సాక్షి, బెంగళూరు: నేరం చేస్తే కటకటాలపాలై జైలు శిక్ష అనుభవిస్తాం. అయితే, కర్ణాటకలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారుల తీరు చూస్తే మాత్రం.. ఆ జైలుకు వెళ్లేందుకైనా నేరం చేయాలి అనిపిస్తుంది. అంత ‘ఫ్రీడం’ ఉంటుంది అక్కడి ఖైదీలకు. తాజాగా బయటపడిన ఓ ఖైదీ పుట్టినరోజు వేడుకల వీడియో అదే విషయాన్ని చెప్తున్నట్టుగా ఉంది. రెండేళ్ల క్రితం పరప్పన అగ్రహార జైలులోని అధికారులు డబ్బు తీసుకొని, నిబంధనలను ఉల్లంఘిస్తూ ఖైదీలకు వివిధ ప్రోత్సాహకాలు ఇస్తున్నారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అప్పుడు పరప్పన జైలు కుంభకోణంపై దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ఐఎఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఖైదీలకు అధికారాలు ఇచ్చినట్లు ఆ కమిటీ ధ్రువీకరించింది. దాంతో ఆ జైలు అధికారులను బదిలీ చేశారు. అలాంటి ఘటనలు మళీ జరక్కుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.
వేడుకలు, ఇంకా వీడియో
బెంగళూరు సుబ్రమణియపుర పోలీస్ స్టేషన్‌కు చెందిన రిజ్వాన్ అలియాస్ రౌడీ కుల్లాను ఇటీవల గతేడాది ఓ మర్డర్ కేసులో అరెస్టు చేసి పరప్పన అగ్రహార జైలులో ఉంచారు. మరికొంత మంది అతని అనుచరులు కూడా అదే జైలులో ఉన్నారు. అయితే, జైలులో ఉన్న రిజ్వాన్ స్నేహితులతో కలిసి తన పుట్టినరోజును జరుపుకోవడమే కాక, దాన్నంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అటాచ్ చేసి మరీ సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. జైలులో రిజ్వాన్‌కు సెల్ ఫోన్ ఎలా వచ్చిందనే విషయం ఇప్పుడు వివాదాస్పదమైంది. విస్తృతమైన పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఇటువంటి ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. ఇక బర్త్ డే ఘటనపై విచారణ చేస్తున్నామని, రిజ్వాన్‌కు ఫోన్ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని జైలు ఉన్నతాధికారులు చెప్తున్నారు. కాగా, పరప్పన జైలులో పుట్టిన రోజు వేడుకలు, ఇతర సంప్రదాయ పండుగలు జరపుకునేందుకు అనుమతి ఉండటం విశేషం. మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు.
Comments
Please login to add a commentAdd a comment