సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార సంఘాల మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ శనివారం ముగిసింది. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులన్నీ ఏకగ్రీవం కాగా అధికార టీఆర్‌ఎస్ మద్దతుదారులే జిల్లా సహకార పీఠాలను కైవసం చేసుకున్నారు. సహకార ఎన్నికలకు తొలిమెట్టుగా పేర్కొనే పీఏసీఎస్ డైరెక్టర్ స్థానాలు మొదలుకొని ఉమ్మడి జిల్లా స్థాయిలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల వరకు పార్టీ మద్దతుదారులే గెలుపొందేలా టీఆర్‌ఎస్ పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తూ వచ్చింది.
పీఏసీఎస్ డైరెక్టర్లు, చైర్మన్లు మొదలుకొని డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ల ఎంపిక వరకు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు క్రియాశీల పాత్రపోషించారు. అయితే డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులకు పార్టీలోనే అంతర్గత పోటీ నెలకొనడంతో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఖరారు చేశారు. తొమ్మిది డీసీసీబీలకుగాను ఆరు జిల్లాల్లో ఓసీలు, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో బీసీ, ఆదిలాబాద్‌లో ఎస్సీ కేటగిరీకి చైర్మన్ పదవి దక్కింది. డీసీఎంఎస్‌లలోనూ ఆరుగురు ఓసీలతోపాటు నల్లగొండ, నిజామాబాద్‌లో బీసీ, వరంగల్‌లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతను చైర్మన్ పదవి వరించింది.
పరిశీలకుల సమక్షంలో అభ్యర్థుల ప్రకటన...
డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికకు శనివారం ఉదయం 9 గంటలకు నోటిఫికేషన్ వెలువడగా క్యాంపుల్లో ఉన్న టీఆర్‌ఎస్ మద్దతుదారులు అంతకు రెండు గంటల ముందే ఉమ్మడి జిల్లా కేంద్రాలకు చేరుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం సీల్డ్ కవర్లు అందుకున్న పార్టీ పరిశీలకులు శనివారం ఉదయం డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లతో భేటీ అయ్యారు. సంబంధిత జిల్లా మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేసిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఆ తర్వాత సీల్డ్ కవర్లలో ఉన్న పేర్లను పార్టీ పరిశీలకులు వెల్లడించి నామినేషన్ల ప్రక్రియను సమన్వయం చేశారు. అయితే ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్‌లో డీసీసీబీ చైర్మన్ పదవులకు బహుముఖ పోటీ నెలకొనడంతో అవకాశం దక్కని ఆశావహులను మంత్రులు బుజ్జగించారు. కొందరికి వైస్ చైర్మన్ పదవి దక్కగా అవకాశం దక్కని నేతలకు ఇతరత్రా అవకాశం ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని డీసీసీబీ చైర్మన్ పదవులకు ఆదిలాబాద్‌లో నామ్‌దేవ్ (ఎస్సీ), మహబూబ్‌నగర్‌లో నిజాంపాషా (బీసీ) పేర్లు అనూహ్యంగా తెరమీదకు వచ్చాయి. మెదక్ డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి భర్త దేవేందర్‌రెడ్డికి అవకాశం లభించలేదు.
టెస్కాబ్ చైర్మన్‌గా కొండూరు ఎన్నిక లాంఛనమే
డీసీసీబీ, డీసీఎంఎస్‌ల చైర్మ న్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక ముగియడం తో అందరి దృష్టి రాష్ట్రస్థాయిలో తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) చైర్మన్ ఎన్నికపై పడింది. ఈ ఎ న్నికకు సంబంధించి ఈ నెల 2 లేదా 3 తేదీల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండగా 5న ఎన్నిక జరగనుంది. టెస్కాబ్ తాజా మాజీ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన నేత కావడంతో రవీందర్‌రావు ఎన్నిక లాంఛనప్రాయంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment