చూడాలంటే భయపెట్టే.. చంద్రిక | Film Review-Chandrika | Sakshi
Sakshi News home page

చూడాలంటే భయపెట్టే.. చంద్రిక

Published Fri, Sep 25 2015 8:20 PM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

చూడాలంటే భయపెట్టే.. చంద్రిక

చూడాలంటే భయపెట్టే.. చంద్రిక

సినిమా రివ్యూ: చంద్రిక
చిత్రం - ‘చంద్రిక’,
తారాగణం - జయరామ్ కార్తీక్, శ్రీముఖి, కామ్నా జెత్మలానీ, గిరీష్ కర్నాడ్, ఎల్బీ శ్రీరామ్, ‘సత్యం’ రాజేశ్
మాటలు - నాగేశ్వరరావు
పాటలు - వనమాలి
సంగీతం - గుణ్వంత్
కెమెరా - కె. రాజేందర్ బాబు
ఎడిటింగ్ - వి. సురేష్‌కుమార్
కథ, స్క్రీన్‌ప్లే - సాజిద్ ఖురేషీ
నిర్మాత - వి. ఆశ
దర్శకత్వం - యోగేశ్

బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు హార్రర్ సినిమాలు చాలా వస్తున్నాయి. అందులో లేటెస్ట్ ఎడిషన్ ఈ ‘చంద్రిక’. వాల్‌పోస్టర్లలో ‘చంద్రముఖి’ తరహాలో డ్యాన్స్ దుస్తుల్లో హీరోయిన్ కనిపించడం, అలాగే కామ్నా జెత్మలానీ లాంటి పేరున్న తార కూడా నటించడం వల్ల ఈ సినిమా పట్ల కొంత ఆసక్తి నెలకొంది. మరి, ఈ శుక్రవారం వచ్చిన ‘చంద్రిక’ ఆ ఆసక్తికి తగ్గట్లే ఉందా?

కథేమిటంటే..
అనగనగా ఒక ఊరు. అందులో ఓ పెద్ద బంగళా. ఆ బంగళాను కొనుక్కున్నవాళ్ళకు చిత్రవిచిత్రమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. దాంతో, అందరూ భయపడి పారిపోతుంటారు. ఆ పరిస్థితుల్లో ఆ బంగళాను అర్జున్ (తొలి పరిచయం - జయరామ్ కార్తీక్) అనే చిత్రకారుడు కొనుక్కుంటాడు. అది తన గురువైన చిత్రకారుడు రవివర్మ ఒకప్పుడు ఉన్న బంగళా అనీ, అందుకే దాన్ని కొన్నాననీ తన భార్య శిల్ప (తెలుగు యాంకర్, నటి శ్రీముఖి)కి చెబుతాడు. ఆ హవేలీలో ఆర్ట్ గ్యాలరీ పెడదామని అతను అనుకుంటే, ‘లేదు... అక్కడే ఉందామ’ని భార్య అంటుంది. అలా ఆ దంపతులు ఆ బంగళాకు కాపురం మారుస్తారు.

అక్కడ నుంచి శిల్ప ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఆ మార్పులను భర్త మొదట పట్టించుకోడు. భవంతిలో ఆత్మ ఉందనే సంగతి అతనికీ క్రమంగా అర్థమవుతుంది. ఆ బంగళాలోని ఒక పెద్ద చిత్తరువు (ఆ బొమ్మలో కామ్నా జెత్మలానీ)ని చూపించి, చంద్రికను అనడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది.

సెకండాఫ్‌కు వచ్చేసరికి, ఆ చంద్రిక ఎవరనే ప్రశ్న వస్తుంది. ఆ భూతాన్ని వదిలించడానికి వచ్చిన మంత్రవేత్త సమక్షంలో ఫ్లాష్‌బ్యాక్ ఓపెన్ అవుతుంది. చంద్రిక ఎవరనే విషయం అడిగిన మంత్రవేత్తతో హీరో జరిగిన కథ చెప్పడం మొదలుపెడతాడు. ఆ బంగళా ప్రసిద్ధ చిత్రకారుడు రవివర్మ (గిరీష్ కర్నాడ్)ది అనీ, అతని తమ్ముడి కూతురే చంద్రిక (కామ్నా జెత్మలానీ) అనీ చెబుతాడు. ఏకలవ్య శిష్యుడిగా గురువు గారి వద్ద చిత్రకళ నేర్చుకోవడానికి వచ్చిన తనకూ, చంద్రికకూ మధ్య పెరిగిన ప్రేమ బంధం గురించి చెబుతాడు. తమ ప్రేమ పెళ్ళిదాకా వచ్చినా, పీటల మీద పెళ్ళి ఆగిపోయినట్లు చెబుతాడు. కానీ, దానికి తాను కారణం కాదని చెబుతాడు. మంత్రవేత్త మాటలతో ఆ తరువాత జరిగిన కథ తెలుసుకోవడం కోసం అన్వేషణ మొదలుపెడతాడు. ఇంతకీ అసలేమైంది? చంద్రిక ఎలా చనిపోయింది? లాంటివన్నీ మిగతా కథ.  

ఎలా చేశారంటే...?
ఇది ప్రధానంగా కన్నడ సినిమా. అయితే, కొంతమంది తెలుగు ఆర్టిస్టుల్ని కూడా పెట్టుకొని, రీషూట్స్ చేసి  ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో తయారైన సినిమా అనగలిగారు. ఈ చిత్ర కథానాయక పాత్రధారికి తెలుగులో ఇదే తొలిచిత్రం. ఆ పాత్రలో ఆయన చేయగలిగిందీ, చేసిందీ ఏమీ లేదు. టీవీ యాంకర్, ‘జులాయి’ చిత్రంలో అల్లు అర్జున్ చెల్లెలు పాత్రధారిణి అయిన శ్రీముఖి ఈ చిత్రంలో హీరోయిన్. ఆమె కొన్ని చోట్ల చూడడానికి బాగుంది. ముఖ్యంగా, చంద్రిక (కామ్నా జెత్మలానీ) పూనినట్లు అనిపించే సీన్స్‌లో బాగా చేశారు.

ఇంటర్వెల్‌కు ముందు తానే చంద్రికను అంటూ వచ్చే ముగ్గులోని ఆత్మ సీన్‌లో శ్రీముఖి ఆంగికం, ఆహార్యం, క్లిష్టమైన భంగిమల్లో ఆమె చేసిన వర్క్ బాగుంది. చంద్రికగా కామ్నా జెత్మలానీ కనిపించేది కాసేపే అయినా, సినిమాకు అదనపు ఆకర్షణ. ఆమెకూ, హీరోకూ మధ్య పెట్టిన రొమాంటిక్ సాంగ్ ఒక రకంగా చెప్పాలంటే, స్పెషల్ ఐటమ్ సాంగ్. గిరీష్ కర్నాడ్ లాంటి సీనియర్ నటుడున్నా, కథలో ఆయనకున్న పాత్ర కొద్దిగానే. ‘సత్యం’ రాజేశ్, ఎల్బీ శ్రీరామ్, ‘తాగుబోతు’ రమేశ్ లాంటి వారందరూ చేసినవి తెరపై కనిపించడానికే తప్ప కథను నడిపించడానికి ఉపయోగపడిన పాత్రలు కావు.

ఎలా ఉందంటే...?
దర్శకుడు యోగేశ్‌కు ఇదే తొలి చిత్రం. ఆ అనుభవ రాహిత్యం బయటపడిపోయింది. క్యారెక్టర్ల పరిచయం కాసేపటికే అయిపోతుంది. బంగళాలోని భూతం సంగతి సినిమా మొదలైన కాసేపటికే అర్థమైపోతుంది. ఇక, ఆ తరువాత కథను పట్టాలెక్కించి, వేగంగా నడపాల్సింది. కానీ, అక్కడ అవసరం లేని, ఆసక్తి కలిగించని సీన్లు పెట్టారు. వాటికి తోడు పానకంలో పుడక లాగా పాటలు. సెకండాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్ మొదలుపెట్టినప్పటి నుంచి సినిమా రసకందాయంలో పడాలి. కానీ, అలా జరగలేదు. సరికదా... అనాసక్తిగా తయారైంది. ఫ్లాష్‌బ్యాక్ ఘట్టం కూడా అంతంత మాత్రంగానే ఉంది. హీరో, కామ్నా జెత్మలానీల ప్రేమఘట్టాన్ని అతిగా సాగదీశారు. ఫ్లాష్‌బ్యాక్ తరువాతహీరో కనిపెట్టిన అంశాలు కూడా ఆసక్తిగా లేవు. చివరకు వచ్చేసరికి, రజనీకాంత్ ‘చంద్రముఖి’ తరహా క్లైమాక్స్‌ను అనుకరించారు. కానీ, అదీ అంతంత మాత్రమే.

మాటి మాటికీ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే దయ్యం పాట ముక్కలు ముక్కలుగా విన్నప్పుడు బాగుంది. గుణ్వంత్ సంగీతం, సేతు సౌండ్ ఎఫెక్ట్స్ కొంత సినిమాను కాపాడాయి. కెమేరా వర్క్ ఫరవాలేదు. కానీ, కథలో పస లేనప్పుడు, చెప్పిన విధానంలో దమ్ము లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు. విషాదం ఏమిటంటే, ‘చంద్రముఖి’ని చూసి, ఆ ధోరణిలో వెళ్ళాలని వాత పెట్టుకున్న ఈ హార్రర్ జానర్ సినిమాలో క్రైమ్ ఎలిమెంట్ కానీ, భయపెట్టే అంశాలు కానీ, కనీసం కాసేపు నవ్వు తెప్పించే విషయాలు కానీ లేకపోవడం! కన్నడంలో ప్రధానంగా తీసిన సినిమా కావడంతో ఆ తరహా టేకింగ్ తెలిసిపోతుంటుంది. వెరసి, తెలుగులో కన్నా ఒక రోజు ముందే కన్నడంలో విడుదలైన ఈ ద్విభాషా ‘చంద్రిక’ జనం చూడడానికి భయపడే సినిమాయే తప్ప, చూస్తే భయపడే సినిమా కాదు!
- రెంటాల జయదేవ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement