చిత్రం: ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’;
తారాగణం: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ; నిర్మాత: వి. ఆనందప్రసాద్; ద
ర్శకత్వం: వినోద్ అనంతోజు;
రిలీజ్: నవంబర్ 20; ఓ.టి.టి: అమెజాన్.
కథకైనా, కళకైనా మధ్యతరగతి జీవితం ఎప్పుడూ మంచి ముడిసరుకు. ఆ జీవితాలను వాస్తవికంగా చూపిస్తూనే, వినోదం పంచే నిజా యతీ నిండిన ప్రయత్నం ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’.
కథేమిటంటే..: ఇది కొన్ని మిడిల్ క్లాస్ కుటుంబాల కథ. గుంటూరుకు కాస్తంత దూరంలో ఉండే కొలకలూరు గ్రామంలో ఓ చిన్న హోటల్ నడుపుతుంటారు కొండలరావు, అతని భార్య (గోపరాజు రమణ, సురభి ప్రభావతి).
వాళ్ళ ఒకే ఒక్క కొడుకు రాఘవ (ఆనంద్ దేవరకొండ). తల్లి దగ్గర నేర్చిన బొంబాయి చట్నీ స్పెషల్‌తో పక్కనున్న గుంటూరు పట్నంలో హోటల్ పెట్టి, పైకి రావాలని హీరో తపన. ఇంటర్ చదివే రోజుల్లోనే సంధ్య (వర్ష బొల్లమ్మ)తో ప్రేమ. హీరో గుంటూరు వెళతాడు. తల్లీతండ్రి పొలం అమ్మి ఇచ్చిన సొమ్ముతో హోటల్ పెడతాడు. తరువాత ఏమైంది, ప్రేమ ఎలా గెలిచిందన్నది మిగతా కథ.
ఎలా చేశారంటే..: హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, కన్నడిగురాలు వర్ష బొల్లమ్మ ఇద్దరూ పాత్రలే కనిపించేలా చేశారు. ఈ సినిమాకు హీరో కాని హీరో మాత్రం కథానాయకుడి తండ్రి పాత్రధారి గోపరాజు రమణ. రంగస్థల నటుడిగా ప్రసిద్ధుడై, టీవీ సీరియల్స్, కొన్ని సినిమాలతో తెర పరిచితుడైన రమణ ఈ తండ్రి పాత్రధారణతో సినిమాకు ప్రాణం పోశారు. ఈ పాత్ర ఆయన కెరీర్‌కు కచ్చితంగా ఓ మలుపు.
సురభి జమునా రాయలు లాంటి రంగస్థల కళా కారులే అత్యధికులు నటించారీ సినిమాలో! అందుకే, హీరో, హీరోయిన్ల మాటెలా ఉన్నా... చుట్టుపక్కల కనిపించే తల్లితండ్రులు, స్నేహితుల మొదలు తాగుబోతు తండ్రితో వేగలేక మొబైల్ ఫోన్ల షాపులో పనిచేసే అమ్మాయి (దివ్య శ్రీపాద), మనవరాలి చదువు కోసం తపిస్తూ పాలు అమ్మే అంజయ్య (కట్టా ఆంటోనీ) దాకా చాలామందితో ఐడెంటిఫై అవుతాం. ప్రతి ఒక్కరితో ప్రేమలో పడతాం. అలాంటి పాత్రల రూపకల్పన దర్శక, రచయితల జీవితానుభవ ప్రతిభ. అతిథి పాత్రలో ‘పెళ్ళిచూపులు’ తరుణ్ భాస్కర్ కనిపిస్తారు.
ఎలా తీశారంటే..: మధ్యతరగతి జీవితం, సాహితీ వాసనలతో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి, షార్ట్ ఫిల్మ్‌ల మీదుగా సినిమాల్లోకి వచ్చిన కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు తొలి ప్రయత్నం ఈ చిత్రం. ఈ గుంటూరు కుర్రాడు మొట్టమొదటి గృహప్రవేశం సీన్ నుంచే సినిమాకు ఓ టోన్ సెట్ చేశాడు. జనార్దన్ పసుమర్తి రాసిన కథ, మాటలు చూస్తే అచ్చంగా ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది.
అక్కడి సంబోధనలు, సామెతల మొదలు తిట్ల దాకా అన్నీ వినోదం పంచుతాయి. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ స్వీకర్ అగస్తి బాణీల్లో ‘సంధ్యా’, ‘గుంటూరు’ పాటల లాంటివి బాగు న్నాయి. గుంటూరు వాతావరణం, అక్కడి ఫేమస్ ఫుడ్ జాయింట్ల పాట (రచన – కిట్టు విస్సాప్రగడ, గానం – అనురాగ్ కులకర్ణి) కొన్నేళ్ళు ఆ ప్రాంతవాసుల థీమ్ సాంగ్‌గా నిలబడిపోతుంది. ఇక, విక్రమ్ ఇచ్చిన నేపథ్య సంగీతం మరో ఆయువుపట్టు.
దేవుణ్ణి నమ్మని హీరో – జాతకాల పిచ్చి ఉన్న అతని స్నేహితుడు, డబ్బున్న పెద్ద సంబంధంతో కూతురి జీవితాన్ని కట్టేయాలనుకొనే ఓ నాన్న – ఆటోవాడికైనా కూతురినిచ్చి పెళ్ళి కానిచ్చేసి తన తాగుడుకు ఢోకా లేకుండా చూసుకోవాలనుకొనే మరో తండ్రి, తండ్రీ కొడుకుల మధ్య సయోధ్యకు ప్రయత్నించే ఓ తల్లి – దురాశతో అయిన సంబంధాన్ని వద్దనుకున్న భర్తకు నచ్చజెప్పే ఓ భార్య... ఇలా చాలా పాత్రలు జీవితంలో నుంచి తెర మీదకు వచ్చాయి. జీవితంలోనూ, మనుషుల్లోనూ సింప్లిసిటీ ఎంత ఆనందాన్నిస్తుందో ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది.
అయితే, రెండుంబావు గంటల కథాకథనంలో హీరో– హీరోయిన్ల ఇంటర్ ప్రేమకథ పర్యవసానాలను తెరపై పూర్తిగా చూపించలేదు. చెట్టు మీద నుంచి మామిడికాయ పడే దాకా బొంబాయి చట్నీలో నిపుణుడైన హీరోకు ఆ వంటలో మామిడి వాడాలనేది తెలీదంటే నమ్మలేం. రెసిపీ మార్చాడందామంటే, ఆ స్పష్టతా లేదు. పాలు పోసే అంజయ్య, చిట్ ఫండ్ డబ్బులతో ఊరికి రోడ్డు వేయించి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న అతి మంచితనపు పెదనాన్న పాత్ర లాంటి సెంటిమెంట్, ఎమోషన్లను మరింతగా తెరపై చూపించి ఉంటే, సినిమా వేరే స్థాయికి వెళ్ళేది. అలాగే, సాగదీత తగ్గించి, క్లైమాక్స్ ముందర కథనం పేస్ పెంచి, మరింత పట్టుగా రాసుకోవాల్సింది. హఠాత్తుగా సినిమా అయిపోయిందన్న ఫీలింగ్ రాకుండా చూడాల్సింది.
అయితే, సినిమా మొత్తం మీద అందించిన ఫీలింగ్‌తో పోలిస్తే, కొత్త కుర్రాళ్ళ తొలి యత్నంగా అవన్నీ క్షమించేయవచ్చు. వెరసి, ఇదో రియలిస్టిక్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ ఉన్న ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్. ఇరవై ఏళ్ళ క్రితం దర్శకులు నాగేశ్ కుకునూర్ ‘హైదరాబాద్ బ్లూస్’, శేఖర్ కమ్ముల ‘డాలర్ డ్రీమ్స్’ మొదలు ఇటీవలి ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘పలాస’ లాంటి ప్రయత్నాలకు కొనసాగింపు ఇప్పుడీ లేటెస్ట్ ఫిల్మ్ అనుకోవచ్చు. ట్రైలర్‌లోనే అంతా చెప్పేసి, సినిమాలో సర్ ప్రైజులు లేకుండా చేసిన దర్శక, రచయితల తొలి ప్రయత్నంలో ఎత్తుపల్లాలున్నా... ఈ చిత్రాన్ని ఇంటిల్లపాదీ కలసి ఇంట్లోనే ఓటీటీలో చూడవచ్చు.
కొసమెరుపు: చివరలో టేస్టు తగ్గినా... (అభి)రుచికరమైన బొంబాయి చట్నీ!
బలాలు:
కథలో నేటివిటీ
మనల్ని మనకు గుర్తుచేసే పాత్రలు
స్టేజ్ ఆర్టిస్టుల సినీ నటన
గుంటూరు యాస, పాటలు
నేపథ్య సంగీతం.
బలహీనతలు:
ముగింపు తెలిసే సింపుల్ స్టోరీలైన్
చివరలో సడలిన కథ, కథనం
ర్ధంతర ముగింపు
వినోదానికి దీటైన సెంటిమెంట్ లేమి
– రెంటాల జయదేవ
Comments
Please login to add a commentAdd a comment