
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలినంటూ మరో మహిళ ముందుకొచ్చారు. జయలలిత కూతురిని తానేనని, కావాలంటే తనకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించవచ్చునని బెంగళూరు చెందిన అమృత అనే మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆమె పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టు ఎందుకొచ్చారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
జయలలిత కూతురిని తానేనని ఈ నెల 22న అమృత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించేందుకు ముందుకురావడంతో ఈ పిటిషన ప్రాధాన్యం సంతరించుకుంది. జయలలిత కూతురైన తనను ఆమె సోదరి, భర్త పెంచి పెద్ద చేశారని, డిసెంబర్ 5న జయలలిత మృతిచెందిన తర్వాత తన జన్మరహస్యాన్ని వారు తనకు వెల్లడించారని అమృత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన జయలలి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అవివాహితగానే ఉండిపోయారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి బయట ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో జయ వారసులమంటూ గతంలో కూడా కొందరు కోర్టుల్లో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment