ఢీసీసీబీ
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదు. బ్యాంకు చైర్మన్‌గా ఉన్న ముత్తవరపు పాండురంగారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న కాపుగల్లు సొసైటీ పాలక వర్గాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత 77 రోజులుగా సాగుతున్న పరిణామాలు ఎటు వైపు దారితీస్తాయో తెలియక డైరెక్టర్లు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. అయితే.. డీసీసీబీ వ్యవహారంలో పొరుగు జిల్లాకుచెందిన ఓ మంత్రి జోక్యం చేసుకోవడంతో సమస్య మరింత జటిలంగా మారినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత పాలకవర్గానికి కేవలం 11నెలల గడువు మాత్రమే ఉన్నందున చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేదని.. ప్రత్యేకాధికారి పాలనతో సరిపెట్టాలని ఆ మంత్రి సహకార రిజిస్ట్రార్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ వ్యవహారంపై పెద్దగా దృష్టి సారించకపోయినా.. చైనా పర్యటన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డీసీసీబీ రాజకీయం మరింత రసకందాయంగా మారింది.
ఏం జరుగుతుందో..
వాస్తవానికి డీసీసీబీలో సందిగ్ధ పరిస్థితులు ఏర్పడి నేటికి 77 రోజులు కావొస్తోంది. పాలకవర్గం లేని కారణంగా అధికారులు కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో పాలన కుంటుపడింది. అయితే.. కాపుగల్లు సొసైటీ రద్దు తర్వాత లేచిన దుమారానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే పరిస్థితి కనిపించడం లేదు. చైర్మన్ ఎన్నికను నిర్వహించి బ్యాంకు వ్యవహారాలు సజావుగా సాగేలా చూడాలని బ్యాంకు సీఈఓ.. సహకార రిజిస్ట్రార్ (ఆర్‌సీఎస్), జిల్లా సహకార అధికారి (డీసీఓ)కి లేఖలు రాసి నెల రోజులు గడుస్తున్నా.. నేటికీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇందుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమనే చర్చ జరుగుతోంది. ముత్తవరపు పాండురంగారావు సదరు మంత్రిని కలిసి తమ తప్పు లేదని..
అధికారుల తప్పిదాలకు బలి చేశారని, తనకు తీవ్ర అన్యాయం జరిగిందని విన్నవించుకున్నట్లు సమాచారం. దీంతో ముత్తవరపు పక్షాన నిలబడ్డ ఆ మంత్రి.. చైర్మన్ ఎన్నికను ఎట్టి పరిస్థితిలో నిర్వహించొద్దని పట్టుపడుతున్నారు. ఎలాగూ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం 11 నెలలే ఉందని.. అవసరమైతే పాలకవర్గాన్ని రద్దు చేసి ప్రత్యేక అధికారి పాలన పెట్టాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాండురంగారావుకు వ్యతిరేకంగా పనిచేస్తోన్న పలువురు డైరెక్టర్లు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిశారు. వారి వాదన విన్న ఆయన చైనా పర్యటన తర్వాత డీసీసీబీ వ్యవహారాన్ని తేల్చేస్తానని ఆ డైరెక్టర్లకు చెప్పారు.
ఈ నేపథ్యంలో మంత్రి విదేశీ పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి వచ్చినందున డీసీసీబీ చైర్మన్ ఎన్నికపై ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తారనే ఉత్కంఠ బ్యాంకు వర్గాలతో పాటు డైరెక్లర్లలో నెలకొంది. చైర్మన్ ఎన్నిక కోసం పట్టువీడకుండా పోరాడుతున్న డైరెక్టర్లు మాత్రం నైరాశ్యంలో పడిపోయారు. సహకార శాఖ అధికారులు మాత్రం ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా అమలు చేస్తామని, ఎన్నికలకు అనుమతిస్తే పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారో... పొరుగు జిల్లాకు చెందిన మంత్రి ఏం చేస్తారోననే మీమాంసకు ఎప్పుడు తెరపడుతుందో.. వేచిచూడాల్సిందే.