నాకు సంగీతం తెలియదు... సంగీతానికి నేను తెలుసు! | 84th birthday celebrations of mangalam palli bala murali | Sakshi
Sakshi News home page

నాకు సంగీతం తెలియదు... సంగీతానికి నేను తెలుసు!

Published Sun, Jul 6 2014 12:06 AM | Last Updated on Tue, Oct 30 2018 5:50 PM

నాకు సంగీతం తెలియదు...  సంగీతానికి నేను తెలుసు! - Sakshi

నాకు సంగీతం తెలియదు... సంగీతానికి నేను తెలుసు!

 ఆయన అపర త్యాగయ్య అంటారు కొందరు! ఆయనకు అహంకారమంటారు... ఇంకొందరు!
 మితిమీరిన ఆత్మవిశ్వాసమంటారు... మరికొందరు! ఎవరేమన్నా, అనుకొన్నా వెరవని స్వభావం...
 సంగీతంలో, జీవితంలో నిత్య ప్రయోగశీల వ్యక్తిత్వం...
 నమ్మినదాన్ని ఆచరించే పట్టుదల...
 నమ్మి వచ్చినవారికి ఆశ్రయమిచ్చే ఔదార్యం...
 సమకాలీన కర్ణాటక సంగీత ప్రపంచంలో
 అరుదైన వాగ్గేయకారుడిగా గౌరవం...
 76 ఏళ్ళుగా పాడుతున్నా...
 ఇప్పటికీ వన్నె తగ్గని ఆ మధు మురళి...
 డాక్టర్ మంగళంపల్లి బాలమురళి.
 త్యాగరాజ స్వామి వారి శిష్యపరంపరలో అయిదో తరం వ్యక్తిగా... తెలుగువారి ఆస్తి ఆయన.
 ‘పద్మశ్రీ’, ‘పద్మవిభూషణ్’, ఫ్రాన్స్ దేశపు అత్యున్నత సత్కారం ‘షెవాలియర్’...
 ఇలా అన్నీ ఈ భారత జాతిరత్నం ద్వారా తమ గౌరవాన్ని పెంచుకున్నవే.
 ఎంత ఎత్తు ఎదిగినా, హృదయంలోని
 పసితనాన్ని ఇప్పటికీ పోగొట్టుకోని...
 84 వసంతాల నిత్య బాలుడాయన.
 నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న
 ఈ ముగ్ధమోహన గాన మురళితో
 ‘సాక్షి’ మాటకచ్చేరీ...

 
 త్యాగరాజస్వామి ప్రత్యక్ష శిష్యపరంపరలో నేను అయిదో తరం వాణ్ణి... త్యాగరాజస్వామి, వారికి మానాంబుచావిడి (ఆకుమళ్ళ) వెంకట సుబ్బయ్య, ఆయనకు సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి, సుసర్లకు పారుపల్లి రామకృష్ణయ్య, ఆయనకు నేను... ఇలా!
   
గానమే కాకుండా అనేక వాద్యాల మీద నాకు పట్టు మొదలైంది ద్వారం వెంకట స్వామి నాయుడుగారి వయొలిన్ కచ్చేరీతో! ఆయన వాయిస్తుంటే విని విని, చూసి చూసి, చటుక్కున వయొలిన్ తీసి వాయించడం మొదలు పెట్టాను.
తర్వాత వయోలా, మృదంగం, కంజీరా, వీణ ఇలా... చాలానే!
నేను పాడిన తెలుగు సినిమా పాటల్లో నాకిష్టమైనవి... ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు..’ (ఉయ్యాల - జంపాల),

 
‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా...’ (గుప్పెడు మనసు), ‘పాడనా వాణి కల్యాణిగా...’ (మేఘసందేశం), ‘నర్తనశాల’లోని ‘సలలిత రాగ సుధారస సారం...’లాంటివి..!

ఆత్మకథ రాయమని అడిగేవారికి నేను చెప్పేదొక్కటే... నా మీద ఇప్పటికే చాలా పుస్తకాలు వచ్చాయి. ఎంతోమంది నా జీవితానికి అక్షరరూపం ఇచ్చారు, ఇస్తున్నారు కూడా. నా జీవితం, సంగీత కృషి మీద ఇప్పటికే విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగింది. పిహెచ్.డి. పట్టా కూడా దక్కాయి. ఇక నేను రాయడమెందుకు!

సంగీతానికి నేనిచ్చే నిర్వచనం... లైఫ్! సంగీతం అంటే ప్రాణం, జీవం. అదే మనిషి జీవితం. అంతేతప్ప, సంగీతం అంటే ఏవో నాలుగైదు కీర్తనలు పాడడం కాదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొనే మాటల్లో కూడా సంగీతం ఉంటుంది. ఆ సంగీతం సరిగ్గా కుదరకపోతే, ఒకరు మాట్లాడేది మరొకరికి అర్థం కాదు. ఆ సంగీతం సమశ్రుతిలో ఉంటే, అదే బ్రహ్మానందం!
 
ఎనిమిదేళ్ళు నిండీనిండగానే కచ్చేరీలు మొదలు పెట్టారు. ఇప్పటికి 76 ఏళ్ళుగా వేల కచ్చేరీలు చేశారు. అసలు తొలిసారిగా మీరిచ్చిన కచ్చేరీ..?
1938 జూలైలో అనుకుంటా... బెజవాడలోని దుర్గాపురంలో శరభయ్యగారి గుళ్లో హాలు ప్రారంభోత్సవం... మా గురువుగారైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు తమ గురువులైన సుసర్ల దక్షిణామూర్తిగారి పేర ‘సద్గురు ఆరాధనోత్సవాలు’ జరుపుతున్నప్పుడు నాతో కచ్చేరీ చేయించారు. కొద్దిసేపనుకున్న నా గానం కొన్ని గంటలు మంత్రముగ్ధంగా సాగింది. నా తరువాత హరికథ చెప్పాల్సిన సుప్రసిద్ధులు ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ తన ప్రోగ్రామ్ కూడా వద్దని, నన్ను ఆశీర్వదించారు. అప్పటి దాకా నా పేరు మురళీకృష్ణ. పసివాడినైన నాకు ‘బాల’ అనే మాట ఆయనే చేర్చి, ‘బాల మురళీకృష్ణ’గా దీవించారు.  
 
అసలు మీరు పుట్టింది... చదువుకున్నది ఏ ఊరిలో..?
 తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో పుట్టా. నేను పుట్టిన పక్షం రోజులకే మా అమ్మ సూర్యకాంతమ్మ చనిపోయింది. దాంతో, మా అమ్మగారి అక్కల్లో అందరి కన్నా పెద్దవారూ, బాలవితంతువైన మా పెద్దమ్మ సుబ్బమ్మ గారు నన్ను పెంచారు. నేను స్కూల్‌లో చేరి చదివింది సరిగ్గా 3 నెలలే. నా పాట విని, విజయవాడ గవర్నర్‌పేటలోని మునిసిపల్ స్కూల్‌లో హెడ్‌మాస్టర్ నాకు ఫస్ట్ ఫారమ్‌లో ప్రవేశం కల్పించారు. మా నాన్నగారు నన్ను ముందు కూర్చోబెట్టుకొని, సైకిల్ తొక్కుతూ బడికి తీసుకువెళ్ళడం నాకిప్పటికీ గుర్తే. బడిలో కూడా నా పాటలే ఆకర్షణ. అంతా నా చుట్టూ చేరేవారు.

అయితే, నా సంగీతంతో మిగిలిన పిల్లల చదువు కూడా పాడవసాగింది. ఇంతలో నేను క్వార్టర్లీ పరీక్షలు తప్పాను. దాంతో, ‘మీ వాడికి చదువు కన్నా సంగీతమే కరెక్ట్. అందులోనే కృషి చేయించండి’ అని హెడ్‌మాస్టర్ నాన్న గారికి చెప్పారు. (నవ్వుతూ) అలా 6వ తరగతి ఫెయిలై, స్కూలు చదువు అటకెక్కినా, వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 12 డాక్టరేట్లు అందుకొని, డాక్టర్‌నయ్యా. రేడియోలో పని చేస్తున్న రోజుల్లో బెజవాడలో ఓ ఆడ ఇంగ్లీష్ ఎనౌన్సర్ నా పాట విని నచ్చి, ఇంగ్లీషులో మెచ్చుకొని, షేక్‌హ్యాండ్ ఇవ్వబోతే అర్థంకాక జంకాను. ఆ తరువాత పట్టుబట్టి, 3 నెలల్లో ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించి, ఆమెతో అనర్గళంగా మాట్లాడా. రోటరీక్లబ్‌లో ఇంగ్లీషులో నా తొలి ఉపన్యాసమిచ్చా. అలాగే, సంస్కృతం మీద పట్టు సాధించా.
 
చిన్ననాటి అనుభవాలు మరికొన్ని...

 నా 11వ ఏట తిరువయ్యారులో త్యాగరాయ ఆరాధనోత్సవాలలో పారుపల్లివారికిచ్చిన సమయంలో నేను పాడినప్పుడు, జనం నుంచి అపూర్వ స్పందన వచ్చి, చుట్టూ మూగితే, నాగరత్నమ్మ గారు నన్ను తీసుకువెళ్ళి, త్యాగరాజస్వామి విగ్రహం పాదాల చెంత పడేశారు. ‘ఏ నరదృష్టీ సోకకుండా ఈ పిల్లవాణ్ణి కాపాడమ’ని ప్రార్థించారు. ఇక, బెజవాడలోని సత్యనారాయణపురంలో మా ఇంటికి ఎదురుగా ఉన్న దూబగుంట వారి సత్రంలో చాతుర్మాస్య దీక్షకని కుర్తాళం పీఠాధిపతి వచ్చారు.

ఆయన పారుపల్లి వారికి ఆధ్యాత్మిక గురువు. స్వామీజీని కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ ప్రేరణ, ఆశీర్వాదం అందుకొని, 72 మేళకర్త రాగాల్లో కీర్తనల రచన ‘జనక రాగ కృతి మంజరి’ మొదలుపెట్టాను. ఇక, శరభయ్యగారి గుళ్ళలో ఉండే దేవీ ఉపాసకుడు, పండితుడు అయ్యప్పశాస్త్రి నాకు యతి, ప్రాస, కవితా లక్షణాలను చెప్పడం, కృతి, కీర్తన, పాట, పదం, జావళీల భేదాలు, రచనా రహస్యాలు తెల్పడం నా సాహితీ రచనకు వన్నెలద్దింది. ప్రతిభకు పెద్దల ఆశీర్వాద బలం తోడైంది.
 
మీ జీవితంలో గురువుగారి పాత్ర? ఆయనలో మీరు చూసిన ప్రత్యేకత?

 మా గురువు పారుపల్లి వారు లేకపోతే, ఆంధ్రదేశంలో ఇవాళ కర్ణాటక సంగీతం ఇంతగా ప్రాచుర్యంలోకి వచ్చేది కాదు. బెజవాడలో గాంధీనగర్‌లోని ఆయన ఇంటికి సైకిల్ మీద వెళ్ళి, పాఠం చెప్పించుకున్న రోజులు నాకింకా గుర్తే. శిష్యులమైన మా అందరికీ ఆయన తనకు తెలిసిన విద్యనంతా నేర్పారు. గమ్మత్తేమిటంటే, పారుపల్లి వారి దగ్గర మా నాన్న గారూ పాఠం చెప్పించుకున్నారు. తండ్రీ కొడుకులిద్దరికీ ఆయనే గురువన్న మాట!
 
కానీ, పారుపల్లి వారి వద్ద నేర్చుకున్న త్యాగరాయ సంగీతం కన్నా, మీ సొంత బాణీకీ, కృతులకే మీరు ప్రాధాన్యమిచ్చారని మరో విమర్శ...
త్యాగరాజస్వామి ముందువాళ్ళు ఎవరు ఎలా పాడేవారో ఎవరికీ తెలీదు కదా! ఆయన ఆ రాగాల్లో కృతులు రాసుకొని, ఆలపించారు. ఆ త్యాగరాయ సంగీతం పరంపరాగతంగా మా వరకు వచ్చింది. ఆ సంగీతాన్ని పాడుతూనే, పెద్దగా పాపులర్ కాని రాగాల్లో సైతం కీర్తనలు రాసి పాడాను. రాగాలు కనిపెట్టాను. అలా రచన, గానంతో వాగ్గేయకారుణ్ణయ్యాను. నా పద్ధతి, పాట ‘బాలమురళి బాణీ’గా ప్రచారంలోకి వచ్చింది. అదేదో నేను ఉద్దేశపూర్వకంగా కొత్తగా, ధైర్యంగా చేశానని చెప్పను కానీ, అలా జరగాలని రాసి ఉంది....  జరిగింది. అంతే!
 
రేడియో పాపులారిటీకి కూడా ఎంతో శ్రమించారు. ఉదయం వేళ ‘భక్తి రంజని’ ఆలోచన మీదేనట!
అవును. ఆ రోజుల్లో కోరి మరీ రేడియోలో చేరాను. ఉదయాన్నే నిద్ర లేస్తూనే, మంచి సంగీతం వింటే, శ్రోతలకు బాగుంటుందని ఆ భక్తి సంగీత కార్యక్రమం పెట్టాను. దాని కోసం ఎన్నో తత్త్వాలు, భక్తి కీర్తనలు సుప్రసిద్ధులెందరితోనో పాడించాను. సంగీతం, నాటకం, స్పోకెన్ వర్డ్ లాంటి వివిధ విభాగాలకు ప్రొడ్యూసర్లనే పోస్టులు పెట్టించి, ఆయా రంగాల్లోని సుప్రసిద్ధులను అధిపతులుగా నియమించేలా చూశాను. ఆకాశవాణికి అది స్వర్ణయుగం!
 
విజయవాడలో ప్రభుత్వ సంగీత కళాశాల పెట్టించి, తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేసిన మీరు మద్రాసుకు మారిపోయి, 50 ఏళ్ళుగా స్థిరపడడానికి కారణం?
 ఉత్తరాదికి బొంబాయి ఎలాగో, దక్షిణాదికి మద్రాసు అలా! కళాసాంస్కృతిక రంగాలకు ఇది కేంద్రం. ఇక్కడ అవకాశాలు ఎక్కువ. బెజవాడ మ్యూజిక్ కాలేజీకి రాజీనామా చేశాక, మళ్ళీ మద్రాసు ఆకాశవాణిలో మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా చేస్తూనే, కచ్చేరీలిస్తూ వచ్చా. ఆ తరువాత పూర్తిగా సంగీతం మీదే దృష్టి పెడుతూ, ఉద్యోగం వదిలేశాను.
 
ఉత్తరాదిన ఎందరికో దక్కిన ‘భారతరత్న’ మీకు రాలేదు. వివక్ష కారణమా?
ఫలానాది కావాలి, రావాలి అని నేనెప్పుడూ అనుకోలేదు... ‘భారతరత్న’ గురించీ అంతే! ఎవరికి ఏది ప్రాప్తమో అదే వస్తుంది. లతా మంగేష్కర్, భీమ్‌సేన్ జోషీ, బిస్మిల్లా ఖాన్, హరిప్రసాద్ చౌరసియా, పండిట్ రవిశంకర్ లాంటి దిగ్గజాలూ, నేనూ కలిసి ఎన్నో వేదికలపై కచ్చేరీలు చేశాం. కానీ, దురదృష్టవశాత్తూ ఇవాళ ప్రతిదీ రాజకీయమైపోయింది.
 
ఈ ఆధునిక యుగంలో కర్ణాటక సంగీతానికి భవిష్యత్తు ఉందంటారా?
కర్ణాటక సంగీతం అనగానే మీరు గిరి గీసుకొని, సంకుచితంగా ఆలోచించకండి. చెవులకు ఇంపుగా ఉండేది అని ఆ మాటకు అసలైన అర్థం. కాబట్టి, శాస్త్రీయ, జానపద, లలిత, పాశ్చాత్య సంగీతాలు ఏవైనా సరే, ఇంపుగా ఉంటే అది కర్ణాటక సంగీతమే. ప్రపంచమే ఓ కుగ్రామమైపోయి, సరిహద్దులు చెరిగిపోవడంతో, మునుపటితో పోలిస్తే ఈ తరానికి వేదికలు, అవకాశాలు ఎక్కువ. కాబట్టి, కచ్చితంగా కర్ణాటక సంగీతానికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంది. అయినా, కాలంతో పాటు వచ్చే మార్పులకు తగ్గట్లుగా కొత్త కూరలు వస్తాయి, రుచులు మారతాయే తప్ప, తినడమైతే మానేయం కదా! సంగీతమూ అంతే!
 
అన్నట్లు, మీకు అత్యంత ఇష్టమైన రాగం..?

 75 మేళకర్త రాగాలలో కీర్తనలు రాశాను. అలాగే, సరికొత్త తాళ విధానాన్ని కనిపెట్టాను. ఇక, మహతి, లవంగి, గణపతి - ఇలా నేను సృష్టించిన రాగాలే దాదాపు 25 పైగా ఉంటాయి. అన్నీ నా పిల్లలే. వాటిలో ఏది ఎక్కువంటే చెప్పడం కష్టం.
 
కానీ, కల్యాణి మీకు ఇష్టమైన రాగమని విన్నట్టు గుర్తు..?
 (నవ్వేస్తూ...) గతంలో ఒకసారి కేరళలోని త్రివేండ్రంలో అనుకుంటా. కచ్చేరీ చేస్తున్నా. ఆ సమయంలో నేను కల్యాణి రాగం పాడుతుంటే, ఒక అందమైన అమ్మాయి వచ్చి, నా పక్కన కూర్చొంది. ‘సొగసు నీ సొమ్ము కల్యాణి రాగిణీ, వగలు విరజిమ్ము నా భావజాలమ్ములో...’ అని అప్పటికప్పుడు పాట, వరుస కట్టాను. ఆ కృతి అయిపోగానే ఎలా వచ్చిన అమ్మాయి అలా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో ఎవరికీ తెలీదు. దానికి ఆ కచ్చేరీకి వచ్చినవాళ్ళే సాక్షులు. కల్యాణి రాగదేవతే అలా వచ్చిందనుకుంటా!
 
అవును... రోజుకి ఎంత సేపు సాధన చేస్తుంటారు?
కచ్చేరీకి వెళ్ళేముందు ఒక రిహార్సల్ కానీ, ప్రాక్టీస్ కానీ అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. మైకు ముందుకు వెళ్ళే వరకూ ఏం పాడతానో నాకే తెలియదు. కూర్చోగానే, ఇవాళ పాడాలి కదా, వీళ్ళందరినీ సంతోషపెట్టాలి కదా అనిపిస్తుంది. అంతే... సంగీతం, పాట వాటంతట అవే వస్తాయి. వాటికి నేను వాహికనవుతాను.

కానీ, ఇలా సాధన లేకుండా, అప్పటికప్పుడు తిల్లానా రాసుకొని, అక్కడికక్కడ సంగతులు వేసుకొని పాడేయడం..?
నేనెప్పుడూ చెబుతుంటాను... సంగీతం నాకు రాదు, తెలియదు. కానీ, సంగీతానికి నేను తెలుసు. అందుకే, అది నన్ను వెతుక్కుంటూ వచ్చినంత కాలం నేను వాహికగా ఉంటాను. పాట నా నోట పలుకుతుంది.

ఎందరికో సంగీతం నేర్పారు... వారసులు ఎవరంటారు?
నా బాణీని కొనసాగించే, ప్రతిభావంతులైన శిష్యులు ఎందరో ఉన్నారు. వారందరూ నాకు సమానమే. నా శిష్యుల్లో ఎవరో ఒకరు ఈ పరంపరను కొనసాగిస్తారు. కానీ, ఫలానావాళ్ళు నా వారసులని చెప్పలేను.. చెప్పకూడదు కూడా!  
 
ఆంధ్రప్రదేశ్ అవతరించిన 1956 నవంబర్ 1న ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వయొలిన్‌తో, మీరు గాత్రంతో రసానందంలో ముంచి తేల్చారని చదివా. కొత్త రాష్ట్రాల్లో కూడా ఆ భాగ్యం కలిగిస్తారా?
నన్ను ఆహ్వానిస్తే... తప్పకుండా వెళ్ళి, అవతరణ దినోత్సవాల్లో పాడతాను. సంగీతామృతాన్ని పంచుతాను.

గతంలోకి వెళితే... ఎన్టీఆర్‌తో మీ అనుబంధం? ఎన్టీఆర్ ముఖ్య మంత్రి పదవిలో ఉండగా, తెలుగు నేలపై పాడనని శపథం పట్టారే..?
ఎన్టీఆర్ మంచి నటుడు, గొప్పవారు. ‘నర్తనశాల’, ‘శ్రీమద్విరాటపర్వము’ లాంటి చిత్రాల్లో ఆయనకు నేను మంచి పాటలు పాడాను. మా మధ్య ఆ గౌరవాదరాలు ఉండేవి. కానీ, ఆయన లలిత కళా అకాడెమీలన్నిటినీ ఒక్క కలం పోటుతో రద్దు చేసేసరికి, భేదాభిప్రాయం వచ్చింది. కళాకారులకు అవమానం జరిగిందనే బాధతో ఆయన తన పంథా మార్చుకొనే దాకా పాడనన్నాను. ఏడేళ్ళ విరామం తరువాత ముఖ్యమంత్రి చెన్నారెడ్డిగారి అభ్యర్థనతో మళ్ళీ హైదరాబాద్‌లో పాడాను. తరువాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ తన తప్పు తెలుసుకొని, పంథా మార్చుకొని, సాదరంగా మళ్ళీ పిలిచి, గౌరవించడంతో వెళ్ళాను. పాడాను. ప్రాథమికంగా మేమిద్దరం ఆర్టిస్టులం. ఆయన నటన నాకూ, నా పాటలు ఆయనకూ నచ్చేవి. అధికారానికో, అహంకారానికో, ఆర్థిక బలిమికో కాదు... నేను ప్రేమకు కట్టుబడతాను.
 
కానీ, సంగీత, సాహిత్య, నాటక అకాడెమీలు పైరవీల మీద, ఆశ్రీతపక్షపాతం మీద నడవడం తప్పే కదా! అయినా అకాడెమీల అవసరం ఉందంటారా?

అకాడెమీలు ఇవాళ్టికీ అవసరమే. ఇక, వాటిలో జరిగే తప్పొప్పులు అంటారా... అవన్నీ జరిగితేనే కదా, ఎలా చేయాలి, ఎలా చేయకూడదనే అనుభవం వస్తుంది. తప్పు జరిగిందని మొత్తం వ్యవస్థనే వద్దనడం తప్పు కదా?!  
 
సినిమా రంగంతో కూడా మీది అవిస్మరణీయమైన అనుబంధం...
అక్కినేని, నా శిష్యురాలు ఎస్. వరలక్ష్మి నటించిన ‘సతీ సావిత్రి’  మొదలుకొని మొన్నామధ్య దాకా నన్ను అడిగినవాళ్ళకు పాడాను. అలాగే, ఏ.వి.ఎం. వారి ‘భక్త ప్రహ్లాద’లో నారదుడిగా నటించాను. జి.వి. అయ్యర్ రూపొందించిన ‘హంస గీతె’ (కన్నడం), ‘ఆది శంకరాచార్య’ (సంస్కృతం), ‘మధ్వాచార్య’, ‘భగవద్గీత’ లాంటి చిత్రాలకు సంగీతం అందించాను. ఉత్తమ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అవార్డులందుకున్నాను. బెంగాలీలో ఉత్పలేందు చక్రవర్తి దర్శకత్వంలోని ‘చచందనిర్’లో కాసేపు కనిపిస్తాను. ఓ సంగీత విద్వాంసుడి జీవితం చుట్టూ తిరిగే కథగా మలయాళంలో రూపొందిన ‘సంధ్య కెందిన సింధూరం’ చిత్రంలో ఆ కథానాయక పాత్ర చేశాను.
 
మీ భార్యాపిల్లల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు..?
 నా భార్య పేరు అన్నపూర్ణ. నాకు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. అందరూ జీవితంలో స్థిరపడ్డారు. అందరికీ సంగీతం వచ్చు. కానీ, సంపాదనలో స్థిరత్వం ఉండని ఈ రంగం వైపు రావద్దని సూచించాను. మా పెద్దమ్మాయి అమ్మాజీ హైదరాబాద్‌లో ఉంటుంది. పెద్దబ్బాయి అభిరామ్ ప్రింటింగ్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. రెండో అమ్మాయి లక్ష్మి గృహిణి. వాళ్లూ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఇక, ఆ తరువాత పిల్లలైన సుధాకర్, వంశీ మోహన్‌లు డాక్టర్లు. సుధాకర్ చెన్నైలోనే ఆదంబాక్కమ్‌లో ఎస్.పి.హాస్పిటల్ పేరిట పెద్ద ఆసుపత్రి నడుపుతూ బిజీగా ఉన్నాడు. వంశీ మోహన్ పేరున్న డయాబెటాలజిస్ట్. నాతోనే చెన్నైలో ఈ ఇంట్లోనే ఉంటాడు. ఇక, నా ఆఖరు అమ్మాయి మహతి కూడా మద్రాసులోనే ఉంటోంది. ఇదీ నా కుటుంబం.
 
‘మహతి’ పేరు బాగా ఇష్టమా? మీ ఇంటికీ అదే పేరు పెట్టుకున్నారు..?

మా అమ్మ వీణావాదనలో దిట్ట. నారదుడి వీణ పేరు కూడా మహతే కదా... అందుకే, ఈ పేరు.  
దీర్ఘకాలం మీ వెంట ఉండి, మీ చరిత్రనూ, కృషినీ ఎం.బి.కె. ట్రస్ట్ ద్వారా భావితరాలకు అందించే ప్రయత్నంచేసిన నర్తకి సరస్వతి మరణించడం...(తీవ్రమైన భావోద్వేగానికి గురై...) ఆమె లేకపోవడం నాకు అపారమైన నష్టం. షి వజ్ మై లైఫ్! ఆమె మరణం తరువాత అనేక అంశాలపై నాకు ఆసక్తి కూడా పోయింది.
 
మరి, మీ గాత్రంలోనే మీ కృతులన్నిటినీ వీడియో రికార్డు కూడా చేయాలన్న ప్రయత్నం ఎంతవరకు వచ్చింది?
దాదాపు 500 రచనల్లో కొన్ని రికార్డు చేశాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఆ పని జరుగుతోంది.
 
మీ పుట్టినరోజంటే, కచ్చేరీలు, ఇతర కళాకారులకు సన్మానాలతో సాగేవి. ఈ సారి ఎలా జరుపుకోబోతున్నారు?
నేనెప్పుడూ పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకోను. అభిమానులే చేస్తుంటారు. ఈ సారి ‘సరిగమ’ సంస్థవారు 1950ల నుంచి ఇప్పటి దాకా నా రికార్డింగుల్లోని ఆణిముత్యాలన్నిటినీ ఏరి, ‘సెలస్టియల్ ట్రెజర్’ అని ఓ సీడీ విడుదల చేస్తున్నారు.
 
గడచిన 83 ఏళ్ళు మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చేస్తే, ఎలా బతకాలనుకుంటున్నారు? మళ్ళీ ఇప్పటి బాల మురళీలాగానేనా?
నా 83 ఏళ్ళ జీవితంలో నాకు చేతనైనంత మంచే చేశాను. నాకు నచ్చినట్లుగా బతికాను. ఏం జరిగినా, అది నా మంచికే అనుకుంటా. ప్రతి క్షణం నాకు చిరస్మరణీయమే!

 - రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement