
జయను చెన్నై జైలుకు తరలించండి
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను బెంగళూరు జైలు నుంచి చెన్నై జైలుకు తరలించాలని సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆమెను పరప్పణ ఆగ్రహారం జైలు నుంచి చెన్నైకి తరలించాలని పిటిషన్ లో కోరారు. జర్నలిస్ట్ హెరీన్ ప్రేస్ దీన్ని దాఖలు చేశారు.
జయకు జైలు శిక్ష పడిన తర్వాత తమిళనాడులో ఆందోళనలు, బంద్ లు జరిగాయని తెలిపారు. జయ మద్దతుదారులు సాగించిన హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయారని, ఆస్తుల ధ్వంసం జరిగిందని వెల్లడించారు. కావేరీ జలాల పంపిణీ వంటి సున్నిత విషయాలను దృష్టిలో పెట్టుకుని జయను సొంత రాష్ట్రానికి పంపించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై శుక్రవారం కోర్టు విచారణ జరపనుంది.