అమ్మ ఆస్తులు ఎవరికో?
♦ బెంగళూరు కోర్టు ఆధీనంలో కోట్లాది ఆస్తులు
♦ పోయెస్‌గార్డెన్ భవనం ఖరీదు రూ.90 కోట్లు
♦ రూ.113 కోట్లపై చర్చోపచర్చలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్దోషని సుప్రీంకోర్టు తీర్పుతో రూ.113 కోట్ల ఆస్తులు ఎవరికి చెందుతాయనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, జయ అన్న సంతానమైన దీప, దీపక్ సొంతం చేసుకుంటారా అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ నిందితులుగా ఆస్తుల కేసుపై 18 ఏళ్లపాటు విచారణ జరిగి ఎట్టకేలకూ 2014లో తీర్పు వెలువడింది. పై నలుగురికి నాలుగేళ్లపాటు జైలు శిక్ష, జయలలితకు రూ.100 కోట్ల జరిమానా, మిగిలిన ముగ్గురికి రూ.10 కోట్ల జరిమానా విధిస్తూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై బెంగళూరు హైకోర్టులో అప్పీలు చేసి నలుగురూ నిర్దోషులుగా బైటపడ్డారు. అయితే బెంగళూరు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.
వాదోపవాదాలు ముగిసిన పిమ్మ ట బెంగళూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు చెప్పింది. జయలలిత మరణించినందున శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా, జయలలిత మరణించినా కింది కోర్టు విధించిన రూ.100 కోట్ల జరిమానా చెల్లించి తీరాలని ఫిబ్రవరి 14వ తేదీన సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ
వందకోట్లు రాబట్టుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేసింది. జయలలితను దోషిగా ప్రకటించాలని, రూ.100 కోట్ల జరిమానా ఎలా వసూలు చేయాలో మార్గదర్శకాలు జారీచేయాల్సిందిగా కోరుతూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌కు విచారణర్హత లేదని వ్యాఖ్యానిస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు పినాకీ సుందరేష్, అమీద్వాయ్ రాయ్ ఈనెల 4వ తేదీన కొట్టివేశారు. అంతేగాక జయలలితను మాత్రం నిర్దోషిగా ప్రకటించడాన్ని పునఃపరిశీలించలేమని, అంతేగాక జయలలితకు విధించిన రూ.100 కోట్ల అపరాధ రుసుము కట్టాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు.
బెంగళూరు కోర్టు ఆధీనంలో అమ్మ ఆస్తులు: సుప్రీంకోర్టు తాజా తీర్పుతో బెంగళూరు న్యాయస్థానం ఆధీనంలోని జయకు చెందిన 10,500 చీరలు, 750 జత చెప్పులు, రూ.3.5కోట్ల విలువైన బంగారు నగలు, 44 ఎయిర్ కండిషన్ మెషీన్లను తిరిగి అప్పగించకతప్పదు. అయితే ఈ ఆస్తులను అప్పగించాల్సిందిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి పొందాల్సి ఉండగా, జయ వారసులుగా పిటిషన్ వేసేవారెవరు అనే ప్రశ్న తలెత్తింది. అలాగే జయలలితకు చెందిన రూ.113 కోట్ల స్థిర, చరాస్థులు ఎవరికి అనే సందేహం కూడా ఉత్పన్నమైంది. జయలలితకు నేరుగా వారసులు ఎవ్వరూ లేరు.
ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్ తామే వారసులమని ముందుకు వచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వం తలచుకుంటే పోయెస్‌గార్డెన్‌లోని ఇంటిని జయలలిత స్మారక నిలయంగా మార్చివేసి స్వాధీనం చేసుకోవచ్చు. అంతేగాక కర్ణాటక న్యాయస్థానం ఆధీనంలోని ఆస్తులను తమకు అప్పగించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం, దీప, దీపక్ వేర్వేరుగా బెంగళూరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలూ లేకపోలేదని అంటున్నారు. ఆస్తుల చిక్కుముడిపై బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ న్యాయవాది మాట్లాడుతూ, జయలలిత పేరున ఉన్న మొత్తం రూ.113.72 కోట్ల ఆస్తుల్లో రూ.41.64 కోట్ల చరాస్థి, రూ.72.09 కోట్ల స్థిరాస్తి ఉందని తెలిపారు.
జయలలిత ఆస్తుల్లో అత్యంత ఖరీదైనది పోయెస్‌గార్డెన్‌లోని ఆమె ఇల్లు అని చెప్పారు. ప్రస్తుతం ఈ ఇంటి ఖరీదు మార్కెట్ ధర ప్రకారం రూ.90 కోట్లు, ప్రభుత్వ రేటు ప్రకారం రూ.43.96 కోట్లని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లాలో 14.50 ఎకరాల్లో ఫాంహౌస్, మధురాంతకం సమీపం సెయ్యూరు గ్రామంలో 3.43 ఎకరాల భూమి, అనేక బ్యాంకుల్లో జయలలిత పేరున రూ.10.63 కోట్ల నగదు ఉన్నట్లు తెలిపారు.
అంతేగాక రూ.42.25 లక్షల విలువైన రెండు టయోటా కార్లు, ఒక టెంపో ట్రావలర్, రెండు టెంపోట్రక్స్, రెండు మహేంద్రా వ్యాన్లు, ఒక స్వరాజ్‌మజ్దా కారు, ఒక అంబాసిడర్, ఒక కాంటెస్సా కారు ఉన్నట్లు చెప్పారు. అలాగే కొడనాడు ఎస్టేట్, బంగ్లా, శ్రీవిజయ పబ్లికేషన్, శశి ఎంటరప్రైజస్, గ్రీన్ టీ ఎస్టేట్ సహా రూ.24.44 కోట్ల విలువైన ఈ ఐదు ఆస్తుల్లో జయ భాగస్వామిగా ఉన్నారు.
జయ గనుక వీలునామా రాసి ఉంటే వారికే చెందుతుంది, లేకుంటే రక్తసంబంధీకులు పొందవచ్చని ఆయన అన్నారు. జయను నిర్దోషిగా ప్రకటించినందున ప్రభుత్వ కార్యాలయాల్లో ఆమె ఫొటోలను పెట్టుకోవచ్చని, భారతరత్న బిరుదుకు సిఫార్సు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.