అగ్ర దర్శకుడికి బేతాళప్రశ్న! | Wrong Gopal Varma movie review | Sakshi
Sakshi News home page

అగ్ర దర్శకుడికి బేతాళప్రశ్న!

Published Sat, Dec 5 2020 12:17 AM | Last Updated on Sat, Dec 5 2020 5:30 AM

Wrong Gopal Varma movie review - Sakshi

చిత్రం: ‘రాంగ్‌ గోపాల్‌ వర్మ’; తారాగణం: షకలక శంకర్, ప్రభు, కత్తి మహేశ్‌; కెమెరా: బాబు; కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం: జర్నలిస్ట్‌ ప్రభు; రిలీజ్‌: డిసెంబర్‌ 4; ఓ.టి.టి: శ్రేయాస్‌.

నిజజీవిత వ్యక్తుల జీవితాన్నీ, ప్రవర్తననూ ఆధారంగా చేసుకొని, వారి మీద వ్యంగ్య బాణాలు, విమర్శలు సంధిస్తూ సినిమాలు తీయడం ఓ ప్రత్యేకమైన జానర్‌. మిగిలిన ప్రాంతీయ భాషా సినీ సీమల్లో కన్నా తెలుగులో ఈ కోవ చిత్రాలు కాస్తంత ఎక్కువే! 1980లలోనే పెద్ద ఎన్టీఆర్‌ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ‘మండలాధీశుడు’, ‘గండిపేట రహస్యం’ లాంటి వ్యంగ్యాత్మక సినీ ప్రయత్నాలు జరిగాయి. ఈ ఫిక్షనల్‌ రియాలిటీ చిత్రాలకు పరాకాష్ఠ – ఇటీవల కరోనా కాలంలో హీరో పవన్‌ కల్యాణ్‌ పై దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తీసిన ‘పవర్‌ స్టార్‌’. దానికి పోటీగా వర్మపై షకలక శంకర్‌ హీరోగా వచ్చిన ‘పరాన్నజీవి’. ఈ పర్సనల్‌ ట్రోలింగ్‌ సినిమాల మధ్య రచయిత జొన్నవిత్తుల తీస్తానని ప్రకటించిన ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లే వాడు) చిత్రం ఇంకా తయారీలో ఉంది. ఇంతలో తాజాగా సీనియర్‌ సినీ జర్నలిస్టు ప్రభు రూపొందించిన చిత్రం ‘రాంగ్‌ గోపాల్‌ వర్మ’.

కథేమిటంటే..: పబ్లిసిటీ కోసం, నాలుగు డబ్బుల కోసం రాజ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) అనే ఓ అగ్ర దర్శకుడు విపరీత ధోరణులకు పాల్పడుతుంటారు. ఆ ధోరణిని అతని అసిస్టెంట్లు (కత్తి మహేశ్‌ వగైరా) ప్రశ్నిస్తారు. దానికి ఆర్జీవీ తనదైన జవాబిస్తారు. కానీ, చివరకు ఆర్జీవీని అంతరాత్మే నిలదీస్తుంది. దానికి ఆయన రియాక్షన్‌ తెరపై చూడాలి. సినిమా టైటిల్‌ను బట్టి, టైటిల్‌ రోల్‌ నటుడి హావభావాలను బట్టి, అంశాలను బట్టి ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి తీసిన ఫిక్షనల్‌ రియాలిటీయో ఇట్టే అర్థమైపోతుంది. ‘ఎ రైట్‌ డైరెక్టర్‌ ఇన్‌ ది రాంగ్‌ డైరెక్షన్‌’ అంటూ టైటిల్‌కు పెట్టిన ట్యాగ్‌ లైన్‌తోనే సినిమాలో తాను ఏం చెప్పదలుచుకున్నదీ, ఏం చూపించదలుచుకున్నదీ ఈ చిత్రదర్శకుడు తేల్చేశారు.

ఎలా తీశారంటే..: ఆర్జీవీని అనుకరించడంలో దిట్ట అయిన షకలక శంకర్‌ ఆ హావభావాలనూ, డైలాగ్‌ డెలివరీనీ యథోచితంగా మెప్పించారు. దర్శకుడు ప్రభు సినిమాలో తన నిజజీవిత జర్నలిస్టు పాత్రలో కనిపిస్తారు. మిగిలిన పాత్రధారులు, పరిమిత సాంకేతిక విభాగాల పనితనం అంతే పరిమితం. దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ప్రభుది. ఆయన తన గురువును ఆదర్శంగా తీసుకొని, ఈ 42 నిమిషాల సినిమాకు తానే కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 32 ఏళ్ళుగా సినీ జర్నలిజమ్‌లో అబ్బిన ప్రశ్నించే లక్షణాన్ని ఈసారి కలంతో కాక కెమేరాతో ఆయన వ్యక్తం చేశారనుకోవాలి.

ఆర్జీవీకి వ్యతిరేకంగా ఈ సినిమా తీయడానికి వివిధ మెగా సినీ వర్గాల నుంచి ప్యాకేజీలు అందాయని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నంపై పరిశ్రమలో ఓ చిన్న ఆసక్తి నెలకొంది. ఆ గాలివార్తలను కొట్టిపారేసిన దర్శకుడు సినీ పరిశ్రమలోని అవాంఛనీయ ధోరణిని ప్రశ్నించడమే ఈ సినిమా లక్ష్యమని తేల్చారు. అదే సమయంలో ఎవరినో కించపరచాలనే ఉద్దేశంతో కాక, ఆవేదనతో ఈ ప్రయత్నం చేసినట్టు సినిమా చివర చెప్పుకొచ్చారు. మొత్తం మీద కొత్త తరహా సినిమా టేకింగ్, ఆలోచనలతో ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన ఓ అగ్ర దర్శకుడు ఇప్పుడు బూతు సినిమాలు, ఫిక్షనల్‌ రియాలిటీ పేరుతో ట్రోలింగ్‌ సినిమాలు తీసే స్థాయికి దిగజారిపోవడాన్ని ఈ సినిమా చర్చకు పెడుతుంది. ఆత్మవిమర్శతో పంథా మార్చుకుంటే, ఇప్పటికీ ఆస్కార్‌ అందుకొనే ప్రతిభ ఆ దర్శకుడికి ఉందని అంటుంది.


‘నా జీవితం, నా సినిమా, నా పోర్న్‌ కాలక్షేపం, నా ఓడ్కా, నా ట్వీట్లు... నా ఇష్టం’ అనే ఆర్జీవీకి ఇలాంటి సద్విమర్శలూ, సలహాలూ కొత్త కావు. కానీ, సెన్సార్‌ అవసరం లేని ఓటీటీల పుణ్యమా అని ఆర్జీవీతో సహా పలువురు తీస్తున్న కంటెంట్‌ను చూసినప్పుడు చాలామందిలో కలిగిన ఆవేదనకు తెర రూపం – ఈ లేటెస్ట్‌ సినిమా. అంతమాత్రాన ఈ తాజా సినిమాతో ఆర్జీవీ సహా అసలు ఎవరైనా మారిపోతారనుకోవడమూ అత్యాశే. అయినా సరే, సినీ రంగంలో ఉంటూ కూర్చున్న చెట్టుకే చేటు తెస్తున్నారన్న వాదనతో ప్రభు ఈ చిరుప్రయత్నం చేశారు. దీనిలో సగటు సినిమా లక్షణాలు వెతుక్కోవడం వేస్ట్‌. పరిమితమైన బడ్జెట్‌లో, అతి పరిమితమైన వనరులు, సాంకేతిక సౌలభ్యాలతో తీసిన ఈ కొత్త గిల్లుడు సినిమా పే పర్‌ వ్యూ పద్ధతిలో ఓటీటీ వేదికలో ఎంత మందికి చేరుతుందో చెప్పలేం. ఎంతమందిని ఆకట్టుకుంటుందో కూడా చెప్పలేం. కాకపోతే, గొప్ప సినీ ప్రయత్నం కాకున్నా... ధర్మాగ్రహంతో వేసిన ఓ ఆవేదనాభరిత ప్రశ్నగా ఈ ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ మిగిలిపోవచ్చు.

కొసమెరుపు: అగ్రదర్శకుడిపై కలం చూపిన కెమేరా ఆగ్రహం.

బలాలు:
సినీసీమలో అవాంఛనీయ ధోరణిపై ఆగ్రహం
వర్మ చుట్టూ ఉన్న వివాదాలు
గడచిన ‘గిల్లుడు సినిమా’ల్లోని అంశాల ప్రస్తావన

బలహీనతలు:
విడిగా కథంటూ ఏమీ లేకపోవడం
విమర్శలు, విశ్లేషణలతోనే మొత్తం సినిమా సాగడం
పరిమిత బడ్జెట్, పరిమిత టెక్నికల్‌ సహకారం

– రెంటాల జయదేవ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement