Shishir Sharma
-
ఇది ఓ సిల్లీ రోబో!
చిత్రం: ‘బొంభాట్’; తారాగణం: సాయిసుశాంత్ రెడ్డి, చాందినీ చౌదరి, ప్రియదర్శి, శిశిర్ శర్మ, తనికెళ్ళ భరణి; సంగీతం: జోష్ బి.; నిర్మాత: విశ్వాస్ హన్నూర్కర్; దర్శకత్వం: రాఘవేంద్ర వర్మ ఇందుకూరి; ఓ.టి.టి: అమెజాన్ ప్రైమ్. సైన్స్ ఫిక్షన్ సినిమా, అందులో మనిషికీ, మర మనిషికీ మధ్య ఓ ప్రేమ. ఈ కాన్సెప్ట్ వింటుంటే, ఎక్కడో విన్నట్టు, చూసినట్టు అనిపిస్తోందా? తాజాగా రిలీజైన కొత్త తెలుగు సినిమా ‘బొంభాట్’ అచ్చం ఇలాంటిదే. కాకపోతే, ఇటు ప్రేమకథకూ, అటు సైన్స్ ఫిక్షన్కూ మధ్య ఇరుక్కుపోయి, కథాకథనం ఎటూ కాకుండా పోవడమే విషాదం. కథేమిటంటే..: లైఫ్‌లో ఎప్పుడూ ఏ మంచీ జరగని కుర్రాడు విక్కీ (సాయిసుశాంత్ రెడ్డి). ఏ కొద్ది మంచి జరిగినా, ఆ వెంటనే చెడు జరిగిపోతుంటుంది. ఇలాంటి అన్‌లక్కీ హీరోకు, చైత్ర (చాందినీ చౌదరి) అనే అమ్మాయితో ప్రేమ. హీరోకి చిన్నప్పటి నుంచి అనుకోకుండా కాలేజీ ప్రొఫెసర్ ఆచార్య (శిశిర్ శర్మ)తో అనుబంధం ఏర్పడుతుంది. పెరిగి పెద్దయిన తరువాత కూడా ఆ ప్రొఫెసర్‌తో హీరో బంధం కొనసాగుతుంటుంది. అనుకోని ఓ ప్రమాదంలో ప్రొఫెసర్ చనిపోతాడు. చనిపోవడానికి రెండు రోజుల ముందు విదేశాల్లోని తన కుమార్తెలానే కనిపించే, ప్రవర్తించే ఓ హ్యూమనాయిడ్ రోబోను ప్రొఫెసర్ తయారుచేస్తాడు. ప్రొఫెసర్ కూతురు మాయ (సిమ్రాన్ చౌదరి) కోసం వెతుకుతూ ఉంటాడు మరో వెర్రి సైంటిస్ట్ సాహెబ్ (మకరంద్ దేశ్‌పాండే). ఇంతకీ, ఈ ఇద్దరు సైంటిస్టుల మధ్య గొడవేంటి, మిగతా కథేమిటన్నది చివరి అరగంటలో చూస్తాం. ఎలా చేశారంటే..: గతంలో ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో కనిపించిన హీరో సాయిసుశాంత్ రెడ్డి, తాజా ‘కలర్ ఫోటో’ ఫేమ్ చాందినీ చౌదరి ఈ స్క్రిప్టులోని పాత్రచిత్రణకు తగ్గట్టు తెరపై కనిపించడానికి బాగానే శ్రమపడ్డారు. సిమ్రాన్ చౌదరి ఓకె. హీరో ఫ్రెండ్‌గా ప్రియదర్శిది కాసేపు కామెడీ రిలీఫ్ వేషం. మన కంటికి కనిపించని అదృష్టంగా హీరో సునీల్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమాలోని ఇద్దరు శాస్త్రవేత్తల పాత్రలకూ సీనియర్ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్ అద్భుతంగా గొంతునివ్వడం విశేషం. ఆ పాత్రలు ఎంతో కొంత బాగున్నాయంటే, ఆ వాచికానికే ఎక్కువ మార్కులు పడతాయి. ఎలా తీశారంటే..: రజనీకాంత్ ‘రోబో’ మొదలు అనేక చిత్రాల నుంచి దర్శక, రచయిత తీసుకున్న అంశాలు ఈ సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇది ప్రేమకథో, సైంటిఫిక్ సినిమానో తెలియనివ్వకుండా మొదటి గంట సేపు సాగదీతతో, కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. సుదీర్ఘమైన సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఓ కీలక మలుపు దగ్గర ఇంటర్వెల్ అయ్యాక, సెకండాఫ్ కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందనుకుంటాం. ఆ పైన కూడా అసలు కథను ఒక పట్టాన ముందుకు సాగనివ్వకుండా పక్కన చెవిటి దాదా (వినీత్ కుమార్) కథ సహా అనేకం పక్కనే నడుస్తుంటాయి. హీరోతో హీరోయిన్ ఎందుకు, ఎలా ప్రేమలో పడిందో అర్థం కాదు. దానికి బలమైన రీజనింగూ కనిపించదు. ప్రొఫెసర్‌తో అంతకాలంగా అనుబంధం ఉన్నా సరే, హీరోకు ఆ ప్రొఫెసర్ అసలు సంగతి ఎందుకు చెప్పడో అర్థం కాదు. సినిమా దాదాపు చివర ముప్పావుగంటకు వచ్చేసినా, వెర్రి సైంటిస్టుకూ, ప్రొఫెసర్‌కూ మధ్య గొడవేమిటో దర్శకుడు చెప్పడు. ప్రియదర్శి లవ్ ట్రాక్ సినిమాకు మరో పానకంలో పుడక. రోబో తాలూకు ప్రేమ, తదితర ఫీలింగ్స్‌కు సరైన ఎస్టాబ్లిష్మెంటూ కనిపించదు. ఈ సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది – బాణీలు, రీరికార్డింగ్ విషయంలో ప్రత్యేకత చూపిన సంగీత దర్శకుడి ప్రతిభ. నాలుగు పాటలనూ నాలుగు విభిన్న పంథాల్లో అందించడం విశేషం. సినిమా మొదట్లో వచ్చే పాట సంగీత దర్శకుడి శాస్త్రీయ సంగీత నైపుణ్యాన్ని తెలియజేస్తూ, వినడానికి బాగుంది. అలాగే హీరోయిన్ జెలసీతో పాడే ‘చుప్పనాతి..’ పాట మరో డిఫరెంట్ కాన్సెప్టుతో, డిఫరెంట్ సౌండ్‌తో వినిపిస్తుంది. నిర్మాణవిలువలు, అక్కడక్కడా డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి. ఇలాంటి కొన్ని పాజిటివ్ పాయింట్లున్నా, అక్కడక్కడే అనేక సీన్లుగా సుదీర్ఘమైన సినిమాగా సా...గుతూ ఉంటే, ప్రేక్షకులు భరించడం కష్టమే. అందులోనూ ప్రేక్షకుడి చేతిలో రిమోట్ చేతిలో ఉండే ఓటీటీ షోలలో మరీ కష్టం. కొసమెరుపు: రెండోసారి రెండు గంటల రోబో వెర్షన్! బలాలు: ► కెమెరా వర్క్, నిర్మాణ విలువలు ► సంగీత దర్శకుడి ప్రతిభ ► శుఖలేఖ సుధాకర్ డబ్బింగ్ బలహీనతలు: ► కలవని ప్రేమ, సైన్స్ ఫిక్షన్ స్టోరీ ► సాగదీత కథనం, పండని ఎమోషన్లు ► అతకని సీన్లు, లాజిక్కు అందని పాత్రచిత్రణ – రెంటాల జయదేవ -
దేశం కోసం రాజీ
‘‘భారతదేశం ఆకాశం కేసి చూస్తూ ఉంటుంది... పాకిస్తాన్ భారత్ కాళ్ల కింద నేలను కబళిస్తుంది’’ అంటూ గెలుపు నవ్వు నవ్వుతాడు తనింట్లో భోజనాల బల్ల మీద భోజనం చేస్తూ పాకిస్తానీ బ్రిగేడియర్ సయ్యద్ (శిశిర్ శర్మ). ఆ మాటకు ఇద్దరు తప్ప మిగిలిన కుటుంబ సభ్యులూ ఆనంద పడ్తారు. ఆ ఇద్దరిలో ఒకరు బ్రిగేడియర్ చిన్న కొడుకు ఇక్బాల్ (విక్కీ కౌశల్), అతని భార్య సెహమత్ (అలియా భట్). ఇక్బాల్ కూడా పాకిస్తానీ ఆర్మీ ఆఫీసరే. మరి అతని మనసెందుకు చివుక్కుమంటుంది తండ్రి మాటకు? అతని భార్య సెహమత్ భారతీయురాలు కాబట్టి! భోజనాలయిపోయి.. ఆ రాత్రి తమ గదిలోకి వెళ్లాక భార్యతో చెప్తాడు.. ‘‘సారీ.. మావాళ్లు కొంచెం ఇన్సెన్సిటివ్æ.. ఇండియా