలు... పెన్ను పట్టుకొని కూర్చొని రాసుకుంటూ ఉండేవారు. ఖాళీగా ఉండేవారు కాదు. 8 నుంచి పది పేజీల్లో కథ రాసేసుకొనేవారు. అందులో బాగా నచ్చిన కథను మాత్రం ఇంకా వివరంగా రాసుకొనేవారు. అలా ఆయన రాసుకున్న స్క్రిప్టుల్లో ‘సౌందర నందనం’, ‘శాంతల’ (మైసూర్ మహారాజా ఆస్థానంలోని డ్యాన్సర్ కథ), చాలా వివరంగా రాసుకున్న ‘కృష్ణభక్తి’ లాంటివి నాలుగైదు ఉండాలి. అలాగే, ‘ప్రేమనగర్’ చిత్రానికి ఆచార్య ఆత్రేయ స్క్రిప్టు నాన్న గారు తన ముత్యాల లాంటి దస్తూరీలో రాసుకున్నది చాలారోజుల పాటు ఇంట్లో ఉండేది. కృష్ణమోహనరావు: ఆయన చదివింది ఎస్.ఎస్.ఎల్.సి అయినా, బి.ఏ (లిటరేచర్)వాడు కూడా రాయలేనంత చక్కటి ఇంగ్లీషు రాసేవారు. రోజూ ఆయన డైరీ రాసేవారు. బీమా సంస్థలో పనిచేసే రోజుల నుంచి అది ఆయన అలవాటు. ఆయన డైరీలు కొన్ని భద్రంగా ఉంచాం. జి. వరలక్ష్మితో, ఆమె కుమారుడైన ప్రకాశ్‌తో మీ అనుబంధం... కృష్ణమోహనరావు: (అందుకుంటూ..) మేమంతా సఖ్యతగా ఉండేవాళ్ళం. కెమేరామన్ విన్సెంట్ దగ్గర మా కె.ఎ్స్. ప్రకాశ్, నవకాంత్, జయరామ్ శిష్యులు. రాఘవేంద్రరావు దర్శకుడయ్యాక తన నూటికి పైగా చిత్రాల్లో 70 దాకా చిత్రాలకు తమ్ముడు ప్రకాశే కెమేరామన్. వరలక్ష్మి గారు ‘పెద్దాడా, చిన్నాడా’ అంటూ మాతో ఆప్యాయంగా ఉండేవారు. ‘అక్కయ్యా’ అంటూ చొరవగా మా అమ్మతో మాట్లాడేవారు. నాన్నగారు కట్టిన ప్రకాశ్ స్టూడి యో సంగతులు గుర్తున్నాయా? కృష్ణమోహనరావు: మొదట్లో ఆయన అభ్యుదయ చిత్రాలే ఎక్కువ తీశారు. డబ్బు కోసం చూడలేదు. 1953లో స్టూడియో కట్టినా, ఇబ్బందులు చుట్టుముట్టాయి. 1960 నుంచి 67 దాకా ఏడేళ్ళు గడ్డుకాలం. రాఘవేంద్రరావు: చిన్నప్పుడు మాకు ఏడు కార్లున్నా, నడుచుకుంటూ స్కూల్‌కు వెళ్ళిన రోజులున్నాయి. స్కూల్ ఫీజుకు డబ్బు కట్టలేక ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. క్రమంగా పరిస్థితి మారింది. చేతులు కాలాక, నాన్న గారు కొద్దిగా పంథా మార్చి, వాణిజ్య విజయం మీద కూడా దృష్టిపెట్టి, ‘విచిత్ర కుటుంబం’ (’69), ‘ప్రేమనగర్’ (’71), ‘సెక్రటరీ’ (’76) లాంటి బయటి చిత్రాలు తీశారు. ఆయనకు ఇష్టమైన దర్శకులు ఎవరు? రాఘవేంద్రరావు: (నవ్వుతూ...) నా కన్నా అవతలివాళ్ళను ఎక్కువ మెచ్చుకొనేవారు. నటుడు మోహన్‌బాబును ‘నా పెద్దకొడుకు’ అనేవారు. కె.వి. రెడ్డి తరం తరువాత తారల ప్రాబల్యం పెరిగిన రోజుల్లో ‘సినిమాకు దర్శకుడే కెప్టెన్ అన్నది మరోసారి చాటిచెప్పిన వ్యక్తిరా - దాసరి’ అని నాన్న గారు ఎప్పుడూ మెచ్చుకొనేవారు. రాఘవేంద్రరావు తనయుడు సూర్యప్రకాశ్ దర్శకుడయ్యాడు. మనుమడు ఇలా సినిమాల వైపు వస్తాడని తాతయ్య ఊహించారా? కృష్ణమోహనరావు: (సూర్యప్రకాశ్‌ను చూపిస్తూ...) మా నాన్న గారు జీవించి ఉండగా వీడు చాలా చిన్నవాడు. అప్పటికింకా చదువుకుంటున్నాడు. సినిమాల్లోకి రాలేదు. రఘుపతి వెంకయ్య పురస్కార ప్రదాన సమయానికి (1997 యేప్రిల్) నాన్న గారు చనిపోవడంతో, ఆయన పేరే మేము పెట్టుకున్న వీడి చేతులకు ఆ పురస్కారం అందించారు. ఆ తరువాత ఊహించని విధంగా వీడూ దర్శకుడయ్యాడు. ‘మార్నింగ్ రాగా’ లాంటి మంచి చిత్రాల్లో నటించాడు. ‘బొమ్మలాట’ (2005)తో తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్నాడు. సూర్యప్రకాశ్! తాత గారి లాగే మీరూ నటుడు, నిర్మాత, దర్శకుడయ్యారు. ఆయన సంగతులు మీకేమైనా గుర్తున్నాయా? సూర్యప్రకాశ్: తాత గారు బతికున్న రోజుల్లో సినిమాల్లోకి రావాలన్న ఆలోచన నాకు లేదు. అయితే, వ్యక్తిగతంగా నా ఎదుగుదల మీద అంతర్లీనంగా ఆయన ప్రభావం ఉంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, వినయంగా ఉండడం లాంటివన్నీ ఆయనను చూసి నేర్చుకున్నవే. రాఘవేంద్రరావు: వీడు సినిమాల్లోకి రావాలనీ, నాన్న గారి వారసత్వం కొనసాగించాలనీ అందరి కన్నా ఎక్కువ అన్నయ్యకి ఉండేది. సినీ రంగంలో తాత ఎంతో గొప్ప వ్యక్తని అప్పట్లో మీకు తెలుసా? సూర్యప్రకాశ్: ఇంట్లో అందరూ చెప్పుకోవడం వల్ల తెలుసు. సినిమాల్లోకి వచ్చాక ఆయన సినిమాలు ‘ప్రేమనగర్’, ‘కొత్త నీరు’ (’82) లాంటివి సీడీల్లో చూశాను. ఆయనకు మనుమడినైనందుకు గర్విస్తున్నా! రాఘవేంద్రరావు: తన పేరే వీడికి పెట్టినందుకు నాన్న గారు ఆనందించారు. పేరుకు తగ్గట్లే స్క్రీన్‌ప్లే, స్క్రిప్టు రాసుకోవడం లాంటివన్నీ వీడికి నాన్న గారి నుంచి వారసత్వంగా వచ్చింది. నాన్నగారు రాసినట్లే వీడూ అన్నీ పకడ్బందీగా రాస్తాడు. సూర్యప్రకాశ్: నేనింకా మూడు, నాలుగు సినిమాల అనుభవమే ఉన్నవాణ్ణి. రాబోయే రోజుల్లో ఆ పేరు నిలబెట్టేలా, నాకు లభించిన ఈ వారసత్వానికి న్యాయం చేసేలా మరింత మెరుగైన సినిమాలు చేయాలి. అవకాశం వస్తే, నాన్న గారి సినిమాల్లో ఏది రీమేక్ చేస్తారు? రాఘవేంద్రరావు: ‘ప్రేమనగర్’ను ఇవాళ మారిన టెక్నాలజీతో బ్రహ్మాండంగా తీసే అవకాశం ఉన్నా... ఆ కథను నాన్న గారు తీసినదాని కన్నా గొప్పగా ఎవరూ తీయలేరు. గతంలో ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని నేను, నాగార్జున, రామానాయుడు గారు అనుకున్నా, మళ్ళీ వదిలేశాం. అయితే, నాన్న గారు తీసిన ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ చాలా మంచి స్క్రిప్టు. వీలుంటే, అది రీమేక్ చేయాలని ఉంది. మీ నాన్న గారి గురించి చాలామందికి తెలియని సంగతులు... కృష్ణమోహనరావు: ఆయనకు సాహిత్య పిపాస ఎక్కువ. నటుడు జగ్గయ్య, ఆయన మంచి సాహితీ ప్రియులు. ఒకప్పుడు నాన్న గారి రచనలు ‘భారతి’ మాసపత్రికలో కూడా వచ్చాయట. రాఘవేంద్రరావు: అలాగే, పేక ముక్కలతో ఆడే బ్రిడ్జి ఆటలో ఆయన అద్భుతమైన ఆటగాడు. నిర్మాత, దర్శకుడిగా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాక, ఉదయం పూట స్క్రిప్టులు రాసుకుంటూ, సాయంత్రం పూట కాలక్షేపం కోసం యాభయ్యో పడికి కొన్నేళ్ళ ముందు బ్రిడ్జి మొదలుపెట్టారు. కొద్దిరోజుల్లోనే జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదిగిన మేధావి ఆయన.ఎనిమిది దశాబ్దాలు దాటిన తెలుగు సినీ చరిత్రలో దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా, మూడు తరాలుగా సినీ రంగంలో కృషి చేస్తుండడం మీ కుటుంబానికి దక్కిన అరుదైన అదృష్టమేమో! రాఘవేంద్రరావు: అవును. మూడు తరాలుగా మా కుటుంబమంతా సినీ రంగంలోనే నిర్మాణ, దర్శకత్వ, సాంకేతిక విభాగాల్లో కృషి చేస్తూనే ఉంది. ఇది ఎల్.వి. ప్రసాద్, ఏయన్నార్, ఎన్టీఆర్, రామానాయుడు గారు - ఇలా కొన్ని కుటుంబాలకే అది దక్కింది. ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ -
నాకు సంగీతం తెలియదు... సంగీతానికి నేను తెలుసు!
ఆయన అపర త్యాగయ్య అంటారు కొందరు! ఆయనకు అహంకారమంటారు... ఇంకొందరు! మితిమీరిన ఆత్మవిశ్వాసమంటారు... మరికొందరు! ఎవరేమన్నా, అనుకొన్నా వెరవని స్వభావం... సంగీతంలో, జీవితంలో నిత్య ప్రయోగశీల వ్యక్తిత్వం... నమ్మినదాన్ని ఆచరించే పట్టుదల... నమ్మి వచ్చినవారికి ఆశ్రయమిచ్చే ఔదార్యం... సమకాలీన కర్ణాటక సంగీత ప్రపంచంలో అరుదైన వాగ్గేయకారుడిగా గౌరవం... 76 ఏళ్ళుగా పాడుతున్నా... ఇప్పటికీ వన్నె తగ్గని ఆ మధు మురళి... డాక్టర్ మంగళంపల్లి బాలమురళి. త్యాగరాజ స్వామి వారి శిష్యపరంపరలో అయిదో తరం వ్యక్తిగా... తెలుగువారి ఆస్తి ఆయన. ‘పద్మశ్రీ’, ‘పద్మవిభూషణ్’, ఫ్రాన్స్ దేశపు అత్యున్నత సత్కారం ‘షెవాలియర్’... ఇలా అన్నీ ఈ భారత జాతిరత్నం ద్వారా తమ గౌరవాన్ని పెంచుకున్నవే. ఎంత ఎత్తు ఎదిగినా, హృదయంలోని పసితనాన్ని ఇప్పటికీ పోగొట్టుకోని... 84 వసంతాల నిత్య బాలుడాయన. నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న ఈ ముగ్ధమోహన గాన మురళితో ‘సాక్షి’ మాటకచ్చేరీ... త్యాగరాజస్వామి ప్రత్యక్ష శిష్యపరంపరలో నేను అయిదో తరం వాణ్ణి... త్యాగరాజస్వామి, వారికి మానాంబుచావిడి (ఆకుమళ్ళ) వెంకట సుబ్బయ్య, ఆయనకు సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి, సుసర్లకు పారుపల్లి రామకృష్ణయ్య, ఆయనకు నేను... ఇలా! గానమే కాకుండా అనేక వాద్యాల మీద నాకు పట్టు మొదలైంది ద్వారం వెంకట స్వామి నాయుడుగారి వయొలిన్ కచ్చేరీతో! ఆయన వాయిస్తుంటే విని విని, చూసి చూసి, చటుక్కున వయొలిన్ తీసి వాయించడం మొదలు పెట్టాను. తర్వాత వయోలా, మృదంగం, కంజీరా, వీణ ఇలా... చాలానే! నేను పాడిన తెలుగు సినిమా పాటల్లో నాకిష్టమైనవి... ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు..’ (ఉయ్యాల - జంపాల), ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా...’ (గుప్పెడు మనసు), ‘పాడనా వాణి కల్యాణిగా...’ (మేఘసందేశం), ‘నర్తనశాల’లోని ‘సలలిత రాగ సుధారస సారం...’లాంటివి..! ఆత్మకథ రాయమని అడిగేవారికి నేను చెప్పేదొక్కటే... నా మీద ఇప్పటికే చాలా పుస్తకాలు వచ్చాయి. ఎంతోమంది నా జీవితానికి అక్షరరూపం ఇచ్చారు, ఇస్తున్నారు కూడా. నా జీవితం, సంగీత కృషి మీద ఇప్పటికే విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగింది. పిహెచ్.డి. పట్టా కూడా దక్కాయి. ఇక నేను రాయడమెందుకు! సంగీతానికి నేనిచ్చే నిర్వచనం... లైఫ్! సంగీతం అంటే ప్రాణం, జీవం. అదే మనిషి జీవితం. అంతేతప్ప, సంగీతం అంటే ఏవో నాలుగైదు కీర్తనలు పాడడం కాదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొనే మాటల్లో కూడా సంగీతం ఉంటుంది. ఆ సంగీతం సరిగ్గా కుదరకపోతే, ఒకరు మాట్లాడేది మరొకరికి అర్థం కాదు. ఆ సంగీతం సమశ్రుతిలో ఉంటే, అదే బ్రహ్మానందం! ఎనిమిదేళ్ళు నిండీనిండగానే కచ్చేరీలు మొదలు పెట్టారు. ఇప్పటికి 76 ఏళ్ళుగా వేల కచ్చేరీలు చేశారు. అసలు తొలిసారిగా మీరిచ్చిన కచ్చేరీ..? 1938 జూలైలో అనుకుంటా... బెజవాడలోని దుర్గాపురంలో శరభయ్యగారి గుళ్లో హాలు ప్రారంభోత్సవం... మా గురువుగారైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు తమ గురువులైన సుసర్ల దక్షిణామూర్తిగారి పేర ‘సద్గురు ఆరాధనోత్సవాలు’ జరుపుతున్నప్పుడు నాతో కచ్చేరీ చేయించారు. కొద్దిసేపనుకున్న నా గానం కొన్ని గంటలు మంత్రముగ్ధంగా సాగింది. నా తరువాత హరికథ చెప్పాల్సిన సుప్రసిద్ధులు ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ తన ప్రోగ్రామ్ కూడా వద్దని, నన్ను ఆశీర్వదించారు. అప్పటి దాకా నా పేరు మురళీకృష్ణ. పసివాడినైన నాకు ‘బాల’ అనే మాట ఆయనే చేర్చి, ‘బాల మురళీకృష్ణ’గా దీవించారు. అసలు మీరు పుట్టింది... చదువుకున్నది ఏ ఊరిలో..? తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో పుట్టా. నేను పుట్టిన పక్షం రోజులకే మా అమ్మ సూర్యకాంతమ్మ చనిపోయింది. దాంతో, మా అమ్మగారి అక్కల్లో అందరి కన్నా పెద్దవారూ, బాలవితంతువైన మా పెద్దమ్మ సుబ్బమ్మ గారు నన్ను పెంచారు. నేను స్కూల్లో చేరి చదివింది సరిగ్గా 3 నెలలే. నా పాట విని, విజయవాడ గవర్నర్‌పేటలోని మునిసిపల్ స్కూల్లో హెడ్మాస్టర్ నాకు ఫస్ట్ ఫారమ్‌లో ప్రవేశం కల్పించారు. మా నాన్నగారు నన్ను ముందు కూర్చోబెట్టుకొని, సైకిల్ తొక్కుతూ బడికి తీసుకువెళ్ళడం నాకిప్పటికీ గుర్తే. బడిలో కూడా నా పాటలే ఆకర్షణ. అంతా నా చుట్టూ చేరేవారు. అయితే, నా సంగీతంతో మిగిలిన పిల్లల చదువు కూడా పాడవసాగింది. ఇంతలో నేను క్వార్టర్లీ పరీక్షలు తప్పాను. దాంతో, ‘మీ వాడికి చదువు కన్నా సంగీతమే కరెక్ట్. అందులోనే కృషి చేయించండి’ అని హెడ్మాస్టర్ నాన్న గారికి చెప్పారు. (నవ్వుతూ) అలా 6వ తరగతి ఫెయిలై, స్కూలు చదువు అటకెక్కినా, వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 12 డాక్టరేట్లు అందుకొని, డాక్టర్‌నయ్యా. రేడియోలో పని చేస్తున్న రోజుల్లో బెజవాడలో ఓ ఆడ ఇంగ్లీష్ ఎనౌన్సర్ నా పాట విని నచ్చి, ఇంగ్లీషులో మెచ్చుకొని, షేక్‌హ్యాండ్ ఇవ్వబోతే అర్థంకాక జంకాను. ఆ తరువాత పట్టుబట్టి, 3 నెలల్లో ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించి, ఆమెతో అనర్గళంగా మాట్లాడా. రోటరీక్లబ్‌లో ఇంగ్లీషులో నా తొలి ఉపన్యాసమిచ్చా. అలాగే, సంస్కృతం మీద పట్టు సాధించా. చిన్ననాటి అనుభవాలు మరికొన్ని... నా 11వ ఏట తిరువయ్యారులో త్యాగరాయ ఆరాధనోత్సవాలలో పారుపల్లివారికిచ్చిన సమయంలో నేను పాడినప్పుడు, జనం నుంచి అపూర్వ స్పందన వచ్చి, చుట్టూ మూగితే, నాగరత్నమ్మ గారు నన్ను తీసుకువెళ్ళి, త్యాగరాజస్వామి విగ్రహం పాదాల చెంత పడేశారు. ‘ఏ నరదృష్టీ సోకకుండా ఈ పిల్లవాణ్ణి కాపాడమ’ని ప్రార్థించారు. ఇక, బెజవాడలోని సత్యనారాయణపురంలో మా ఇంటికి ఎదురుగా ఉన్న దూబగుంట వారి సత్రంలో చాతుర్మాస్య దీక్షకని కుర్తాళం పీఠాధిపతి వచ్చారు. ఆయన పారుపల్లి వారికి ఆధ్యాత్మిక గురువు. స్వామీజీని కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ ప్రేరణ, ఆశీర్వాదం అందుకొని, 72 మేళకర్త రాగాల్లో కీర్తనల రచన ‘జనక రాగ కృతి మంజరి’ మొదలుపెట్టాను. ఇక, శరభయ్యగారి గుళ్ళలో ఉండే దేవీ ఉపాసకుడు, పండితుడు అయ్యప్పశాస్త్రి నాకు యతి, ప్రాస, కవితా లక్షణాలను చెప్పడం, కృతి, కీర్తన, పాట, పదం, జావళీల భేదాలు, రచనా రహస్యాలు తెల్పడం నా సాహితీ రచనకు వన్నెలద్దింది. ప్రతిభకు పెద్దల ఆశీర్వాద బలం తోడైంది. మీ జీవితంలో గురువుగారి పాత్ర? ఆయనలో మీరు చూసిన ప్రత్యేకత? మా గురువు పారుపల్లి వారు లేకపోతే, ఆంధ్రదేశంలో ఇవాళ కర్ణాటక సంగీతం ఇంతగా ప్రాచుర్యంలోకి వచ్చేది కాదు. బెజవాడలో గాంధీనగర్‌లోని ఆయన ఇంటికి సైకిల్ మీద వెళ్ళి, పాఠం చెప్పించుకున్న రోజులు నాకింకా గుర్తే. శిష్యులమైన మా అందరికీ ఆయన తనకు తెలిసిన విద్యనంతా నేర్పారు. గమ్మత్తేమిటంటే, పారుపల్లి వారి దగ్గర మా నాన్న గారూ పాఠం చెప్పించుకున్నారు. తండ్రీ కొడుకులిద్దరికీ ఆయనే గురువన్న మాట! కానీ, పారుపల్లి వారి వద్ద నేర్చుకున్న త్యాగరాయ సంగీతం కన్నా, మీ సొంత బాణీకీ, కృతులకే మీరు ప్రాధాన్యమిచ్చారని మరో విమర్శ... త్యాగరాజస్వామి ముందువాళ్ళు ఎవరు ఎలా పాడేవారో ఎవరికీ తెలీదు కదా! ఆయన ఆ రాగాల్లో కృతులు రాసుకొని, ఆలపించారు. ఆ త్యాగరాయ సంగీతం పరంపరాగతంగా మా వరకు వచ్చింది. ఆ సంగీతాన్ని పాడుతూనే, పెద్దగా పాపులర్ కాని రాగాల్లో సైతం కీర్తనలు రాసి పాడాను. రాగాలు కనిపెట్టాను. అలా రచన, గానంతో వాగ్గేయకారుణ్ణయ్యాను. నా పద్ధతి, పాట ‘బాలమురళి బాణీ’గా ప్రచారంలోకి వచ్చింది. అదేదో నేను ఉద్దేశపూర్వకంగా కొత్తగా, ధైర్యంగా చేశానని చెప్పను కానీ, అలా జరగాలని రాసి ఉంది.... జరిగింది. అంతే! రేడియో పాపులారిటీకి కూడా ఎంతో శ్రమించారు. ఉదయం వేళ ‘భక్తి రంజని’ ఆలోచన మీదేనట! అవును. ఆ రోజుల్లో కోరి మరీ రేడియోలో చేరాను. ఉదయాన్నే నిద్ర లేస్తూనే, మంచి సంగీతం వింటే, శ్రోతలకు బాగుంటుందని ఆ భక్తి సంగీత కార్యక్రమం పెట్టాను. దాని కోసం ఎన్నో తత్త్వాలు, భక్తి కీర్తనలు సుప్రసిద్ధులెందరితోనో పాడించాను. సంగీతం, నాటకం, స్పోకెన్ వర్డ్ లాంటి వివిధ విభాగాలకు ప్రొడ్యూసర్లనే పోస్టులు పెట్టించి, ఆయా రంగాల్లోని సుప్రసిద్ధులను అధిపతులుగా నియమించేలా చూశాను. ఆకాశవాణికి అది స్వర్ణయుగం! విజయవాడలో ప్రభుత్వ సంగీత కళాశాల పెట్టించి, తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేసిన మీరు మద్రాసుకు మారిపోయి, 50 ఏళ్ళుగా స్థిరపడడానికి కారణం? ఉత్తరాదికి బొంబాయి ఎలాగో, దక్షిణాదికి మద్రాసు అలా! కళాసాంస్కృతిక రంగాలకు ఇది కేంద్రం. ఇక్కడ అవకాశాలు ఎక్కువ. బెజవాడ మ్యూజిక్ కాలేజీకి రాజీనామా చేశాక, మళ్ళీ మద్రాసు ఆకాశవాణిలో మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా చేస్తూనే, కచ్చేరీలిస్తూ వచ్చా. ఆ తరువాత పూర్తిగా సంగీతం మీదే దృష్టి పెడుతూ, ఉద్యోగం వదిలేశాను. ఉత్తరాదిన ఎందరికో దక్కిన ‘భారతరత్న’ మీకు రాలేదు. వివక్ష కారణమా? ఫలానాది కావాలి, రావాలి అని నేనెప్పుడూ అనుకోలేదు... ‘భారతరత్న’ గురించీ అంతే! ఎవరికి ఏది ప్రాప్తమో అదే వస్తుంది. లతా మంగేష్కర్, భీమ్సేన్ జోషీ, బిస్మిల్లా ఖాన్, హరిప్రసాద్ చౌరసియా, పండిట్ రవిశంకర్ లాంటి దిగ్గజాలూ, నేనూ కలిసి ఎన్నో వేదికలపై కచ్చేరీలు చేశాం. కానీ, దురదృష్టవశాత్తూ ఇవాళ ప్రతిదీ రాజకీయమైపోయింది. ఈ ఆధునిక యుగంలో కర్ణాటక సంగీతానికి భవిష్యత్తు ఉందంటారా? కర్ణాటక సంగీతం అనగానే మీరు గిరి గీసుకొని, సంకుచితంగా ఆలోచించకండి. చెవులకు ఇంపుగా ఉండేది అని ఆ మాటకు అసలైన అర్థం. కాబట్టి, శాస్త్రీయ, జానపద, లలిత, పాశ్చాత్య సంగీతాలు ఏవైనా సరే, ఇంపుగా ఉంటే అది కర్ణాటక సంగీతమే. ప్రపంచమే ఓ కుగ్రామమైపోయి, సరిహద్దులు చెరిగిపోవడంతో, మునుపటితో పోలిస్తే ఈ తరానికి వేదికలు, అవకాశాలు ఎక్కువ. కాబట్టి, కచ్చితంగా కర్ణాటక సంగీతానికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంది. అయినా, కాలంతో పాటు వచ్చే మార్పులకు తగ్గట్లుగా కొత్త కూరలు వస్తాయి, రుచులు మారతాయే తప్ప, తినడమైతే మానేయం కదా! సంగీతమూ అంతే! అన్నట్లు, మీకు అత్యంత ఇష్టమైన రాగం..? 75 మేళకర్త రాగాలలో కీర్తనలు రాశాను. అలాగే, సరికొత్త తాళ విధానాన్ని కనిపెట్టాను. ఇక, మహతి, లవంగి, గణపతి - ఇలా నేను సృష్టించిన రాగాలే దాదాపు 25 పైగా ఉంటాయి. అన్నీ నా పిల్లలే. వాటిలో ఏది ఎక్కువంటే చెప్పడం కష్టం. కానీ, కల్యాణి మీకు ఇష్టమైన రాగమని విన్నట్టు గుర్తు..? (నవ్వేస్తూ...) గతంలో ఒకసారి కేరళలోని త్రివేండ్రంలో అనుకుంటా. కచ్చేరీ చేస్తున్నా. ఆ సమయంలో నేను కల్యాణి రాగం పాడుతుంటే, ఒక అందమైన అమ్మాయి వచ్చి, నా పక్కన కూర్చొంది. ‘సొగసు నీ సొమ్ము కల్యాణి రాగిణీ, వగలు విరజిమ్ము నా భావజాలమ్ములో...’ అని అప్పటికప్పుడు పాట, వరుస కట్టాను. ఆ కృతి అయిపోగానే ఎలా వచ్చిన అమ్మాయి అలా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో ఎవరికీ తెలీదు. దానికి ఆ కచ్చేరీకి వచ్చినవాళ్ళే సాక్షులు. కల్యాణి రాగదేవతే అలా వచ్చిందనుకుంటా! అవును... రోజుకి ఎంత సేపు సాధన చేస్తుంటారు? కచ్చేరీకి వెళ్ళేముందు ఒక రిహార్సల్ కానీ, ప్రాక్టీస్ కానీ అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. మైకు ముందుకు వెళ్ళే వరకూ ఏం పాడతానో నాకే తెలియదు. కూర్చోగానే, ఇవాళ పాడాలి కదా, వీళ్ళందరినీ సంతోషపెట్టాలి కదా అనిపిస్తుంది. అంతే... సంగీతం, పాట వాటంతట అవే వస్తాయి. వాటికి నేను వాహికనవుతాను. కానీ, ఇలా సాధన లేకుండా, అప్పటికప్పుడు తిల్లానా రాసుకొని, అక్కడికక్కడ సంగతులు వేసుకొని పాడేయడం..? నేనెప్పుడూ చెబుతుంటాను... సంగీతం నాకు రాదు, తెలియదు. కానీ, సంగీతానికి నేను తెలుసు. అందుకే, అది నన్ను వెతుక్కుంటూ వచ్చినంత కాలం నేను వాహికగా ఉంటాను. పాట నా నోట పలుకుతుంది. ఎందరికో సంగీతం నేర్పారు... వారసులు ఎవరంటారు? నా బాణీని కొనసాగించే, ప్రతిభావంతులైన శిష్యులు ఎందరో ఉన్నారు. వారందరూ నాకు సమానమే. నా శిష్యుల్లో ఎవరో ఒకరు ఈ పరంపరను కొనసాగిస్తారు. కానీ, ఫలానావాళ్ళు నా వారసులని చెప్పలేను.. చెప్పకూడదు కూడా! ఆంధ్రప్రదేశ్ అవతరించిన 1956 నవంబర్ 1న ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వయొలిన్‌తో, మీరు గాత్రంతో రసానందంలో ముంచి తేల్చారని చదివా. కొత్త రాష్ట్రాల్లో కూడా ఆ భాగ్యం కలిగిస్తారా? నన్ను ఆహ్వానిస్తే... తప్పకుండా వెళ్ళి, అవతరణ దినోత్సవాల్లో పాడతాను. సంగీతామృతాన్ని పంచుతాను. గతంలోకి వెళితే... ఎన్టీఆర్‌తో మీ అనుబంధం? ఎన్టీఆర్ ముఖ్య మంత్రి పదవిలో ఉండగా, తెలుగు నేలపై పాడనని శపథం పట్టారే..? ఎన్టీఆర్ మంచి నటుడు, గొప్పవారు. ‘నర్తనశాల’, ‘శ్రీమద్విరాటపర్వము’ లాంటి చిత్రాల్లో ఆయనకు నేను మంచి పాటలు పాడాను. మా మధ్య ఆ గౌరవాదరాలు ఉండేవి. కానీ, ఆయన లలిత కళా అకాడెమీలన్నిటినీ ఒక్క కలం పోటుతో రద్దు చేసేసరికి, భేదాభిప్రాయం వచ్చింది. కళాకారులకు అవమానం జరిగిందనే బాధతో ఆయన తన పంథా మార్చుకొనే దాకా పాడనన్నాను. ఏడేళ్ళ విరామం తరువాత ముఖ్యమంత్రి చెన్నారెడ్డిగారి అభ్యర్థనతో మళ్ళీ హైదరాబాద్‌లో పాడాను. తరువాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ తన తప్పు తెలుసుకొని, పంథా మార్చుకొని, సాదరంగా మళ్ళీ పిలిచి, గౌరవించడంతో వెళ్ళాను. పాడాను. ప్రాథమికంగా మేమిద్దరం ఆర్టిస్టులం. ఆయన నటన నాకూ, నా పాటలు ఆయనకూ నచ్చేవి. అధికారానికో, అహంకారానికో, ఆర్థిక బలిమికో కాదు... నేను ప్రేమకు కట్టుబడతాను. కానీ, సంగీత, సాహిత్య, నాటక అకాడెమీలు పైరవీల మీద, ఆశ్రీతపక్షపాతం మీద నడవడం తప్పే కదా! అయినా అకాడెమీల అవసరం ఉందంటారా? అకాడెమీలు ఇవాళ్టికీ అవసరమే. ఇక, వాటిలో జరిగే తప్పొప్పులు అంటారా... అవన్నీ జరిగితేనే కదా, ఎలా చేయాలి, ఎలా చేయకూడదనే అనుభవం వస్తుంది. తప్పు జరిగిందని మొత్తం వ్యవస్థనే వద్దనడం తప్పు కదా?! సినిమా రంగంతో కూడా మీది అవిస్మరణీయమైన అనుబంధం... అక్కినేని, నా శిష్యురాలు ఎస్. వరలక్ష్మి నటించిన ‘సతీ సావిత్రి’ మొదలుకొని మొన్నామధ్య దాకా నన్ను అడిగినవాళ్ళకు పాడాను. అలాగే, ఏ.వి.ఎం. వారి ‘భక్త ప్రహ్లాద’లో నారదుడిగా నటించాను. జి.వి. అయ్యర్ రూపొందించిన ‘హంస గీతె’ (కన్నడం), ‘ఆది శంకరాచార్య’ (సంస్కృతం), ‘మధ్వాచార్య’, ‘భగవద్గీత’ లాంటి చిత్రాలకు సంగీతం అందించాను. ఉత్తమ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అవార్డులందుకున్నాను. బెంగాలీలో ఉత్పలేందు చక్రవర్తి దర్శకత్వంలోని ‘చచందనిర్’లో కాసేపు కనిపిస్తాను. ఓ సంగీత విద్వాంసుడి జీవితం చుట్టూ తిరిగే కథగా మలయాళంలో రూపొందిన ‘సంధ్య కెందిన సింధూరం’ చిత్రంలో ఆ కథానాయక పాత్ర చేశాను. మీ భార్యాపిల్లల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు..? నా భార్య పేరు అన్నపూర్ణ. నాకు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. అందరూ జీవితంలో స్థిరపడ్డారు. అందరికీ సంగీతం వచ్చు. కానీ, సంపాదనలో స్థిరత్వం ఉండని ఈ రంగం వైపు రావద్దని సూచించాను. మా పెద్దమ్మాయి అమ్మాజీ హైదరాబాద్‌లో ఉంటుంది. పెద్దబ్బాయి అభిరామ్ ప్రింటింగ్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. రెండో అమ్మాయి లక్ష్మి గృహిణి. వాళ్లూ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఇక, ఆ తరువాత పిల్లలైన సుధాకర్, వంశీ మోహన్‌లు డాక్టర్లు. సుధాకర్ చెన్నైలోనే ఆదంబాక్కమ్‌లో ఎస్.పి.హాస్పిటల్ పేరిట పెద్ద ఆసుపత్రి నడుపుతూ బిజీగా ఉన్నాడు. వంశీ మోహన్ పేరున్న డయాబెటాలజిస్ట్. నాతోనే చెన్నైలో ఈ ఇంట్లోనే ఉంటాడు. ఇక, నా ఆఖరు అమ్మాయి మహతి కూడా మద్రాసులోనే ఉంటోంది. ఇదీ నా కుటుంబం. ‘మహతి’ పేరు బాగా ఇష్టమా? మీ ఇంటికీ అదే పేరు పెట్టుకున్నారు..? మా అమ్మ వీణావాదనలో దిట్ట. నారదుడి వీణ పేరు కూడా మహతే కదా... అందుకే, ఈ పేరు. దీర్ఘకాలం మీ వెంట ఉండి, మీ చరిత్రనూ, కృషినీ ఎం.బి.కె. ట్రస్ట్ ద్వారా భావితరాలకు అందించే ప్రయత్నంచేసిన నర్తకి సరస్వతి మరణించడం...(తీవ్రమైన భావోద్వేగానికి గురై...) ఆమె లేకపోవడం నాకు అపారమైన నష్టం. షి వజ్ మై లైఫ్! ఆమె మరణం తరువాత అనేక అంశాలపై నాకు ఆసక్తి కూడా పోయింది. మరి, మీ గాత్రంలోనే మీ కృతులన్నిటినీ వీడియో రికార్డు కూడా చేయాలన్న ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? దాదాపు 500 రచనల్లో కొన్ని రికార్డు చేశాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఆ పని జరుగుతోంది. మీ పుట్టినరోజంటే, కచ్చేరీలు, ఇతర కళాకారులకు సన్మానాలతో సాగేవి. ఈ సారి ఎలా జరుపుకోబోతున్నారు? నేనెప్పుడూ పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకోను. అభిమానులే చేస్తుంటారు. ఈ సారి ‘సరిగమ’ సంస్థవారు 1950ల నుంచి ఇప్పటి దాకా నా రికార్డింగుల్లోని ఆణిముత్యాలన్నిటినీ ఏరి, ‘సెలస్టియల్ ట్రెజర్’ అని ఓ సీడీ విడుదల చేస్తున్నారు. గడచిన 83 ఏళ్ళు మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చేస్తే, ఎలా బతకాలనుకుంటున్నారు? మళ్ళీ ఇప్పటి బాల మురళీలాగానేనా? నా 83 ఏళ్ళ జీవితంలో నాకు చేతనైనంత మంచే చేశాను. నాకు నచ్చినట్లుగా బతికాను. ఏం జరిగినా, అది నా మంచికే అనుకుంటా. ప్రతి క్షణం నాకు చిరస్మరణీయమే! - రెంటాల జయదేవ