నా శిష్యగణం అందరూ మొండోళ్లే - దాసరి
‘‘శ్రీకాంత్ చాలా కోపరేట్ చేసే నటుడు. ఇలాంటి హీరోలుంటే ఏడాదికి 50 మీడియమ్ సినిమాలు చేసేయొచ్చు. నా శిష్యగణం అందరూ మొండోళ్లే. దేనికైనా ఎదురొడ్డి నిలుస్తారు. వారిలో ప్రభు ఒకడు. సమర్థత ఉన్న నిర్మాత దొరికితేనే డెరైక్షన్ చేయమన్నాను. లక్కీగా తనకు శ్రీనివాసరెడ్డిలాంటి నిర్మాత దొరికాడు’’ అని దాసరి నారాయణరావు చెప్పారు. శ్రీకాంత్ హీరోగా ప్రభు దర్శకత్వంలో రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి నిర్మిస్తోన్న ‘మొండోడు’ పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీని దాసరి, టీజర్‌ను ఎన్.శంకర్, తనికెళ్ల భరణి, ప్రచార చిత్రాన్ని మనోజ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ -‘‘పెద్ద సినిమాల డేట్లు ఇష్టానుసారం మార్చేయడం వల్ల చిన్న సినిమా నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను బతికుండగా ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా బాధపడ్డాను’’ అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘జర్నలిస్ట్ ప్రభు నా సినిమాతో దర్శకుడైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రభు మాట్లాడుతూ -‘‘ఇది నా 27 ఏళ్ల కల. పరిశ్రమలో 90 శాతం మందికి దాసరి గురువుగారు. నేను కూడా ఆయన శిష్యుణ్ణే. శ్రీకాంత్ అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేను’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఆర్.నారాయణమూర్తి, సాగర్, శ్రీహరి, రోజా, రాజ్‌కుమార్, ప్రసన్నకుమార్ తదితరులు మాట్లాడారు.