గురించి అలా మాట్లాడుతుంటే నీకెంత బాధనిపించుంటుందో అర్థం చేసుకోగలను. సారీ... ’’ అంటూ! పెద్దవాళ్ల ఇష్టంతో మాత్రమే జరిగిన తమ పెళ్లిలో.. భార్య ఎలాంటి ఇబ్బంది పడకూడదని.. తమ మనసులు కలిసేవరకు.. చెలిమి పెరిగే వరకూ తను భార్య దగ్గర తొందరపడకూడదని.. ఆమె తన ఇష్టం చెప్పేంత వరకు దగ్గరకు రాకూడదని భార్య స్పేస్‌ను గౌరవిస్తుంటాడు. సెహమత్కు హిందుస్థానీ క్లాసికల్ ఇష్టం అని ఆ రికార్డ్స్‌ను ప్రెజెంట్ చేసి తనూ ఆ సంగీతాన్ని ఆస్వాదించడం మొదలుపెడ్తాడు. అలా భార్య భారతదేశంలో ఎలా పెరిగిందో.. ఎలాంటి అలవాట్లతో వచ్చిందో అలాగే పూర్తిగా ఆమెను అంగీకరించేలా తనను సన్నద్ధం చేసుకుంటుంటాడు. వాటిల్లో ఆమె దేశభక్తి కూడా ఒకటని తెలుసుకుంటాడా? అంగీకరిస్తాడా? ఆమె పట్ల అతనికున్న ప్రేమ దాన్నీ జయిస్తుందా? రాజీ పడేలా చేస్తుందా? ‘‘మనిద్దరి మధ్య ఏదీ నిజం కాదా సెహమత్?’’ తన పట్ల తుపాకీ గురిపెట్టిన భార్యను అడుగుతాడు ఇక్బాల్ ఆవేదనగా.. భార్య చేతిలో తుపాకి అబద్ధమైతే బాగుండు అనే ఆశతో.. తను అపురూపంగా తొడిగిన మువ్వల పట్టీల సవ్వడి రేపిన అలజడి అసత్యమైతే బాగుండు అనే ఆరాటంతో! ‘‘దేశం ఒక్కటే నిజం’’ అంటూ స్థిరంగా పలికిన భార్య స్వరం.. ఆయన భ్రమను పటాపంచలు చేస్తుంది. అందుకే అంటాడు ‘‘రెండు బుల్లెట్లు మాత్రమే వాడు.. ఒకటి నీ కోసం.. ఇంకోటి నా కోసం.. ఎందుకంటే దేశం ఒక్కటే నిజం కాబట్టి’’ అని. ఏంటీ యుద్ధం? ‘‘బంధాలు..అనుబంధాలు, ప్రాణాలకు విలువివ్వని ఈ యుద్ధం ఎందుకు? నా భర్తను చంపుకొని, నన్ను నమ్మిన వాళ్లందర్నీ మోసం చేసి నేను సాధించిందేంటి?’’ అదే ఆవేదన సెహమత్లో కూడా! తండ్రి అప్పగించిన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తుంది. కానీ ఎంతమందిని పణంగా పెట్టింది? ముఖ్యంగా తనను ప్రాణంలా ప్రేమించిన భర్తను! మిషన్ పూర్తి చేసుకొని కడుపులో నలుసుతో మాతృదేశం తిరిగొస్తుంది. ఏ యుద్ధాన్ని ద్వేషిస్తుందో.. ఏ గూఢచారి వ్యవస్థను అసహ్యించుకుంటుందో మళ్లీ అదే యుద్ధంలో.. అదే వ్యూహంలోకి తన కొడుకును సైనికుడిగా పంపిస్తుంది.ఇదీ సెహమత్ ఖాన్ జీవితం... రాజీ సినిమా కథ!ఒక సైనికుడి తల్లి నిజ జీవిత కథ ఆధారంగా ఇండియన్ నేవీ మాజీ లెఫ్టినెంట్ కమాండర్ హరీందర్ ఎస్ సిక్కా రాసిన ‘‘కాలింగ్ సెహమత్’’ నవలే రాజీ సినిమా! మేఘనా గుల్జార్ దర్శకురాలు. కథా వివరం.. కాలం 1971. హిదాయత్ ఖాన్ (రజిత్ కపూర్), పాకిస్తానీ బ్రిగేడియర్ సయ్యద్‌కు భారతదేశ సైనిక రహస్యాలను అందచేస్తున్నట్టు నటిస్తూనే పాకిస్తాన్ వ్యూహాన్ని గ్రహిస్తుంటాడు. అలాంటి ఒక సందర్భంలోనే భారత నావికా దళం మీద తన ఆధిపత్యం కోసం పాకిస్తాన్ కుట్రకు సిద్ధమైందనే విషయాన్నీ తెలుసుకుంటాడు. అప్పటికే అతనికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని తేలుతుంది. చావుకు దగ్గరైన∙అతను బతికున్నప్పుడే ఏదైనా చేయాలనే చింతతో ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకుంటున్న కూతురిని ఉన్న పళంగా పిలిపిస్తాడు. ఆమే సెహమత్ ఖాన్. రక్తం చూస్తేనే కళ్లు తిరిగిపడిపోయేంత పిరికిది. చీమకు కూడా హాని కలగొద్దని తపించే సున్నితమనస్కురాలు. స్నేహితుడైన భారత ఇంటెలిజెన్స్ అధికారి ఖాలీద్ మీర్ (జైదీప్ అహ్లావత్)తో సంప్రదించి తన కూతురిని స్పైగా పాకిస్తానీ బ్రిగేడియర్ సయ్యద్ ఇంటికి పంపించాలనుకుంటాడు. ఈ విషయాన్నే సెహమత్తో చెప్పి ఒప్పిస్తాడు. ఖాలీద్ మీర్ ఆమెకు శిక్షణనిస్తాడు. బ్రిగేడియర్‌తో తనకున్న స్నేహం, అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకొని, సెంటిమెంట్‌తో దెబ్బకొట్టి తన కూతురిని బ్రికేడియర్ కొడుకు.. ఇక్బాల్‌కు ఇచ్చి నిఖా చేస్తాడు. పాకిస్తాన్‌కు పంపిస్తాడు కోడలిరూపంలో స్పైని. మిషన్ స్టార్ట్ అవుతుంది.. అత్తారింట్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే తన మిషన్‌ను ప్రారంభిస్తుంది సెహమత్. ఆ ఇంట్లో పనోడు, నమ్మకస్తుడూ అయిన అబ్దుల్.. సెహమత్ వచ్చినప్పటి నుంచే ఆమెను అనుమానిస్తుంటాడు. అనుక్షణం నీడలా వెంటాడుతుంటాడు. మొత్తానికి ఓర్పు, నేర్పుతో ఆ ఇంట్లో వాళ్లందరికీ ఆప్తురాలవుతుంది ఒక్క అబ్దుల్‌కి తప్ప. ట్రైనింగ్‌లో నేర్చుకున్న మెళకువలతో భారత నావికా దళం మీద జరుగుతున్న కుట్రను ఎప్పటికప్పుడు భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిస్తుంటుంది. ఆ విషయాన్ని అబ్దుల్ పసిగడ్తాడు సాక్ష్యాధారలతో సహా. ఇంటెలిజెన్స్ నేర్పిన విద్యతోనే అబ్దుల్‌ను చంపేస్తుంది. చీమ చిటుక్కుమంటేనే విలవిల్లాడే తను ఓ మనిషిని చంపేంత కరుకుగా మారడాన్ని తట్టుకోలేకపోతుంది. ఏడుస్తుంది. అబ్దుల్ మరణం సెహమత్ బావగారి( భర్త అన్న)కీ మింగుడుపడదు. కూపీ లాగుతుంటాడు. అందులో సెహమత్ చిక్కుకునే ప్రమాదం కనపడే సరికి ట్రైనింగ్‌లో నేర్చుకున్న మరో విద్యతో బావగారినీ మట్టుబెడుతుంది. వరుస చావులతో ఆ ఇల్లు షాక్‌కి గురవుతుంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వాళ్ల నిఘా పెరుగుతుంది. తన మీద అనుమానం రాకుండా చనిపోయిన అబ్దుల్ మీదకు మళ్లిస్తుంది. భారత్, పాకిస్తాన్ విభజన జరగకముందు అబ్దుల్ భారతీయుడు. విభజన తర్వాత పాకిస్తాన్ వచ్చి స్థిరపడ్తాడు. ఆ కారణంతో అతని మీద సందేహం వచ్చేలా చేస్తుంది. ఆ క్రమంలో భర్తకు దొరికిపోతుంది. ఖంగు తింటాడు. ఇంకోవైపు సెహమత్ డేంజర్లో ఉందని తెలుసుకొని భారత ఇంటెలిజెన్స్ బృందం ఆమెను కాపాడ్డానికి పాకిస్తాన్ వస్తుంది. అయితే అప్పటికే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నిఘా ఉండడం వల్ల వాళ్లు సెహమత్ను అనుసరిస్తుంటారు. ఇది భారతీయ బృందం కళ్లలో పడి ఆమె ప్రాణాలతో శత్రువులకు దొరికితే ఇండియాకు మరింత ప్రమాదమని సెహమత్ను చంపేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ప్రయత్నంలో సెహమత్ కాకుండా తనలా బురఖా వేసుకొని ఉన్న భారత గూఢచార సంస్థ ఉద్యోగినితో పాటు సెహమత్ భర్తా చనిపోతారు.భారత ఇంటెలిజెన్స్ తీరుకి దిగ్భ్రాంతి చెందుతుంది సెహమత్. చివరకు తనను కూడా చంపడానికి వెకడుగువేయని ఆ నిర్ధయకు. తనను నమ్మిన భర్త ప్రాణాలూ తీసినందుకు. మట్టి కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే ఆ యుద్ధ తంత్రాలను ఏవగించుకుంటుంది. తండ్రి అప్పజెప్పిన పనిని పూర్తిచేస్తుంది. కానీ విపరీతమైన నైరాష్యంతో ఇండియాకు వస్తుంది.ఇదీ రాజీ.. ఘాజీ ముందు జరిగిన కథ. – శరాది -
సినిమా రివ్యూ: మేరి కోమ్
నటీనటులు: ప్రియాంక చోప్రా, దర్శన్ కుమార్, సునీల్ థాపా, మీనాక్షి కలితా, శిశిర్ శర్మ సంగీతం: శశి-శివమ్ ఫోటోగ్రఫీ: కీకో నకహర ఎడిటింగ్: రాజేశ్ జి. పాండే, సంజయ్ లీలా భన్సాలీ నిర్మాత: వయాకామ్ 18 మోషన్ పిక్చర్ డైరెక్టర్: ఒమంగ్ కుమార్ క్రియేటివ్ డైరెక్టర్: సంజయ్ లీలా భన్సాలీ ప్లస్ పాయింట్స్: ప్రియాంక చోప్రా యాక్టింగ్ ఫోటోగ్రఫీ మ్యూజిక్ మైనస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే ఇటీవల కాలంలో భారతీయ సినిమా పరిశ్రమలో క్రీడల నేపథ్యం, జీవిత కథల ఆధారంగా రూపొందిన 'లగాన్', 'చక్ దే ఇండియా', 'భాగ్ మిల్కా భాగ్', 'పాన్ సింగ్ తోమార్' చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. గత చిత్రాలు అందించిన ప్రోత్సాహంతో భారత బాక్సర్ మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా ఆమె పేరుతో నిర్మించిన చిత్రం శుక్రవారం సెప్టెంబర్ 5 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ క్రీడాభిమానులు ఆకట్టుకున్న మేరీ కోమ్ పాత్రలో ప్రియాంక చోప్రా సినీ ప్రేక్షకులను ఆలరించిందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు కథలోకి... భారత దేశంలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోని ఓ కుగ్రామంలోని పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఓ యువతి... తనకు ఎదురైన అన్ని అడ్డంకులు జయించి బాక్సింగ్ క్రీడలో అంతర్జాతీయ ఛాంపియన్ గా మేరి కోమ్ ఎలా మారింది. అలాగే వైవాహిక జీవితం తర్వాత మళ్లీ బాక్సింగ్ రింగ్ లోకి దూకి, క్రీడా సంస్థల అవమానాలను, అనేక ఆటుపోట్లను అధిగమించి.. విమర్శకులకు ఎలాంటి సమాధానమిచ్చిందనే కథాంశమే మేరి కోమ్ చిత్రం. తాను అనుకున్న లక్ష్యం కోసం తండ్రిని ఎదురించమే కాకుండా అనేక కష్టాలను ఎదురించి అంతర్జాతీయ క్రీడాకారిణిగా మారిన ఓ సామాన్య యువతి పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించింది. మేరి కోమ్ పాత్రలో ప్రియాంక జీవించిందనే చెప్పవచ్చు.. ప్రతి సన్నివేశంలోనూ తనదైన మార్క్ నటనతో ఆకట్టుకుంది. మేరి కోమ్ జీవితంలో ఎదురైన ఉద్వేగ భరిత క్షణాలకు తెరమీద అద్భుతంగా మెప్పించింది. ఓ క్షణంలో మేరి కోమ్ పాత్రను ఆమె తప్ప మరొకరు చేయరేమో అనే ఫీలింగ్ ను క్రియేట్ చేయడంలో ప్రియాంక చోప్రా సఫలమైంది. ప్రియాంక చోప్రా కెరీర్ లోనే అత్యుత్తమ పాత్రను పోషించింది. మేరి కోమ్ ను ఉత్తమ చిత్రంగా మలచడానికి ప్రియాంక 'వన్ ఉమెన్ ఆర్మీ' మారింది. కోచ్ పాత్రలో సునీల్ థాపా గుర్తుండి పోయే పాత్రను షోషించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే .. కీకో నకహర అందించిన ఫోటోగ్రఫీ ప్రేక్షకుడిని కథలో లీనం చేయడానికి తోడ్పాటునందించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని సహజసిద్దమైన అందాలను నకహర తన కెమెరాలో బంధించిన తీరు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. శశి-శివమ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. జిద్ది దిల్, సలామ్ ఇండియా, తేరి బారీ పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. వైవాహిక జీవితం తర్వాత బాక్సింగ్ క్రీడకు దూరమైన తర్వాత మేరికోమ్ అనుభవించిన క్లిష్ట పరిస్థితులు, తన గురించి పత్రికలు గొప్పగా రాసిన పేపర్ పై కుమారుడు మూత్రం పోయడంలాంటి సన్నివేశాలు దర్శకుని ప్రతిభకు అద్దం పట్టాయి. మణిపూర్ అంటే ఏదేశంలో ఉంది అని అడగటం, క్రీడాకారుల పట్ల ఆయ సంఘాలు తీరు, మహిళా క్రీడాకారులను ఎలా వేధింపులకు గురి చేస్తున్నారనే అంశాలు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులు చేత చప్పట్టు కొట్టించాయి. ఓ గొప్ప చాంఫియన్ పేరున్న మేరి కోమ్.. గర్భం దాల్చిన తర్వాత తాను ఇక బాక్సింగ్ దూరమయ్యాననే ఆవేదనతో భర్తతో 'నీవు బాగా ఫుట్ బాల్ అడుతావు. నా జీవితమే త్యాగం చేయాల్సి వస్తోంది అనే సీన్ బ్రహ్మండంగా పండింది. అయితే తొలిసారి దర్శకత్వం వహించిన ఒమాంగ్ కుమార్ అనుభవ రాహిత్యం స్పష్టం కనిపించింది. భావోద్వేగాలను తెరకెక్కించడంలో దర్శకుడిగా విఫలయ్యారనే చెప్పవచ్చు. ప్రేక్షకుడు ఊహించిన విధంగానే కథ నడవడం, కథనంలో వేగం లోపించడం, ఎలాంటి ట్విస్ట్ లేకుండా స్క్రీన్ ప్లే ఉండటం కొంత నిరాశకు గురిచేసే అంశం. చివరగా: మేరి కోమ్ జీవితంలో చీకటి, వెలుగులు, కష్టా నష్టాలు, ఉద్విగ్న క్షణాలను తెరపై చూపించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం చూడటం ద్వారా స్పూర్తి పొంది దేశంలోని కోట్లాది మంది ప్రజల నుంచి మరో 'మేరి కోమ్' అవతరిస్తే చాలు ఈ చిత్రం లక్ష్యాన్ని చేరుకున్నట్టే అని చెప్పవచ్చు. -రాజబాబు అనుముల