రోస్టర్ పాయింట్ పాటిస్తే ఒట్టు
Published Tue, Aug 9 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
– డీసీసీబీ పోస్టుల భర్తీలో సీఫారసులకే పెద్దపీట
– బడుగు, బలహీన వర్గాలకు మొండిచెయ్యి
– ప్రభుత్వ ఉత్తర్వులకు తూట్లు
కర్నూలు(అగ్రికల్చర్): అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో చేపట్టే నియామకాల్లో రోస్టర్ విధానం పాటించాలి. ఈ మేరకు ప్రభుత్వం సర్కులర్ మెమో కూడా జారీ చేసింది. అయితే జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు మాత్రం సర్కారు ఉత్తర్వులు వర్తించడం లేదు. అవుట్ సోర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్, రోస్టర్ విధానం పాటించడమేమింటని ప్రశ్నిస్తుండటం గమనార్హం. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఏడాదిన్నర కాలంగా 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, 15 వరకు అటెండర్ కమ్ మెసెంజర్ పోస్టులు అవుట్ సోర్సింగ్‌పై భర్తీ చేశారు. ఇందుకు నోటిఫికేషన్ ఇవ్వడంకానీ, రోస్టర్ విధానం పాటించడం కానీ జరగలేదు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు పొలిటికల్ బాడీ ఉండటం, దానిపై అధికార పార్టీ ప్రభావం అధికంగా ఉండడంతో పోస్టులన్నీ సిఫారసుల మేరకు భర్తీ చేశారు. రాజకీయ పలుకుబడి లేని బడుగు, బలహీనవర్గాల వారికి ఏ ఒక్క పోస్టూ దక్కిన దాఖలాలు లేవు.
స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల పంపకాలు..
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో స్టాఫ్ అసిస్టెంట్‌ల కొరత ఉంది. స్టాఫ్ అసిస్టెంట్లు అంటే క్యాషియర్, క్లర్క్‌తో సమానమైన ఉద్యోగాలు. ఈ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసుకునేందుకు అనుమతి లేకపోవడంతో అవుట్ సోర్సింగ్‌పై 35 పోస్టుల భర్తీకి బోర్డు సమావేశంలో తీర్మానించారు. అయితే నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్ విధానం ప్రకారం భర్తీ చేయాల్సి ఉంది. అయితే పాలకవర్గ సభ్యులు ఈ పోస్టులను పంచుకున్నట్లు తెలుస్తుంది. ఒక్కో పోస్టుకు రూ.50 వేలు, అంతకు మించి తీసుకుని అనుకూలమైన వారిని సిఫారసు చేసినట్లు ఆరోపణలున్నాయి. మెసెంజర్ కమ్ అటెండర్ పోస్టుల భర్తీదీ ఇదే పరిస్థితి కావడం గమనార్హం.
రోస్టర్ విధానం పాటించాల్సిందే..
స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో రోస్టర్ విధానం పాటించాల్సి ఉందని బ్యాంకు అధికారులే చెబుతున్నారు. అయితే పొలిటికల్ బాడీ ఉన్నందునా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. పాలకవర్గంలో 21 మంది డైరెక్టర్లుంటారు. ఇటు అధికారపార్టీ నేతలు, అటు డైరెక్టర్ల సిఫారసులు వెల్లువెత్తుతుండటంతో సాధారణ వ్యక్తులకు ఉద్యోగాలు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఎవరికి వారు అవుట్ సోర్సింగ్ పోస్టులను అమ్ముకున్నారనే విమర్శలున్నాయి.
టెంపరరీ పోస్టులు, ఆపై అవుట్ సోర్సింగ్.. అందుకే పాటించలేదు...
స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికపై అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశాం. ఆరు నెలలు, ఏడాది పని చేసే పోస్టులకు నోటిఫికేషన్, రోస్టర్ అవసరం ఏముంది. త్వరలోనే రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నాం. అప్పుడు నోటిఫికేషన్, రోస్టర్ అన్నీ పాటిస్తాము. ఆరు నెలలు, ఏడాది పనిచేయడానికి ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు. అవుట్ సోర్సింగ్‌పై భర్తీ చేసే కిందిస్థాయి పోస్టులకు రోస్టర్ పాయింట్ అవసరం లేదు.
– రామాంజనేయులు, సీఈఓ, కేడీసీసీబీ
Advertisement
Advertisement