ఇది ఓ సిల్లీ రోబో! | Bombhaat Telugu Movie Review | Sakshi
Sakshi News home page

ఇది ఓ సిల్లీ రోబో!

Published Sat, Dec 5 2020 12:33 AM | Last Updated on Sat, Dec 5 2020 12:33 AM

Bombhaat Telugu Movie Review - Sakshi

చిత్రం: ‘బొంభాట్‌’; తారాగణం: సాయిసుశాంత్‌ రెడ్డి, చాందినీ చౌదరి, ప్రియదర్శి, శిశిర్‌ శర్మ, తనికెళ్ళ భరణి; సంగీతం: జోష్‌ బి.; నిర్మాత: విశ్వాస్‌ హన్నూర్‌కర్‌; దర్శకత్వం: రాఘవేంద్ర వర్మ ఇందుకూరి; ఓ.టి.టి: అమెజాన్‌ ప్రైమ్‌.

సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా, అందులో మనిషికీ, మర మనిషికీ మధ్య ఓ ప్రేమ. ఈ కాన్సెప్ట్‌ వింటుంటే, ఎక్కడో విన్నట్టు, చూసినట్టు అనిపిస్తోందా? తాజాగా రిలీజైన కొత్త తెలుగు సినిమా ‘బొంభాట్‌’ అచ్చం ఇలాంటిదే. కాకపోతే, ఇటు ప్రేమకథకూ, అటు సైన్స్‌ ఫిక్షన్‌కూ మధ్య ఇరుక్కుపోయి, కథాకథనం ఎటూ కాకుండా పోవడమే విషాదం.

కథేమిటంటే..: లైఫ్‌లో ఎప్పుడూ ఏ మంచీ జరగని కుర్రాడు విక్కీ (సాయిసుశాంత్‌ రెడ్డి). ఏ కొద్ది మంచి జరిగినా, ఆ వెంటనే చెడు జరిగిపోతుంటుంది. ఇలాంటి అన్‌లక్కీ హీరోకు, చైత్ర (చాందినీ చౌదరి) అనే అమ్మాయితో ప్రేమ. హీరోకి చిన్నప్పటి నుంచి అనుకోకుండా కాలేజీ ప్రొఫెసర్‌ ఆచార్య (శిశిర్‌ శర్మ)తో అనుబంధం ఏర్పడుతుంది. పెరిగి పెద్దయిన తరువాత కూడా ఆ ప్రొఫెసర్‌తో హీరో బంధం కొనసాగుతుంటుంది. అనుకోని ఓ ప్రమాదంలో ప్రొఫెసర్‌ చనిపోతాడు. చనిపోవడానికి రెండు రోజుల ముందు విదేశాల్లోని తన కుమార్తెలానే కనిపించే, ప్రవర్తించే ఓ హ్యూమనాయిడ్‌ రోబోను ప్రొఫెసర్‌ తయారుచేస్తాడు. ప్రొఫెసర్‌ కూతురు మాయ (సిమ్రాన్‌ చౌదరి) కోసం వెతుకుతూ ఉంటాడు మరో వెర్రి సైంటిస్ట్‌ సాహెబ్‌ (మకరంద్‌ దేశ్‌పాండే). ఇంతకీ, ఈ ఇద్దరు సైంటిస్టుల మధ్య గొడవేంటి, మిగతా కథేమిటన్నది చివరి అరగంటలో చూస్తాం.


ఎలా చేశారంటే..: గతంలో ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో కనిపించిన హీరో సాయిసుశాంత్‌ రెడ్డి, తాజా ‘కలర్‌ ఫోటో’ ఫేమ్‌ చాందినీ చౌదరి ఈ స్క్రిప్టులోని పాత్రచిత్రణకు తగ్గట్టు తెరపై కనిపించడానికి బాగానే శ్రమపడ్డారు. సిమ్రాన్‌ చౌదరి ఓకె. హీరో ఫ్రెండ్‌గా ప్రియదర్శిది కాసేపు కామెడీ రిలీఫ్‌ వేషం. మన కంటికి కనిపించని అదృష్టంగా హీరో సునీల్‌ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. సినిమాలోని ఇద్దరు శాస్త్రవేత్తల పాత్రలకూ సీనియర్‌ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్‌ అద్భుతంగా గొంతునివ్వడం విశేషం. ఆ పాత్రలు ఎంతో కొంత బాగున్నాయంటే, ఆ వాచికానికే ఎక్కువ మార్కులు పడతాయి.

ఎలా తీశారంటే..: రజనీకాంత్‌ ‘రోబో’ మొదలు అనేక చిత్రాల నుంచి దర్శక, రచయిత తీసుకున్న అంశాలు ఈ సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇది ప్రేమకథో, సైంటిఫిక్‌ సినిమానో తెలియనివ్వకుండా మొదటి గంట సేపు సాగదీతతో, కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది. సుదీర్ఘమైన సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఓ కీలక మలుపు దగ్గర ఇంటర్వెల్‌ అయ్యాక, సెకండాఫ్‌ కొంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనుకుంటాం. ఆ పైన కూడా అసలు కథను ఒక పట్టాన ముందుకు సాగనివ్వకుండా పక్కన చెవిటి దాదా (వినీత్‌ కుమార్‌) కథ సహా అనేకం పక్కనే నడుస్తుంటాయి.

హీరోతో హీరోయిన్‌ ఎందుకు, ఎలా ప్రేమలో పడిందో అర్థం కాదు. దానికి బలమైన రీజనింగూ కనిపించదు. ప్రొఫెసర్‌తో అంతకాలంగా అనుబంధం ఉన్నా సరే, హీరోకు ఆ ప్రొఫెసర్‌ అసలు సంగతి ఎందుకు చెప్పడో అర్థం కాదు. సినిమా దాదాపు చివర ముప్పావుగంటకు వచ్చేసినా, వెర్రి సైంటిస్టుకూ, ప్రొఫెసర్‌కూ మధ్య గొడవేమిటో దర్శకుడు చెప్పడు. ప్రియదర్శి లవ్‌ ట్రాక్‌ సినిమాకు మరో పానకంలో పుడక. రోబో తాలూకు ప్రేమ, తదితర ఫీలింగ్స్‌కు సరైన ఎస్టాబ్లిష్‌మెంటూ కనిపించదు. ఈ సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది – బాణీలు, రీరికార్డింగ్‌ విషయంలో ప్రత్యేకత చూపిన సంగీత దర్శకుడి ప్రతిభ.

నాలుగు పాటలనూ నాలుగు విభిన్న పంథాల్లో అందించడం విశేషం. సినిమా మొదట్లో వచ్చే పాట సంగీత దర్శకుడి శాస్త్రీయ సంగీత నైపుణ్యాన్ని తెలియజేస్తూ, వినడానికి బాగుంది. అలాగే హీరోయిన్‌ జెలసీతో పాడే ‘చుప్పనాతి..’ పాట మరో డిఫరెంట్‌ కాన్సెప్టుతో, డిఫరెంట్‌ సౌండ్‌తో వినిపిస్తుంది. నిర్మాణవిలువలు, అక్కడక్కడా డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి. ఇలాంటి కొన్ని పాజిటివ్‌ పాయింట్లున్నా, అక్కడక్కడే అనేక సీన్లుగా సుదీర్ఘమైన సినిమాగా సా...గుతూ ఉంటే, ప్రేక్షకులు భరించడం కష్టమే. అందులోనూ ప్రేక్షకుడి చేతిలో రిమోట్‌ చేతిలో ఉండే ఓటీటీ షోలలో మరీ కష్టం.
కొసమెరుపు: రెండోసారి రెండు గంటల రోబో వెర్షన్‌!

బలాలు:
► కెమెరా వర్క్, నిర్మాణ విలువలు
► సంగీత దర్శకుడి ప్రతిభ
► శుఖలేఖ సుధాకర్‌ డబ్బింగ్‌

బలహీనతలు:
► కలవని ప్రేమ, సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీ
► సాగదీత కథనం, పండని ఎమోషన్లు 
► అతకని సీన్లు, లాజిక్‌కు అందని పాత్రచిత్రణ

– రెంటాల జయదేవ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement