రాజమండ్రి రూరల్ (తూర్పుగోదావరి జిల్లా) : అప్పుల బాధ తాళలేక ఒక కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటనలో తల్లి, కూతురు అక్కడికక్కడే మృతిచెందగా తండ్రి చావుబతుకులమధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొండగుంటూరులో మంగళవారం వేకువజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కొండగుంటూరు గ్రామానికి చెందిన పాలిశెట్టి శివసుబ్రహ్మణ్యం(29) ప్రైవేట్ గ్యాస్ కంపెనీలో సిలిండర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య మాధవి(24), కుమార్తె జాహ్నవి (2) ఉన్నారు. ఇటీవల ఇంటి నిర్మాణం కోసం శివసుబ్రహ్మణ్యం అప్పులు చేశాడు. అయితే డబ్బు తిరిగివ్వమని అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో అప్పు వెంటనే తీర్చే మార్గం లేక మనస్థాపానికి గురై భార్యా, కుమార్తెకు పురుగుల మందు ఇచ్చి తనూ తాగాడు.
ఉదయం ఎంతకూ తలుపు తెరవకపోవడంతో ఇరుగుపొరుగువాళ్లకు అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా మాధవి, జాహ్నవి విగతజీవులై కనిపించారు. శివసుబ్రహ్మణ్యం కూడా కొనఊపిరితో కనిపించాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కొనఊపిరితో ఉన్న శివసుబ్రమణ్యంను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధను భరించలేకే తాము పురుగులమందు తాగినట్లు శివసుబ్రమణ్యం పోలీసులతో చెప్పాడు. మాధవి తల్లిదండ్రులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
Published Tue, Jun 9 2015 5:32 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement