ఎలాంటి హింస జరిగినా బెయిల్ రద్దు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు, ఆమె సహచరులు శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు మంజూరుచేసిన బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు పలు షరతులు విధించింది. అలాగే, ఫాలీ నారిమన్ వాదనలు వినిపించే సమయంలో కూడా పలు హామీలు ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రముఖ న్యాయవాది, బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి తెలిపారు. జయలలితకు, ఆమె సహచరులకు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలా వద్దా అనే విషయం మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. దాదాపు 35 వేల కాగితాలతో కూడిన కొన్ని పత్రాలను డిసెంబర్ 18వ తేదీలోగా కర్ణాటక హైకోర్టుకు సమర్పించాలని, ఒకవేళ అలా సమర్పించలేకపోతే మాత్రం వెంటనే బెయిల్ రద్దవుతుందని స్వామి చెప్పారు. బెయిల్ కూడా డిసెంబర్ 18 వరకు మాత్రమే అమలులో ఉంటుంది. కర్ణాటక హైకోర్టు విచారణ మీద ఎలాంటి వాయిదా కోరకూడదు. ఆ తర్వాత కూడా జయకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే విషయం మీద కర్ణాటక హైకోర్టే నిర్ణయం తీసుకుంటుంది.
జయలలితకు బెయిల్ మంజూరు అయిన తర్వాత తమిళనాడులో ఎలాంటి హింస జరగబోదని, జడ్జిల గురించి గానీ, వేరే ఎవరి గురించి గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోరని జయ తరఫున వాదించిన ప్రముఖ న్యాయవాది ఫాలీ నారిమన్ కోర్టుకు హామీ ఇచ్చారన్నారు. ఎక్కడ ఎలాంటి హింసాత్మక సంఘటన జరిగినా, తనపై దాడి జరిగిందని సుబ్రమణ్యం స్వామిలాంటి వాళ్లు ఎవరైనా చెప్పినా కూడా వెంటనే బెయిల్ రద్దవుతుందని అన్నారు. జయలలితకు అనారోగ్యంగా ఉందన్న కారణంతోనే బెయిల్ ఇస్తున్నందువల్ల.. డిసెంబర్ 18వ తేదీ వరకు ఆమె ఇల్లు వదిలి వెళ్లకూడదని, అలాగే సందర్శకులను కూడా చూడకూదని కూడా షరతులు విధించారు.