journalist prabhu
-
అగ్ర దర్శకుడికి బేతాళప్రశ్న!
చిత్రం: ‘రాంగ్ గోపాల్ వర్మ’; తారాగణం: షకలక శంకర్, ప్రభు, కత్తి మహేశ్; కెమెరా: బాబు; కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు; రిలీజ్: డిసెంబర్ 4; ఓ.టి.టి: శ్రేయాస్. నిజజీవిత వ్యక్తుల జీవితాన్నీ, ప్రవర్తననూ ఆధారంగా చేసుకొని, వారి మీద వ్యంగ్య బాణాలు, విమర్శలు సంధిస్తూ సినిమాలు తీయడం ఓ ప్రత్యేకమైన జానర్. మిగిలిన ప్రాంతీయ భాషా సినీ సీమల్లో కన్నా తెలుగులో ఈ కోవ చిత్రాలు కాస్తంత ఎక్కువే! 1980లలోనే పెద్ద ఎన్టీఆర్ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ‘మండలాధీశుడు’, ‘గండిపేట రహస్యం’ లాంటి వ్యంగ్యాత్మక సినీ ప్రయత్నాలు జరిగాయి. ఈ ఫిక్షనల్ రియాలిటీ చిత్రాలకు పరాకాష్ఠ – ఇటీవల కరోనా కాలంలో హీరో పవన్ కల్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘పవర్ స్టార్’. దానికి పోటీగా వర్మపై షకలక శంకర్ హీరోగా వచ్చిన ‘పరాన్నజీవి’. ఈ పర్సనల్ ట్రోలింగ్ సినిమాల మధ్య రచయిత జొన్నవిత్తుల తీస్తానని ప్రకటించిన ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లే వాడు) చిత్రం ఇంకా తయారీలో ఉంది. ఇంతలో తాజాగా సీనియర్ సినీ జర్నలిస్టు ప్రభు రూపొందించిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. కథేమిటంటే..: పబ్లిసిటీ కోసం, నాలుగు డబ్బుల కోసం రాజ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) అనే ఓ అగ్ర దర్శకుడు విపరీత ధోరణులకు పాల్పడుతుంటారు. ఆ ధోరణిని అతని అసిస్టెంట్లు (కత్తి మహేశ్ వగైరా) ప్రశ్నిస్తారు. దానికి ఆర్జీవీ తనదైన జవాబిస్తారు. కానీ, చివరకు ఆర్జీవీని అంతరాత్మే నిలదీస్తుంది. దానికి ఆయన రియాక్షన్ తెరపై చూడాలి. సినిమా టైటిల్‌ను బట్టి, టైటిల్ రోల్ నటుడి హావభావాలను బట్టి, అంశాలను బట్టి ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి తీసిన ఫిక్షనల్ రియాలిటీయో ఇట్టే అర్థమైపోతుంది. ‘ఎ రైట్ డైరెక్టర్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్’ అంటూ టైటిల్‌కు పెట్టిన ట్యాగ్ లైన్‌తోనే సినిమాలో తాను ఏం చెప్పదలుచుకున్నదీ, ఏం చూపించదలుచుకున్నదీ ఈ చిత్రదర్శకుడు తేల్చేశారు. ఎలా తీశారంటే..: ఆర్జీవీని అనుకరించడంలో దిట్ట అయిన షకలక శంకర్ ఆ హావభావాలనూ, డైలాగ్ డెలివరీనీ యథోచితంగా మెప్పించారు. దర్శకుడు ప్రభు సినిమాలో తన నిజజీవిత జర్నలిస్టు పాత్రలో కనిపిస్తారు. మిగిలిన పాత్రధారులు, పరిమిత సాంకేతిక విభాగాల పనితనం అంతే పరిమితం. దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ప్రభుది. ఆయన తన గురువును ఆదర్శంగా తీసుకొని, ఈ 42 నిమిషాల సినిమాకు తానే కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 32 ఏళ్ళుగా సినీ జర్నలిజమ్‌లో అబ్బిన ప్రశ్నించే లక్షణాన్ని ఈసారి కలంతో కాక కెమేరాతో ఆయన వ్యక్తం చేశారనుకోవాలి. ఆర్జీవీకి వ్యతిరేకంగా ఈ సినిమా తీయడానికి వివిధ మెగా సినీ వర్గాల నుంచి ప్యాకేజీలు అందాయని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నంపై పరిశ్రమలో ఓ చిన్న ఆసక్తి నెలకొంది. ఆ గాలివార్తలను కొట్టిపారేసిన దర్శకుడు సినీ పరిశ్రమలోని అవాంఛనీయ ధోరణిని ప్రశ్నించడమే ఈ సినిమా లక్ష్యమని తేల్చారు. అదే సమయంలో ఎవరినో కించపరచాలనే ఉద్దేశంతో కాక, ఆవేదనతో ఈ ప్రయత్నం చేసినట్టు సినిమా చివర చెప్పుకొచ్చారు. మొత్తం మీద కొత్త తరహా సినిమా టేకింగ్, ఆలోచనలతో ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన ఓ అగ్ర దర్శకుడు ఇప్పుడు బూతు సినిమాలు, ఫిక్షనల్ రియాలిటీ పేరుతో ట్రోలింగ్ సినిమాలు తీసే స్థాయికి దిగజారిపోవడాన్ని ఈ సినిమా చర్చకు పెడుతుంది. ఆత్మవిమర్శతో పంథా మార్చుకుంటే, ఇప్పటికీ ఆస్కార్ అందుకొనే ప్రతిభ ఆ దర్శకుడికి ఉందని అంటుంది. ‘నా జీవితం, నా సినిమా, నా పోర్న్ కాలక్షేపం, నా ఓడ్కా, నా ట్వీట్లు... నా ఇష్టం’ అనే ఆర్జీవీకి ఇలాంటి సద్విమర్శలూ, సలహాలూ కొత్త కావు. కానీ, సెన్సార్ అవసరం లేని ఓటీటీల పుణ్యమా అని ఆర్జీవీతో సహా పలువురు తీస్తున్న కంటెంట్‌ను చూసినప్పుడు చాలామందిలో కలిగిన ఆవేదనకు తెర రూపం – ఈ లేటెస్ట్ సినిమా. అంతమాత్రాన ఈ తాజా సినిమాతో ఆర్జీవీ సహా అసలు ఎవరైనా మారిపోతారనుకోవడమూ అత్యాశే. అయినా సరే, సినీ రంగంలో ఉంటూ కూర్చున్న చెట్టుకే చేటు తెస్తున్నారన్న వాదనతో ప్రభు ఈ చిరుప్రయత్నం చేశారు. దీనిలో సగటు సినిమా లక్షణాలు వెతుక్కోవడం వేస్ట్. పరిమితమైన బడ్జెట్లో, అతి పరిమితమైన వనరులు, సాంకేతిక సౌలభ్యాలతో తీసిన ఈ కొత్త గిల్లుడు సినిమా పే పర్ వ్యూ పద్ధతిలో ఓటీటీ వేదికలో ఎంత మందికి చేరుతుందో చెప్పలేం. ఎంతమందిని ఆకట్టుకుంటుందో కూడా చెప్పలేం. కాకపోతే, గొప్ప సినీ ప్రయత్నం కాకున్నా... ధర్మాగ్రహంతో వేసిన ఓ ఆవేదనాభరిత ప్రశ్నగా ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ మిగిలిపోవచ్చు. కొసమెరుపు: అగ్రదర్శకుడిపై కలం చూపిన కెమేరా ఆగ్రహం. బలాలు: సినీసీమలో అవాంఛనీయ ధోరణిపై ఆగ్రహం వర్మ చుట్టూ ఉన్న వివాదాలు గడచిన ‘గిల్లుడు సినిమా’ల్లోని అంశాల ప్రస్తావన బలహీనతలు: విడిగా కథంటూ ఏమీ లేకపోవడం విమర్శలు, విశ్లేషణలతోనే మొత్తం సినిమా సాగడం పరిమిత బడ్జెట్, పరిమిత టెక్నికల్ సహకారం – రెంటాల జయదేవ -
కళాపోషకులు
విశ్వ కార్తికేయ, దీపా ఉమావతి జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళాపోషకులు’. ఎమ్. సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను సీనియర్ జర్నలిస్ట్ ప్రభు విడుదల చేశారు. చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’ చిత్రంలో బాల నటుడిగా నటించిన విశ్వ కార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. మొదటి సినిమా అయినా బాగా నటించాడు. ప్రేమ కథతో పాటు కుటుంబ ఆంశాలున్న చిత్రమిది’’ అన్నారు. ‘‘ప్రస్తుతం మా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది’’ అన్నారు ఎమ్. సుధాకర్ రెడ్డి. ‘‘మేమందరం ఎంతో ఇష్టంగా కష్టపడి చేసిన ‘కళాపోషకులు’ చిత్రానికి ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు విశ్వ కార్తికేయ. -
అందుకే ‘రాంగ్ గోపాల్‌వర్మ’ చేశాను
షకలక శంకర్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘రాంగ్ గోపాల్‌వర్మ’. ప్రముఖ పాత్రికేయుడు ప్రభు స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభు, షకలక శంకర్, అభి, ర్యాప్రాక్ షకీల్, బాబు, పాత్రికేయులు వినాయకరావు, సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్‌గా పలు సంచలనాలు సృష్టించిన ప్రభు ‘రాంగ్ గోపాల్‌వర్మ’ చిత్రంతో దర్శకునిగానూ సంచలనాలు సృష్టించాలని వినాయకరావు, సురేశ్ ఆకాక్షించారు. ఇప్పటివరకు తాను నటించిన చిత్రాలన్నింటిలోకి తనకు బాగా న చ్చిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’’ అన్నారు షకలక శంకర్. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాత ప్రభుకు కృతజ్ఞతలు అన్నారు కెమెరామెన్ బాబు, సంగీత దర్శకుడు షకీల్. ప్రభు మాట్లాడుతూ– ‘‘ఒక దర్శకుని వింత పోకడలకు, వెర్రి చేష్టలకు విసిగిపోయి వాటికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో ‘రాంగ్ గోపాల్‌వర్మ’ చిత్రాన్ని తెరకెక్కించాను. మోషన్ పోస్టర్, టైటిల్ సాంగ్, టీజర్‌కు చక్కని పేరొచ్చిన ఈ చిత్రాన్ని అతి త్వరలో ఓటీటీ ద్వారా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
ఈ పాట మెగాభిమానులకు అంకితం
ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. నటుడు ‘షకలక’ శంకర్ టైటిల్ పాత్ర పోషించారు. ఈ చిత్రం ఆడియోను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రభు ఎంతో ఆవేదనతో, ధర్మాగ్రహంతో ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి తెరకెక్కించిన ఈ చిత్రం అందరికీ చేరువ కావాలి’’ అన్నారు. దర్శక–నిర్మాత ప్రభు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం కోసం నేను స్వయంగా రాసిన ‘వర్మా వర్మా వర్మా... ఓ రాంగ్ గోపాల్ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా నీ ఖర్మ..’ అనే పాటని ర్యాప్ షకీల్ చక్కగా పాడటంతో పాటు మా చిత్రానికి సంగీతం అందించాడు. ఈ పాటను మెగాభిమానులకు, ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యా¯Œ ్సకు అంకితం చేస్తున్నాను. అందుకే పవన్ పుట్టినరోజున ఈ పాటను విడుదల చే శాం. చిత్తూరు జిల్లాలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ముగ్గురు పవన్ అభిమానులకు మా చిత్రం ద్వారా వచ్చే ఆదాయంలో పావు వంతు వారి కుటుంబాలకు అందిస్తాం’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు ర్యాప్ షకీల్ పాల్గొన్నారు. -
సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా ప్రభు
ప్రముఖ సీనియర్ జరల్నిస్ట్ ప్రభు సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా నియమితులయ్యారు. ఈ బాధ్యతను ఆయన చేపట్టడం ఇది రెండోసారి. ఉత్తమ పాత్రికేయుడిగా నంది అవార్డును కూడా అందుకున్న ప్రభు దివంగత నటుడు ఏయన్నార్ జీవితం ఆధారంగా గతంలో తీసిన ‘నటసామ్రాట్’ అనే సీరియల్‌కు దర్శకత్వం వహించారు. ఫద్నాలుగవ అంతర్జాతీయ బాలలచలన చిత్రోత్సవాలకు మీడియా కమిటీ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. ‘‘ఏ బాధ్యత స్వీకరించినా నా వంతు న్యాయం చేయడానికి కృషి చేస్తాను’’ అని ప్రభు పేర్కొన్నారు. -
నా శిష్యగణం అందరూ మొండోళ్లే - దాసరి
‘‘శ్రీకాంత్ చాలా కోపరేట్ చేసే నటుడు. ఇలాంటి హీరోలుంటే ఏడాదికి 50 మీడియమ్ సినిమాలు చేసేయొచ్చు. నా శిష్యగణం అందరూ మొండోళ్లే. దేనికైనా ఎదురొడ్డి నిలుస్తారు. వారిలో ప్రభు ఒకడు. సమర్థత ఉన్న నిర్మాత దొరికితేనే డెరైక్షన్ చేయమన్నాను. లక్కీగా తనకు శ్రీనివాసరెడ్డిలాంటి నిర్మాత దొరికాడు’’ అని దాసరి నారాయణరావు చెప్పారు. శ్రీకాంత్ హీరోగా ప్రభు దర్శకత్వంలో రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి నిర్మిస్తోన్న ‘మొండోడు’ పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీని దాసరి, టీజర్‌ను ఎన్.శంకర్, తనికెళ్ల భరణి, ప్రచార చిత్రాన్ని మనోజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ -‘‘పెద్ద సినిమాల డేట్లు ఇష్టానుసారం మార్చేయడం వల్ల చిన్న సినిమా నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను బతికుండగా ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా బాధపడ్డాను’’ అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘జర్నలిస్ట్ ప్రభు నా సినిమాతో దర్శకుడైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రభు మాట్లాడుతూ -‘‘ఇది నా 27 ఏళ్ల కల. పరిశ్రమలో 90 శాతం మందికి దాసరి గురువుగారు. నేను కూడా ఆయన శిష్యుణ్ణే. శ్రీకాంత్ అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేను’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఆర్.నారాయణమూర్తి, సాగర్, శ్రీహరి, రోజా, రాజ్‌కుమార్, ప్రసన్నకుమార్ తదితరులు మాట్లాడారు.