Parappana Agrahara
-
జైల్లో ఖైదీ బర్త్‌డే వేడుకలు, వైరల్ వీడియో
సాక్షి, బెంగళూరు: నేరం చేస్తే కటకటాలపాలై జైలు శిక్ష అనుభవిస్తాం. అయితే, కర్ణాటకలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారుల తీరు చూస్తే మాత్రం.. ఆ జైలుకు వెళ్లేందుకైనా నేరం చేయాలి అనిపిస్తుంది. అంత ‘ఫ్రీడం’ ఉంటుంది అక్కడి ఖైదీలకు. తాజాగా బయటపడిన ఓ ఖైదీ పుట్టినరోజు వేడుకల వీడియో అదే విషయాన్ని చెప్తున్నట్టుగా ఉంది. రెండేళ్ల క్రితం పరప్పన అగ్రహార జైలులోని అధికారులు డబ్బు తీసుకొని, నిబంధనలను ఉల్లంఘిస్తూ ఖైదీలకు వివిధ ప్రోత్సాహకాలు ఇస్తున్నారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అప్పుడు పరప్పన జైలు కుంభకోణంపై దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ఐఎఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఖైదీలకు అధికారాలు ఇచ్చినట్లు ఆ కమిటీ ధ్రువీకరించింది. దాంతో ఆ జైలు అధికారులను బదిలీ చేశారు. అలాంటి ఘటనలు మళీ జరక్కుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. వేడుకలు, ఇంకా వీడియో బెంగళూరు సుబ్రమణియపుర పోలీస్ స్టేషన్‌కు చెందిన రిజ్వాన్ అలియాస్ రౌడీ కుల్లాను ఇటీవల గతేడాది ఓ మర్డర్ కేసులో అరెస్టు చేసి పరప్పన అగ్రహార జైలులో ఉంచారు. మరికొంత మంది అతని అనుచరులు కూడా అదే జైలులో ఉన్నారు. అయితే, జైలులో ఉన్న రిజ్వాన్ స్నేహితులతో కలిసి తన పుట్టినరోజును జరుపుకోవడమే కాక, దాన్నంతా సెల్ఫోన్లో చిత్రీకరించి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అటాచ్ చేసి మరీ సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. జైలులో రిజ్వాన్‌కు సెల్ ఫోన్ ఎలా వచ్చిందనే విషయం ఇప్పుడు వివాదాస్పదమైంది. విస్తృతమైన పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఇటువంటి ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. ఇక బర్త్ డే ఘటనపై విచారణ చేస్తున్నామని, రిజ్వాన్‌కు ఫోన్ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని జైలు ఉన్నతాధికారులు చెప్తున్నారు. కాగా, పరప్పన జైలులో పుట్టిన రోజు వేడుకలు, ఇతర సంప్రదాయ పండుగలు జరపుకునేందుకు అనుమతి ఉండటం విశేషం. మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. -
జైలులో ప్రేమ కథ.. బెంగుళూరు గజగజ..!
జైలులో బీజం పడిన ఓ ప్రేమ కథ కారణంగా ఇప్పుడు బెంగుళూరు నగరం గజగజలాడుతోంది. దొంగతనాలే జీవిత పరమార్ధంగా ఎంచుకున్న ఇద్దరు ప్రేమించుకుంటే ఏం జరుగుతుంది అనే కోణంలో సినిమా తీస్తే ఈ కథకు వంద మార్కులు పడతాయనడంలో ఆశ్చర్యమే లేదు. 2011లో పరప్పనా అగ్రహారా జైలులో ఈ ప్రేమ కథ మొదలైంది. పట్టపగలు దోపిడీలకు పాల్పడే ముఠా నాయకుడు కోటి రెడ్డిని కలవడానికి అతని సోదరి సుమ(25) తరచూ పరప్పనా అగ్రహారా జైలుకు వెళ్లేది. అదే సమయంలో ఓ రోజు జైలులో ఉన్న పేరుమోసిన రౌడీ షీటర్ రాజా అలియాస్ క్యాట్ రాజా(28)ని చూసింది. పిల్లికళ్లతో ఉండే రాజా.. తనకంటూ ప్రత్యేకతను మెయింటైన్ చేసేవాడు. అతని కళ్లు పిల్లి కళ్లలా ఉండటంతో అందుకు తగిన బ్రాండ్ల టీ షర్ట్ లనే ధరించేవాడు. రాజా తీరు నచ్చిన సుమ అప్పటికప్పుడు జైల్లోనే అతనికి ప్రపోజ్ చేసింది. సుమ ప్రపోజల్ ను ఒప్పుకున్న రాజా జైలు నుంచి విడుదల కాగానే (మూడేళ్ల క్రితం) వివాహం చేసుకున్నాడు. దీంతో కోటి రెడ్డి సామ్రాజ్యానికి రాజా వారసుడయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజా వేగంగా ఎదిగాడు. పోలీసులను ముప్ప తిప్పలను పెడుతున్న రాజా ఈ ఏడాది జులైలో ఓ రాజకీయ నాయకుడి హత్య కేసులో అరెస్టు అయ్యాడు. భర్త అరెస్టుతో గ్యాంగ్ పగ్గాలను చేపట్టిన సుమ.. జైలు నుంచి భర్త చెబుతున్న సూచనలను పాటిస్తూ క్రిమినల్ యాక్టివిటీస్ ను కొనసాగిస్తోంది. రాజా అరెస్టు తర్వాత గ్యాంగ్ లోని ఎనిమిది మంది సభ్యులను పోలీసులు అరెస్టు చేసినా సుమ మాత్రం పోలీసులకు ఇంకా చిక్కలేదు. ప్రతి దోపిడీ తర్వాత ఆ డబ్బు మొత్తాన్ని గ్యాంగ్ సుమకు అప్పజెప్తుందని బెంగళూరు రూరల్ డిప్యూటీ ఎస్పీ ఎస్ కే ఉమేశ్ చెప్పారు. ఆ తర్వాత ఎవరెవరికీ ఎంతెంత ఇవ్వాలనేది ఆమె నిర్ణయిస్తుందని వెల్లడించారు. పేరు మోసిన రౌడీ భార్య కావడంతో ఆమె తరచూ స్ధావరాలను మారుస్తూ ఉంటుందని చెప్పారు. రాజా అరెస్టు తర్వాత ఇప్పటివరకూ అతని గ్యాంగ్ 40కు పైగా దోపిడీలకు పాల్పడిందని తెలిపారు. గ్యాంగ్ సభ్యులు అరెస్టు అవుతున్నా సుమ సాయంతో రాజా కొత్తవారిని సభ్యులుగా నియమించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు చెప్పారు. -
జయను చెన్నై జైలుకు తరలించండి
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను బెంగళూరు జైలు నుంచి చెన్నై జైలుకు తరలించాలని సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆమెను పరప్పణ ఆగ్రహారం జైలు నుంచి చెన్నైకి తరలించాలని పిటిషన్ లో కోరారు. జర్నలిస్ట్ హెరీన్ ప్రేస్ దీన్ని దాఖలు చేశారు. జయకు జైలు శిక్ష పడిన తర్వాత తమిళనాడులో ఆందోళనలు, బంద్ లు జరిగాయని తెలిపారు. జయ మద్దతుదారులు సాగించిన హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయారని, ఆస్తుల ధ్వంసం జరిగిందని వెల్లడించారు. కావేరీ జలాల పంపిణీ వంటి సున్నిత విషయాలను దృష్టిలో పెట్టుకుని జయను సొంత రాష్ట్రానికి పంపించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై శుక్రవారం కోర్టు విచారణ జరపనుంది.