- 10 శాతం వాటా ధనంలో 7.5 శాతం డీసీసీబీకే
- 5 శాతం చెల్లింపునకు 2.5 శాతం పెంపు
- అంతంత మాత్రం సంఘాలకు మరింత ఆర్థిక భారం
- చెల్లించి తీరాల్సిందేనని డీసీసీబీ ఒత్తిడి
తగ్గుతున్న సహకార బలం
Published Tue, Nov 1 2016 12:02 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
అమలాపురం టౌ¯ŒS :
రైతులకు పంట రుణాలు అందించి వ్యవసాయానికి బాసటగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆర్థిక పరిస్థితి అంతకంతకూ తీసికట్టుగా తయారవుతోంది. ఆ సంఘాల ఆర్థిక మూలాలు, ఆదాయ మార్గాలకు గండికొట్టే చర్యల వల్ల క్రమేపీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. జిల్లాలోని 300 వ్యవసాయ సహకార సంఘాల్లో దాదాపు 70 సంఘాలు తప్ప మిగిలినవన్నీ ఖజానా ఖాళీతో సతమమవుతున్నాయి. సంఘాల్లో సభ్యులు (రైతులు) రుణాలు తీసుకున్నప్పుడు సహకార చట్టం ప్రకారం వారి నుంచి ఆ రుణం విలువలో పది శాతం సొమ్ములను వాటా ధనం (షేర్ ధనం)గా సంఘాలు జమ చేసుకుంటాయి. ఆ వాటా ధనం అయిదు శాతం డీసీసీబీకి చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన అయిదు శాతం సంఘాభివృద్ధికి వినియోగించుకుంటుంది. గత కొన్నేళ్లుగా వాటా ధనంపరంగా సంఘాలు, డీసీసీబీల మధ్య సాగుతున్న వాటా నిష్పత్తి ఇదే. అయితే నాలుగు నెలల కిందట డీసీసీబీ జిల్లాలోని సహకార సంఘాలకు ఓ సర్క్యులర్ జారీ చేసింది. వాటా ధనంలో ఇప్పటి వరకూ డీసీసీబీకి జమ చేస్తున్న అయిదు శాతాన్ని ఇక నుంచి 7.5 శాతానికి పెంచుతున్నట్లు ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఒక్కసారిగా అయిదు శాతం నుంచి 2.5 శాతం మేర అదనంగా పెంచటంపై జిల్లాలోని సహకర సంఘాల మెజారిటీ అధ్యక్షులు వ్యతిరేకిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి తాము వసూలు చేసి జమ చేసుకునే వాటా ధనంలో మూడొంతులు డీసీసీబీ పట్టుకునిపోతే ఇక సంఘాలను ఎలా నిర్వహించాలి... ఆర్థికంగా ఎలా పటిష్టం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఈ విధానం వల్ల జిల్లాలో ఇబ్బంది పడుతున్న 200కి పైగా సంఘాలకు సంబంధించి ఒక్కో సంఘం రూ.రెండు లక్షల నుంచి రూ.అయిదు లక్షల వరకూ కోల్పోయే పరస్థితి కనిపిస్తోందని ఆయా సంఘాల పాలక వర్గాలు ఆందోళనలో పడ్దాయి.
ఎందుకిలా....?
ఆర్‌బీఐకి అనుసంధానంగా పనిచేస్తున్న డీసీసీబీ సహకార సంఘాలకు రుణాలు ఇవ్వటం.. వాటిని వసూలు చేయటం..తద్వారా వ్యాపారం చేయటం వంటి ప్రక్రియలు సాధారణమే. అందుకు డీసీసీబీ ఆర్‌బీఐ నుంచి కొన్ని అనుమతులు పొందుతుంది. క్యాష్ రిజర్వు రేషియో (సీఆర్‌ఆర్)కు లోబడే ఆర్‌బీఐ అనుమతులు ఇస్తుంది. అయితే డీసీసీబీలో ఇటీవల కాలంలో సీఆర్‌ఆర్ కాస్త తగ్గటంతో తిరిగి ఆ స్థాయిలో దానిని పెంచుకోవాల్సి ఉందని తెలిసింది. ఇందు కోసం సహకార సంఘాలు సభ్యుల నుంచి వసూలు చేసే వాటా ధనం నుంచి అప్పటికే తీసుకుంటున్న అయిదు శాతం వాటాను ఏడున్నర శాతానికి పెంచి వసూలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. అయితే లాభాల్లో ఉండి ఆర్థిక పరిపుష్టితో ఉన్న కొన్ని సంఘాలు ఇప్పటికే వాటా ధనాన్ని ఏడున్నర శాతం వంతున డీసీసీబీకి చెల్లించేస్తున్నాయి. అయితే నష్టాల్లో ఉండి నిర్వహణా భారంతో సతమతమవుతున్న సంఘాలు మాత్రం వాటా ధనానికి పెంచిన మేర చెల్లింపులు చేసేందుకు ససేమిరా అంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 70 శాతం సంఘాలు పెంచిన వాటా ధనం శాతాన్ని చెల్లించకుండా అయిదు శాతమే చెల్లిస్తామని భీష్మించుకుని ఉన్నాయి.
ఛైర్మన్, డైరక్టర్లూ సంఘాల అధ్యక్షులైనా సమస్యకు పరిష్కారమేది...?:
సీఆర్‌ఆర్ కోసమే అయితే ఆ సమస్యను వేరే మార్గాల్లో పరిష్కరించుకావాలే తప్ప ఇలా సంఘాలకు క్షేత్ర స్థాయిలో డిపాజిట్ రూపంలో ఆదాయ వనరుగా ఉండే వాటా ధనం తీసుకునే శాతాన్ని అమాంతంగా పెంచటం సమంసజం కాదని సంఘాల అధ్యక్షులు అంటున్నారు. డీసీసీడీ చైర్మన్, 20 మంది డీసీసీబీ డైరెక్టర్లు జిల్లాలో ఏదో ఒక సహకార సంఘానికి అధ్యక్షులే... కనీసం వారైనా డీసీసీబీ పాలక వర్గ సమావేశాల్లో చర్చించి సంఘాల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని లోతుగా ఆలోచించే ప్రయత్నం చేయటం సంఘాల అధ్యక్షులు వాపోతున్నారు.
Advertisement
Advertisement