సహకారం శూన్యం
Published Fri, Apr 1 2016 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM
సహకార రైతుపై సర్కారు చిన్నచూపు చూస్తోంది. సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం కనబరుస్తోంది. సహకార బ్యాంకునే నమ్ముకున్న అన్నదాతకు అప్పులే మిగుల్చుతోంది. రుణమాఫీ వర్తింపజేయడంలో తాత్సారం చేస్తోంది. ఇతర బ్యాంకుల్లో రుణ బకాయిలకు నగదు జమచేసి... డీసీసీబీకి మాత్రం శూన్యహస్తం చూపిస్తోంది.
విజయనగరం అర్బన్: ఎన్నికల హామీల్లో ప్రధానమైన రుణమాఫీని అరకొరగా అమలు చేసిన సర్కారు సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు వర్తింపజేయడంలో తాత్సారం చేస్తోంది. తొలి విడత రైతులకు మాత్రమే ప్రకటించిన మేరకు రుణమాఫీ జరిగింది. రెండో విడతగా ప్రకటించిన రుణమాఫీ నిధులు అన్ని బ్యాంక్‌లకు నూరుశాతం విడుదల చేసినా... సహకార బ్యాంకులకు 79 శాతం మాత్రమే విడుదల చేసింది. దీనివల్ల రుణాలు పూర్తిగా మాఫీకాక దాని పరిధిలోని రైతులకు వడ్డీ భారంగా మారుతోంది. రుణమాఫీ బకాయి నిధుల కోసం సహకార బ్యాంకుల అధికారులు పలుమార్లు ప్రభుత్వాన్ని అడిగితే పట్టించుకోవడం లేదు.
16,282మంది ఎదురుచూపు
గత ఏడాది చివరి క్వార్టర్లో ప్రకటించిన రెండవ విడత రుణమాఫీ జాబితాలో జిల్లాలోని 16,282 మంది రైతులకు సుమారు రూ.20 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం సంబంధిత ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్)కి నిధులు పంపాలి. అయితే కారణం చెప్పకుండా కేవలం రూ.16 కోట్లు(మంజూరైన మొత్తంలో 79%) మాత్రమే అప్పట్లో విడుదల చేశారు. అరకొరగా వచ్చిన సొమ్మును అందరికీ సమానంగా పంచి మిగిలిన 21 శాతం రణమాఫీ బకాయి ఉంచాలని ఆప్కాబ్ ఆదేశించింది.
ఈ మేరకు జిల్లా సహకార బ్యాంక్ అధికారులు రెండవ విడత రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేశారు. ఇది జరిగి దాదాపు ఐదు నెలలు అవుతోంది బకాయి రుణమాఫీపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మూడో విడత రుణమాఫీ అర్హత జాబితా కూడా మూడునెలల క్రితమే ప్రకటించారు. కానీ రెండో విడత రుణమాఫీ బకాయి నిధుల విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బకాయి రుణమాఫీ నిధులు రాకపోవడం వల్ల 16,282 మంది రైతులపై వడ్డీ భారం పడుతోంది.
Advertisement
Advertisement