జయలలితకు బెయిల్ మంజూరు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. ఆమెకు సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష మీద స్టే విధించింది. జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాదులు నారిమన్, సుశీల్ కుమార్, తులసి వాదనలు వినిపించారు. అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడిన జయలలిత.. కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా, అక్కడి న్యాయమూర్తి తిరస్కరించిన విషయం తెలిసిందే. దాంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి.లోకూర్లతో కూడిన ధర్మాసనం జయకు బెయిల్ ఇచ్చింది. ఆరువారాల్లో కర్ణాటక హైకోర్టుకు పేపర్బుక్తో అప్పీలు చేసుకోవాలని ధర్మాసనం తెలిపింది.
ఎట్టకేలకు అమ్మకు బెయిల్ మంజూరు కావడంతో అన్నా డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. 21 రోజుల తర్వాత జయలలిత కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల కానున్నారు. అన్నా డీఎంకే వ్యవస్థాపక దినోత్సవం రోజునే ఆమెకు బెయిల్ రావడం గమనార్హం.