హద్దులు చెరిపిన ఆకాశం | Aakaasam Nee Haddhu Ra Movie Review | Sakshi
Sakshi News home page

హద్దులు చెరిపిన ఆకాశం

Published Fri, Nov 13 2020 12:29 AM | Last Updated on Fri, Nov 13 2020 12:29 AM

Aakaasam Nee Haddhu Ra Movie Review - Sakshi

చిత్రం: ఆకాశం నీ హద్దురా; తారాగణం: సూర్య, అపర్ణా బాలమురళి, పరేశ్‌ రావల్, మోహన్‌ బాబు; మాటలు: రాకేందు మౌళి; సంగీతం: జి.వి. ప్రకాశ్‌ కుమార్‌; కెమెరా: నికేత్‌ బొమ్మిరెడ్డి; నిర్మాత: సూర్య; రచన – దర్శకత్వం: సుధ కొంగర; రిలీజ్‌ తేదీ: నవంబర్‌ 12; ఓటీటీ వేదిక: అమెజాన్‌;

ఏ రంగంలో పైకి రావాలన్నా, ఏ కొత్త ఆలోచనైనా జనామోదం పొందాలన్నా ఎన్నో కష్టనష్టాలు తప్పవు. ఆ పురిటినొప్పులు భరిస్తేనే అంతిమ విజయం వరిస్తుంది. పౌర విమానయాన రంగంలో సామాన్య పౌరుడికి కూడా విమానంలో చౌకధరకు చోటివ్వాలని తపించిన ఓ మంచి మనిషి కథ ఇది. ‘ఎయిర్‌ దక్కన్‌’ ఫౌండర్‌ కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా, సినిమాటిక్‌ కల్పనలు జోడించి మహిళా దర్శకురాలు సుధ కొంగర చేసిన స్ఫూర్తిదాయక ప్రయత్నం – ‘ఆకాశం నీ హద్దురా’.

కథేమిటంటే..: చుండూరు అనే చిన్న ఊళ్ళో మాస్టారు రాజారావు కొడుకు చంద్రమహేశ్‌ (సూర్య). నిమ్న వర్గానికి చెందినవాడైనా ఆ ఊరికి కరెంట్‌ తెప్పించడంలో, చివరకు రైలు హాల్టు వచ్చేలా కృషి చేయడంలో రాజారావు ఎంతో కృషి చేస్తాడు. అహింస, అర్జీ పద్ధతుల్లో సాగే రాజారావు పోరాటాన్ని తరాల అంతరంతో కొడుకు హర్షించడు. తల్లి పార్వతి (ఊర్వశి) సయోధ్యకు ప్రయత్నించినా, కొడుకు వినడు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీలో చదువుకొని, ఎయిర్‌ ఫోర్స్‌ లో చేరతాడు.

అంతిమ ఘడియల్లో ఉన్న తండ్రిని చూడడానికి విమానంలో వద్దామన్నా, డబ్బు చాలక టైమ్‌కి రాలేకపోతాడు హీరో. ఆ బాధతో ఎలాగైనా సామాన్యమైన ఊరి జనం మొత్తానికీ చౌకధరకు విమానయానం అందుబాటులోకి తేవాలనుకుంటాడు. ఆ క్రమంలో అతనికి చిన్నస్థాయి నుంచి పైకి ఎదిగిన జాజ్‌ ఎయిర్‌ లైన్స్‌ అధిపతి పరేశ్‌ గోస్వామి (పరేశ్‌ రావల్‌) ప్రేరణ అవుతారు. తీరా అదే పరేశ్‌ అసూయతో, అహంకారంతో హీరో ప్రయత్నానికి అడుగడుగునా అడ్డుపడతాడు. చివరకు హీరో ఎలా తన కలను నిజం చేసుకున్నాడో మిగతా కథ.

ఎలా చేశారంటే..: కుగ్రామంలో పుట్టి, ఎడ్లబండి మీద తిరిగిన కెప్టెన్‌ జి.ఆర్‌. గోపీనాథ్‌ జీవిత అనుభవాల ఆత్మకథ ‘సింప్లీ ఫ్లయ్‌’ ఈ సినిమాకు ప్రధాన ఆధారం. వరుసగా ఫ్లాపులతో ఉన్న హీరో సూర్య ఆ పాత్రను ఆవాహన చేసుకొని, అభినయించారు. ఆర్థిక స్వావలంబన, అదే సమయంలో భర్తకు అన్నిఅండగా నిలిచే మనస్తత్వం కలిసిన బలమైన హీరోయిన్‌ పాత్రలో అపర్ణ మనసుకు హత్తుకుంటారు.

హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలు, సంభాషణలు చూస్తే, మంచి మణిరత్నం సినిమా చూస్తున్నామనిపిస్తుంది. విలన్‌గా పరేశ్‌ రావల్‌ తక్కువ మాటలతో, ఎక్కువ భావాలు పలికిస్తూ బాగున్నారు. వైమానికదళ అధికారి పాత్రలో మోహన్‌ బాబు బాగున్నారు. కానీ, ఆ పాత్ర రూపకల్పన, కథ చివరకు వచ్చేసరికి దక్కిన ప్రాధాన్యం ఆశించినంత బలంగా లేవు. హీరో తల్లితండ్రుల మొదలు స్నేహితులు, గవర్నమెంట్‌ ఆఫీసు అధికారుల దాకా చాలా పాత్రలు నిడివితో సంబంధం లేకుండా మనసుపై ముద్ర వేస్తాయి.

ఎలా తీశారంటే..: మణిరత్నం వద్ద పనిచేసిన డైరెక్టర్‌ సుధ కొంగరపై తన గురువు సినిమా టేకింగ్‌ ప్రభావం బలంగా ఉన్నట్టు తెరపై కనిపిస్తుంది. సినిమా ఫస్ట్‌ సీన్‌ నుంచి ప్రేక్షకులు కథలో ఇన్‌ వాల్వ్‌ అయిపోతారు. పాత్రలనూ, సన్నివేశాలనూ, బలమైన సంఘటనలనూ కథకు తగ్గట్టు వాడుకున్నారు. లో కాస్ట్‌ ఎయిర్‌ లైన్స్‌ లాంటి టెక్నికల్‌ అంశాన్ని సైతం అందరికీ అర్థమయ్యేలా, ఎమోషనల్‌ గా చూపించడం విశేషం. కొన్ని చోట్ల కంటతడి పెట్టకుండా ఉండలేం. అందుకే, భావోద్వేగాలను ఇష్టపడేవారికి కచ్చితంగా నచ్చే సినిమా ఇది.

అయితే, అక్కడక్కడా బాగున్న ఎమోషనల్‌ సీన్లను కూడా పరిమితికి మించి కొనసాగించడంతో మెలోడ్రామా మితిమీరింది. తండ్రి చనిపోయాక ఇంటికొచ్చిన హీరోతో తల్లి వాదన సీన్, పోస్టాఫీస్‌లో ఊరి జనం హీరోతో ఫోన్‌లో మాట్లాడే సీన్‌ లాంటివి బాగున్నా, కొద్దిగా కత్తెరకు పదును పెట్టి ఉండాల్సింది. అలాగే, లల్లాయి లాయిరే అంటూ మొదలయ్యే పాట మినహా మిగిలినవేవీ గుర్తుండేలా లేకపోవడం చిన్న లోటే. అయితే, ఇలాంటి లోటుపాట్లన్నీ బిగువైన కథాకథనంలో కొట్టుకుపోతాయి. శాలినీ ఉషాదేవితో కలసి దర్శకురాలు రాసుకున్న స్క్రీన్‌ ప్లే, సినిమా నిర్మాణ విలువలు, రీరికార్డింగ్, కెమెరా పనితనం ప్రధాన బలాలయ్యాయి..

గోపీనాథ్‌ జీవితకథతో పాటు చౌకధరలో విమానయానమనే విభాగంలో జరిగిన అనేక నిజజీవిత సంఘటనలను కూడా కలగలిపి, ప్రధాన పాత్రల స్వరూప స్వభావాలను పకడ్బందీగా రాసుకున్నారు సుధ కొంగర. రాసుకోవడంతో స్క్రిప్టు ఆసక్తిగా తయారైంది. ఇప్పటి వరకు స్పోర్ట్స్‌ డ్రామాలు, సినిమా యాక్టర్లు, పొలిటీషియన్ల బయోపిక్‌లకే పరిమితమైన చోట తెలుగు మహిళ సుధ కొంగర చేసిన ఈ ప్రయత్నం అందుకే ఆనందం అనిపిస్తుంది. హీరోకూ, ప్రత్యర్థికీ మధ్య వ్యాపార పోరాటం సహా, కథలో అడుగడుగునా హీరోకు ఎదురయ్యే సవాళ్ళు ప్రేక్షకుల ఆసక్తిని చివరికంటా నిలుపుతాయి. సినిమా క్లైమాక్స్‌ లో ఎలాగైనా హీరోనే గెలుస్తాడని తెలిసినా, రెండున్నర గంటలూ ఆపకుండా చూసేలా చేస్తుంది. ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ కంటెంట్‌ కావడంతో, కరోనా వేళ ఇటీవల రిలీజైన సినిమాల్లో ఇది ఫస్ట్‌ బిగ్‌ ఓటీటీ హిట్‌గా నిలిచే సూచనలూ ఉన్నాయి.
 కొసమెరుపు: ఇటీజ్‌ నాట్‌ ఎ ‘భయో’పిక్‌!

బలాలు
► స్ఫూర్తిదాయక కథ
► బిగి సడలని కథనం
► దర్శకత్వ ప్రతిభ
► పాత్రల రూపకల్పన, నటన
► సీన్లలోని ఎమోషన్‌

బలహీనతలు
► అక్కడక్కడ అతి మెలోడ్రామా
► డబ్బింగ్‌ సినిమా వాసనలు
► ఆకట్టుకోని పాటలు
► క్లైమాక్స్‌ లో కాస్తంత తికమక 

– రెంటాల జయదేవ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement