కిరాతకుడు మంజునాథ్- హతులు బెహరా, మమతాబసు (ఫైల్)
బనశంకరి: డబ్బు, నగల కోసం బెంగళూరు పుట్టేనహళ్లిలో జంటహత్యలకు పాల్పడిన ఘరానా దుండగునిపై పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. నిందితుడు కోణనకుంటె నివాసి మంజునాథ్ అలియాస్ అంబారి. ఇతనిపై ఇప్పటికే పలు దోపిడీ, దొంగతనాలతో పాటు వివిధ పోలీస్‌స్టేషన్లులో 9 కేసులు నమోదై ఉన్నాయి. జేపీ నగర 7వ ఫేజ్ పుట్టేనహళ్లి సంతృప్తి లేఔట్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమతాబసు (71), ఆమె కుమారుని స్నేహితుడైన ఒడిశావాసి దేవబ్రత బెహరా (41) ఈ నెల 7 తేదీన రాత్రి దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. అప్పటినుంచి పోలీసులు దర్యాప్తు చేశారు.
సిగరెట్ డబ్బులు ఇచ్చి..
ఆ రోజు రాత్రి దేవబ్రత బెహరా బార్‌కు వెళ్లి మద్యం తాగి పక్కనే అంగడిలో సిగరెట్ కొన్నాడు. గూగుల్‌పేలో సిగరెట్‌కు డబ్బు చెల్లించాలని చూడగా సాధ్యం కాలేదు. ఈ సమయంలో బార్‌లో పక్కటేబుల్‌లో కూర్చున్న నేరగాడు మంజునాథ్ వచ్చి ఇతని సిగరెట్‌కు రూ.12 చెల్లించాడు. బెహరా ఇంటికి నడిచి వెళ్తుండగా వెంబడించిన మంజునాథ్ అతడి వద్ద విలువైన మొబైల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లాలని చూశాడు. అతన్ని గమనించిన బెహరా నీకు ఇవ్వాల్సిన రూ.12 ఇస్తాను, వెళ్లిపో అని చెప్పినా కూడా వెళ్లకుండా వెంబడించాడు.
ఇంటి వద్దకు వెళ్లిన బెహరా కాలింగ్ బెల్ నొక్కడంతో మమతాబసు తలుపు తీసినప్పుడు ఆమె మెడలోని బంగారు చైన్‌ను మంజునాథ్ గమనించాడు. కోణనకుంటెకు వెళ్లిన మంజునాథ్ ఒక బైక్‌ను దొంగిలించి చాకు కొనుగోలు చేసి రాత్రి 12 గంటల సమయంలో బెహరా ఇంటికి వెళ్లి కాలింగ్‌బెల్ ఒత్తాడు. బెహరా వాకిలి తీయగానే అతడిని తోసుకుంటూ ఇంట్లోకి చొరబడి చాకుతో ఇష్టానుసారంగా పొడిచి చంపాడు. తరువాత మొదటి అంతస్తుకు వెళ్లి అక్కడ నిద్రిస్తున్న మమతాబసును గొంతుకోసి హత్య చేశాడు. ఆమె మెడలో ఉన్న బంగారుచైన్, బ్రాస్‌లెట్, 4 మొబైల్స్, 2 ల్యాప్‌టాప్లు, హార్డ్‌డిస్క్ తీసుకుని రక్తంతో తడిసిన తన బట్టలను కవర్‌లో పెట్టుకుని అక్కడి నుంచి బైకులో ఉడాయించాడు.
పట్టుకోవడానికి వెళ్లగా దాడి..
మరుసటి రోజు పనిమనిషి వచ్చి ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి ఇరుగుపొరుగుకు చెప్పగా, మమతాబసు కొడుక్కి, పోలీసులకు తెలిపారు. పుట్టేనహళ్లి పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం సాయంత్రం 7.30 సమయంలో కోణనకుంటె పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆదిత్యనగర ఎస్‌ఆర్.పాఠశాల వద్ద నిందితుడు మంజునాథ్ ఉన్నట్లు తెలిసి సీఐ కిశోర్‌కుమార్, పోలీస్‌సిబ్బందితో వెళ్లారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా పెద్ద కత్తితో దాడికి దిగడంతో సీఐ పిస్టల్‌తో కాల్చడంతో నేరగాని కుడికాలులోకి తూటా దూసుకెళ్లడంతో కిందపడిపోయాడు. తక్షణం పోలీసులు అరెస్ట్ చేసి చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు.
చదవండి:
దారుణం: బాలికకు మాయమాటలు చెప్పి..
పరువు కోసం తల్లి, ప్రేమ కోసం కూతురు..
Comments
Please login to add a commentAdd a comment