గోల్డెన్‌ మెమొరీస్‌-‘రౌడీ అల్లుడు’ @30 ఇయర్స్‌ | Megastar Chiranjeevi Rowdy Alludu Completes 30 Years | Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ మెమొరీస్‌-‘రౌడీ అల్లుడు’ @30 ఇయర్స్‌

Published Tue, Oct 19 2021 12:29 AM | Last Updated on Tue, Oct 19 2021 7:18 AM

Megastar Chiranjeevi Rowdy Alludu Completes 30 Years - Sakshi

ఒకే హీరో... రెండు పాత్రలు... మనిషిని పోలిన మనుషులు ఇద్దరు... ఒకడు సాధుస్వభావి, వేరొకడు తాడోపేడో తేల్చుకొనే ఉడుకు, దుడుకు జీవి. ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్ళడం... సమస్యలను చక్కబెట్టడం... వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ ఫార్ములా ఇది. సరిగ్గా 140 ఏళ్ళ క్రితం 1881లో వచ్చిన మార్క్‌ట్వైన్‌ రచన ‘ప్రిన్స్‌ అండ్‌ పాపర్‌’ నాటి నుంచి అరిగిపోని, తరిగిపోని వాణిజ్య సూత్రం. వెండితెరపై ఎప్పుడో ఎన్టీఆర్‌ ‘రాముడు-భీముడు’ నుంచి ఇవాళ్టి దాకా స్టార్‌ హీరోలకు సూపర్‌హిట్‌ కథామంత్రం. హీరో చిరంజీవి కెరీర్‌లో అలాంటి బంపర్‌ హిట్‌ అందించిన ద్విపాత్రాభినయ చిత్రాల్లో ప్రత్యేకమైనది – ‘రౌడీ అల్లుడు’. 1991 అక్టోబర్‌ 18న విడుదలైన ఈ చిత్రానికి ఇప్పుడు 30 వసంతాలు.

కొత్త బ్యానర్‌... సరికొత్త హీరోయిన్‌...
అది 1991 జూన్‌ ప్రాంతం. సరిగ్గా అప్పుడే హీరో చిరంజీవికి ‘గ్యాంగ్‌ లీడర్‌’ లాంటి కెరీర్‌ బెస్ట్‌ బాక్సాఫీస్‌ హిట్‌ వచ్చింది. యాక్షన్‌ నిండిన ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్‌ సినిమా తరువాత ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచన. ఈసారి పూర్తి ఎంటర్‌టైనర్‌ తీస్తే? అదీ – తెరపై ఒకరికి ఇద్దరు చిరంజీవుల్ని చూపిస్తే? అంతకు ముందు ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’తో వసూళ్ళ వర్షం కురిపించిన చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్‌ను రిపీట్‌ చేస్తే? ఇలాంటి ఆలోచనల ఫలితమే – ‘రౌడీ అల్లుడు’ చిత్రం.

‘గ్యాంగ్‌ లీడర్‌’ బంపర్‌ హిట్‌ తర్వాత చిరంజీవి తన వాళ్ళ కోసం చేసిన సినిమా ఇది. అల్లు అరవింద్‌ సమర్పణలో, చిరంజీవి తోడల్లుడు డాక్టర్‌ కె. వెంకటేశ్వరరావు, బావ గారు పంజా ప్రసాద్‌ (హీరో సాయిధరమ్‌ తేజ్‌ తండ్రి) నిర్మాతలుగా శ్రీసాయిరామ్‌ ఆర్ట్స్‌ పతాకంపై ‘రౌడీ అల్లుడు’ రూపొందింది. సినిమా నిర్మాణ వ్యవహారాలన్నీ అల్లు అరవిందే చూసుకున్నారు. ఆ బ్యానర్‌పై వచ్చిన ఏకైక సినిమా ఇది. ఇక, చిరంజీవి, దివ్యభారతి కాంబినేషన్‌లో వచ్చిన ఏకైక సినిమా కూడా ఇదే. నార్త్‌ నుంచి వచ్చి తెలుగు సినిమాలు చేస్తున్న హీరోయిన్‌ దివ్యభారతికి అప్పట్లో మంచి క్రేజుంది. వెంకటేశ్‌ ‘బొబ్బిలి రాజా’, మోహన్‌బాబు ‘అసెంబ్లీ రౌడీ’ లాంటి హిట్స్‌తో ఆమె జోరు మీదున్నారు. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’లో హీరోకు గాయం కావడంతో, షూటింగ్‌ ఆలస్యమై అప్పటికింకా రిలీజు కాని బాలకృష్ణ ‘ధర్మక్షేత్రం’లోనూ ఆమే హీరోయిన్‌. బాక్సాఫీస్‌ లెక్కలతో చిరంజీవి సరసన ఆమెను బుక్‌ చేశారు. రెండో హీరోయిన్‌గా శోభనను తీసుకున్నారు. 

ఆ మేనరిజమ్‌తో... బాక్సాఫీస్‌ బద్దలు
కోట్లకు పడగెత్తిన మేనల్లుడు కల్యాణ్‌ (చిరంజీవి) స్థానంలో అదే పోలికలున్న ఆటో జానీ (రెండో చిరంజీవి)ని పెట్టి, మోసం చేయాలనుకుంటాడో దుష్ట మేనమామ (కోట శ్రీనివాసరావు). మొదట వారి పాచిక పారినా, ఆనక హీరో ‘నీచ్‌ కమీన్‌ కుత్తే’ దుష్టత్రయం పనిపట్టడం కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌ నిండిన ఈ చిత్రకథ. కోటీశ్వరుడైన బిజినెస్‌ మ్యాగ్నెట్‌ కల్యాణ్‌గా, అమలాపురం నుంచి బొంబాయి వెళ్ళి స్థిరపడ్డ ఆటో జానీగా – రెండు పరస్పర విరుద్ధమైన పాత్రలను హీరో చిరంజీవి సమర్థంగా పోషించారు. ఒకదానికొకటి సంబంధం లేని బాడీ లాంగ్వేజ్‌తో, భాషతో, యాసతో వినోదం పంచారు.

ముఖ్యంగా, ఆటో డ్రైవర్‌ జానీ పాత్రలో ప్రత్యేకంగా కనిపించడం కోసం డైలాగ్‌ డెలివరీ మొదలు మేనరిజమ్స్‌ దాకా అన్ని విషయాల్లో వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. ‘గ్యాంగ్‌ లీడర్‌’లో ‘రప్ఫాడిస్తా’ అన్న చిరంజీవి, ‘రౌడీ అల్లుడు’లో ‘బాక్స్‌ బద్దలైపోతుంది’ అనే ఊతపదంతో ఆకట్టుకున్నారు. ఆ వెంటనే ‘ఘరానా మొగుడు’లో ‘ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకో’ అంటూ జనం నోట నిలిచిపోయారు. వరుసగా ఈ మూడు మేనరిజమ్‌లూ జనజీవితంలో భాగమైపోయాయి. మూడు సినిమాలూ సూపర్‌హిట్టే. చిరంజీవి కెరీర్‌లో ఈ 3 చిత్రాల హ్యాట్రిక్‌ హిట్‌ సీజన్‌ ఓ మరపురాని ఘట్టం. 

రెండు ఫార్ములాలు... మూడు సినిమాలు...
చిరంజీవితో డ్యుయల్‌ రోల్‌ కథ చేయాలనే దర్శకుడి ఆలోచనకు రచయిత సత్యానంద్‌ అల్లిన కథ, చేసిన మాటల మాయాజాలం – ఈ బాక్సాఫీస్‌ హిట్‌. ఈ చిత్ర రచనలో సత్యానంద్‌ అనుభవం, దర్శక – నిర్మాతల అభిరుచి ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఒక విధంగా ఈ చిత్రకథ అంతకు ముందు సంవత్సరాల్లో చిరంజీవికి ఘనవిజయాలు అందించిన అనేక ఫార్ములాల మిక్స ్చర్‌ పొట్లం. ‘దొంగమొగుడు’ (1987)లోని ద్విపాత్రల ధోరణికి అందమైన కొనసాగింపు. హీరో డ్యుయల్‌ రోల్‌ ఫార్ములా, మామను ఆటపట్టించే ‘యముడికి మొగుడు’ (1988), అత్తను టీజ్‌ చేసే ‘అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు’ (1989) మూడింటి సమ్మేళనం – ఈ ‘రౌడీ అల్లుడు’. డబుల్‌ రోల్, టీజింగ్‌ ఫార్ములాలు రెంటినీ కలపడంతో బాక్సాఫీస్‌ వినోదానికి కొదవ లేకుండా పోయింది. 

మారిన ఆ టైటిల్స్‌ కథ!
విలన్‌ పాత్రధారుల్లో ఒకరైన అల్లు రామలింగయ్యకు ‘బొంబాయిలో ఇంతే... బొంబాయిలో ఇంతే’ లాంటి మేనరిజమ్స్‌ పెట్టడం, ఆటో జానీ పాత్ర డైలాగుల్లో మాస్‌ వినోదపు మసాలా దట్టించడం సామాన్య జనానికి బాగా పట్టాయి. ఒక దశలో ఈ సినిమాకు ‘ఆటో జానీ’, ‘ఫిఫ్టీ – ఫిఫ్టీ’ అనే రెండు టైటిల్స్‌ కూడా అనుకున్నారు. కానీ, చివరకు మామను ఆటపట్టించే వినోదాత్మక కథాంశానికి తగ్గట్టుగా ‘రౌడీ అల్లుడు’ టైటిల్‌ ఖరారు చేశారు. అప్పట్లో చిరంజీవి, నగ్మాల ‘ఘరానా మొగుడు’కు కూడా మొదట అనుకున్న టైటిల్‌ అది కాదు. ‘లీడర్‌ రాజు’ అని పెడదామనుకున్నారు. కానీ, చివరకు ‘ఘరానా మొగుడు’కు ఫిక్సయ్యారు.

‘రౌడీ అల్లుడు’ కన్నా ముందు చిరంజీవి రెగ్యులర్‌ నిర్మాత దేవీవరప్రసాద్‌ ఆయనతో సినిమాకు వెయిటింగ్‌లో ఉన్నారు. దాంతో, ‘రౌడీ అల్లుడు’ రిలీజు కన్నా ముందే అప్పటికే నిరీక్షిస్తున్న దేవీవర ప్రసాద్‌తో చిరంజీవి – రాఘవేంద్రరావుల తదుపరి బిగ్‌ హిట్‌ ‘ఘరానా మొగుడు’ సెట్‌ మీదకొచ్చేసింది.  రజనీకాంత్‌ ‘మన్నన్‌’ తెరకెక్కుతున్నప్పుడే, కాస్తంత ఆలస్యంగానైనా అదే కథతో దానికి సమాంతరంగా ‘ఘరానా మొగుడు’ మొదలైంది. మరోపక్క రాఘవేంద్రరావు ‘అల్లరి మొగుడు’ కూడా సెట్స్‌పై ఉండడం విశేషం. ఏకకాలంలో సెట్స్‌పై ఉన్న ఈ సినిమాలన్నీ అప్పట్లో బాక్సాఫీస్‌ సంచలనాలు కావడం విచిత్రం. 

12 రోజులు... రోజుకు 12 గంటలు...
స్విట్జర్లాండ్‌లో షూటింగ్‌ జరుపుకొన్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. కేవలం పాతిక మంది లోపు యూనిట్‌తో, దాదాపు 12 రోజులు, రోజుకు 12 గంటల చొప్పున షూటింగ్‌ చేసి, మూడు పాటలు చిత్రీకరించారు. ఎవరి సామాన్లు వారు మోసుకుంటూ, షూటింగ్‌ సామగ్రి కూడా తలా ఓ చెయ్యి వేసి, ఓ కుటుంబంలా షూటింగ్‌ చేశారు. ఇక, ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిన సరుకులతో హీరో చిరంజీవి సతీమణి సురేఖ పర్యవేక్షణలో అక్కడ తెలుగు వంటలు వండి, వడ్డించుకోవడం మరో విశేషం.

బప్పీలహరి మ్యూజికల్‌ మేజిక్‌!
1991 జూన్‌లో మొదలుపెట్టి నాలుగే నాలుగు నెలల్లో సినిమాను పూర్తి చేసి, అక్టోబర్‌కు ఈ చిత్రాన్ని హడావిడిగా రిలీజ్‌ చేసేయడం విశేషం. సినిమా రిలీజుకు ముందే ‘రౌడీ అల్లుడు’కు బప్పీలహరి బాణీలు జనంలోకి వెళ్ళిపోయాయి. సినిమా రిలీజయ్యాక, చిరంజీవి స్టెప్పులు, మాస్‌ మెచ్చే చిత్రీకరణలు తోడై, రిపీట్‌ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించాయి. తెలుగులో దర్శకుడు రాఘవేంద్రరావు, బప్పీలహరి తొలి కాంబినేషన్‌ ఇదే. చిరు – బప్పీలహరి ‘గ్యాంగ్‌లీడర్‌’ సహా వరుస జనాకర్షక గీతాలతో రచయిత భువనచంద్ర దూసుకుపోతున్న సమయం అది. ‘రౌడీ అల్లుడు’లో డిస్కోశాంతిపై వచ్చే స్పెషల్‌ సాంగ్‌ ‘అమలాపురం బుల్లోడా...’, చిరంజీవి – దివ్యభారతిపై వచ్చే ‘ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కనపెట్టు..’, ‘లవ్‌ మీ మై హీరో..’ పాటలు ఆయన భువన మోహన రచనలే. 


శోభనపై వచ్చే ‘చిలుకా క్షేమమా...’, దివ్యభారతితో తొలి రేయి పాటగా తీసిన ‘కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో...’ పాటల్ని భావుకతతో పండించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. అలాగే ‘తద్ధినకా తప్పదికా...’ పాటలో అక్షరప్రాసతో అలరించారు. గమ్మత్తేమిటంటే, అటు ఆ మాస్‌ మసాలా పాటలు, ఇటు ఈ లలిత శృంగార యుగళ గీతాలూ కూడా సమాన స్థాయిలో పాపులరవడం. ఈ 6 పాటలే కాకుండా, చిరు – దివ్యభారతిపై ‘స్లోలీ స్లోలీ...’ అనే భువనచంద్ర రచన కూడా షూట్‌ చేశారు. సినిమా నిడివి ఎక్కువవుతోందని, చివరకు ఆ పాటను తొలగించారు. అలా ఆ పాట కేవలం ఆడియో క్యాసెట్లకే పరిమితమైపోయింది. 

తమిళ హీరోకు తెలుగు బాణీ!
ఇంటింటా టేప్‌ రికార్డర్లు పెరిగి, సినీగీతాలు ఊరూవాడా మోగడం ఎక్కువైన కొత్త రోజులవి. అందుకు తగ్గట్టే, ‘రౌడీ అల్లుడు’ పాటల క్యాసెట్లను 6 వేర్వేరు రకాల అందమైన ఇన్‌లే కవర్లతో, ఒకేసారి అన్నికేంద్రాల్లో కలిపి దాదాపు 2 లక్షలు విడుదల చేశారు. లహరి ఆడియో చేసిన వినూత్న ప్రయోగం వార్తావిశేషమైంది. ‘రౌడీ అల్లుడు’లోని ‘అమలాపురం బుల్లోడా...’ పాట ఎంత పాపులర్‌ అయిందంటే, ఆ బాణీని తరువాతి రోజుల్లో ఓ తమిళ చిత్రంలో సినిమాలో వాడారు. నేటి అగ్ర తమిళ హీరో విజయ్‌ వర్ధమాన దశలో ఉండగా ‘రసికన్‌’ (తెలుగులో ‘యమ లవ్‌’గా అనువాదమైంది) చిత్రంలో ఆ బాణీ మరోసారి ప్రేక్షకులను పలకరించింది. 


చిరు వినోదానికి వసూళ్ళ వర్షం
ఒక రకంగా దర్శకుడు రాఘవేంద్రరావు కెరీర్‌లోనూ అదో గోల్డెన్‌ పీరియడ్‌. అప్పట్లో ఆయనకు ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’, మోహన్‌బాబు ‘అల్లుడు గారు’, వెంకటేశ్‌ ‘కూలీ నంబర్‌1’ తర్వాత వరుసగా నాలుగో హిట్‌ ‘రౌడీ అల్లుడు’. దసరా పండుగ కానుకగా 1991 అక్టోబర్‌ 18న ‘రౌడీ అల్లుడు’ రిలీజైంది. ‘గ్యాంగ్‌ లీడర్‌’ క్రేజు తర్వాత రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపింది. ‘రౌడీ అల్లుడు’ తొలి మూడు వారాల్లోనే రూ. 1.85 కోట్లకు పైగా, మొత్తం వంద రోజుల్లో రూ. 3.25 కోట్ల పైగా నికర వసూళ్ళు రాబట్టుకోవడం విశేషం. ఆ వివరాలను చిత్ర యూనిట్‌ స్వయంగా పత్రికాముఖంగా భారీయెత్తున ప్రకటించింది. పాటలు, మాటల వినోదం పంచి, విశేష ప్రేక్షకాదరణతో 51 థియేటర్లలో నేరుగా, మరో 5 థియేటర్లలో నూన్‌షోలతో మొత్తం 56 చోట్ల 50 రోజుల పోస్టర్‌ వేసుకుంది. ఆ పైన డైరెక్టుగా 21 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. 

తెలుగునాట ఘన విజయం సాధించిన ‘రౌడీ అల్లుడు’ శతదినోత్సవం 1992 జనవరి 26, ఆదివారం నాడు  నెల్లూరులో సినీ, వ్యాపార, రాజకీయవేత్త మాగుంట సుబ్బరామిరెడ్డికి చెందిన అర్చన థియేటర్‌లో జరిగింది. జంధ్యాల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. బప్పీలహరి, దివ్యభారతి లాంటి యూనిట్‌ సభ్యులతో పాటు సీనియర్‌ దర్శకులు కె.విశ్వనాథ్, దాసరి సహా సినీ ప్రముఖులందరూ మద్రాసు నుంచి ప్రత్యేకంగా ఆ ఉత్సవానికి హాజరయ్యారు. హైదరాబాద్‌ సుదర్శన్‌ 70 ఎం.ఎం.లో ఈ సినిమా రిలీజు కోసం చిరంజీవిదే ‘గ్యాంగ్‌ లీడర్‌’ను 23 వారాలకే తీసేయాల్సి వచ్చింది. అలా ‘రౌడీ అల్లుడు’ వల్ల ‘గ్యాంగ్‌లీడర్‌’కు ఆ హాలులో 25 వారాల సిల్వర్‌ జూబ్లీ మిస్సవడం గమనార్హం. వినోదం పంచే ఆటో జానీ లాంటి పాత్రలకు తాను పెట్టింది పేరని ఆ తరువాత వరుసగా అనేక చిత్రాల్లో చిరంజీవి నిరూపించుకోవడం మరో చరిత్ర. 

– రెంటాల జయదేవ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement