సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మందగమనం ఉన్నా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుల సంఘటిత శక్తిని వారి సంక్షేమానికి ఉపయోగపడేలా కొత్తగా ఎన్నికైన సహకార సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన జిల్లా కేంద్ర సహకార సంఘాలు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల (డీసీఎంఎస్) చైర్మన్లు సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌తో భేటీ అ య్యారు. సహకార ఎన్నికలను సవాల్‌గా తీసుకుని టీఆర్‌ఎస్‌కు భారీ విజయాన్ని అందించిన మంత్రులను కేటీఆర్ అభినందించారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 48 శాతం మేర ప్రాతినిథ్యం కల్పించామని చెప్పారు. ఆదిలాబాద్‌లో ఎస్సీ, మహబూబ్‌నగర్‌లో మైనారిటీ వర్గానికి చెందిన వారిని చైర్మన్లుగా ఎంపిక చేసిట్లు గుర్తు చేశారు. సహకార ఎన్నికల్లో రిజర్వేషన్లు లేకున్నా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో బలహీన, బడుగు వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించేలా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను ఖరారు చేశారన్నారు.
ఖర్చుకు వెనుకాడకుండా రైతు సంక్షేమం: ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నందునే రాష్ట్రంలోని 906 సహకార సంఘాల్లో 94 శాతానికి పైగా తమ పార్టీ మద్దతుదారులే గెలుపొందారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం కొత్త పుంతలు తొక్కుతోందని, రైతు బీమా, రైతుబం ధు లాంటి ప్రత్యేక పథకాలను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కేంద్ర అసంబద్ధ నిర్ణయాలతో దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొందని ఆరోపించారు. సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment